"మీకు ఉన్నది అదొక్క సమస్యే కదా సార్! శ్రీలక్ష్మి దగ్గిర మీరు చిరంజీవి అనిపించుకుంటే ఆ తరువాత మీ జీవితమంతా టెక్నికలర్ సినిమానే కదా సార్!"
"మరి నా శ్రీమతి ఓకే చెయ్యాలిగదా! రెండేళ్ళ నుంచి నిలువెత్తు అద్దాన్ని ముందు పెట్టుకుని ప్రాక్టీసు చేస్తున్నాను. కానీ లాభం లేదే! చిరంజీవి హీరోయిన్ ని చూసినట్టు నేను నా భార్యను చూడలేకపోతున్నాను. దాంతో దానికి 'పడకమూడ్' రావడం లేదు. పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలవుతున్నా నేను యింకా అస్కలిత బ్రహ్మచారినే. అది తలుచుకున్నప్పుడంతా నా మనసు బాధను స్కలిస్తుందయ్యా" నూతన్ ప్రసాద్ లా రెండు చేతులతోనూ తల పట్టుకున్నాడు.
"ఎప్పుడో ఒకరోజు మీరు సక్సెస్ అవుతారులెండి సార్" నరేష్ అన్నాడు.
"ఏ రోజూ నేను సక్సెస్ కానయ్యా! ప్రసాద్ ప్రసాదే! నన్ను చిరంజీవిలా చూడమంటే ఏం చూస్తాను నా బొంద" నిరాశగా అన్నాడు.
"నాన్నగారు వున్నారా సార్?" అడిగాడతను.
మరో సమస్య గుర్తొచ్చినట్టు ప్రసాద్ తన ముఖాన్నంతా ఎరుపు చేసుకుని "నిక్షేపంలా వున్నాడయ్యా కింద సిగరెట్లు తగలేస్తూ. రోజుకు అయిదు ప్యాకెట్ లు వూదేస్తాడు పిల్లాడు చాక్ లెట్లను చప్పరించినట్లు. ఆ అయిదు పాకెట్లకూ రోజుకు పదిరూపాయలవుతున్నాయి. ఎక్కడ్నించి తేను? ఆయన స్వార్జితంగా మిగిలిన ఈ ఒక్క యింటిని పొగలా మార్చితే తప్ప బాల్చీ తన్నేసేటట్టు లేడు. ఆయనలా సిగరెట్ లు తాగుతూనే వుంటే నేనూ నీలా అద్దె యింట్లో వుంటూ, అద్దె బకాయిపడి చీవాట్లు తింటుండాల్సిందే" అని చెప్పాడు.
నరేషుకి తన పరిస్థితి గుర్తొచ్చి సిగ్గుపడుతూ తలవంచుకున్నాడు.
"ఏమయ్యా నరేషూ! ఎం.ఏ. చదువుకున్నావ్ కదా! మానాన్న దగ్గిర సిగరెట్ లు మాన్పించే ఉపాయం చెప్పకూడదూ! ఆ ఉపాయమేదో నా చెవిలో వూదితే ఒక నెల అద్దె అడగనయ్యా!" సీరియస్ గా చెప్పాడు ప్రసాద్.
"ఒక నెల అద్దె అడగరా?" ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ బిగదీసుకుపోయాడతను.
ఒక చిన్న సలహా చెబితే యాభై రూపాయలు. ఇదేదో కాస్ట్ లీ బేరంలా వుందనిపించి "ఓ చిన్న ప్లాన్ చెబుతాను సార్! దానితో మీ నాన్నగారు సిగరెట్ల జోలికి వెళ్లడు" చెప్పాడతను.
"త్వరగా అదేదో నా చెవిలో వూదు."
"ఏం లేదు సార్! చాలా సింపుల్! మీ నాన్నగారు సిగరెట్ కాల్చడానికి ఉపక్రమించినప్పుడు ఆయన చేతిలోనుండి సిగరెట్ ను తీసేసుకుని వక్కపొడి ఇవ్వండి. వక్కపొడి నములుతూ సిగరెట్ ధ్యాస మరిచిపోతాడు. అలా కొంతకాలానికి సిగరెట్ లు మానేస్తాడు. ఇక వక్కపొడి ఇప్పుడిప్పుడే తీసుకుంటాడు తప్ప అది అలవాటు కాదు" గీతోపదేశం చేస్తున్న కృష్ణుడైపోయాడు.
కాసేపు సాలోచనగా చూసి "ఇదేదో బావుందన్నట్టుందయ్యో! ట్రై చేస్తాను. నీ సలహా సక్సెస్ అయి, మా నాన్నగారు సిగరెట్ లు మానేస్తేనే చెప్పినట్టు ఒక నెల అద్దె అడగను. అదే నీకు బహుమానం" అన్నాడు ప్రసాద్.
"నా ఐడియా సక్సెస్ అవుతుంది సర్!"
"చూద్దాం" అంటూ అతను పైకి లేచాడు. కొండవీటి రాజాలో చిరంజీవి గెటప్ లో ఆయనకు ఆ రోజు శ్రీలక్ష్మి నల్ల ఫ్యాంట్ వేసి, పైన 'ఇంటర్నేషనల్ క్రూక్' అని రాసివున్న నల్లటి చేతుల్లేని బనీను వేసి, తల చుట్టూ నల్ల రిబ్బన్ కట్టి వుంది. ఆయన అవతారాన్ని చూసి నిజంగానే ఇంటర్నేషనల్ క్రూక్ లా వున్నాడనుకుని "అలాగే సార్" అన్నాడతను.
ప్రసాద్ ఆ డ్రస్ లో చెక్ పోస్టుకు వెళ్ళి ఎలా డ్యూటీ చేస్తాడో అర్థం కాలేదు నరేష్ కి.
ఆయన వెళ్ళిపోయాడు.
మళ్ళీ నరేష్ రజని ఒళ్ళో వాలిపోయి, కలలు కనడం ప్రారంభించాడు.
ఆమె ప్రేమను ఎలా సంపాదించాలో, తన ప్రేమను ఆమెకు ఎలా తెలియజేయాలా అన్నదే అతనికిప్పుడు ప్రధాన సమస్య అయిపోయింది. తనకు వుద్యోగం రాలేదనిగానీ, తన బతుకు బండి నడపటం లేదనిగానీ అతనికి చింత లేదు. అతను ప్రేమలో మొలనుంచి తలవరకు కూరుకు పోతున్నాడు.
తన ఆరాధనంతా ఆమెకు ఎలా తెలియజెయ్యాలా అన్న ఆలోచనలో మునిగిపోయాడతను.
పదిగంటలా పదకొండో నిముషానికి అతనికి బ్రహ్మాండమైన ఐడియా స్ఫురించింది. అది తను రోజూ ఆమెకో ఉత్తరం రాయడం. ఆ ఉత్తరంలో తన ప్రేమనంతా తెలియజెప్పే ఓ కవిత్వపు పీస్ ఉంటుంది. కింద తన సంతకం ఉండదు. ఆమె ఈ లెటర్ తనే రాశాడని సులభంగానే వూహిస్తుంది. లెటర్ లోని కవిత్వపు 'తునక' ఆమెను మరో లోకంలో తిప్పుతుంది. ఆ లోకంలో ఎక్కడ చూసినా తనే కనిపిస్తాడు. ఆ లోకంలో మొక్కలన్నీ ముళ్ళు లేని పూలనే పూస్తాయి. సెలయేళ్ళు సైతం రిథమిక్ గా పారుతుంటాయి. గాలి కృష్ణశాస్త్రి గీతాల్ని ఆలపిస్తుంటుంది. ఆ లోకంలో వెన్నెలకి పరిమళం వుంటుంది. దాంతో రజని తన ప్రేమ కోసం గిలగిల్లాడిపోతుంది.
ఆరోజునుంచే రోజుకొక ఉత్తరాన్ని పోస్ట్ చేయాలనుకున్నాడు అతను. ఆ రోజు లెటర్ లో ఏం రాయాలా అని మళ్ళా తపస్సులోకి వెళ్ళిపోయాడు.
పదకొండు గంటలా ఒక్క నిమిషానికి తను లెటర్ లో ఆరోజు ఏం రాయాలో తట్టింది.
వెంటనే పక్కనున్న పేపర్ ను అందుకుని ఇలా రాశాడు.
"సూర్యుడు వుదయించకపోతే లోకమంతా చీకటి.
నీవు దయ చూపకపోతే నాగతి ఏమిటి"
ఒకసారి చదువుకుని బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు. ఇన్ లాండ్ కవర్ లో రాసి పోస్టు చేద్దామనుకున్నాడు. కవర్ కొనడానికి చిల్లర కోసం పుస్తకాల్లో ఫ్యాంట్ జేబుల్లో అంతా వెదికాడు. ఎక్కడా దొరకలేదు. చివరకు హుండీ మీద అతని చూపుపడింది.