Previous Page Next Page 
చెక్ పేజి 16


    డప్పులు ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నట్టు నిశ్శబ్దంగా వుంది. గాలిలో పెరాలిసిస్ వచ్చినట్టు అప్పుడప్పుడూ వీస్తోంది. ఆకాశం చినుకులను రాలుస్తూ తన సానుభూతిని ప్రకటిస్తోంది.

 

    "పెద్దా ! ఒక్క మాట విను" ధైర్యం చేసి ఇద్దరు రైతులు పెద్ద దగ్గరకు వెళ్ళారు. "ఈ ఘోరం వద్దు. కన్నా కూతురితో తండ్రి పడుకోవడం దారుణం. ఆ తల్లి మనల్ని ఆదరించే తల్లి. ఆ గంగమ్మ తల్లే దీనిని ఒప్పుకోదు. ఒకసారి ఆలోచించు" అన్నారు.

 

    "అయితే మా పెద్దే కన్నెరికం చేస్తారు" ఠక్కున అన్నారు యానాదులు. రైతులు హతాశులయ్యారు. రైతు స్త్రీలు ఇళ్ళకు పరుగు లామతి నడకతో  బయల్దేరారు.

 

    గాలి బిగదీసుకుపోయింది. కొన్ని కాగడాలు తనువును చాలించాయి. చినుకులు దబదబాపడుతున్నాయి.

 

    "అయ్యో! వద్దు. నా మీద కసి తీర్చుకోండి. నన్ను చంపండి. కొట్టండి. నా బిడ్డను వదిలెయ్యండి" అంటూ భుజంగం పెద్దకాళ్ళముందు చతికిలపడిపోయాడు.

 

    "పెద్దా నువ్వే కన్యార్పణం చెయ్. ఆయన్ను వదిలిపెట్టేయ్" యానాదుల్లో కొందరు సలహా ఇచ్చారు.

 

    పెద్ద గొంతు విప్పాడు. "సరే మీ ఇష్టం. ఆమెను బసిలిని చేసే బాధ్యత నా నెత్తిమీద వేసుకున్నాను. పెద్దగా యానాదుల బాగోగులు చూడాల్సిన వ్యక్తిని నేను. అందుకే ఒప్పుకుంటున్నాను."

 

    డప్పులు తిరిగి అరవడం ప్రారంభించాయి. గాలి సంకెళ్ళను విప్పుకున్నట్లు మెల్లిగా వీస్తోంది. పడుతున్న చినుకులు కాగడాల వెలుగుల్లో రక్తపు చుక్కగా వున్నాయి.

 

    అనూరాధను గుడిలోకి తోశారు.

 

    పెద్ద భుజంగం చేతుల్లోంచి తన కాళ్ళను లాక్కున్నాడు. మెల్లగా గుడికేసి సాగాడు.

 

    భుజంగం పసిపిల్లాడిలా అయిపోయాడు. జుట్టు పీక్కున్నాడు. యానాదులకంతా రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. వెళ్ళిపోతున్న రైతులను పిలిచాడు. గంగమ్మ తల్లిని ప్రార్థించాడు.

 

    అయినా ఎవరూ అతని మొర ఆలకించలేదు.

 

    పిచ్చిపట్టిన వాడిలా గుడిలోకి దూసుకెళ్ళాలని ప్రయత్నించాడు. గుడిలో అతను వెళ్ళకుండా యానాదులంతా అడ్డుకున్నారు.

 

    ఇక అక్కడ వుండలేకపోయాడు. ఈడ్చి వదిలిపెట్టిన బాణంలా తన ఇంటికి పరిగెత్తాడు.

 

    తలుపులన్నీ మూశాడు.

 

    ఉరితాడును మెడకు బిగించుకుంటూ అతను ఒక్క విషయం గురించే ఆలోచించాడు.

 

    "తన చీటీల మోసం ఎలా బెడిసి కొట్టింది?" ఆ ప్రశ్న అతని బుర్రలో గింగుర్లు తిరుగుతోంది.

 

    సరిగ్గా అదే సమయంలో మచ్చల పాములా తనమీదకొస్తున్న యానాది పెద్దని చూసి అనూరాధ దిక్కులు పిక్కటిల్లేలా కెవ్వున అరిచింది.

 

    కథ పూర్తిచేసి కుర్చీలో వెనక్కు వాలాను.

 

    "అనూరాధను బసిలిగా చేయడం దారుణం" అంది కీర్తి.

 

    "ఆమెను గూర్చే ఆలోచిస్తావెందుకు? అంతవరకు భుజంగం చెరిచిన యానాదుల అమ్మాయిల గురించి ఆలోచించవేం?"

 

    "అది నిజమే అనుకో. కానీ పాపం అనూరాధ తను చేయని తప్పుకు శిక్ష అనుభవించింది."

 

    "కావచ్చు. ఒక కార్యం యొక్క దుష్ఫలితాలు మనం వూహించినట్టే వుండవు. ఆ అమ్మాయి చేసిన తప్పంతా భుజంగం లాంటి వాడికి కూతురుగా పుట్టడమే."

 

    కీర్తి మౌనంగా వుండిపోయింది.

 

    "మన బాధంతా అనూరాధను పెద్ద చెరచడంవరకే పరిమితమై పోతుంది. కానీ అంతకు ముందు యానాదుల అమ్మాయిలు పడ్డ నరకం మన మనసులను తాకదు. ఓ పెద్దింటి అమ్మాయి పరిస్థితులవల్ల పెదదైపోయి మరో ఇంట్లో అంట్లు తోముతూ వుంటే మనం లీటర్ల కొద్దీ కన్నీళ్ళు కారుస్తాం. పుట్టినప్పట్నించి అంట్లు తోమే అమ్మాయిలను పట్టించుకోం. అదే మన నైతిక విలువల్లో వుండే లొసుగు" అన్నాను.

 

    "నువ్వు చెప్పేది ఏదీ కాదనలేను ప్రభూ! లెక్చర్ ఆపు" అంది కీర్తి దండం పెడుతూ.

 

    "సరే ఇక మాట్లాడను."

 

    "అది సరే మదన్! చీటీల మోసం ఏమిటి? అది ఎలా బెడిసికొట్టింది?"

 

    "అదే ఈ కథకు సస్పెన్స్."

 

    కీర్తి వుడుక్కుంది.

 

    "అయితే గుడ్ నైట్."

 

    కీర్తి తన పోర్షన్ లోకి వెళ్ళిపోయింది.

 

    నేను నిరుత్సాహంగా అలానే కుర్చీలో వుండిపోయాను.

 

    "బొల్లి మచ్చల యానాది పెద్ద కీర్తిని భయపెట్టాడా?"

 

    కొంతసేపు అక్కడే వుండి నా పోర్షన్ లోకి వెళ్లాను. మరుసటి రోజు ఉదయం నేనే ముందు నిద్రలేచాను. వరండాలో కూర్చున్న అయిదు నిమిషాలకల్లా దామూ వచ్చాడు.

 

    "ఏం సార్ ! త్వరగా లేచినట్టున్నారు"

 

    "అవును దామూ!రాణీగారికంటే కాస్త ముందే. ఆమె ఇంకా లేచినట్టులేదు" అని కాఫీ అందుకున్నాను.

 

    "ఇంకేం సార్ విశేషాలు?"

 

    "తిరుమల బాగా నచ్చిందా సార్?"

 

    "వూ" అని తల ఆడించాను.

 

    అంతలో తలుపు తెరుచుకున్న చప్పుడు.

 

    స్నానం చేసి, కొత్తచీర కట్టుకుని వచ్చింది కీర్తి.

 

    రోజా పువ్వులున్న తెల్లటి చైనీస్ సిల్క్ చీర కీర్తి ఒంటి నునుపుకి జారిపోతూ వుంది.

 

    "నమస్తే అమ్మా" అని కాఫీ అందించాడు దాము. నవ్వుతూ తీసుకుంది.

 

    "ఏం సార్! ఈ రోజు కాటేజ్ లోనే వుంటారా! ఎటైనా వెళతారా? మీరు ఇక్కడే వుంటే కాఫీలు పట్టుకొస్తుంటాను" అన్నాడు దాము.

 

    "ఈ రోజు పాపనాశనం వెళ్లాలనుకుంటున్నాం" అంది కీర్తి. ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయిందన్నమాట.

 

    "అవును దామూ."

 

    "అలా అయితే సాయంకాలం వస్తాను సార్."

 

    దామూ వెళ్ళిపోయాడు.

 

    "రాత్రి నా కోసం ఎదురు చూశావా?" కొంటెగా అడిగింది కీర్తి.

 

    "లేదు" అన్నాను కటువుగా.

 

    "రాత్రి చెప్పిన కథ నన్ను పూర్తిగా భయపెట్టలేదు మదన్. అనూరాధను తలచుకుంటే బాధ పొంగుకొచ్చింది. అయితే సస్పెన్స్ బాగుంది. చీటీల మోసం ఏమిటో అంతుబట్టడం లేదు. రాత్రి కథలో భయానకం కన్నా, విషాదమే ఎక్కువగా వుంది."

 

    అంత అద్భుతంగా కథను విశ్లేషిస్తున్న కీర్తిని భయపెట్టే కథను చెప్పగలనా? ఇంపాజిబుల్.

 Previous Page Next Page