వాళ్ళలా ఆడుతూ పడుతూ పని చేసుకుపోతుంటే చెకింగ్ అదికారి అక్కడికొచ్చాడు.
"అక్కడ జనాభా పెరగాలని పైనించి ఆర్డర్స్ పాస్ అవుతూ వుంటే మీరిక్కడ తీరుబడిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా పని చేస్తే అయినట్లే. కానీండి కానీండి" అంటూ మందలించాడు. అలా మందలిస్తూ ఇటు తిరిగి చూసేసరికి చెప్పలేనంత సంఖ్యలో ఆడవాళ్ళు కనిపించారు.
"మీరంతా ఎవరు? ఇక్కడికెందుకు వచ్చారు?" ఆ అధికారి వాళ్ళని అడిగాడు.
అధికారి ఎవర్నో ప్రశ్నించటం చూసి వంచిన తల ఎత్తకుండా పని చేసుకుపోతున్న బ్రహ్మలోక వాసులు ఒక్క క్షణం తల ఎత్తి చూశారు. క్షణం తల ఎత్తిన ఆలశ్యానికి అక్కడ భూలోకంలో వేలకొద్దీ ట్యూబెక్టమీ ఆపరేషన్లు జరిగిపోయాయ్. అధికారి తన వాళ్ళందరినీ గద్దించి మళ్ళీ వీళ్ళవైపు తిరగి "మీరంతా ఎవరు? ఇక్కడి కెందుకు వచ్చారు?" అంది అడిగాడు.
"బ్రహ్మదేవుణ్ణి కలుసుకోడానికొచ్చాం చాలా అర్జంట్ గా మాట్లాడాలి." అని చెప్పింది లీడర్ లీలారాణి.
"అంత అర్జంట్ విషయం ఏమిటి? అయినా ఆయన చాల బిజీగ ఉన్నారు. మీతో మాట్లాడతారో లేదో?" అన్నాడు ఆ అధికారి.
"మేము ఊర్కినే రాలేదు సరస్వతీదేవి పంపిస్తే వచ్చాం. మమ్మల్ని ఆయన దగ్గరికి పంపిస్తారో లేదో ఇంకా మీ యిష్టం." పెద్ద అబద్దం ఆడేసింది ఆండాళమ్మ. మగవాళ్ళు ఎక్కడ లొంగుతారో ఆమెకు అనుభవం మీద బాగా తెలుసు!
ఆండాళమ్మ అంత పెద్ద అబద్దం ఆడటం లీడర్ లీలారాణికి బొత్తిగ నచ్చలేదు. కాని ఈలోపలే ఆ అధికారి ఆండాళమ్మ చెప్పింది నినంగానే పూర్తిగ తగ్గిపోయి "ఏ దారికుండా వెళితే బ్రహ్మదేవుడిని కలుసుకోవచ్చో" వివరంగ చెప్పాడు.
లీడర్ లీలారాణి నోరు తెరిచే అవసరం లేకపోయింది. "చూశారా నా ప్రతాపం ఒక నిజంకన్నా ఒక అబద్దం ఎంత బలంగ పనిచేస్తుందో!" అన్నట్లు ఫోజు పెట్టింది ఆండాళమ్మ.
అందరు కలిసి అక్కడున్న మట్టిని తొక్కకుండ ఆ అధికారి చెప్పిన మరో మార్గం గుండ పయనమయ్యారు.
దారి పొడుగూతా పెద్ద సంఖ్యలో చిన్న పెద్ద మగవాళ్ళున్నారు. అందరు వంచిన తల లెత్తకుండ బరబర మని అదోరకమైన కలాలతో తోలుముక్కల్లాంటి మీద ఏవిటేమిటో గీతలు పెడుతున్నారు.
ఆ రాతల్ని చూసిన త్రివేణి అత్తగారితో అంది "ఇది ఈ లోకంలో వాళ్ళు రాసే షార్ట్ హాండ్ ఏమో!"
"ఛీ! ఊర్కో టైపు కొట్టడాలు షార్ట్ హాండ్ లు విదేశీభాషలు వీళ్ళకెందుకు? ఇది బ్రహ్మరాత అయ్యుంటుంది." అలివేణి కోడల్ని నెమ్మదిగ మందలిస్తూ అంది.
"బ్రహ్మరాత అయితే ఆ బ్రహ్మదేవుడే రాయాలికదా! ఇందరు రాయడమేమిటి? ఇదేమిటో కనుక్కుంటే పోలా! కాస్త కాలక్షేపంగ ఉంటుంది కదత్తయ్యా!" అంది త్రివేణి.
డాక్టర్ గారి భార్య అయిన అమృతవల్లి "మన డాకటేరుగారి రాత కూడ ఇలాగే ఉంటుంది. అర్ధమైచావదు." తనూ ఏదో వకటిమాట్లాడాలని మాట్లాడుతూ అంది.
"అనుమానం అంటూ రాకూడదు. వచ్చింతర్వాత అడిగి తెలుసుకోవడం మంచిది. ఏమో ఈ రాతల్లో ఏముందో ఎందుకో తెలుసుకోవాలి కదా! తెలుసుకుంటేనే కదా తెలిసేది." లా చదవని లాయర్ సుహాసిని లా పాయింట్లు లాగుతు అంది.
"అడిగేద్దాం" అందరు అనుకున్నారు.
అనుమానం వచ్చిం తర్వాత అడిగి తెలుసుకోకపోతే వాళ్ళు ఆడవాళ్ళు ఎట్లా అవుతారు మరి!
"మా తరపున నువ్వే అడుగు తల్లి! ఎంతైనా లీడర్ ని నువ్వడిగితే బాగుంటుంది." ప్లీడర్ గారి భార్య పేరిందేవమ్మ అంది.
పాపం ఆవిడ ఎప్పుడో తప్ప పెదవి విప్పి మాట్లాడటం అంటుజరగదు. కోర్టులోనే గాక ఇంట్లో కూడ భార్యముందు తన ప్లీడర్ గిరీతో పిడివాదం వేసుకోని మాట్లాడుతుంటాడు ఆ ప్లీడర్ గిరితో పిడివాదం వేసుకోని మాట్లాడుతుంటాడు ఆ ప్లీడర్ గారు.
పెద్ద ఇల్లాలు నోరు విప్పి అడిగేసరికి ఆమె మాట కాదన బుద్ది కలేదు. లీడర్ లీలారాణి కి "ఏమండోయ్! ఏమిటి మీరురాసేది?" ఒకతని ముందుకు వెళ్ళి నుంచుని అడిగేసింది.
కొత్త స్వరం అందుట్లో ఆడస్వరం వినంగనే అతను రాస్తున్న గీతలు రాతలు ఆపేసి తల ఎత్తి చూశాడు. ఆ వెంటనే అక్కడున్న అందరు కూడా చేస్తున్న పనులు ఆపేసి వీళ్ళందరి వైపు వింతగా చూశారు.
"ఎవరు? మీరు? ఇక్కడి దాకా ఎలా వచ్చారు?" అతనడిగాడు.
ఈతఫా లీడర్ లీలారాణి అబద్దం ఆడటానికి వెనుకంజ వేయలేదు. "సరస్వతీదేవి పంపిస్తే వచ్చాం. అప్పడాల పిండిలాగ....చలిమిడి సుద్దలాగ__పూరీల పిండిలాగ చేసే రకరకాల మట్టి పని వారలు బ్రహ్మ దేవుడి దగ్గర కెళటానికి ఇటు మార్గంకుండా దారి చూపిస్తే ఇటు వస్తున్నాం. మధ్యలో మీరు కనపడ్డారు. మా అవమానం తీర్చుకోడానికి ఆగాం. మీరంతా ఎవరు? మీరు రాసే రాతలు ఏమిటి? ఉత్త గీతలు తప్ప వీటిల్లో ఒక భాష పాడు ఏమీ కనబడ్డం లేదు." ధీమాగ అడిగింది.
"మేడమ్ గారు (సరస్వతీదేవి) పంపిస్తే ఆమె రికమండేషన్ తో బ్రహ్మదేవుడి దగ్గర కొచ్చిన వాళ్ళు వీళ్ళతో మర్యాదగ మాట్లాడటం మంచిది" అనుకొన్న అతను మర్యాదగ చెప్పాడు.
"ఇవి బ్రహ్మరాతలు. మేము ఒకగీత గీశామంటే మానవుల తలరాత ఒక ఏడాదిపాటు సరిపోతుందన్నమాట. మా గీతల్లోనే వాళ్ళ తల రాతలుంటయ్. మొట్టమొదట్లో మట్టి బొమ్మలు చేయడం దగ్గర్నుంచి వాటి నుదుట రాతలు ప్రాణ ప్రతిష్ట చేయటం అన్నీ బ్రహ్మగారు ఒక్కరే చూసుకునే వారు. ఇప్పుడు భూలోకంలో జనాభా పెరిగి పోయింది. ఆయనొక్కరు ఈ పనులన్నీ చేయలేక అసిస్టెంట్లని పెట్టుకొన్నారు... మట్టి బొమ్మల్ని తయారుచేయటానికి కొందరిని వాళ్ళ నుదుట రాతలు రాయటానికి గీతాకారులైన మమ్మల్ని ప్రాణ ప్రతిష్ట చేయటానికి మరి కొందరిని నియమించి ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విశ్రాంతి కూడ యుగానికి ఒక్కరోజు ఇవ్వాళే నన్నమాట. మీరు బయల్దేరిన వేళ మంచిది ఇప్పుడు బ్రహ్మగారు విశ్రాంతిగ ఉన్నారు."
"అర్ధమైంది ఆనాడు బ్రహ్మగారు స్వయంగ నుదుట రాసిన రాతలు చక్కగ పరిశుభ్రంగ ఉండేవి. ఇప్పుడిదేమిటయ్యా! మీ రాతలు ఎంత అర్దాన్నంగ ఉన్నాయో భూలోకంలో మనుషుల మనసులు అంత అర్దాన్నంగ చతుర మధ్యంగాను ఉన్నాయి. ఆ రాసేదేదో కాస్తశుభ్రంగ నీట్ గ రాయొచ్చుకదా!" సూరంపూడి సూర్యకాంతాదేవి కయ్ కయ్ మంటు అడిగింది.
"కోప్పడకు తల్లీ! ఇది మా తప్పుకాదు. చిన్నవాళ్ళం మేమంతా చాలా జాగ్రత్తగ మానవుల నుదుటిరాతలు చక్కటి గీతలతో రాస్తున్నాం. కాస్త అలాపైకి వెళ్ళి చూడండి. వయో వృద్దులు సరీగ కళ్ళు కనబడక చేతులు వణుకుతు చాదస్తాలు పోతు మీకు కానవస్తారు. వణుకుతున్న చేతులతో రాస్తే ఆ గీతలు వంక వంకరటింకరగ కాక తిన్నగ ఎలా వస్తాయ్! కళ్ళు సరీగ ఆనక పెట్టిన గీతమీదనే మళ్ళీ గీత పెడతారు దాంతో అక్కడ మానవుల మనసు.....తలరాతలు తలకిందులు కావటం వల్ల మతిలేని వదిలా మూఢుల్లా పరమశుంఠల్లా మత్తుమందుకు బానిసలయిన బలహీనుల్లా తయారవుతున్నారు. ఇదంతా మా తప్పుకాదు. అ ముసిలాళ్ళ రాతల తప్పు..." అంటు వివరించాడు అతను.