Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 16


    "ఏం చెప్పను... అంతా ఓ.కె... కానీ... మా డాడీని ఎలాగోలా కాకాపట్టి నేను ఒప్పించాను. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా టేకిల్ చేస్తే... వచ్చే నెలలోనే మన పెళ్ళయిపోతుంది..." చెప్పింది రోష్ణి.

 

    "అంటే ఎలా..."

 

    "ఎలా అంటే... ఈ ఉద్యోగం మానేసి, మా బిజినెస్ లోకి వచ్చేయమన్నారనుకో... బుద్ధిగా వచ్చేస్తానని చెప్పాలి... ఆయన అన్నదానికి మరోమాట అనకుండా ఉంటే... ఆయనకు చాలా ఇష్టం... అదే ఆయన వీక్ పాయింట్" చెప్పింది రోష్ణి.

 

    "మరి మీ ఇంట్లో మీ ఆంటీవాళ్ళు మన పెళ్ళికి అడ్డం రారా" ఆసక్తిగా ప్రశ్నించాడు అవినాష్.

 

    "డాడీకి ఇష్టమైతే వాళ్ళేమాత్రం... అంతకీ అక్కడుండలేమనుకో... సిటీలో ఇంకో బిల్డింగు ఉంది... అక్కడుంటాం మనకేం భయమా... డాడీ మన దగ్గరే ఉంటారు..." చెప్పింది రోష్ణి.

 

    తన పధకం పారుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అవినాష్ కు. ఇంత సులభంగా తను లక్షాధికారి అవుతాడని అతనెప్పుడూ ఊహించలేదు.

 

    టిఫినూ, కాఫీలూ పూర్తయ్యాయి.

 

    ఇద్దరూ బైటకొచ్చారు.

 

    "ఇదిగో అవినాష్... మా డాడీ బొంబాయినుంచి అయిదురోజుల తర్వాత వస్తారు... అంటే శనివారం అన్నమాట... ఆ రోజు సాయంత్రం సరిగ్గా ఆరుగంటలకు నువ్వెక్కడున్నా రావాలి... నిన్ను డాడీకి ఇంటర్డ్యూస్ చేస్తాను... ఆ తర్వాత మీ ఇద్దరూ మాట్లాడుకుంటారు... ఓ.కె..."

 

    కార్లో కూర్చుంది రోష్ణి.

 

    "నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చెయ్యనా" అని అడిగింది.

 

    "వద్దు... ఇవాళ లంచ్ చేసి కాలేజీకెళ్తాను... నువ్వెళ్ళిపో"

 

    "సీ... యూ..." ఇగ్నీషన్ కీ తిప్పి, ఇంజన్ స్టార్టు చేసింది.

 

    కారు ముందుకి కదిలింది.

 

    లంచ్ చేసి కాలేజీకి వెళ్దామనుకున్న అవినాష్ ఆవేళ కాలేజీ కెళ్ళలేదు. తను అర్జంటుగా ఊరెళ్తున్నానని, ఫాదర్ కి సీరియస్ గా ఉందని ప్రిన్సిపాల్ తో చెప్పి ఉండిపోయాడు.

 

    తర్వాత తన రూం కెళ్ళిపోయి, చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు.

 

    శనివారం లోపల తను గౌతమి అడ్డం తొలగించుకోవాలి.

 

    అందుకు పటిష్టమైన పధకం ఆలోచించాడు.

 

    తర్వాత-

 

    నాలుగ్గంటలకు రూంలోంచి బయటికొచ్చి శ్రీ కృష్ణచైతన్యా నర్సింగ్ హోంకి వెళ్ళాడు గౌతమిని కలవడానికి...


                             *    *    *    *


    ఆ గదిలో ఎదురెదురుగా గౌతమి, అవినాష్ కూర్చున్నారు.

 

    తన పథకాన్ని అమలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు అవినాష్. అందుకు ముందు మాటగా అతని నోటంట ఓ మాట వచ్చింది.

 

    "మా డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారు తెల్సా..."

 

    ఆ మాటకు చాలా ఆశ్చర్యపోయింది గౌతమి. ఆమె నీర్సపు కళ్ళల్లోంచి ఒక ఆశ సూర్యుడిలా వెలిగింది.

 

    "ఇప్పటికే మా డాడీ పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది... ఎప్పటికెలా ఉంటుందో తెలీదు... కోడల్ని చూసుకుని చనిపోవాలని తనకు కోరికట... మనకు మరేం భయంలేదు... కానీ మన పెళ్ళి తిరుపతిలో జరగాలట..." అన్నాడు అవినాష్.

 

    "ఏం..." వెంటనే అడిగింది.

 

    "ఆయన మనలా కాదులే... దేవుడు భక్తుడు... తనున్నా లేకపోయినా కొడుకు పెళ్ళి తిరుపతిలో చేయిస్తానని మొక్కుకున్నాడట... అంచేత మనపెళ్ళి తిరుపతిలో జరుగుతుంది..."

 

    "నీ ఇష్టం..." కొండంత ఆనందంతో అంది.

 

    "ఇవాళేం వారం..." అడిగాడు.

 

    "సోమవారం..."

 

    "మన పెళ్ళి గురువారం జరుగుతుంది..."

 

    ఆ మాటకి మరీ ఆశ్చర్యపోయింది గౌతమి.

 

    "అవును గురువారమే..."

 

    "నేనింకో విషయం చెప్తే... నువ్వు టపీమని క్రిందపడిపోతావ్ తెల్సా..."    

 

    "ఏమిటబ్బా... చెప్పు... ఇవాళ నాకేదో ఏప్రిల్ ఫస్టులా ఉంది..." అంది గౌతమి.

 

    "అమ్మగారికి అలాగే ఉంటుంది కానీ... మన పెళ్ళికి మా డాడీ వస్తున్నారు... తెల్సా..." ఆ మాట విని మరీ ఆశ్చర్యపోయింది గౌతమి.

 

    "మా డాడీ ఒక్కరే కాదనుకో... మా అంకుల్స్ కూడా రావొచ్చు... బైదిబై నేను చెప్పే విషయం పూర్తిగా విను... మనం మంగళవారం పూరీ, తిరుపతి ఎక్స్ ప్రెస్ ఎక్కుతాం- నేను నీతో విజయవాడ వరకు మాత్రమే వస్తాను- విజయవాడలో నేను దిగిపోయి, మా ఇంటికెళ్ళి- మా డాడీని తీసుకుని మర్నాడు అక్కడ నుంచి తిరుపతి వస్తాను- నువ్వు డైరెక్ట్ గా తిరుపతి వెళ్తే మేము అక్కడ కలుస్తాం..."

 

    "నేను నీతో మీ ఊరొస్తే ఏమైనా అవుతుందా-"

 

    "మన పెళ్ళి జరుగుతుందనే విషయం అందరికీ తెలుస్తుంది- ఎవడైనా మా డాడీ బుర్ర పాడుచేసేస్తే-"

 

    "మరి తిరుపతిలో ఎక్కడుంటాను-" అమాయకంగా అడిగింది గౌతమి.

 

    "పిచ్చిమొద్దూ- హోటల్స్ లేవా- హోటల్ రూంని ఇవాళే నేను బుక్ చేస్తాను- ఓ.కె-"

 

    "నువ్వెక్కడి కెళ్తున్నావో, ఏమిటో మీ కాలేజీలో గాని హాస్టల్లో గాని చెప్పకూడదు... ఆఖరికి మీ హాస్టల్ మేట్ డాక్టర్ మాలతో సహా..." ఆ మాట అంటున్నప్పుడు అవినాష్ గొంతు తడబడింది. కానీ గౌతమి ఆ మార్పుని గుర్తించలేదు.

 

    "ఏం" అనుమానంగా అడిగింది.

 

    "ఏం లేదు... నీ కస్సలేం తెలీదు." నవ్వాడు. అది ఆమెను నమ్మించడానికి నవ్విన నవ్వని తెలీదు.

 

    "ఇన్నాళ్ళూ నేనేదో మోసగాడినైనట్టు, నిన్ను నేను దారుణంగా మోసంచేసి వెళ్ళిపోయేవాడిలా అయినట్టు మీ డాక్టర్ నన్ను చూడలా..?! అంచేత మనం పెళ్ళి చేసుకుని వచ్చి ఒక్కసారి సర్ ప్రైజ్ చేస్తామన్నమాట... అర్థమైందా."

 Previous Page Next Page