"ఆ.... పైకి అంతా అలాగే వుంటారు" జ్యోతి ఈసడింపుగా అంది.
సుబ్బారావు ఆ మాటలు నిజం అని అన్నా అంగీకరించలేదు ఆమె మనసు.
"పోన్లే - ఎవరెలాంటివారైతే మనకెందుకు? ఇంతకూ ఆవిడ నీతో సరిగా మాట్లాడిందా?" కుతూహలంగా అడిగాడు.
"ఎందుకు మాట్లాడదు? గంట మాట్లాడింది. కాఫీఇచ్చింది, ఇల్లంతా చూపించింది. అబ్బ, ఏం ఇల్లు? ఏం ఫర్నిచర్?ఇదిలేదు అదిలేదు అనకుండా అన్నీ వున్నాయి.
ఇల్లంటే అలావుండాలి. మనమూ వున్నాం ఎందుకు? పెట్టిపుట్టాలి దేనికన్నా. ఆవిడవైపు, ఆయనవైపు అంతా గొప్పవాళ్ళే, పెద్ద ఉద్యోగస్తులే. చీరల చూపించింది. అబ్బ ఎన్ని చీరలో కళ్ళు చెదిరిపోయాయి. ఎప్పుడూ ఏవో పార్టీలవీ ఇస్తుంటారట.... జ్యోతి ఉత్కంఠతతో చెప్పుకుపోతుంటే సుబ్బారావు నవ్వుతూ అన్నాడు.
"ఏదో అవన్నీ నీకే వున్నంత సంబరపడిపోతున్నావు" అన్నాడు చలాకీగా.
జ్యోతి మూతి మూడు వంకర్లు తిరిగింది.
"ఆ.... నాకు అంత అదృష్టంకూడానా! అదేవుంటే ఇలా ఎందుకు ఏడుస్తాను? ఈసడింపుగా అంది.
సుబ్బారావు మొహం చిన్నబోయింది. ఏమనాలో తెలియక జ్యోతి వంక చూస్తూ వూరుకున్నాడు.
జ్యోతి మొహం మాడ్చుకుని, చిటపటలాడుతూ లోపలికి వెళ్ళి పోయింది. తనవైపుకి రాగానే సుబ్బారావు ఆమె చెయ్యిపట్టుకుని తనవైపు లాగాడు.
"జ్యోతీ! ఒకటి చెప్పనా? డబ్బుతోనే ఆనందం వుండదు జ్యోతీ! డబ్బు జీవితంలో సుఖపడడానికి అవసరం అంటే వప్పుకుంటాను గానీ డబ్బుతోనే సుఖం వుందనుకుంటే అది పొరపాటు అని తెల్సుకో. నిన్ను నీవు అలా చులకన చేసుకునేబదులు వున్నదానితో తృప్తిపడుతూ, మనకంటె లేనివాళ్ళతో పోల్చుకుని సంతృప్తిపడాలి" అనునయంగా నచ్చచెప్పబోయాడు.
జ్యోతి విసురుగా చేయి లాక్కుని "చేతకానివాళ్ళంతా చెప్పే మాటలే ఇవి. ఇలాంటి కబుర్లంటే నాకు వల్లు మండుతుంది" చురచుర చూస్తూ అని లోపలికి వెళ్ళిపోయింది.
సుబ్బారావు నిస్సహాయుడిలా చూశాడు.
* * * *
జ్యోతి కాపురానికి వచ్చి మూడునెలలు గడిచాయి. ముచ్చటగా గడవకపోయినా జ్యోతి విసుర్లు, కసుర్లు, ఎత్తిపొడుపులు, హేళనలు ఇవన్నీ సుబ్బారావుకి బాగా అలవాటయిపోయాయి.
ఎంత సౌమ్యం వహించినా, ఆమె స్వభావం ఇంతేనని సరిపెట్టుకున్నా, పెళ్ళిచేసుకున్నాను తప్పదు అనుకుంటూ ఎన్ని అవమానాలు దిగమింగినా, ఒక్కోసారి అతని అహం దెబ్బతినేది.
చిన్నపిల్ల - నాలుగురోజులు పోతే తెల్సుకుంటుంది అని ఎంత నచ్చచెప్పుకున్నా జ్యోతి ప్రవర్తనతో అతని మనసు రోజురోజుకి విరిగిపోసాగింది.
తనకి వున్నంతలో జ్యోతిని తృప్తిపరచాలని సినిమాలకి, షికార్లకి తీసుకెళ్ళినా, ఏంచేసినా జ్యోతి మొహం విడేదికాదు.
రోజురోజుకి సుబ్బారావు మనసు విరిగిపోసాగింది. ఏం చేసినా జ్యోతిని మార్చలేనని అతనికి అర్థమైపోయింది.
మొదటినెల జీతంతెచ్చి జ్యోతి చేతిలో పెట్టాడు. "జీతం ఇదిగో జ్యోతీ! నీ ఇష్టం ఎలా మేనేజ్ చేస్తావో, ఎంత మిగిల్చి ఏం కొంటావో?" అన్నాడు.
"ఆ.... మహా వేలు తెచ్చిచ్చినట్లు. బోడి ఆరువందలతో మిగలడం కూడానూ" మూతితిప్పి లోపలికి వెళ్ళిపోయింది.
ఏ రోజన్నా ఆఫీసుకి తొందరగా వెళ్ళాల్సివచ్చి అన్నం తొందరగా పెట్టమంటే-
"అబ్బ! వంటవుతుంది. పెద్ద ఆఫీసరులాగ అంత అర్జంటేమిటో" అంది విసుగ్గా.
సుబ్బారావుకి వల్లుమండింది కాస్త.
"ఆఫీసరునయితే సావకాశంగా భోజనంచేసి పడుకుని లేచి వెళ్ళేవాడిని. తల అమ్ముకొన్నవాడినిగనకే ఈ తిప్పలు" అన్నాడు విసురుగా. జ్యోతి నోరు మూసుకుని వూరుకుంది.
ప్రతి విషయంలో తన లేమిని, తన ఉద్యోగాన్ని దెప్పుతుంటే భరించడం కష్టం అవసాగింది అతనకి.
'అసలు నీకు పెళ్ళికిముందు నేనో గుమస్తానని, నా జీతం ఆరువందలని తెలిసే చేసుకున్నావా?" అన్నాడు ఓ రోజు కాస్త కఠినంగా. తీవ్రంగానే అన్నాడొకసారి.
"కోరికలుంటే తీరిపోతాయా? అదృష్టం వుండాలి. నేను యింతే పెట్టిపుట్టాను" విరక్తిగా చూసింది జ్యోతి.
"ఆ సంగతి గుర్తించావు కనక దొరికినదానితో నోరుమూసుకోవాలి గాని ఇలా అడుగడుగునా లేదు లేదు అనుకుంటే వస్తుందా?" సుబ్బారావు కోపంగా అన్నాడు.
జ్యోతి జవాబివ్వకుండా లేచిపోయింది. అలాంటి ప్రశ్నలు సుబ్బారావు వేసినపుడు ఏం జవాబివ్వాలో అర్థంకాదు ఆమెకి.
ఈ మధ్య శ్యామలతో దోస్తీఎక్కువైంది జ్యోతికి. ఆవిడ గొప్పలు, కోతలు అన్నీ శ్రద్ధగా వింటూంది జ్యోతి.
ఆవిడ కొనే చీరలన్నీ చూస్తుంది. ఆవిడ ఇంటికి పార్టీలకి కార్లలో వచ్చేవాళ్ళని చూస్తూ నిట్టూరుస్తుంది.
ఆవిడ భర్త కమలాకరం దర్జాగా సూటూ బూటూ వేసుకుని కారు డ్రైవ్చేసుకుంటూ వెళుతూంటే సుబ్బారావుతో పోల్చుకుంటూ ఆమె మనసు మూలుగుతుంది.