Previous Page Next Page 
మగబుద్ధి పేజి 17


    "ఏమిటి అడ్రస్?" నరేష్ ఆగలేక పోతున్నాడు.

 

    "పెద్ద కష్టపడకుండానే అడ్రస్ తెలుసుకున్నాను" డ్రైవర్ అసలు విషయం చెప్పక బాగానే సస్పెన్స్ మైన్ టైన్ చేస్తున్నాడు.

 

    "ముందు విషయం చెప్పవయ్యా!" గద్దించి అడిగాడు నరేష్.

 

    "స్వామీ! నేను అయ్యప్పదీక్షలో ఉన్నాను. నన్ను మీరు స్వామీ అని పిలవాలి. అయ్యాగియ్యా అనకూడదు" డ్రైవర్ చిన్నబుచ్చుకుంటూ చెప్పాడు.

 

    "సరేలే స్వామీ! ముందు చంపక అడ్రస్ చెప్పు."

 

    ఇక తప్పదన్నట్టు ముఖం పెట్టి "బాలాజీ కాలనీలో ఇల్లు. ఇంటి నెంబర్ పదిహేడూ బై ఒకటి" అని చెప్పాడు డ్రైవర్.

 

    నరేష్ ఎగిరి గంతేశాడు. అడ్రస్ ను మనసులోనే మరో మారు అనుకొని బ్యాంక్ లాకర్ లో వేసినట్టు అడ్రస్ ను మెదడులోని ఒక అరలో వేసేశాడు. ఇక చచ్చినా మరిచిపోను అనుకున్నాడు.    

 

    "మరి మీరిస్తానన్న పదిహేను రూపాయలు" డ్రైవర్ నసుగుతూ అడిగాడు.

 

    "సారీ స్వామీ! జేబులో చిల్లిగవ్వలేదు. ఎప్పుడైనా ఇటొచ్చినప్పుడు ఇస్తాలే. అయ్యప్పమీద ఒట్టు" అని నరేష్ వెళ్ళిపోతున్నాడు.

 

    మోసం ఎక్కడ జరిగిందో తెలిసిపోయింది డ్రైవర్ కి.

 

    "ఆగు" గద్దించాడు అతను.

 

    నరేష్ వెనక్కు తిరిగి చూశాడు.

 

    "డబ్బివ్వకపోతే తంతాను."

 

    "నువ్విప్పుడు తన్నలేవు స్వామీ. కారణం నువ్వు అయ్యప్ప దీక్షలో వున్నావు. ఇలా తన్నకూడదనే నిన్ను సెలక్ట్ చేసుకున్నాను" అని చరాచరా వచ్చేశాడు నరేష్.

 

                                                *    *    *    *    *

 

    నరేష్ నిద్ర లేచాడు.

 

    వెంటనే రజని రూపం అతని కళ్ళ ముందు వేలాడింది. తను రజనీని మనసా, వాచా ప్రేమిస్తున్నాననేందుకు ఈ సింప్టమ్ చాలు. రజని ఎవరో ఎక్కడుంటుందో తెలిసిపోయింది. ఇక మిగిలింది తన ఆరాధనను ఆమెకు తెలియజేయడమే. తన ప్రేమను అందంగా, అద్భుతంగా తెలియజేయాలనుకున్నాడు.  

 

    రజని ఎవరో తెలిశాక కూడా అతను ఆమెను ప్రేమించడం మానుకోలేదు. పూటకు అన్నం లేని తను కోటీశ్వరుడు కూతురైన రజనీని ప్రేమించడానికి అనర్హుడన్న ఆలోచనే రాలేదతనికి. ఆమె పాకీవాడి కూతురైనా, ప్రధానమంత్రి కూతురైనా అతనికొక్కటే. తను ఆమెను ప్రేమిస్తున్నాడు. గాలిలాగే ప్రేమకూ రంగు, రుచి, వాసన లేదు. గాలిలాగే ప్రేమ కూడా సర్వాంతర్యామి. ప్రేమకు ఆస్తులు, అంతస్తులు అడ్డురావు. ప్రేమకు తారతమ్యం లేదు. అది స్వచ్ఛమైంది అందుకే తన ప్రేమను ఆమెకు తెలియజేయాలని కొన్నిరోజుల ఆలోచన తరువాత నిర్ణయించుకున్నాడు అతను.   

 

    అయితే తన ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియటం లేదు. చాలా  విధాలుగా వూహించాడు. కానీ కుదరటం లేదు. ఏ ఒక్కటీ థ్రిల్లింగ్ గా లేదు.

 

    జనం, వాహనాలతో రోడ్డు బిజీగా వుంటుంది. ఓ దగ్గిర ట్రాఫిక్ జామ్ లో రజని కారు యిరుక్కుపోయుంటుంది. తను ఆమెను చూస్తాడు. పట్టలేని ఉద్వేగంతో తన ప్రేమను ఆమెకు తెలియజేయాలని పరుగెత్తుతాడు. అప్పుడే ఎర్రలైట్ ఆరి, పచ్చలైట్ వెలుగుతుంది తను వాహనాలను తప్పించుకుంటూ పరుగెడతాడు. చివరకు రజని కారు దగ్గరకు వెళతాడు. అప్పటికే కార్లకు, బస్సులకు అడ్డం పడి ఆమె దగ్గరకు పరుగెత్తుతున్న తనను రజని గుర్తిస్తుంది. తను కారు దగ్గరికెళ్ళి ఆయాసంతో అంతకంటే భావోద్వేగంతో ఆమెతో ఐ లవ్ యూ అంటాడు... అప్పుడు...?

 

    ఇలా చెప్పాలని ఆలోచించాడు. కానీ ఇది వీలు కాదనిపించింది. ట్రాఫిక్ జామ్ లో రజని కారు యిరుక్కుపోవాలి. ఆ సమయంలో తాను అక్కడ వుండాలి. చాకచక్యంగా వాహనాలను తప్పించుకుపోవాలి. దురదృష్టవశాత్తూ తను ఏ వాహనం కిందయినా పడి కాలును తొక్కేస్తే అప్పుడు తన ప్రేమ కుంటిదయిపోతుంది.  

 

    ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ అలా దొర్లుతూ వుండిపోయాడు. పడకనుంచి లేస్తే టిఫిన్ సమస్య కూడా ఎదురౌతుందని అలానే కళ్ళు మూసుకున్నాడు. ఏకంగా పన్నెండుకు లేస్తే టిఫిన్ సమస్యను స్కిప్ చేసెయ్యచ్చని అతని ఎత్తుగడ.

 

    "నరేష్... నరేష్"

 

    ఎవరో పిలుస్తున్నట్టనిపించి పడకమీద నుంచి లేచాడు.

 

    డోర్ తెరుస్తూనే ప్రసాద్ కనిపించడంతో తెల్లారి ఈ సుత్తి ఎందుకొచ్చిందనుకున్నాడు.

 

    ఇంటి ఓనర్ కొడుకు కాబట్టి, తను అద్దె బకాయి వున్నాడు కాబట్టి తన అసహనాన్నంతా లోపలే దాచుకొని "రండి సార్" అంటూ ఆహ్వానించాడు.

 

    ప్రసాద్ లోపలికొచ్చాడు.

 

    అతనికి ముప్ఫై మూడు ఏళ్ళుంటాయి. కుడిపక్క పాపిట దగ్గిర వెంట్రుకలు బాగా అరచేతి పొడవున రాలిపోవడంతో మరో రెండేళ్ళు ఎక్కువ వున్నట్టు కనిపిస్తాడు. చెక్ పోస్టులో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. లంచాలు అవి బాగా మేస్తాడని అతన్ని చూస్తూనే తెలిసిపోతుంది అతనికున్న సమస్యలు రెండే రెండు. ఒక సమస్య భార్య శ్రీలక్ష్మి అయితే, మరో సమస్య తండ్రి పూర్ణానందం.

 

    అతను గదినంతా పరిశీలనగా చూసి "బ్రహ్మచారి గది ఎంత బాగా లేకపోతే ఆ బ్రహ్మచారి అంత సుఖాలు అనుభవిస్తున్నట్టు లెక్క" అన్నాడు.

 

    నరేష్ అర్థంకానట్టు చూశాడు.

 

    "అవునయ్యా! బ్రహ్మచారి గది శుభ్రంగా వుంటే ఆ కుర్రాడు అంత బుద్ధిమంతుడన్న మాట! బుద్ధిమంతుడికి ఎప్పుడూ సుఖముండదు. అలా అల్లాటప్పాగా వుండేవాడికే సుఖాలు రూమ్ వరకూ నడిచొస్తాయి. నీ గదిలో ఎప్పుడయినా నిరోద్ ప్యాకెట్టూ, సిగరెట్ పెట్టెలూ కనిపిస్తాయేమోనని చూస్తున్నాను. కానీ కనిపించవే. అందుకే నువ్వంటే నాకు అయిష్టమయ్యా" ప్రసాద్ ముఖం అష్టవంకర్లు పోయింది.

 

    "మీరు వింతగా మాట్లాడుతారు సార్!" నరేష్ అన్నాడు.

 

    "నా మాట విని పెళ్ళికి ముందే ఎంజాయ్ చెయ్! పెళ్ళయిన మరుక్షణం సంతోషించడానికి ఏం మిగలదు ఎందుకంటే పెళ్ళి కాగానే జీవితం ముండమోస్తుంది" అని బిగ్గరగా నవ్వాడు.

 

    శ్రీలక్ష్మిలాంటి భార్య దొరికితే ఎవరయినా అలానే మాట్లాడతారనిపించింది నరేష్ కి. ఆమెది వింత మనస్తత్వం! పెళ్ళి అయిన రోజు నుంచి తన భర్తను సర్కస్ ఫీట్లు చేయిస్తోంది. ఆమెకు నటుడు చిరంజీవి పిచ్చి, తన భర్త కూడా చిరంజీవి లాగానే వుండాలని ఆమె తపన. అందుకే తన భర్త దగ్గర చిరంజీవి వేసుకునే టీ షర్ట్ లు, డబుల్ బుల్ చొక్కాలు వేయిస్తుంది. జీన్స్ ఫ్యాంట్లు తొడుగుతుంది. మెడచుట్టూ స్కార్ప్ కట్టిస్తుంది. ఈ వేషధారణతో అతను అచ్చు బఫూన్ లా వుంటాడు. ఇంతే అయితే ఫరవాలేదు. ప్రణయ సన్నివేశాల్లో చిరంజీవిలా ఫీలింగ్స్ పెట్టాలని శాసిస్తోంది. చిరంజీవి హీరోయిన్ వేపు చూసినంత కత్తిగా తనవైపు చూస్తే తప్ప తనకు 'పడకమూడ్' రాదని ఫస్టునైటే తెగేసి చెప్పేసింది. అప్పటినుండి పాపం ప్రసాద్ చిరంజీవిలా భావప్రకటన చేయడానికి ప్రాక్టీసు చేస్తూనే వున్నాడు. కానీ ఇంతవరకూ అతను తన పెళ్ళాం దగ్గర తన అనుకరణను ఓకే అనిపించుకోలేదు. ఈ విషయాలన్నీ నరేష్ దగ్గిర చెప్పుకుని బాధపడుతుంటాడతను.

 Previous Page Next Page