Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 17

    సాయంత్రం ఆఫీసునించి ఇంటికి వస్తూనే ముఖం గంటుపెట్టుకుని కూర్చున్న జ్యోతిని చూసాడు సుబ్బారావు. పాపం వంటరితనం అనుకున్నాడు జాలిగా.
    "సారీ జ్యోతీ! ఎంత పెందలాడే బయలుదేరదామన్నా ఆలస్యం అయిపోయిందోయ్! కోపం వచ్చిందా?" అన్నాడు లాలనగా దగ్గిరికి లాక్కుంటూ.
    'ఇంకాస్త ఆలస్యంగా వస్తే బతికిపోతాను' మనసులో అనుకుంది జ్యోతి.
    కొత్త భార్యతో ఇంతాలస్యం చేస్తే నేనెలా వంటరిగా వుంటాను? మీరు లేకుండా నాకు తోచదు మీరు పెందలాడే రాకపోతే నాకు కోపం వస్తుంది' అంటూ ముద్దులు గునుస్తారని, బతిమలాడి వాళ్ళని ప్రసన్నురాలిని చేసుకోవాలని వగైరాలు విన్నాడు- చదివాడు.
    అలా జ్యోతి అలకసాగిస్తుందని భ్రమపడ్డాడు. సాగించాలని కోరుకున్నాడు.
    కాని జ్యోతి 'పెడసరంగా'-
    "ఆలస్యం అయిపోయిందని నేనేడుస్తూ కూర్చోలేదులెండి, నేనేం అనకుండానే ఈ సంజాయిషీలు ఎవరడిగారు?" అంది.
    అదంతా అలకలో భాగం అనుకుని జ్యోతిని మరింత కావలించుకుని, "ఆలస్యానికి పరిహారంగా అమ్మాయిగారిని సినిమాకి తీసుకెళ్ళమంటారా?" అన్నాడు మురిపెంగా జ్యోతి మోహంలో మొహంపెట్టి.
    "అబ్బ వదలండి ముందు. చెమటకంపు కొడ్తున్నారు. ఇప్పుడే శుభ్రంగా స్నానంచేసాను, అసహ్యంగా చెమటవంటితో ఏమిటది?" చీదరింపుగా అంది.
    పాపం సుబ్బారావు చిన్నబుచ్చుకుని వదిలేసాడు.
    జ్యోతి విసురుగా లోపలికి వెళ్ళి అంతకంటె విసురుగా కాఫీగ్లాసు, ఉప్మాప్లేటు తెచ్చి టేబిల్ మీద పెట్టింది.
    సుబ్బారావు బట్టలువిప్పి లుంగీ చుట్టబెట్టుకుని వచ్చాడు. అంతలోనే క్షణం క్రితం సంగతి మరిచిపోయి-
    "నీకేదీ? నువ్వూ తెచ్చుకో" అన్నాడు.
    "నేను తినేశాను ఎప్పుడో" అంది జ్యోతి.
    సుబ్బారావు మనసు చివుక్కుమంది.
    అతనికిలా ఇద్దరూ కల్సి ఓ ప్లేటులో తినడం వగైరా ముచ్చటలు, సరదాలున్నాయి. పాపం ఆకలేయదు అని మనసుకి నచ్చచెప్పుకుంటూ-
    "తింటే ఏంలే. మళ్ళీ నాతో కొంచెంతిను. ఏదీ నోరుతెరు" అంటూ చెమ్చాతో కాస్త ఉప్మాతీసి తను తిని, జ్యోతికి మరికాస్త పెట్టబోయాడు.
    జ్యోతి మధ్యలోనే చిరాగ్గా ఆ చెయ్యి తోసేసి-
    "అబ్బ ఏమిటిది! నేను తిన్నాను నాకేంవద్దు. ఇలా అసహ్యంగా ఎంగిలి తినాలంటే చిరాకు నాకు" అంది మొహం చిట్లించి.
    "పోవోయ్! నాఎంగిలి తగలనట్లు మాట్లాడుతున్నావు" అంటూ ఉప్మా తింటున్న మూతితో జ్యోతి పెదాలమీద చటుక్కున ముద్దు పెట్టి- "ఈ ఎంగిలి ఏంచేస్తావు?" అన్నాడు చిలిపిగా.
    జ్యోతి చురచుర చూసి చీరకొంగుతో పెదాలు గట్టిగా తుడిచేసుకుంది.
    "ఇదిగో! మీరిలా చేసారంటే- నాకు వళ్ళుమండుతుంది. నాకసహ్యం" అంది గట్టిగా పళ్ళుబిగపట్టి.
    "నీకు మండితే నాకు సరదాగా వుంటుంది. నీక్కోపంవస్తే నాకు ముచ్చట. చూడు. సత్యభామచేత కాలుతో కూడా తన్నించుకోలేదూ కృష్ణుడు. అలా ఆడవాళ్ళకోపం. అలక కూడా ముచ్చటేట" అన్నాడు సుబ్బారావు.
    ఇంత అయిష్టత స్పష్టంగా తను వ్యక్తీకరిస్తున్నా పట్టించుకోని ఆ మొగుడ్ని ఏం చేయాలో అర్థంకాలేదు జ్యోతికి.
    "చాల్లెండి సరసం. నాకసలే చిరాగ్గా వుంది. వూరికే మాట్లాడకండి" విసుగ్గా అంది జ్యోతి.
    "ఎందుకో చిరాకు?"
    జ్యోతి సమాధానం చెప్పలేదు.
    "అయితే ఏంచేశావు రోజంతా. పడుకుని నిద్రపోయావా? పక్కింటావిడ దగ్గరికి వెళ్ళలేకపోయావా.....?" కాఫీ తాగుతూ యధాలాపంగా అన్నాడు.
    "ఆవిడగారే వచ్చింది" జ్యోతి ముభావంగా అంది.
    "సుశీలగారు మంచావిడ. మూర్తి కూడా చాలా సరదాగావుంటాడు. నీకు తోచనప్పుడు వెళుతూవుండు."
    "ఆవిడకి గర్వం అట, సరిగా మాట్లాడదటగా. నాకూ అలాగే అన్పించింది."
    "ఎవరన్నారు?" ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు.
    "పై ఆవిడ" మేడమీదకి చూపిస్తూ అంది జ్యోతి.
    "ఓహో.... ఆవిడ కూడా వచ్చిందా?" కుతూహలంగా అడిగాడు.
    "ఊహు నేనే వెళ్ళాను" అంది జ్యోతి.
    "ఐసీ! ఆవిడ చెప్పిందా సుశీలగారికి గర్వం అనీ. వెళితే అసలు మాట్లాడలేదని, మాట్లాడినది కాస్త తన గురించి, ఇంట్లో ఫర్నిచర్ గురించే మాట్లాడిందని, ఈవిడ్ని గడ్డిపోచలా తీసి మాట్లాడిందట. ఈవిడ రెండు మూడుసార్లు వెళ్ళినా ఆవిడ రానేలేదుట క్రిందకి వస్తూ చూసికూడా పలకరించనేలేదట, దాంతో ఈమె మరి వెళ్ళలేదట. పెద్ద ఆఫీసరు పెళ్ళాన్నని ఆవిడకి గర్వం వుండచ్చు గాని సుశీలకెందుకో గర్వం?
    "అదే అంది.... ఈ మూర్తిగారు బాగా లంచాలు తింటాడటగదా?"
    "ఛా.... అదేమిటి? ఎవరు చెప్పారు?" మరికాస్త ఆశ్చర్యంగా అడిగాడు.
    "అతను చాలా స్ట్రిక్ట్ గా వుంటాడు. మంచివాడు, నెమ్మదైనవాడు. ఒక్క చెడు అలవాటు కనబడలేదు నాకు."
    "ఆ..... మీకేం తెలుసు? లంచాలు తింటాడుట. లేకపోతే ఇంట్లో ఆ బీరువాలు, మిషను, స్కూటరు అవన్నీ ఎలావచ్చాయి? చేసేది గుమస్తా ఉద్యోగం."
    "ఏమో! ఎలా వచ్చాయో? పొదుపుగా వాడుకుని ఒక్కోటి అమర్చుకున్నారో, వెనకాతల ఏదన్నా కొద్దిపాటి ఆస్తివుందో, వాయిదాలమీద కొనుక్కున్నారో మనకేం తెలుసు? కాని అతనలాంటివాడు కాదని నా నమ్మకం. వాళ్ళిద్దరూ చాలా ప్రిన్సిపుల్స్ గలవాళ్ళలా కనిపించారు."                             

 Previous Page Next Page