Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 18


    రాత్రి పన్నెండు గంటలవేళ-

 

    విజయవాడ స్టేషన్ కు చేరుకుంది ట్రైన్.

 

    "జాగ్రత్త...ఎల్లుండుదయానికల్లా నేనొచ్చేస్తాను" తన సూట్ కేసు పట్టుకుని దిగుతూ అన్నాడు అవినాష్.

 

    రైలు కదిలే వరకూ అక్కడే ఉన్నాడు.

 

    అవినాష్ రూపం కళ్ళముందు కనుమరుగయే వరకూ కంపార్ట్ మెంట్ కిటికీలోంచి చూస్తూనే ఉంది గౌతమి.

 

    ఆ తర్వాత-

 

    ఆమెతో చెప్పినట్టుగా విజయవాడ ఊళ్ళోకి వెళ్ళలేదు అవినాష్.

 

    ఊళ్ళోకి వెళ్ళడానికి అక్కడెవరూ లేరనే విషయం అవినాష్ కి ఒక్కడికే తెల్సు. 'డాడీ' అనే పేరుతో చెప్పిన మాటలన్నీ తను కల్పించినవేనని అవినాష్ కి తెల్సు.

 

    మరో గంటసేపు అవినాష్ విజయవాడ స్టేషన్లో రెండో నెం. ప్లాట్ ఫారమ్మీద విశాఖపట్నం వచ్చే ట్రైన్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

 

    సరిగ్గా రెండు గంటల ప్రాంతంలో-

 

    విశాఖపట్నం వస్తున్న ట్రైన్లో ఉన్నాడు అవినాష్.


                            *    *    *    *


    స్టేషనులో దిగ్గానే-

 

    ఆ రోజు ఈవెనింగ్ పూరీ, తిరుపతి ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో ఓ టిక్కెట్ రిజర్వ్ చేయించాడు.

 

    ఆ తర్వాత-

 

    రూం కొచ్చి, స్నానం చేస్తూ తన పధకాన్నంతా మరోసారి నెమరు వేసుకున్నాడు.

 

    ఎక్కడా ఏ ఆటంకం లేకుండా తన పధకం అమలు జరుగుతున్నందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటి తను శ్రీకృష్ణచైతన్యా నర్సింగ్ హోంకి వెళ్ళాలి.

 

    రెండు - వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళాలి.

 

    మూడు-గౌతమి పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళాలి.

 

    రూంలోంచి బయటికొచ్చి, జంక్షనులో ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేసి, కాఫీ తాగి ఆటో ఎక్కాడు. అయిదు నిమిషాల్లో ఆటో నర్సింగ్ హోం ముందు ఆగింది.

 

    ఆటోని ఉండమని చెప్పి-లోనికి నడిచాడు.

 

    ఆ సమయంలో డాక్టర్ మాల డ్యూటీలో ఉంది.

 

    "ఏమిటిలా వచ్చారు-మీ గౌతమి ఊరెళ్ళిందిగా-"

 

    అవినాష్ ని చూడగానే అంది డాక్టర్ మాల.

 

    "సడన్ గా ఎందుకెళ్ళింది-" ప్రశ్నించాడు అవినాష్ ఒకింత ఆశ్చర్యం నటిస్తూ.

 

    "నాల్రోజులు రెస్టు తీసుకుని వస్తానంది..." చెప్పింది మాల.

 

    "మొన్న ఈవెనింగ్ నేనొచ్చాను-ఒక్కమాట కూడా నాతో చెప్పలేదే-" బాధపడుతున్నట్టుగా అన్నాడు అవినాష్.

 

    "తన భవిష్యత్తేమౌతుందోనని భయపడుతోంది పాపం-

 

    మీతో చెప్పలేక పోతోంది కానీ... ఎంత బాధపడుతుందో తెల్సా-" మాల అంది.

 

    "ఆ పెళ్ళి విషయం మాట్లాడానికే వచ్చాను నేను..." నెమ్మదిగా అన్నాడు అవినాష్.

 

    "వెరీగుడ్...వాటే ప్లెజెంట్ న్యూస్- ఈ మాట వింటే గౌతమిలోనున్న బెంగలన్నీ పోతాయ్..." మాల అంది.

 

    "అయినా సమయానికి లేదు కదా..."

 

    "పోనీలెండి...ఏమైంది...శనివారంనాడు వచ్చేవచ్చు-

 

    రాగానే నేను చెప్తాను..." డాక్టర్ మాల వార్డులోకి వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ అంది.

 

    "అయితే శనివారం ఉదయాన్నే హాస్టల్ కి వస్తాను"

 

    "అలాగే-"

 

    మాలకి నమస్కారం పెట్టి, వెనక్కి వచ్చేసాడు అవినాష్.

 

    "ఒక పని అయిపోయింది-" మనసులో అనుకున్నాడు ఆటో ఎక్కుతూ.

 

    పదినిమిషాల తర్వాత సూర్యానగర్లోని ఉమెన్స్ హాస్టల్ ముందు ఆటో ఆగింది.

 

    ఆ సమయంలో హాస్టల్లో వార్డెన్ తప్ప మరెవరూ లేరు.

 

    "ఎవరు కావాలి సార్..." తనరూంలోకి అడుగుపెట్టిన అవినాష్ ని చూస్తూ అడిగింది వార్డెన్.

 

    "మిస్ గౌతమి..." చెప్పాడు అవినాష్.

 

    "ఒంట్లో బాగులేదని నిన్ననే వాళ్ళూరు వెళ్ళింది. శనివారం రావొచ్చు"

 

    "ఊరెళ్ళిందా..." ముఖంలో విషాదాన్ని నటిస్తూ ఆశ్చర్యపోయాడు అవినాష్.

 

    "థాంక్యూ మేడమ్... నేనొస్తాను..." వెనక్కి తిరిగాడు అవినాష్.

 

    "హలో...ఏమైనా చెప్పమంటారా..." వెనకనుంచే అడిగింది వార్డెన్.

 

    "వద్దులెండి...నేను శనివారం వస్తాను-" మరోమాట మాట్లాడకుండా వచ్చి ఆటోలో కూర్చున్నాడు.

 

    "వాల్టేర్ అప్ లాండ్స్ పోనీ..." ఆటోవాడితో చెప్పాడు అవినాష్.

 

    మరో పావుగంట తర్వాత ఆటో అప్ లాండ్స్ లోని ఉమెన్స్ కాలేజీ ముందు ఆగింది.

 

    ఆటో దిగి, నేరుగా ప్రిన్సిపల్ రూంవేపు నడిచాడు.

 

    తనని తాను పరిచయం చేసుకుని గౌతమి గురించి ప్రిన్సిపాల్ ని అడిగాడు.

 

    "ఓ గౌతమి...లేదే- లీవ్ లో ఉన్నట్టుందే..." అని అందావిడ.

 

    "మీరెక్కడ నుంచి వచ్చారు..." మళ్ళీ ప్రశ్నించిందావిడ.

 

    "ఇక్కడే..."

 

    "అర్జంటు పనా..."

 

    కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు.

 

    "వస్తాను గౌతమి వస్తే... నేనొచ్చానని చెప్పండి..." లేస్తూ అన్నాడు అవినాష్.

 Previous Page Next Page