తనకి ఇష్టం లేకపోయినా, అవినాష్ కి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో తలూపింది గౌతమి.
"మనతో మీ చెల్లిని తీసుకెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు గానీ... ఇప్పటికిప్పుడు అంతదూరం నుంచి మీ చెల్లిని ఇక్కడకు తీసుకురావడం చాలా కష్టంకదూ...? మీ ఊరికి ఫోనుందా" అడిగాడు అవినాష్. ఆ ఊరికి ఫోన్ లేదని తెల్సు. ఇప్పటికిప్పుడు ఆ మారుమూల గ్రామంలో ఉన్న గౌతమి చెల్లి ఇంతదూరం రాలేదని, రప్పించే అవకాశం లేదని తెల్సు, అవినాష్ గౌతమికి ఎక్కడా అనుమానం రాకుండా ఆ చెల్లి ప్రసక్తి ఎత్తాడు.
"మనం తిరుపతిలో పెళ్ళి చేసుకుని మా ఊరెళ్ళి అక్కడ నుంచి నేరుగా మీ ఊరువెళ్దాం ఏమంటావ్" చేతులు పట్టుకుని అడిగాడు.
"అలాగే..." తలూపింది గౌతమి. ఇప్పుడు అవినాష్ మనసు చాలా ఆనందంగా ఉంది. ఇంతకు పూర్వం చెప్పినవన్నీ మరోసారి చెప్పి, మళ్ళీ ఉదయాన్నే వస్తానని చెప్పి, ఆమె కనురెప్పలమీద సున్నితంగా ముద్దు పెట్టుకుని బైటకు వచ్చేసాడు. ఒక హోటల్లో కూర్చుని తనెట్లా పద్మవ్యూహాన్ని అల్లాలో 'రఫ్' గా రెండో పధకం సిద్ధం చేశాడు.
ఈ రెండో పథకం ఎక్కడా ఫెయిల్ కాకుండా ఉంటే గౌతమి మళ్ళీ మానవమాత్రులకు కన్పించదు.
"మానవ మాత్రులకు గౌతమి కన్పించకుండా చేయడానికి అవసరమైన తెలివితేటలు తనకున్నాయి. గర్వంగా అనుకున్నాడు అవినాష్.
ఆ గర్వంతో అతను ఉప్పొంగిపోయాడు.
సరీగ్గా అదే సమయంలో-
అక్కడ నర్సింగ్ హోమ్ లో-
లేడీ డాక్టర్ మాలతో గౌతమి ఇలా చెప్తోంది.
"మా అమ్మను చూడాలనుంది మాలా... నాల్రోజులు లీవ్ పెట్టి మా ఊరెళ్తాను... ఏమంటావ్".
"నీ గర్భం గురించి బాధపడుతున్నావా..." లాలనగా అడిగింది డాక్టర్.
"లేదు."
"అయితే వెళ్ళిరా".
"ఎప్పుడెళ్తావ్?" డాక్టర్ మాల ఆ గదిలోంచి బైటకొస్తూ అడిగింది.
"రేపెళ్తాను" చెప్పింది గౌతమి.
గౌతమి ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మొట్టమొదటిసారి తనకు అన్నీ అయిన స్నేహితురాలు మాలతో అవినాష్ ప్రోద్భలంవల్ల అబద్ధం చెప్పింది. ఆ అబద్ధంవల్ల ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని నష్టాలో ఇరుక్కుంటుందో, ఏ మృత్యు గుహలోకి జారిపోతుందో, ఏ చీకటి ముళ్ళల్లో పడి విలవిల్లాడుతుందో...
అప్పుడు గౌతమికి తెలీదు.
7
మంగళవారం.
సమయం రాత్రి 7 గంటలు
విశాఖపట్నం నుంచి విజయవాడమీదుగా తిరుపతి వెళ్ళే పూరీ, తిరుపతి ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో కిటికీ పక్కసీట్లో కూర్చుని, మసక మసక వెల్తురులో వెనక్కి వెళ్ళిపోతున్న దృశ్యాల్ని చూస్తూ కూర్చుంది గౌతమి.
ఆమె మనసు ఇప్పటికి కుదుటపడింది. తన బతుకు ఏమౌతుందోనని ప్రతిక్షణం కన్నీళ్ళు కార్చిన ఆమె మనసులో ఇప్పుడు సంతోషం చోటు చేసుకుంది.
ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత తన మెడలో పచ్చని పసుపుతాడుంటుంది. తన కాలివేళ్ళకు మట్టెలుంటాయి.
తన చుట్టూ నిండుతనం చోటు చేసుకుంటుంది.
తను భయపడ్డట్టుగా తనకి అవమానాలుండవు. అనుమానాలుండవు. తనదైన చిన్న సంసారం తోటలో తన కన్న పేగుతో తను-గర్భంలో పడగానే తనని చీకటి బాధలకు, యమయాతనలకు గురిచేసిన తన 'ప్రేమ'
పుట్టే తన పాప ఎలా ఉంటుందో?
గౌతమి ఊహలు గమ్మత్తుగా ఉన్నాయి-
అప్పుడే విసిరిన పూలలా, సుగంధాల్ని మోస్తూ బరువుగా సంతృప్తి చెందే తాజా, తాజా పూలలా ఉన్నాయి.
"ఏమాలోచిస్తున్నావ్..." అవినాష్ పలకరింపుకి ఆలోచనలలోంచి తేరుకుంది గౌతమి.
"ఏం లేదు..." మెల్లగా నవ్వేసింది.
"తిరుపతెప్పుడైనా వెళ్ళావా." అడిగాడు అవినాష్.
"లేదు..." అందామె ఒకింత ఆనందోద్వేగంతో.
"అయినా ఏం పర్వాలేదులే... ట్రైన్ దిగ్గానే ఎవర్ని అడిగినా చెప్తారు. భీమా హోటల్ లో రూం బుక్ చేశాను. రేపటినుంచి నాలుగు రోజులపాటు ఆ రూం మనదే. ఫలానా విశాఖపట్నం నుంచి వచ్చానని, నా పేరు చెప్తే నీక్కావల్సినన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒక్కపూట నువ్వు గడిపేసావనుకో నేనొచ్చేస్తాను...ఓ.కే..."
"అలాగే...."
"ఖర్చుకి డబ్బులున్నాయి కదా...."
"ఉన్నాయి...."
చాలాసేపు వాళ్ళిద్దరి మధ్యా మాటలేం లేవు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
తొమ్మిదిన్నర ప్రాంతంలో-
సామర్లకోట స్టేషన్లో పావుగంటసేపు రైలాగింది.
ఇద్దరూ స్టేషన్ కేంటిన్లో టిఫిన్ చేశారు.