"అగ్నిహోత్రం నెత్తినగాదు నానెత్తిన చిలకరించాలి." పెళ్ళాం మీద కోపిష్టిలు మొగుడు ఎగిరిపడ్డట్లు అన్నాడు పురోహితుడు.
నిజమేకాబోలు అనుకుని మరోసారి నీళ్ళగ్లాసులో తమలపాకు ముంచాడు శ్యాంసుందర్.
అదిచూసి పురోహితుడు కంగారుపడి కొద్దిగా కళ్ళెర్ర చేసి "ఆ...ఆ..." అంటూ ఆగమని చేయి అడ్డంపెట్టి "మంత్రాలు శ్రద్ధగా వింటూ చెప్పింది చేయాలంటూ" కోప్పడ్డాడు. పైగా మరోమాటన్నాడు. "మీరేం చిన్నపిల్లలా, ఏమిటీ అల్లరి!" అంటూ.
ఇద్దరు ఏమనుకున్నారో మవునం వహించారు కొద్దిసేపు.
సమయంచూసి తగ్గుస్వరంతో "మేనర్స్ తెలియదు." అంది వాసంతి.
"ఎస్. ఎస్." అన్నాడు శ్యాంసుందర్ వాసంతిమాటకి వంతగా.
పందిట్లో భోజనాలు పూర్తి అయినట్లున్నాయి. సగం మంది ఆడవాళ్ళు నాగవల్లిదగ్గరకు పరుగెత్తుకొచ్చారు.
శ్యాంసుందర్, వాసంతి బుద్ధిమంతుల్లా కూర్చున్నారు.
పానకంబిందెల్లో వుంగరం మట్టెలువేసి తీసే తతంగం మొదలయింది.
ఆడంగులంతా వాసంతి శ్యాంసుందర్ చుట్టూచేరి ఆ తర్వాత పార్టీలుగా మారి." "అబ్బాయ్! ఉంగరాన్ని రెండుసార్లు వీలయితే ముమ్మారు నీవే తియ్యి. మట్టెలు తీశావో జీవితాంతం పెళ్ళాంమాట వినాల్సిందే ఆనక నీ యిష్టం." అంటూ హెచ్చరించి శ్యామ్ సుందర్!" అమ్మోయ్! ఇసి పూర్వం రోజులు కాకపోయినా ఆ తర్వాత అతగాడి ముక్కుకి తాడేసి ఆడించినా మేమేం వచ్చిచూసేదిలేదు. తీస్తే వుంగరమే తియ్యి." అని వాసంతికి బలవంతపు హితబోధలు చేశారు. చిన్నకారు అమ్మాయిలు పెళ్ళికొడుకు వుంగరం తీస్తాడని, కాదు పెళ్ళికూతురే ఉంగరం తీసి గెలుస్తుంది. పందాలేసుకున్నారు.
పానకం బిందెలో శ్యామ్ సుందర్ వాసంతి ఒకేసారి చేతులు పెట్టారు. శ్యామ్ సుందర్ కి త్యాగం చేసే అవసరం కలగలేదు. వాసంతి రెండుసార్లు వుంగరం తీసింది.
విజయగర్వంతో వాసంతి ముఖం వెలిగిపోయింది.
వాసంతి స్వయంగా వుంగరం తీసినందుకు శ్యాంసుందర్ బాధపడలేదు. కాని స్వయంగా తాను వుంగరం తీసి వాసంతి చేతికిద్దామనుకున్న పని విఫలమైందని రవంత చింతించాడు.
ఉంగరం విషయంలో పందాలేసుకున్న శ్యాంసుందర్ తరుపు అమ్మాయి "కావాలని మా శ్యామ్ మట్టెలు తీశాడు. ఉంగరం తియ్యలేక కాదు. పెళ్లాం నొచ్చుకుంటుందని త్యాగం చేశాడు" అంది.
వాసంతి తరపు అమ్మాయి ఊరుకోలేదు. రెండాకులు ఎక్కువే చదివింది.
"అనుభవంమీద చెపుతున్నట్లుంది. మీ ఆయన పెళ్ళినాడు వుంగరం త్యాగంచేశాడేమిటి?" అంది వ్యంగంతో కూడిన నవ్వుతో.
నాగవల్లి పీటలమీదనుంచి శ్యాంసుందర్ వాసంతి లేచారు.
13
"వాసంతీ!" అని మృదువుగా పిలుస్తూ వాసంతి బుజాలమీద చేతులేసి వాసంతిని తనవైపు తిప్పుకున్నాడు శ్యాంసుందర్.
శ్యాంసుందర్ వైపు బొమ్మలా తిరిగింది కాని వాసంతి పెదవి కదపలేదు. తీవ్రంగా ఆలోచిస్తూ పరధ్యాన్నంగా వుండిపోయింది.
"ఈక్షణం నీకేమనిపిస్తున్నది వాసంతీ?"
"ఏమనిపిస్తుందంటే మరి...మరి..."
"ఊ...మరి...ఆగిపోయావేం!"
వాసంతి మునిపంటితో పెదవి కొరుక్కుంటు వుండిపోయింది.
"ఊ...సిగ్గుపడుతున్నావుకదూ? ఈ క్షణం ఏమనిపిస్తుందో నేనే చెపుతాలే. మళ్ళీమళ్ళీ మనిరువురికి తొలిరాత్రి రాదుకాబట్టి. ఈ తొలిరేయి నిదురపోకుండా మధురంగా గడపాలి. అదీ...ఇలా నీ కళ్ళలోనికి నేను నా కళ్ళలోనికి నీవు ఆదమరచి చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయి ఇలా..." వాసంతి ముఖానికి దగ్గరగా ముఖాన్ని చేర్చి అన్నాడు శ్యాంసుందర్.
"అదేంకాదు" అంటూ టక్కున ముఖం పక్కకు తిప్పుకుంది వాసంతి.
తెల్లబోయాడు శ్యాంసుందర్.
అదేంకాదన్న వాసంతి మరింకేదో చెప్పలేదు.
వాసంతీ? నీ మనసులో ఏముందోచెప్పు. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? సిగ్గుపడుతున్నావా? భయపడుతున్నావా? ఏదయినా అనుమానమా! ఈ శ్యాం యీరోజునుంచి నీవాడు. నీ శ్యాం దగ్గర నీ యీ మవునం ఏమిటి!"
"మవునం కాదు. నన్ను వాసు అని పిలిస్తే నాకెంతో యిష్టం."
"అలాగేనోయ్ వాసూ?"
వాసంతి ముఖం పువ్వులా విచ్చుకుంది.
"శ్యాం అని పేరుపెట్టి పిలిస్తే అభ్యంతరమా?"
"ఓహ్. నీకిష్టముంటుందో లేదో అని ముందే రిక్వెస్ట్ చేయలేదు. నువ్వు దొండపండులాంటి పెదవి విప్పి మృదుమధురమైన స్వరంతో "శ్యాం" అని పిలిస్తే నాకంతకు మించి ఆనందం ఏముంటుంది వాసూ?"
"నిజం!"
"నిజంగా!"
"థాంక్యూ."
"థాంక్స్ ఎవడిక్కావాలి. స్వీట్ గ ఓ ముద్దిచ్చేసి ,శ్యాం అని పిలువు."
వాసంతి ముద్దివ్వలేదుగాని విప్పారిన కళ్ళతో, నునుసిగ్గుతో శ్యాంసుందర్ని తదేకంగా చూస్తూ "శ్యాం!" అంది అతినెమ్మదిగా.
ఆనందం పొంగిపొర్లుతుంటే ఆపుకోలేని ఆవేశంతో బలంగా తన బాహువుల్లోకి వాసంతిని లాక్కున్నాడు శ్యాంసుందర్.
వాసంతి అభ్యంతరం చెప్పలేదు.
14
సాయంత్రం నాలుగు తర్వాత వర్జంలేదని వాసంతి భర్తతో అత్తవారింటికి ప్రయాణం కావటం అప్పుడు మంచిదని నిర్ణయించారు.
"ఓనాడు ఆడపిల్ల అత్తవారికటి కెందుకెళ్ళాలి? భర్త భార్య యింటికొచ్చి వుంటే తప్పా! ఆడదాని అవసరం మగాడికి ఎంతగా ముఖ్యమో మగాడి అవసరము అంతగానే ఆడదానికి ముఖ్యం. అంటూ లెక్చరు దంచేదానివే ఇప్పుడవన్నీ ఏమయినవమ్మా వాసంతీ?" అంది జానకి.
వాసంతి అత్తవారింటికెళుతున్నదని ఆపూట రాధాకృష్ణ జానకీ ఇక్కడికే భోజనానికొచ్చారు. వాసంతికి బద్ధకంగా వుందంటే జానకి వాసంతి జడ అల్లుతూ ఓనాటి మాటలు పట్టుకొని వేళాకోళం చేస్తున్నది.