"మీ వారికి బ్యాంక్ లో పనట గదా. మీ పుట్టిల్లు ఎక్కడ?"ఆవిడ ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఆవిడ ముందు తానో చీమ, దోమ అయిపోతున్నట్లు కుంచించుకుపోతూ పుట్టింటి వివరాలు, తండ్రి ఉద్యోగం, మామగారి ఉద్యోగం అన్నీ సిగ్గుపడుతూ చెప్పింది.
ఆ తరువాత ఆమె, శ్యామల తండ్రి ఎంత పెద్ద ఆఫీసరో, మామగారెంత పలుకుబడిగాలవారో, చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా సోఫాల్లో, డన్ లాప్ ల్లోనే పెరిగానని, కారులో ఎండపొడ ఎరగకుండా తిరిగానని ఎంతెంత పెద్దవాళ్ళతో పరిచయమో, క్లబ్బులని, సినిమాలని, షికార్లని ఎలాతిరుగుతారో గంట చెప్పి-
"వెధవది రెండువేల అయిదువందలు వచ్చినా నెలాఖరుకి నయాపైసా వుండదండీ. ఐదారువందలు తెచ్చుకునేవాళ్ళు ఎలా బతుకుతారోననిపిస్తుంది" అంటూ సాగదీసింది.
జ్యోతి ఆ కబుర్లు వింటూ మరింత కుంచించుకుపోయింది. ఆమె చెప్పిన దానికంతా తల ఆడించింది.
"అవునండీ. ఈ రోజుల్లో ఐదారువందలంటే దేనికి సరిపోతుంది? ఏదో యింత తిండి తినడానికే చాలదు" అని మాట కల్పింది. ఆ తరువాత శ్యామల జ్యోతిముందు పెళ్ళినాటి కబుర్లు, రిసెప్షన్ కి ఎన్ని వందలమంది వచ్చారో చెపుతూ నెలకి ఒకసారి మేము ఇచ్చే పార్టీకే 5,6 వందలు అవుతుందని చెపుతూ ఆ ఫోటో ఆల్బమ్ తెచ్చి చూపెట్టింది.
పని కుర్రాడికి టీ కలపమని పురమాయించింది. ఆ ఫోటోలు చూస్తూ జ్యోతి మరింత కుంగిపోయింది.
వెధవది టీ కే రోజూ రెండు బాటిల్స్ పాలు చాలవండీ. ఎవరో వస్తూనే వుంటారు."అంది టీ యిచ్చి. ఆ తరువాత ఆమె సంభాషణ సుశీల మీదకు తిరిగింది.
"ఆ సుశీలగారితో పరిచయం అయిందా మీకు?" అంది హఠాత్తుగా.
అదేదో తప్పుపని అయినట్లు జ్యోతి సందేహిస్తూ "ఆఁ యిప్పుడే వచ్చారు ఆవిడ మా యింటికి" అంది.
"యిక్కడికి రాలేదేం?" అంది కళ్ళు చిట్లించి చూస్తూ. జ్యోతికి ఏం చెప్పాలో అర్థంకాలేదు. "మీరేం అనుకుంటే అనుకోండిగాని అవిడెందుకో నాకు నచ్చలేదు. మహాగర్వం వుంది ఆవిడకి. ఏం చూసుకొనండీ గర్వం? యింత వున్న నాకే గర్వంలేదే, మహామొగుడి గుమస్తాఉద్యోగం చూసుకుని అంత మిడిసిపాటు ఏమిటి? రెండుసార్లు వచ్చిందంతే.
తరువాత ఏం వచ్చిందో మరి రాలేదు, ఆవిడగారు రాకపోతే నాకేం నష్టం? పో- పొమ్మన్నాను. మనిషికి అంతగర్వం పనికిరాదండీ. మీతో ఎలా మాట్లాడింది....?"
"ఆఁ.... ఏదో పావుగంట కూర్చున్నాను. నాకూ ఆవిడ ధోరణి అంత నచ్చలేదండీ...." అంది జ్యోతి తను చెప్పిన మాటలు ఆవిడకి సంతసం కలిగించాయా అన్నది చూస్తూ. ఆవిడ బి.ఏ. చదివిందట. అందుకేమో అంత గొప్ప" అంది శ్యామల.
"బోడి బి.ఏ. అంతా చదువుతున్నారు" అంది. శ్యామల బి.ఏ. ప్యాసవలేదు. కాన్వెంట్ చదవడంవల్ల ఇంగ్లీషు గడగడ లాడిస్తుంది కాని చదువులో ఎప్పుడూ చురుకు కాదామె. జ్యోతి అంగీకారంగా తల ఆడించింది-"
"మీరింతసేపు కూర్చున్నారా? ఆమె వచ్చిన పది నిమిషాలకే పెద్ద పోజిచ్చి వెళ్ళిపోయింది" ఆవిడ అలా ఓ పావుగంట సుశీలని విమర్శిస్తుంటే జ్యోతి అన్నింటికీ తల వూపింది.
జ్యోతిని తీసికెళ్ళి ఇల్లంతా చూపించింది ఆవిడ. డబుల్ కాట్ మంచాలు, అంతెత్తు పరుపులు, బోంబేడై యింగు దుప్పట్లు, గోద్రెజ్ బీరువా, డ్రెస్సింగ్ టేబిల్, డైనింగ్ టేబిల్, పిల్లల బెడ్ రూమ్ వేరే- ఫ్రిజ్. ఎన్నోరకాలు కప్పులు, గ్లాసులు అన్నీ చూస్తుంటే మతిపోయినదానిలా అయిపొయింది జ్యోతి.
ఎంత బాగుందీ యిల్లు!
పెట్టిపుట్టాలి ఎందుకైనా. తనూ వుంది ఎందుకు? బాధగా ఆమె మనసు మూలిగింది.
శ్యామల ఇల్లు చూశాక ఆమెపట్ల మరింత ఆకర్షణ పెరిగింది జ్యోతికి.
ఆ ఆకర్షణలో ఆవిడ గొప్పలు, దర్జాలు చెపుతూంటే పరోక్షంగా ఏదో అంటూ తమలేమిని దెప్పుతూన్న సంగతి జ్యోతికి తట్టలేదు.
సుశీల మొగుడు గుమస్తా ఉద్యోగం అయితే స్కూటర్ కొన్నాడట, రేడియో కొన్నాడట, బీరువా వుందట, మిషన్ వుందట.
వాడి ఉద్యోగానికి లంచాలు పుచ్చుకోకపోతే ఇవన్నీ ఎలా వస్తాయంటూ, తామే కొనడానికి అవస్థపడుతుంటే గుమస్తాగాడు ఎలా కొన్నాడు అంటుంటే జ్యోతి ఆ గొప్పలు, దర్జాలు తమని తాము పొగుడుకొంటున్న ఆమె ధోరణి గుర్తించలేదు.
ఓ గంట ఆవిడ కబుర్లు విని వదలలేక వదలలేక వచ్చినట్లు అయిష్టంగానే కదిలింది జ్యోతి.
'మాయింటికోసారి రండి' అనబోయి-
"వస్తే....కూర్చోపెట్టటానికి మంచి కుర్చీలయినా లేవు. ఆవిడవస్తే తమ ఇల్లు చూసి ఏం అనుకుంటుందోనని సిగ్గుపడి జ్యోతి ఆ మాట అనలేదు.
"ఈసారెప్పుడన్నా సాయంత్రం వస్తాలెండి" అని ఉదారంగా అని "అబ్బ! ఇలా ఎండవేళ వెళ్ళాలంటే చిరాకు నాకు. అందరూ రెస్టు తీసుకునే టైము. డిస్టర్బ్ చేస్తే వళ్ళుమండుతుంది నాకు" అని కూడా చేర్చింది.
జ్యోతి గతుక్కుమంది. మరోసారి చెప్పి కిందకి దిగింది.
ఇంట్లోకి వచ్చిపడ్డాక ఆమె ఇంటికీ, తన ఇంటికీ తేడా మరీ కొట్టొచ్చినట్లు కన్పించి, 'ఛీ- ఏంకొంప ఇది' అనుకుంది కోపంగా.
కాసేపు స్వర్గంలో విహరించి మళ్ళీ నరకంలోకి వచ్చిపడ్డట్టు కలతపడింది. ఆ కలత క్రమంగా కోపంగా. అసంతృప్తిగా మారింది.
జ్యోతి మూడ్ మారిపోయింది. ఇప్పుడిప్పుడే మనసు సరిపుచ్చుకోడానికి వ్యర్థప్రయత్నాలు చేస్తున్న జ్యోతి మనసు మళ్ళీ తిరగబడింది. ఆఖరికి అదంతా సుబ్బారావు మీద కోపంగా మారింది.