"మనం చేసింది తప్పు కాకపోయినా పిరికితనం మాత్రం కాదా?" అభిరామ్ ఆ ప్రశ్నను అప్పటికి కొన్ని వందల సార్లు రెట్టించాడు.
మేఖల వేదాంత ధోరణిలో నవ్వింది.
"నేను కాదనలేదుగా....? ఎందుకు పదే పదే ఆ ప్రశ్ననే వేసి రెట్టిస్తావు? నిన్ను వదిలివేస్తే వెళ్ళి వాడ్ని చంపేస్తావు. అదృష్టం వక్రిస్తే అంధకారంలోకి త్రోసివేయబడతావు అంతేగా.....? అంతకంటే గొప్ప ఏదయినా వుందా....? ఏదయినా వుంటే దాన్ని సాధించటానికి వెళతానంటే నేనాపను. కాని వీటన్నిటికన్నా గొప్ప విషయాలు లక్ష్యాలు చాలా వున్నాయి. సాధించగల్గితే..."
"నాకర్ధం కాకుండా మాట్లాడటం నీకు అలవాటన్నా అయుండాలి- అవసరమైనా అయుండాలి- అనుకోని యాదృచ్చికమైనా కావాలి. కళ్ళముందు కనిపించే అన్యాయాల్ని ఎదుర్కోకుండా ఏదో సాధిస్తానని, ఏవో అధ్బుతాలని సృష్టిస్తానని అనుకోవటాన్ని ఏమనాలో నాకు తెలీదు" అభిరామ్ నిష్టూరంగా అన్నాడు.
మేఖల నవ్వింది.
"నా ప్రశ్నలకు నువ్వు సమాధానం కాదేమో?" అభిరామ్ కంఠం గంభీరంగా వుంది.
"నాకు తెలుసు నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి నాక్కొంత గడువు కావాలి. నేనేమిటో... అసలు మనిషేమిటో....జీవితమేమిటో....ముందు నన్ను తెల్సుకోనివ్వు.... అప్పటివరకు నువ్వు గతాన్ని మర్చిపో, నేను నీ ప్రశ్నలకు తర్వాతనయినా సమాధానం ఇవ్వలేకపోతే నీ గతాన్ని -అదే మన గతాన్ని నేను త్రవ్వి తీస్తాను. ఇక పోదాం పద... పడుకుందాం" అంది మేఖల స్థిరంగా.
* * * * *
"నువ్వూ పడుకోరాదూ....?" క్రాంతి విమల్ కేసి చూస్తూ అంది.
"మనిషి జీవితంలో నిద్ర అనే స్థితి లేకపోతే ఎంతో బావుంటుంది కదా?"
విమల్ మాటలకు క్రాంతి ఉలిక్కిపడింది.
"మనిషి జీవితాన్ని నిద్ర సగం మింగేస్తోంది"
"సమస్యల్ని, బాధల్ని మర్చిపోవాలనుకునే బలహీన మనస్కుడు మద్యాన్ని ఆశ్రయిస్తాడు. ధైర్యవంతులు తట్టుకుంటారు. అదీ లేనివాళ్ళు నిద్రని ఆశ్రయిస్తారు. కాని... నువ్వు..." క్రాంతి ఆవులిస్తూ పక్క సరి చేసుకుంటూ అంది.
కొద్దక్షణాలు ఏదో ఆలోచిస్తూ వున్న విమల్ సడన్ గా లైట్ ఆర్పి, తలుపులు వేసి పడక మీదకు చేరుకున్నాడు.
* * * * *
"Success is the final step on the ladder of failure... మనం మన ఇంట్లోంచి వెళ్ళగొట్టబడటం ఒక అపజయమే అయితే, మనమిప్పుడు అపజయాల నిచ్చెనపై ఉన్నట్లు భావించవచ్చు. మరి కొన్ని మెట్లు ఎక్కేస్తే ఫైనల్ స్టెప్ మీద కాలు పెడతాం. ఆ ఫైనల్ స్టెప్ విజయానికి ఓంకారం అవుతుంది. సో... మనం కొన్నాళ్ళు మన గతాన్ని మర్చిపోయి శ్రమిద్దాం. అప్పుడు గతం మన వర్తమానాన్ని, ఆ వర్తమానాన్ని ఆధారం చేసుకునే ఎదిగే భవిష్యత్ ను చూసి సిగ్గుపడ్తుంది." మోకాళ్ళ మధ్య తల దూర్చుకుని ఆలోచిస్తున్న అభిరామ్ ని చూసి అంది మేఖల.
ఏదో చేయాలి.... నలుగురు మెచ్చేది సాధించాలి... ఆ నలుగురికి ఉత్తేజాన్ని యిచ్చే ప్రయోజనకరమైన పని చేయాలి. ఉద్యోగం లేకపోతే స్త్రీ బ్రతకదనుకునే తల్లిని, ఉద్యోగం లేకపోతే పెళ్ళి కాదనుకునే సమాజాన్ని సవాల్ చేసి నిలదొక్కుకోవాలి... తన తల్లి చేసిన అవమానం ఆమెనంతగా కదిలించి వేస్తోంది.
"ముందు మనకు చెరో రెండు జతల బట్టలు కొనాలి. బజారుకెళ్ళి తెచ్చుకుందాం పద" అంది మేఖల.
అభిరామ్ లేచి నించున్నాడు.
అతను ఒక మౌని....
అతను ఒక జడపదార్ధం.....
అతని జడత్వాన్ని వదిలించే సాధనాలు, ఆవేశం, తిరుగుబాటు అన్యాయాన్ని ఎదుర్కొనే ఆత్మ స్థయిర్యం మేఖల కొంత డబ్బు తీసుకుని కిటికీలో ఉన్న లాక్ ని అందుకుని బయటికి నడిచింది.
ఆ వెనుకే అబిరామ్ బయటకు వచ్చాడు.
సరిగ్గా అప్పుడే నలుగురు యువకులు అటుకేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు.
"పిల్ల చాలా బావుంది కదరా...?"
"బావుందా--?! బ్రహ్మాండం బ్రద్దలయ్యేలా వుంది"
'అమ్మాయి బాగానే వుంది. ఆమె వెనుకే ఉన్న అన్న గురించి కూడా ఆలోచించటం మంచిది"
"వాడో పిచ్చివాడు. ఎప్పుడూ ఎక్కడో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. వాడికి కూడా భయపడి మన పేటకొచ్చిన పిల్లను వదిలేస్తే ఎలా?"
ఆ నలుగురూ నాలుగు రకాలుగా కామెంట్ చేసుకుంటూ విమల్, క్రాంతి ఉండే గది ముందుకొచ్చి ఆగారు.
ఓ క్షణం ఆగి గట్టిగా తలుపుల్ని అరచేత్తో కొట్టాడో యువకుడు. ఆ చప్పుడికి అప్పుడే తాళం వేసి వెనుదిరుగుతున్న మేఖల ఉలిక్కిపడి చూసింది.
మరోసారి మరో యువకుడు అంతకంటే విసురుగా తలుపుల్ని మోదాడు.
ఈసారి ఆశ్చర్యపోయింది మేఖల.
మామూలుగా ఏదో పనుండి వచ్చిన వాళ్ళయితే అంత జబర్దస్తీగా తలుపుల్ని బాదవలసిన అవసరం లేదు.
ఆ ఆలోచన రాగానే అనుమానంగా ఆ నలుగురుకేసి చూసిందామె.
సరిగ్గా అప్పుడే తలుపుల్ని తెరచుకుని బయటకు చూసింది క్రాంతి.
అప్పుడామె చూపుల్లో తొంగి చూసిన ఆందోళనను మేఖల పసి గట్టింది.
ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా ఆమె సిక్స్త్ సెన్స్ ఆమెను హెచ్చరించింది. షాపింగ్ కి వెళ్ళవలసిన మేఖల ఎవరో మంత్రం వేసినట్లు అక్కడే ఆగిపోయి అటే చూడసాగింది.
"ఏమే - పిల్లా - నిన్ను పిలుస్తున్నా పట్టించుకోకుండా పొగరుగా వచ్చేసావు. మా బస్తీలో ఉంటూ మమ్మల్నే లెక్క చేయటం లేదే....?" ఒక యువకుడు అధికారం ప్రదర్శిస్తూ అడిగాడు.
"అలా మంచీ మర్యాద లేకుండా పిలిచావు కనుకే పట్టించుకోకుండా వచ్చేసాను. అయినా నాతో మీకేం పని- మీతో మాత్రం నాకేం పనిలేదు" క్రాంతి విసురుగానే సమాధానమిచ్చింది.
"అహా! నీకు మర్యాదివ్వాలా? మాకు తెలీదులే. గదిలోకి రానిస్తావా? మేమే రామా?" మరో యువకుడు వెటకారంగా అన్నాడు.
"మీరు చేస్తున్నది దౌర్జన్యం. ఇది మంచిదికాదు" క్రాంతి చుట్టు ప్రక్కలకు చూస్తూ అంది.
ఆమెకు ధైర్యం ఒకింత ఎక్కువే. కాని నలుగురిని ఒక్కసారి చూసేసరికి ఆమెకు కంగారుగా వుంది. పైగా ఆ సమయంలో తన అన్న కూడా లేడు.
"మా పేటలో ఉంటూ మా అవసరాలను తీర్చకపోవటం మంచిది కాదనే చెబుతున్నాం" అన్నాడో యువకుడు నవ్వుతూ.
మేఖలకు పరిస్థితి అర్ధమైపోయింది.
ఆమెకు పట్టరాని ఆవేశం పొంగుకొచ్చింది.
వడివడిగా రోడ్డు దాటి అక్కడకు చేరుకుంది.
మేఖలను చూసిన క్రాంతికి కొద్దిగా ధైర్యమొచ్చింది.
"చూడండి - వీళ్ళు నన్ను అల్లరి పెడుతున్నారు" అంది క్రాంతి మేఖలకేసి సపోర్టు కోసం చూస్తూ.
"ఏమిటీ గొడవా...?" మేఖల కోపంగా ప్రశ్నించింది. ఆ నల్గురూ ఒక్కసారి వెనుదిరిగి మేఖల కేసి చూసి ఆశ్చర్యపొయ్యారు.
"వార్నీ - దీనికన్నా యిది మరీ అందంగా ఉందిరా పిటపిటలాడి పోతోంది. ఈ కొత్తపిట్ట కొత్తగా మన పేటకొచ్చిందా?" తాపీగా అన్నాడో యువకుడు మేఖల శరీరంలోని ఒంపుసొంపుల్ని కసిగా చూస్తూ.
మేఖల కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి.
"వెనుకా, ముందు చూసుకొని, కాస్త నోరు సంభాళించుకొని మాట్లాడు" మేఖల ఫైరైపోయింది.
వాళ్ళ దృష్టి క్రాంతి మీద నుంచి తప్పుకొని మేఖల మీద పడింది.
"వెనుకా, ముందు చూసి పిచ్చెక్కిపోయే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. మా పిచ్చి కుదరాలంటే మామీద మీరు దయతలవాలి..." అతని మాటలు పూర్తి కాలేదు.
కాకపోగా అతను అప్పుడు చేసిన ఆర్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించి పోయింది.
ముందేం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.
అభిరామ్ పంజా ఎత్తిన పులిలా చూస్తున్నాడు ఆర్తనాదం చేసిన వ్యక్తికి మెడమీద దెబ్బ తగలటంతో స్పృహ తప్పి రోడ్డు మీద పడి పోయాడు.
మిగతా ముగ్గురూ క్షణకాలం పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్ధం కాక శిలా ప్రతిమలైపోయారు.
క్రాంతి ప్రమాదం తప్పినందుకు గుండెల నిండా ఊపిరి తీసుకుంది. ఆపైన ఆశ్చర్యపోయింది- అతనెవరు? ఎక్కడ నుండి వచ్చాడు సడెన్ గా? అని.