"ఏంటిరా వాసూ! జోక్ చేయటానికి నేనే దొరికానా అదీ మీ అత్తయ్యముందు."
"అదిగాదు మామయ్యా! అత్తయ్య అబద్దమాడుతున్నది."
"సరేనమ్మా వాసంతీ! నేను అబద్దమాడాను. నేనే నవ్వాను. ఏమిటా అబద్ధం, ఎందుకా నవ్వు?"
జానకి అలా అనంగానే ఏం చెప్పాలో తెలియలేదు వాసంతికి. ఈలోపలే రాధాకృష్ణ అందుకుని "నువ్వే చెప్పెయ్యి వాసూ!" అని వాసంతిమీద పెట్టాడు.
ఏమని చెప్పాలో ఆలోచన అందక "నేనేం చెప్పను. అత్తయ్యనే అడుగు. చాతనయితే అత్తయ్య నోటంట చెప్పించు" అంది వాసంతి.
జానకి ఎందుకు నవ్విందో, ఏం చెపుతుందో అని శ్యాంసుందర్ ఆదుర్దాగా చెవి వొగ్గాడు.
"తప్పదోయ్, వాసు పెదవి కదపనని చెప్పేసింది. నువ్వే కానియ్యి" అన్నాడు రాధాకృష్ణ.
"తప్పదా?" అంది జానకి.
"తప్పదుమరి" అన్నాడు రాధాకృష్ణ.
జానకి ఓసారి ఓరకంటితో వాసంతిని చూసి "నేను వాసంతి స్వయంవరాలగురించి, గాంధర్వ వివాహాల గురించి చర్చించుకుంటున్నాము. నేను ప్రేమవివాహాలు మంచివికావన్నాను. లౌ మారేజీలో కావలసినంత త్రిల్ వుంటుందని వాసంతి అంది. అప్పుడేమో..."
జానకి ఆడే అబద్ధాలు చూస్తుంటే వాసంతికి వళ్ళు మండిపోయింది. జానకి చెప్పేది పూర్తిగాకముందే అడ్డుతగిలి "అబద్ధం! అంతా అబద్ధం. మేమేం ప్రేమలుగురించి, పెళ్ళిళ్ళ గురించి అనుకోలేదు. అత్తయ్య నన్ను మోచేత్తో పొడిచి ఏమిటి విశేషం అంది. నాకేంచెప్పాలో తోచలేదు. వెంటనే తాను ఏదేదో వూహించుకుని నవ్వింది. ఇదీ మామయ్యా! అసలు జరిగింది" అంటూ వాసంతి ఆవేశంగా నిజం చెప్పింది.
వాసంతి మాటలు పూర్తిగా విని మరోసారి నవ్వింది జానకి.
"విన్నారుగా, మీ వాసు పెదవి కదపదన్నారు. వాసంతి నోటంట కారణం చెప్పించాను చూశారా! మీ మామ. కోడళ్ళు తెలివి గొప్ప మావేననుకుంటారు. పాపం, అప్పుడప్పుడు పప్పులో కలేస్తుంటారు" అంది జానకి.
ఇంకేం మాట్లాడాలో తెలియని వాసంతి "పో అత్తయ్యా!" అంది చిన్నగా నవ్వి.
మరోసారి గలగల నవ్వింది జానకి.
నలుగురూ ఎదురుగా కనిపించే పార్కులోకి నడిచారు. పార్కులో పెద్దగా జనం లేరు. ఓ పక్కగా లాన్ లో కర్చీఫ్ లు పరుచుకుని కూర్చున్నారు.
"ఊఁ, ఇహ అసలు విషయానికి రండి" అన్నాడు రాధాకృష్ణ యిరువురిని వుద్దేశించి.
వాసంతి మాట్లాడదల్చుకోలేదు. గడ్డిపరకలు తుంచుతూ కూర్చుంది. అవసరమయితే అప్పుడేచూద్దాం, ముసుగులో గుద్దులాట దేనికి అనుకుంది.
"జరిగింది ఏమిటి అంటే..." అంటూ శ్యాంసుందర్ మొదలుపెట్టాడు.
రాధాకృష్ణ "ఊ" కొడుతుంటే బహుశ్రద్దగా వింటూ కూర్చుంది జానకి.
శ్యామ్ మంచి దైర్యవంతుడు. హీరో లక్షణాలు శ్యామ్ లో పుష్కలంగా వున్నాయి. మురిసిపోయింది వాసంతి.
12
పెళ్ళిపీటలమీద నుంచి లేచి నాగవల్లిపీటలమీద కూర్చున్నారు శ్యాంసుందర్, వాసంతి.
నాగవల్లి పూర్తికానిదే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు భోంచేయరాదు. కొత్త దంపతులకోసం పెళ్ళివారు కడుపు మాడ్చుకోరు గాబట్టి అవతల భోజనాల ఏర్పాటు జోరుగా సాగుతున్నది.
ఏ కొద్ది సమయం దొరికినా క్విక్ గా ఓ ముక్క మాట్లాడుకుని అంతకన్నా క్విక్ గా నోరుమూసుకుని బుద్ధిమంతుల్లా కూర్చున్నారు శ్యాంసుందర్, వాసంతిలు.
"పెళ్ళిచూపులకు ముందే అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారటగా!" అని ఒకరంటే. "అదేంలేదు పెళ్ళిచూపుల తర్వాతాక్ కొన్నాళ్ళు ప్రేమించుకుని ఆపై పెళ్ళిదాకా వచ్చారు." అన్నారు మరొకరు. "దేమయినా పెళ్ళికావటం ముఖ్యం, ఆ మూడుముళ్ళు పడ్డాయి." గుండె మీద నుంచి పెద్దభారం దిగినట్లు అన్నాడు వేరొకాయన. "మరే మరే" అన్నాడు ఇంకో ఆయన.
ఎవరే మనుకున్నా ఏ కోట్లాటలు లేకుండా పెళ్ళి ఘనంగా జరిగింది.
నాగవల్లి పీటలకి కొద్దిదూరంగ నలుగురు ముత్తయిదువులు కూర్చున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు పాత చుట్టరికాలు తిరగేస్తూ ఎంతమంది సవ్యంగా వున్నారు, ఏ చుట్టానికి సిరి అబ్బింది? ఏ దాయాది పరలోకం ఎలాటపా కట్టాడు! సుందరమ్మ అత్తగారి పక్షపాతం సూరమ్మ కోడలి కడుపులాంటి విషయాలు బహు కుతూహలంగా ముచ్చటించుకుంటున్నారు. మరో యిద్దరు కునికిపాట్లులాంటి పాట్లు మధ్య మధ్య ఆవులిస్తూ జోగుతూ నడుస్తున్నారు.
దంపతులకి సమయం దొరికింది.
"మన్ని ఫ్రీగా వదిలేశారేం పాపం!" తగ్గుస్వరంతో అన్నాడు శ్యాంసుందర్.
"లంచ్ టయిమ్ అయింది. విస్తళ్ళదగ్గరకు పారిపోయారు" అంది వాసంతి.
"ఇదంతా సర్దాగా ఉంది కదూ!"
"వుందిగాని ఇప్పుడు విసుగుపుడుతున్నది. ఎంత చిరాకేస్తున్నదో?"
"నువ్వు పక్కనున్నందువల్ల కాబోలు నాకు చిరాగ్గా లేదు వుషారుగా వుంది."
వాసంతి మాట్లాడలేదు. కాసేపాగి "పెళ్ళిలో యిదే లాస్ట్ అయిటమ్ అనుకుంటాను" అంది.
"అవును ఇప్పుడిక్కడేదో చేస్తారనుకుంటాను!"
"ఒక బిందెతో వుంగరం మట్టెలు వేసి మనచేత మూడుసార్లు తీయిస్తారుట. ఎవరికీ ఎక్కువసార్లు వుంగరం దొరికితే వారిమాట రెండోవారు వింటారుట."
"ఉంగరం నాకు దొరికినా వదిలేస్తాను నువ్వే తియ్యి." అన్నాడు శ్యాంసుందర్.
"థాంక్స్" అంది వాసంతి.
పెళ్ళిచేయించే బ్రాహ్మడుకి ముక్కు మూరెడుంది. దానికో బారెడు కోపంవుంది. పెళ్ళిపీటలమీద కూర్చున్న లగాయితూ అబ్బాయి అమ్మాయి గుసగుస లాడుకోటం మధ్య మధ్య ఇంగ్లీషు ముక్కలు పేలటం చూస్తుంటే కోపం వస్తున్నది. ఆయన కోపానికి తగ్గట్లుగానే ఓ సంఘటన జరిగింది. నేతిగిన్నెలో తమలపాకు మంచి తమలపాకు కంటుకున్న చేతిని అగ్నిహోత్రంలో చిలకరించు నాయనా!" అని చెపితే వాసంతి చెక్కెళ్ళు చూస్తున శ్యాంసుందర్ నీళ్ళగ్లాసులో తమలపాకు ముంచి ఆ నీటిని అగ్నిహోత్రంమీద చిలకరించాడు.