అతని కుడికన్ను కొద్దిగా వాచి వుండటం తప్ప మరో మార్పు లేదు శరీరంలో. బయటకు కనపడకుండా ఎంతో లాఘవంతో లో దెబ్బలు కొట్టిన ఆ వస్తాదును మెచ్చుకున్నాడు. ఒళ్ళంతా పచ్చిపుండులా తయారయినా బయటకు మాత్రం మామూలుగానే కనిపిస్తున్నాడు.
అతను థియేటరులోంచి బయటికొచ్చి ఆవరణలో తిరుగుతుండడంతో గేట్ మ్యాన్ అడిగాడు.
"ఏం సార్! సినిమా నచ్చలేదా? వెళ్ళిపోతారా?"
"లోపల నా ఫ్యామిలీ వుంది. వాళ్ళ కోసం చూస్తున్నాను. లోపలుంటే నా శరీరం నాకు మిగలదు."
"ఏం సార్ సినిమా అంత చెత్తగా వుందా?"
"ఆఁ!" ఎటో చూస్తూ అన్నాడతను.
గేట్ మ్యాన్ వెళ్ళిపోయాడు.
సినిమా వదిలేలోపు తను ఒక పని చేయాలి! ఆ పని చేస్తేనే రజని అడ్రస్ తెలుస్తుంది. మరో పదిహేను నిమిషాల్లో సినిమా వదిలేస్తారు. ఆ పనిని ఈలోపు ముగించాలనుకుంటూ అతను కారు పార్కింగ్ వేపు నడిచాడు.
అక్కడెవరూ లేరు. దాదాపు నాలుగయిదు కార్లు వున్నాయి. అతనికి కావలసిన కారు రెక్కలు ముడుచుకున్న తెల్లటి పావురాయిలా వుంది. ఆ కారు దగ్గరకి మెల్లగా వెళ్ళి ముందు టైరు దగ్గర వంగాడు.
తనను ఎవరయినా గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. ఎవరూ తనను గమనించడంలేదని నిర్ధారించుకున్నాక టైరును తన చేతనున్న పిన్నుతో పొడిచాడు.
కొంతసేపటికి టైరు చిన్న శబ్దంతో భూమిని అతుక్కుపోయింది. ఓ పక్క టైరులో గాలి లేకపోవడంతో కారు ఆ మేరకు వాలిపోయింది.
అతను పైకిలేచి బయటకు నడిచాడు.
అంతవరకు అతన్నే స్థంభం పక్కనుంచి గమనిస్తున్న బ్రహ్మానందం కూడా అక్కణ్ణుంచి కదిలాడు.
బయటికొచ్చిన నరేష్ పక్కనే ఉన్న ఆటోస్టాండ్ కు వెళ్ళాడు.
"స్వామీ! ఆటోకావాలా?" ఆటో డ్రైవర్ అడిగాడు.
నరేష్ అతన్ని ఎగాదిగా చూశాడు. ఆ డ్రైవర్ అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. నల్లటి పంచె, నల్లటిచొక్కా, నల్లటవల్తో అతను బొగ్గుముక్కలా ఉన్నాడు. నుదుటిమీద అడ్డంగా చందనం బొట్టు. దానిపైన విభూది పట్టీ.
అతన్ని చూస్తూనే తన రజని అడ్రస్ సంపాదించడంలో వేయాల్సిన రెండో స్టెప్ ఏమిటో అతనికి తెలిసిపోయింది.
"ఆఁ" అన్నాడు నరేష్ గంభీరంగా.
"ఎక్కడికి స్వామీ?" అయ్యప్ప దీక్షలో వున్నవారు అందర్నీ స్వామి అని సంబోధించాలి. అందుకే డ్రైవర్ సార్ అనకుండా స్వామీ అన్నాడు.
ఇతనెవరో అసలైన అయ్యప్ప స్వామిగా ఉన్నాడు ఇలాంటివాళ్ళే తనకు కావలసింది మనసులో అనుకున్నాడు నరేష్.
ఆటో లోపల కూర్చుని "అప్సరాకి వెళ్ళనీ" అన్నాడు.
ఆటో ఫర్లాంగు దూరం నడిచి అప్సరా ముందాగింది.
ఆటోను పక్కగా పెట్టిన అయ్యప్పస్వామితో "ఇప్పుడు థియేటర్ లోంచి నలుగురు అమ్మాయిలు వస్తారు వాళ్ళ కారు చెడిపోయింది. వాళ్ళను వాళ్ళు చెప్పిన అడ్రస్ దగ్గర దింపి వచ్చెయ్ వాళ్ళే మీటర్ ఛార్జి ఇస్తారు. తీసుకో. కానీ ఒక్క సహాయం చేయాలి నువ్వు. ఆ నలుగురిలో గులాబీ రంగు చీర కట్టుకున్న అమ్మాయి ఎక్కడ దిగిందో, ఆ ఇంటి నంబరేమిటో చూసి నాకు చెప్పాలి" చెప్పాడు నరేష్.
డ్రైవర్ అనుమానంగా చూశాడు.
"నువ్వు అయ్యప్పదీక్షలో వున్నావు స్వామీ! అనుమానపడడం, అవమానించడం, కోపం తెచ్చుకోవడం లాంటివి చేయకూడదు. ఆమెకు నేను సెక్రటరీని. నిన్ననే వాళ్ళు ఇల్లు మార్చారు. కొత్త ఇంట్లో దిగారు. ఆ కొత్త ఇల్లు అడ్రస్సెక్కడో నాకు తెలియదు. ఆమెనే డైరెక్ట్ గా అడుగుదామనుకుంటే ఆమెకి కాస్తంత కోపమెక్కువ. ఇల్లు మార్చి ఇరవై నాలుగు గంటలైంది. మేం ఏ ఇంట్లో చేరామో తెలుసుకోలేని నువ్వు ఏం సెక్రటరీవి అని నన్ను దులిపేస్తుంది. అందువల్ల ఆ అడ్రస్ తెలుసుకుని చెప్పు. స్వామీ! నువ్వీ సాయం వూరికే చెయ్యక్కర్లేదు. పదిహేను రూపాయలిస్తాను. సరేనా?" నరేష్ ఆగాడు.
"అలానే స్వామీ" అన్నాడు డ్రైవర్. తను స్వామిదీక్షలో వున్నాడు కాబట్టి ఎవరినీ అనుమానించకూడదని మనసులోనే అనుకొన్నాడు.
సినిమా వదిలారు.
రజని, సరళ, విమల, స్వర్ణముఖి కారు దగ్గరకి వెళ్ళారు.
కారు ఓ పక్కకు వాలినట్టు అనుమానమొచ్చి చూస్తే గాలిపోయిన టైర్ భూమికి అతుక్కుపోయి కనిపించింది.
"గాలిపోయిందా? పంచరా?" సరళ అడిగింది.
"ఏమో? ఇప్పుడెలా ఇంటికి చేరడం?" రజని. తనలోతానే అనుకొంటున్నట్టు అంది.
"కారు ఇక్కడే వదిలిపెట్టి ఆటోలో వెళ్ళు. మేం సిటీ బస్సులో వెళతాం. మీ డ్రైవర్ ను పంపి కారు తెప్పించుకో" ఉచిత సలహా పారేసింది సరళ.
"అదొక్కటే మార్గం" వాచ్ మాన్ ను పిలిచింది రజని. అతను వచ్చాడు.
"ఇది నా కారు. గాలిపోయింది డ్రైవర్ ను పంపిస్తాను కారు పంపండి."
అలానేనన్నట్టు తలవూపాడు వాచ్ మాన్.
ఎదురుగ్గా గేటు దగ్గిరగా వున్న ఆటోను కేకేసింది రజని.
"బాలాజీ కాలనీ" అని చెప్పి ఎక్కి కూర్చుంది ఆమె.
సరళ, విమల, స్వర్ణముఖి మిత్రురాలికి చేతులూపారు.
ఆటో వెళ్ళిపోగానే వాళ్ళు ముగ్గురూ బస్టాప్స్ కేసి నడిచారు.
ఎదురుగ్గా వున్న టీ బంక్ లో నరేష్ కూర్చుని కళ్ళప్పగించి చూస్తున్నాడు.
రజని ఆటోలో ఎక్కడం, అది తుర్రుమనటం గమనించాడు.
మరో పావుగంటకు ఆటో వచ్చింది.
తెల్లగా పళ్ళు చూపిస్తూ నవ్వుతున్న డ్రైవర్ ను చూస్తూనే తను సక్సెస్ అయ్యాడని అతను గ్రహించాడు.
పట్టలేని ఆనందంతో డ్రైవర్ దగ్గరకు వచ్చి "అడ్రస్ పట్టావా?" అని అడిగాడు. ఆనంద మోహన్ దవడమీద బాగా కొట్టడంతో మాట్లాడేటప్పుడు నోరంతా నొప్పేస్తోంది. అయితే ఆ బాధను గుర్తించే స్థితిలో అతను లేడు.
"ఆ" అంటూ డ్రైవర్ మళ్ళీ పళ్ళికిలించాడు.