అయాన్ రాండ్ అట్లాస్ ష్రగ్డ్ లోని ఫిలాసఫీ నచ్చి అప్పటికి పాతిక సార్లయిన చదివి జీర్ణించుకొని వుంటాడు విమల్.
అతని ఆలోచనలు నిన్నటిని అసహ్యించుకుంటాయి. నేటిని పరిశీలిస్తాయి. రేపటిని కేవలం పట్టించుకుంటాయి. రాబోయే దశాభ్దాల గురించి స్ట్రెయిన్ తీసుకుంటాయి.
అందుకే అతనెప్పుడూ ఎక్కడో వున్నట్లుగా వుంటాడు. అతని చూపుల్లో ఎప్పుడూ ఇంటలెక్చువల్ లీడ్ కనిపిస్తుంటుంది.
మనిషి అభద్రతా భావాన్ని ఖండించే విధంగా అతని ప్రవర్తన వుంటుంది.
నిరంతర పరిశోధనలో మునిగి ఉండే మునిలా ఉంటాడు. రేపటి సమాజం, రేపటి రాష్ట్రం, రేపటి దేశం, రేపటి ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తాయి అనే అతను ఆందోళన పడుతుంటాడు.
అతని ఆలోచనలు అతని తల్లిదండ్రులకు ఎంత మాత్రం అర్ధం కాలేదు. వారి స్థాయి అవగాహనకు అందలేదు. అందుకే అతన్ని తిట్టారు. అతనితో పోట్లాడారు - ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు.
అందుకూ అతనేం వెరవలేదు.
పాపం తల్లిదండ్రులు - అమాయకులు - నేనే అర్ధం చేసుకుంటే పోలే- అని అనుకున్నాడు.
అందుకే అతను ఇంట్లోంచి వస్తూ ఏ మాత్రం బాధపడలేదు. ఆ ఇంటికి సంబంధించిన ఆస్తుల్ని తలుచుకొని కలవరపడలేదు.
అతను మరో క్షణంలో ఆ ఇంటి గడపదాటి బయట అడుగు పెడతాడనిగానీ చెల్లెల్ని ఏం చేస్తావంటూ ఒక సైకలాజికల్ ఏంకర్ ని అతని జీవితానికి తగిలించారు.
ఇద్దరూ ఉత్తచేతులతో ప్రపంచంలోకి అడుగు పెట్టారు.
లక్షలాది ఆస్తుల్ని తృణప్రాయంగా వదిలేసి వెళుతున్న ఆ అన్నా చెల్లెల్ని చూసి చాలా మంది జాలిపడ్డారు.
విమల్ ఓ డ్రీమర్ అనీ, ఐడియలిస్ట్ అనీ, ఆచరణ సాధ్యంకాని అనంతమైన ఆలోచనలు అతని మెదడులో అనుక్షణం కొత్త పుంతలు తొక్కుతుంటాయని గౌరీప్రసాద్ భయం. తను నానా గడ్డి తిని సంపాదించాడని తన వెనక ఎంతోమంది అనడం గౌరీ ప్రసాద్ కు తెలుసు.
"ఎందుకు నాన్నా, మరీ ఇంత దారుణంగా సంపాదించడం" అని విమల్ అప్పుడప్పుడూ తన తండ్రి గౌరీప్రసాద్ ని నిలదీయకపోయినా అడిగేవాడు. అందుకాయన రెచ్చిపోయేవాడు.
"నాకు తెలియక పిచ్చెక్కి సంపాదిస్తున్నాను. మొదట్లో కట్టుకున్న దాని కడుపు కట్టలేక సంపాదించాను. ఆ తర్వాత కన్నబిడ్డలకు మంచి భవిష్యత్ ను, రిచ్ లీడ్ ని ఇవ్వాలని సంపాదించాను. ఆ తర్వాత ణ అభార్యా బిడ్డలు సకల సౌకర్యాలు అనుభవించాలని సంపాదించాను. వాళ్ళు ఆరోగ్యంగా వుండాలని అపోలో హాస్పిటల్ నేనా కుటుంబానికి ఆరోగ్య కేంద్రంగా ఎన్నుకున్నాను. నా వాళ్ళు సుఖపడాలని కారు కొన్నాను. వాళ్ళ బెడ్ రూమ్స్ కి ఎ/సి మెషిన్స్ పెట్టించాను. హైజెనిక్ గా, ఆరోగ్యంగా, బలంగా పెరగాలని ప్రతి వస్తువు సుపీరియర్ క్వాలిటీ వుండేలా చూసి కొన్నాను. ఇవన్నీ అయ్యాక సమాజంలో నా పిల్లలకు వెల్దీలీడ్, ఇంట లెక్చువల్ సొసైటీ లీడ్ ఇవ్వాలని సంపాదించాను. దాని మూలంగానే మనింటిపై రంగుల బల్బులు వెలిగితే ఇంటి ముందు దేశ విదేశీకార్లు వచ్చి ఆగుతున్నాయి. నా భార్యా, పిల్లల్నే చూసుకుంటూ నాకెంత చెడ్డపేరు వస్తుందో తెలిసినా లెక్కచేయలేదు. ఇప్పుడలా సంపాదించడం నాకు ఒక వ్యసనమై పోయింది. నేను సంపాదించిన ఆస్తుల్ని పెంచుతూ మన కుటుంబపు భవిష్యత్ తరాలకు నువ్వు ఆధారమవుతావా లేదా" అని ఆయన కొడుకును నిలదీసేవాడు.
విమల్ వేదాంత ధోరణిలో నవ్వేవాడు తప్ప తన తండ్రి ఆశించే సమాధానాన్ని తనను తాను సమాధానపరచుకుని ఇచ్చేవాడు కాదు. అన్నింటినీ అందరినీ నిరాసక్తంగా చూసే విమల్ కి చెల్లెలంటే చచ్చేంత ప్రాణం. క్రాంతికి కూడా తండ్రి మాట మీద కన్నా అన్న మాటమీదే గౌరవం ఎక్కువ. గౌరీప్రసాద్ విమల్ కి పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చేవాడు. కొడుకు పెళ్ళితో తన ఆస్థులు రెట్టింపు అవుతాయని తెలిసే అంత తాపత్రయపడేవాడు గౌరీప్రసాద్. తన కూతురు గొప్ప అంధగత్తె కానుక కాణీకట్నం లేకుండా చేసుకునే సంబంధం కోసం వెతికే వాడు. తండ్రి మనస్తత్వం తెలిసినవాళ్ళు కావడంతో ఆ అన్నాచెల్లెలు అవసరమైన సమయంలో అడ్డుపుల్లలు వేస్తూ వుండేవారు. కొన్నాళ్ళకు ఆయన విసిగిపోయి భార్యమీద లేచేవాడు.
"ఆశకు అంతు వుండాలి కదా? మనకిప్పుడు కావాల్సినంత వుంది. ఇంకెందుకు ఈ తాపత్రయం" అని చిన్నగా నసిగేది జలంధర.
ఆమెకు భర్తంటే భయం. నోరు తెరిచి అడగకుండానే అన్నీ వాకిట్లోకి తెచ్చిపెట్టాడని ఆమె తనను తాను తగ్గించుకుంది. అది కొన్నాళ్ళకు గౌరీ ప్రసాద్ కి అధికారంలా సంక్రమించింది. ఆమెకు తన బిడ్డల వాదనలో నిజం వుందని పించేది. భర్త ధోరణిలో అనుచితాలు కనిపించేవి. దానితో ఆయన మరీ రెచ్చిపోయే వాడు. ఆవేశపడి ఆరోగ్యాన్ని పాడుచేసుకునేవాడు.
ఈ భావాల వైరుధ్యం, నమ్ముకున్న జీవన విధానాల మధ్య ఘర్షణ నిత్య కృత్యమైపోయింది ఆ ఇంట్లో.
అరమరికలు లేకుండా బ్రతకాల్సిన బంధుత్వమన్న ఆ నలుగురూ అపరిచితుల్లా వుండటం ప్రారంభమయింది. గౌరీప్రసాద్ రూడ్ నెస్, పచ్చి మెటీరియలిజం విమల్ కి నచ్చేది కాదు.
అనంత విశ్వాన్ని ఆచరణ సాధ్యం చేసుకోవాలనే విమల్ కలలు గౌరీప్రసాద్ కి నచ్చేవికావు. ఇద్దరి ధ్యేయం ఒక్కటే- డబ్బు సంపాదన కాని గమ్యాలే విరుద్దంగా ఉన్నాయి. గౌరీప్రసాద్ లో అహం కస్సుమంటే విమల్ లోని ఆత్మాభిమానం బుస్సుమంది. అప్పుడే కదా విడిపోవడం అన్నది చోటు చేసుకునేది.
నా పద్దతులు నీకు నచ్చనప్పుడు నేను సంపాదించినది నీకు అక్కర్లేనప్పుడు మరి ఇక ణ అడగ్గ్ర ఎందుకని గౌరీప్రసాద్ అనడంతో సంపాదించడం మీ ఒక్కరికే కాదు తెలిసింది అని విమల్ ఆ ఇంటి నుంచి వెళ్ళి పోయేందుకు పరోక్షంగా తన సంసిద్దతను తెలియజేశాడు. విషయం తెంచుకునేదాకా వస్తుందని ఊహించని గౌరీప్రసాద్ కొడుకు నిర్ణయానికి ఖిన్నుడైపోయాడు.
విమల్ బయటకు అడుగు వేస్తాడనగానే గౌరీప్రసాద్ భయపడి పోయాడు. అలాగే కొడుకుని వదిలేస్తే తిరిగి తనకు దక్కుతాడా? కేవలం సిద్దాంతాల వైరుధ్యం మూలంగా కన్నకొడుకును వదులుకుని బ్రతక గలడా? లేదు.... కానుక ఒక సైకలాజికల్ ఏంకర్ ని కొడుకు కలల జీవితానికి జోడించాలనుకున్నాడు.
"పెరిగి పెద్దవాడై పెళ్ళీడుకొచ్చిన కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని నలుగురూ నన్నే వేలుపెట్టి చూపిస్తారు. ఆ పరిస్థితుల్లో నీ చెల్లెలికి నేను పెళ్ళి చేయగలనా? లేదు... ఏ ఒక్క మంత్రి తప్పుడు నిర్ణయం తీసుకున్నా మొత్తం మంత్రివర్గం సమిష్టి బాధ్యత ఎలా వహిస్తుందో కుటుంబ మయినా అంతే. ఒక కుటుంబానికి చెందిన సంతానంలో ఏ ఒక్కరు సంఘ వ్యతిరేకంగా ప్రవర్తించినా అది కుటుంబ సభ్యులందరి మీదా రిఫ్లెక్ట్ అవుతుంది.
అందుకని నీ చెల్లెలికి పెళ్ళిచేసి ఓ ఇంటిదాన్ని చేసే బాధ్యత నువ్వే తీసుకో అదీ కన్నతండ్రిలా బాధ్యతను నిర్వహించాలి. యోగ్యుడయిన వాడిని, చదువుకున్నవాడిని,. కష్టపడి నాలుగు లక్షలు సంపాదించ గలిగేవాడిని, మంచి పరువు, ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని వరుడిగా ఎన్నిక చేయాలి. అదంతా తేలికయిన విషయం కాదు. చేయగలవా? ఈ బాధ్యతను త్రికరణశుద్దిగా నిర్వర్తించగలవా? లేదంటే రాజీపడి నాకు, నా ఆస్తులకు వారసుడిగా ఆగిపో" అని గౌరీప్రసాద్ అంటే విమల్ తేలిగ్గా నవ్వేశాడు.
"కన్నతండ్రి కూడా తేలేనంత మంచి సంబంధం తెస్తాను. నలుగురూ మెచ్చేలా, నచ్చేలా వరుడ్ని చూస్తాను. ఇది ఒక బరువని, బాద్యతని నేను భావించాను. నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను." అని చెల్లెల్ని తనతో రమ్మన్నట్లుగా చూడగానే క్రాంతి పరుగున వెళ్ళి అన్న దరి చేరింది.
అప్పుడు గౌరీప్రసాద్ షాక్ తిన్నాడు కాని- జలంధర లోలోపల చాలా సంతోషించింది. అలా బయటికి గెంటివేయబడిన ఆ అన్నాచెల్లెలు ఆ పట్టణాన్ని వదిలేసి మరో నగర ప్రవేశం చేశారు. ఆ నగరానికి వచ్చిన వారానికి చిన్నగది ఒకటి తల దాచుకునేందుకు సంపాదించుకుని అందులో దిగిపోయారు.
తరాల అంతరాలు....
అనివార్యమేమో ఈ 1990 దశాబ్దం నుంచి....
* * * * *
"ఇప్పుడేమిటీ చేయటం....?" నిద్రలేమితో మండుతున్న కళ్ళను సుతారంగా రుద్దుకుంటూ అడిగింది మేఖల.
"పోనీ.... నిర్ణయాధికారం నాకిస్తావా?" అభిరామ్ అన్నాడు.
మేఖల చురుగ్గా చూసింది అభిరామ్ వైపు.
ఆమెకి కోపం వచ్చిందని గ్రహించి తల దించుకున్నాడు అభిరామ్.
ఆమె నడక సాగించింది.
ఆమె ముందు.... ఆమె చేతిలో బ్యాగ్-
అతను వెనుక- అతని చేతిలో సూట్ కేసు-
కొంత దూరం ముందుకు వెళ్ళాక రోడ్డు సైడ్ గా వున్న ఒక షాప్ ఆమెని ఆకర్షించింది.
కమీషన్ బేసిన్ మీద ఇల్లు అద్దెకు ఇప్పించబడును.