అని ఆ షాప్ ముందున్న వుడెన్ బోర్డుపై పెయింట్ చేసుంది. అదే ఆమెను ఆకర్షించింది.
అభిరామ్ ని తనతో రమ్మని సైగ చేస్తూ ఆ షాపులోకి నడిచింది మేఖల.
షాప్ లోకి వచ్చి మేఖలని చూసి పనిమనిషి నిద్రపోతున్న కుర్రాడ్ని లేపే ప్రయత్నం చేసింది.
విసుక్కున్నాడు. ఈలోపు ఇదంతా విని ఆ షాప్ లో వెనుకవేపు ఉన్న వుడ్ పార్టీషన్ చాటున పడుకున్న ఓ యువకుడు లేచి కళ్ళు నులుముకుంటూ ముందుకు వచ్చాడు.
"ఇక్కడెవరూ లేరా....?" మేఖల ఆ యువకుడి కేసి చూస్తూ ప్రశ్నించింది.
"ఏ.... ఏమండీ? ఏం కావాలి?"
"ఇల్లు అద్దెకు కావాలి --" అంది మేఖల ఆ యువకుడి కేసి చూస్తూ.
"కూర్చోండి" అన్నాడు.
మేఖల కూర్చోలేదు.
చెదిరిన జుత్తును ప్రోగు చేసుకుని ముడి వేసుకుంటూ "ఇంతకీ చూపిస్తారా లేదా?" అంది.
"అయ్యో చూపించకుండా ఎలా వుంటాం? అది మా వ్యాపారం. ఎంతవరకు పెట్టగలరు?" అన్నాడు.
"అంటే?" మేఖల కర్ధంకాలేదు అతనడిగిన ప్రశ్న.
"అదే ఎక్కువ రెంట్ పెట్టగలిగితే ఎక్కువ సౌకర్యాలున్న ఇల్లు చూపిస్తాం. రెంట్ తక్కువలోనే కావాలంటే ఇరుగ్గా వున్న ఇల్లు మాత్రమే దొరుకుతుంది. పైగా సౌకర్యాలంతగా ఉండవు. మినిమమ్ అద్దె రెండొందలతో ప్రారంభమవుతుంది. పదివేలవరకు వుంటుంది. మీ ఓపిక చెబితే దాన్ని బట్టి చూసి పెడతాను." అన్నాడతను.
"రెండొందలలో చూడగలరా?"
ఆమె ఒకింతసేపు ఆలోచించి అన్నది.
"మీ ఇద్దరికీ ఒక రూమ్ సరిపోతుందా?"
"ఎలాగోలా ఒక గదిలోనే సర్దుకుంటాం. రెండొందల లోపే ఉండేలా ఒక గదిని చూపిస్తే చాలా మేలు చేసిన వారవుతారు. చూపిస్తానంటే నా తమ్ముడు మీతో వస్తాడు" అంది.
"మీరిక్కడే కూర్చుని ఈ పేపర్స్ చూస్తూండడమ్మ..... నేను మీ తమ్ముడు గారిని నాతో తీసుకువెళ్ళి నాలుగయిదు గదులు చూపించి తీసుకు వస్తాను. మీ తమ్ముడుగారికి నచ్చితే, ఆ తరువాత మీరూ చూడవచ్చు" అన్నాడు మర్యాద కనపరుస్తూ.
మొత్తానికి ఆ రోజు మధ్యాహ్నానికి మధ్యతరగతి ప్రజలుండే ఏరియాలో ఒక గది దొరికింది. దానికి అద్దె రెండు వందలు, కరెంట్, వాటర్ విడిగా కట్టుకోవాలి. అభిరామ్ కయితే ఆ గది నచ్చలేదు గాని మేఖల మాత్రం మనస్సును సరిపెట్టుకుంది.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమీషన్ ఇచ్చి, ఆ గది ఓనర్ కి రెండు నెలల రెంట్ అడ్వాన్స్ గా ఇచ్చి, ఆరోజు సాయంత్రం ఐదుగంటలకు గదిలో దిగి పోయారు- ఆ అక్కా తమ్ముళ్ళు.
సాయంత్రం ఆరుగంటలకల్లా రూమ్ ని శుభ్రం చేసుకుని వంట సామాగ్రి తెచ్చుకునేందుకు మేఖల అభిరామ్ తో బయటకు వెళ్ళిపోయింది.
వంట సామాగ్రి, నిత్యకృత్యాలకు అవసరమైన మేరకు కొన్ని వస్తువుల్ని తీసుకుని వస్తూ దారి మధ్యలోనే ఓ మెస్ లో భోంచేసి రూమ్ కి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది గంటలయింది.
సామానంతా గదిలో నీట్ గా సర్దేసి బజారునుంచి తెచ్చుకున్న రెండు చాపలు, రెండు బ్లాంకెట్స్, పిల్లోస్ తో పడకలు సిద్దంచేసి తమ్ముడికి పైజామా ఇచ్చి, తాను నైటీ వేసుకుని పడక మీదకు చేరుకుంది మేఖల.
అభిరామ్ లుంగీ కట్టుకుని, షర్ట్ తీసేసి గది బయటకు వెళ్ళి ప్రపంచాన్ని చూస్తూండిపోయాడు.
మేఖల తాను అంతవరకు జాబ్ చేసి సంపాదించిన డబ్బును, తమ యిద్దరికీ ఒక నెలకు అయ్యే ఖర్చును మనసులోనే లేక్కేసుకుంటూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.
* * * * *
"అన్నయ్యా.... అన్నయ్యా.... ఒరేయ్ అన్నయ్యా..." అంది క్రాంతి ఆలోచనల్లో మునిగి వున్న విమల్ ని చూస్తూ.
అతనికి చెల్లెలి పిలుపు వినిపించలేదు.
క్రాంతి మరోసారి పిలిచింది. అతనిలో చలనం లేకపోవటం చూసి, దగ్గరకు వెళ్ళి కదిపింది.
విమల్ తేరుకుంటూ ఏమిటన్నట్లుగా చెల్లెలివేపు చూశాడు.
"మన ఎదురింటి వీధి గదిలో ఎవరో దిగినట్లున్నారే" అంది వెన్నెల్లో సిల్హాట్ లా కనిపిస్తున్న అభిరామ్ ని చూస్తూ.
"జీవితం ఒక ప్రవాహం. ఎందరో వస్తుంటారు, పోతుంటారు. నిరుపేదలు, నిరుద్యోగులు జీవనభ్రుతి వెతుక్కుంటూ నగరాలకు వచ్చి ఇలాంటి ప్రాంతల్లోనే గది అద్దెకు తీసుకొని వుంటారు. ఆ తరువాత ఉద్యోగవేటలో కొందరు లీనమైతే, బ్రతుకుదెరువుకి ఏ పని దొరికినా చాలని యింకొందరు, జీవితంలో పైపైకి పోవాలని మరికొందరు వారి వారి ఆశల్ని, అభిరుచుల్ని, కలల్ని బట్టి వేట కొనసాగిస్తారు. ఆ వేటలో కొందరికి కుందేళ్ళు, మరికొందరికి పావురాళ్ళు, ఇంకొందరికి జింకలు, కొద్దిమందికి బంగారు లేళ్ళు దొరుకుతాయి. కొందరు వేటలో అలసిపోయి రక్తహస్తాలతో, నిరాశా నిస్పృహల్తో గూళ్ళను చేరుతారు. ఇట్స్ ఆల్ ఏ స్ట్రగుల్ ఫర్ మియర్ ఎగ్జిస్టెన్స్, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది, అనుకోవాల్సిందీ ప్రత్యేకంగా ఏమీ వుండదు, పొద్దు పోయింది- పడుకో రాదు" అన్నాడు విమల్ వేదాంత ధోరణిలో.
క్రాంతి చూపుల్ని మరల్చకుండానే-
"మనం ఏదయినా సాధించగలమా అనిపిస్తోంది నీ వేదాంత ధోరణి చూస్తుంటే" అంది ఒకింత నిరాశగా.
"కొంతమంది బాగా తిని తిని చనిపోతారు- మరి కొంతమంది బాగా తాగి తాగి చనిపోతారు. ఇంకొంతమంది ఏదీ చేయక, ఏమీ చేయలేక, ఏదీ సాధించలేక ఏదో ఒకటి చేసేవార్ని, ఎంతో కొంత సాధించే వారిని చూసి చూసి అసూయతో చనిపోతారు. మనం చివరి తరగతిలోకి రామనే నా నమ్మకం. మొదటి రెండు తరగతుల్లో మనం ఇమడలేం. మరి మనం ఏ తరగతిలోకి వస్తాం.....? ఏవో అద్భుతాలు సాధించి, ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్ళే ఒక కొత్త తరగతిని మనకి మనం సృష్టించుకోవాలి.....?" విమల్ సాలోచనగా అన్నాడు.
విమల్ మాట్లాడే విధానాన్ని చూసి ఒక్కోసారి క్రాంతి కూడా భయపడుతుంది. తన అన్న కలల్లో విహరిస్తున్నాడా? కలలే కంటున్నాడా? కలల్లో జీవిస్తున్నాడా....? ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా?
మనస్సు సంతోషంగా వున్నప్పుడు తన అన్న లక్ష్యాలు గొప్పవని, అవి సామాన్యులకు అర్ధం కావని గర్వపడుతుంది. ఆ కలల్ని నిజం చేసి ప్రపంచమంతా తనకేసి చూసేట్లు చేసుకోగలడని నమ్మి ఆనందిస్తుంది.
* * * * *
"నిద్ర రావటం లేదా....?" మేఖల గదిలోంచి బయటకు వచ్చి అభిరామ్ ని ప్రశ్నించింది.
అతనేం సమాధానం ఇవ్వలేదు.
"ఎదురుగా వున్న ఇంట్లో యెవరో యువతీ-యువకుడు అద్దెకు వుంటున్నట్లుందే-?" అని తనలో తానే అనుకుంది మేఖల.
సన్నటి ఇరుకు సందు అది.
మున్సిపాలిటీ వాళ్ళ సీతకన్ను పడిన కొన్ని వేల వీధుల్లోని ఒక వీధి అది.
వీధి మొత్తం మీద పది ఎలక్ట్రిక్ స్థంభాలున్నా రెండు లైట్సే వెలుగుతున్నాయి.
డ్రయినేజీ కాలువ ఒకటి ఓవర్ ఫ్లో అయి ఆ వీధి మధ్యలోంచే సజీవ నదిలా ప్రవహిస్తోంది.
దాని తాలూకు చెడు వాసన ఉండుండి గాలి వాలుకి వచ్చి వారి ముక్కు పుటాల్ని బ్రద్దలు కొట్టేస్తోంది.
పేదరికం, అవసరాలు, ఆశల ఆరాటాలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఘర్షణలు, అశాంతి, అయోమయం ఆ వీధుల్లో నిత్యం జీవనం చేస్తుంటాయి.
కేవలం బ్రతకటం కోసం.....
బ్రతికి ఏదో సాధించటం కోసం కాదు.....
కేవలం బ్రతకటం కోసం ఎంత ఆరాటం....? అన్నప్రశ్న అక్కడే, అలాంటి ప్రాంతంలోనే ఎప్పుడూ ఉదయిస్తుంది.
థర్డ్ వరల్డ్ నేషన్స్ సగటు జేవేఉల జీవితాలకి రెండోవేపు ఆ ప్రాంతం జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా నేర్పగల విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం.
"చలిగా వుంది. లోపలికొచ్చి పడుకోరాదు" అంది మేఖల అభిరామ్ వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ.