Previous Page Next Page 
దావాగ్ని  పేజి 16


    నోటి వెంబడి మాట రానట్లు చూసింది వినీల.

 

    "జనరల్ భోజా భార్య ఇండియన్ ఏజెంటా?"

 

    "దానిలో ఆశ్చర్యమేమీ లేదు" అన్నాడు ప్రతాప్ తాపీగా.

 

    "కొద్ది నెలలనుంచి జనరల్ భోజా జెన్నిఫర్ అంటే కొంచెం విముఖంగా వుంటున్నాడు. అతనికి ఆమె అంటే మొహం మొత్తింది. జనరల్ భోజాకి ఇంతకు ముందు ఇద్దరు భార్యలు వుండేవారు. వాళ్ళమీద అతనికి మోజు తీరిపోగానే వాళ్ళనేం చేశాడో జెన్నిఫర్ కి బాగా తెలుసు"

 

    "ఏం చేశాడు?" అంది వినీల.

 

    "తొట్టినిండా యాసిడ్ పోయించి, దానిలో వాళ్ళని పడేశాడు" అన్నాడు ప్రతాప్.

 

    "మైగాడ్:" అంది వినీల.

 

    "తనకీ ఇంక రేపో మాపో అదే గతి పడుతుందని భయం పట్టుకుంది జెన్నిఫర్ కి. ఆమెది అందరిమీదా దాష్టికం చేసే స్వభావం. తెల్ల తోలు కావడంవల్ల కాబోసు, ఆమె అంటే జనరల్ భోజాకి కూడా కొద్దిగా జంకు వుంది.

 

    పైకి అలా బింకంగా నెట్టుకొస్తూనే రహస్యంగా ఇంటిలోనే గవర్నమెంట్ కి కబురంపింది జెన్నిఫర్.

 

    "ఏమని?"

 

    "కొంతమంది పాలెస్ గార్డ్స్ ని వశపర్చుకుని తను జనరల్ భోజా మీద తిరుగుబాటు చేస్తాననీ, తను అధికారాన్ని వశపరుచుకోగానే ఇండియా తన ప్రభుత్వాన్ని గుర్తించి, తనకు సాయంగా సాయుధ దళాలని పంపాలనీ.

 

    ఈ ప్రాంతంలోని దేశాలలో ఇండియానే సూపర్ పవర్ అని గుర్తించిన తెలివైన స్త్రీ ఆమె.

 

    ఇండియా పట్ల తనకు ఉన్న భక్తి విశ్వాసాలు ప్రకటించుకోవడానికిగానూ, తనకు తెలిసినంతవరకూ జనరల్ భోజా పాలెస్ సీక్రెట్స్ మనకి చేరవేస్తోంది. చిత్రద్వీప్ గురించి మాకు ఎంత లేటెస్టు న్యూస్ తెలుసంటే, ఉదాహరణకి ఒక విషయం చెబుతాను.   

 

    ఇవాళ జనరల్ భోజా నిన్ను తన ప్రయివేట్ జెట్ కి పైలట్ గా ఉండమని అడిగాడు అవునా?" అన్నాడు ప్రతాప్ కూల్ గా.

 

    ఆశ్చర్యంతో నోరు కొద్దిగా తెరిచి, అవునన్నట్లు తలపంకించింది వినీల. తర్వాత గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని అంది "మరి అంత ఉపయోగకరంగా ఉన్నప్పుడు ఆమెకే సాయం చేసి, ఆమె ప్రాణాలు రక్షించి, ఎల్లకాలం చిత్రద్వీప్ మనకు అనుకూలంగా ఉండేటట్లు చేసుకోవచ్చు కదా:"  

 

    సంతోషం లేకుండా నవ్వాడు ప్రతాప్.

 

    జెన్నిఫర్ ఈజ్ ఏ వర్త్ లెస్ ఉమెన్. ఆమె ఇదే ప్రతిపాదన ఎన్ని దేశాలకు చేసిందో తెలియదు. ఇదే సమాచారాన్ని ఎన్ని దేశాలకు అందిస్తుందో తెలియదు. మనకు కావలసింది అలా బజారులో టోకున అమ్ముతున్న సమాచారం కాదు. ఐ వాంట్ ఎక్స్ క్లూజివ్ ఇన్ ఫర్మేషన్."

 

    "మరి డినరల్ భోజా ఆమెని చంపేస్తాడని తెలిసి కూడా ఊరుకుంటామా మనం?" అంది వినీల సానుభూతిగా.

 

    "దటీజ్ హర్ ప్యూనరల్" అని భుజాలెగరేశాడు ప్రతాప్.... "అదలా వదిలేయ్: ఇప్పుడు మనం ఆలోచించవలసిందల్లా నువ్వు జనరల్ భోజా కొలువులో ఎలా చేరాలని ఈ విషయంలో ఎక్కువ ఆలోచించవలసిన పనిలేదు కూడా మృత్యువును స్వయంగా ఆహ్వానించినట్లు నిన్ను తన దగ్గర చేరమని అడిగాడు జనరల్ భోజా ఒక హంతకుడిని ఒంటరిగా తరుముకొచ్చిన నీ ధైర్యసాహసాలు చూసేకాక, నిన్ను భోజా స్వయంగా తన దగ్గర పైలెట్ గా చేరమని అడగడం వల్ల కూడా నువ్వే మా నెక్స్ ట్ ఏజెంట్ వని నిర్ణయించుకున్నాను." అన్నాడు ప్రతాప్.

 

    వినీల కళ్ళు మెరిశాయి.

 

    "ఇప్పుడంతా అర్థమయింది. తప్పకుండా అతని దగ్గర పైలెట్ గా చేరతాను. ఎనీ థింగ్ ఫర్ మై కంట్రీ:" అంది.

 

    తృప్తిగా తల పంకించాడు ప్రతాప్.

 

    హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అంది వినీల . "ఇందాక మీరు మొదలెట్టిన కథ పూర్తిగా చేయనేలేదు. మీరిలా పిచ్చివాడిలా ఎందుకు నటిస్తున్నారు?"

 

    "ఏజెంట్లకి రెండు ఐడెంటిటీలు ఉండడంవల్ల చాలా పనులు సులభంగా సాధించవచ్చు. మా అమ్మ చనిపోకముందే నేను ఈ సీక్రెట్ సర్వీసులో చేరాను. అమ్మ మరణం నన్ను కృంగదీసింది. నిజంగా పిచ్చెక్కినంత పని అయింది. కానీ అప్పుడు గుర్తొచ్చింది నాకు ఉన్నది ఒక్క అమ్మకాదు, ఇద్దరమ్మలని. మా అమ్మ నన్ను కన్నతల్లి. కానీ అమ్మలని కన్న అమ్మ ఈ భారతదేశం. ఆమె అందరికీ కన్నతల్లి కంటే ఎక్కువ.

 

    కన్నతల్లి చావు నా పాలిట శాపమయినా, దేశమాత సేవకోసం దాన్నే వరంలాగా మార్చుకున్నాను... అప్పట్లో తాత్కాలికంగా నేను ఉన్న ఉన్మదావస్థలాంటిదాన్ని కావాలని పొడిగించి, నాకు నిజంగా మతి భ్రమించిందని అందరూ అనుకునేటట్లు చేశాను. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతాప్ పిచ్చివాడు బయట రహస్యంగా తిరిగే రాణా ప్రచండుడు.... ఇలా పిచ్చివాడిగా ఉండడం వల్ల నన్నెవ్వరూ పట్టించుకోరు. కానీ నేను మాత్రం అందరి రహస్యాలూ కనిపెట్టటానికి ఈ అవతారం బాగా పనికి వస్తుంది. పిచ్చివాడి రూపంలో ఉండి తెలుసుకున్న విషయాలకి రాణా రూపంలా బయటకెళ్ళి చేయవలసిన విరుగుడు చేస్తాను" అన్నాడు ప్రతాప్ అలియన్ రాణా.                       

 Previous Page Next Page