Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 18

    "శ్యాంకి అక్కడ జాబ్ వుండబట్టి వెళుతున్నాను. నే యిక్కడ జాబ్ చేస్తుంటే శ్యాం ఇక్కడి కొచ్చేవాడు." అడిగింది జానకి కాబట్టి కోపం తెచ్చుకోక తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో మాత్రమే అని వూరుకుంది వాసంతి.
    వాసంతితో పంపాల్సినవి సర్దుతూ అక్కడేవున్న ఆదిలక్ష్మమ్మ కింకా కూతురు లోక మెరుగని పసిదానిగానె తలచి తల్లిగా తను చెప్పదలచినవి కొన్ని వున్నాయనుకుని పెదవి విప్పింది.
    "వాసంతీ? బొత్తిగా నీకేం తెలియదే అల్లుడుగారిని అలా పేరుపెట్టి పిలవ్వొచ్చా?"
    "అమ్మా? నేను శ్యాంని పేరుపెట్టి పిలవటంవల్ల కొంపలంటుకుపోవు. ముందా అల్లుడుగారన్న పదం నాముందు ఎత్తకు వినలేకుండా వున్నాను" అంది వాసంతి.
    "బాగుందే అల్లుడుగారిని అల్లుడుగారనక ఏమనిపిలుస్తాం! నీలాగా మొగుణ్ని పేరుపెట్టి పిలిచే ఆడపిల్లని నేనింతవరకూ చూడలేదు."
    "ఇప్పుడు నన్ను చూడు."
    "చూడకేం చూస్తూనేవున్నా. ఎవరినని ఏం ప్రయోజనం వుంది.  ఆ తండ్రి పెంపకం అలాంటిది." పసుపుకొమ్ములు పొట్లంకడుతూ అంది ఆదిలక్ష్మమ్మ.
    ఇరువురి సంభాషణ వింటూ వుండిపోయింది జానకి.
    "నాన్నగారిని ఏమీ అనకు నాక్కోపమొస్తుంది."
    "ఆయన్ని నిన్ను మాటని బ్రతకటమే. సరిసరి నాకంత యోగ్యత కూడానా?"
    వాసంతి ఫక్కున నవ్వింది. "యోగ్యతంటూ ఉంటే నన్ను నాన్నగారిని అనాలనే వుందన్నమాట. పిచ్చిఅమ్మా! మరినాకేంటి నీతులు చెపుతున్నావు?" మనసులో దాచుకోటం అంటూ వుండదు కాబట్టి టక్కున అనేసింది.
    "ఏదో మాటవరసకి అఘోరించాను. నాకాపద్ధతులు గిట్టవు లాంటి కోరికలు లేవు, అల్లుడుగారిని మాత్రం..."
    "స్టాప్ స్టాప్. మమ్మీ! నీ నోట్లోంచి మాటకుముందు అల్లుడుగారు అల్లుడుగారు. పిలుపు నాకర్ణములకు కఠినముగా వినిపించుచున్నది. శ్యామ్ అంటే ఏమయింది?"
    ఆదిలక్ష్మమ్మ కళ్ళుపెద్దవిచేసి ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకుంది.
    "పేరుపెట్టి చిన్నపిల్లలని పిలుస్తారు, కొన్ని వరసలనుబట్టి పిలుస్తారు. ఆడపిల్ల అత్తారింటి వేపువాళ్ళని పిలవటం, భార్య భర్తని పిలవటం మా కాలంలో భర్త భార్యని పిలవటం ఎరగం."
    "ఏమోయ్! వసేయ్, ఏమిటే, అని భర్త ఏమండీ! ఏంటండీ! అని భార్య అబ్బబ్బ అని పిలుపులా అడవిజాతివాళ్ళ అరుపులు."
    "నీకన్నీ విడ్డూరమే. అత్తయ్యపిలవటంలేదూ మీ మామయ్యని ఏమండీ అని..."
    "ఆ...అత్తయ్య పిలిచినా మామయ్య అత్తయ్యని పేరుపెట్టి పిలుస్తున్నాడు. అది వాళ్ళిష్టం. నేను శ్యామ్ ని శ్యామ్ అనే పిలుస్తాను." వాంతి మొండిగా జవాబిచ్చింది.
    కూతురు మొండితనం చూస్తుంటే విసుగ్గా వుంది. ఇరవై ఏళ్ళు వచ్చినా కడుపునపుట్టిన బిడ్డగాబట్టి "ఈ పిల్ల యింత అమాయకురాలేమిటమ్మా!" అనే జాలివుంది ఆదిలక్ష్మమ్మ.కి." అయితే నాకు తెలియక అడుగుతాను మీ అత్తగారిని కూడా పేరుపెట్టే పిలుస్తావుటే వాసంతీ!" అంది అత్తామామల విషయంలో కూతురు ఏంచేస్తుందో అనే ఆలోచన వచ్చింది.
    వాసంతి, తెలివితక్కువదేం కాదు. చిన్నగానవ్వి "అమ్మా? నిన్నూ నాన్నగారిని పేరుపెట్టి పిలవటంలేదుగా, అలాగే వాళ్ళనూ పిలవను" అంది.
    "రక్షించావు. వాళ్ళను పేరుపెట్టి పిలిచి మా పరువు గంగలో కలపలేదు, నీ మొగుడి కిష్టమయింది. పేరుపెట్టి పిలుస్తున్నావు సరే. మేమంటే కన్నవాళ్ళం నోరుమూసుకున్నాము. మీ అత్తామామల కిష్టముండాలికదా?" ఈ ప్రశ్నకి ఏం బదులిస్తుందో అని అడిగింది ఆదిలక్ష్మమ్మ.
    "మామధ్యన వాళ్ళెవరు? వాళ్ళిష్టమొచ్చినట్లు నే వుండాలంటే నా మనసంగీకరించవద్దూ, నేను పసిపాపనుకాదు. నాకో వ్యక్తిత్వం వుంది. ఆవిడ కాచారముండి మడితడి అంటే ఆవిడిష్టానికి తలొగ్గి పసుపునీళ్లు నెత్తిన చల్లుకుంటు పేడనీళ్ళు ఇల్లంతాజల్లి అలికి ముగ్గులుపెట్టి తడిగుడ్డలోడుతూ కట్టెల పొయ్యిముందు కన్నీరుకారుస్తూ వంకాయ తిరగమోత వేస్తూ..." బోలెడు ఆవేశంతో కామా పులిష్టాపుల లేకుండా సుదీర్ఘ ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోతున్న వాసంతి టప్పున నోరుమూసుకుని చటుక్కున తపతిప్పి గుమ్మంవైపు చూసింది. 
    వాసంతి మాటలింటూ గుమ్మానికి నిండుగా నుంచున్న శ్యాంసుందర్ చప్పట్లు కొడుతూ "హియర్ హియర్" అని చిలిపిగా వాసంతిని చూస్తున్నాడు.
    వాసంతి పొరపాటయిపోయినట్లు నాలుక కోరుకుని "ఆ..." దీంట్లో పొరపాటేముంది రేపు అత్తగారు యిలాంటి పనులు చెపితేమాత్రం తాను చేయటానికి సిద్ధంగా వుందా!  అనుకుని ధీమాగా శ్యాంసుందర్ ముఖంలోకి చూసి చిన్నగా చిరునవ్వొకటి విసిరింది.
    ఆదిలక్ష్మమ్మ గుమ్మంలో నుంచునివున్న శ్యాంసుందర్ ని చూసి కంగారుగా చేతిలోవున్న పొట్లాలు కింద జారవిడిచి లేచినుంచుంది. అలవాటు ప్రకారం భుజంమీద వున్న చీరకొంగుని వీపుచుట్టు తిప్పి ముందుకు లాక్కుని వదిగి నుంచుంది. అమ్మాయి అన్న మాటలు అల్లుడుగారు వినేవుంటారు. ఏమనుకుంటారో ఏంఖర్మో. ఇదా నోరు దురుసుమనిషి. అని భయంతో అనుకుంది.
    జానకి అక్కడేవున్న కుర్చీనిముందుకి లాగి "కూర్చోండి" అంది శ్యాంసుందర్ తో.
    శ్యాంసుందర్ కుర్చీలో కూర్చుంటూ "నీ వాక్ ప్రవాహంబుకు నేవచ్చి అడ్డు తగిలినట్లున్నాను సతీ!" అన్నాడు నాటకంలో పాత్రధారిలా.
    కాలేజీలో చాలా నాటకాలలో తాను చాలా రకాల వేషాలు ధరించినట్లు శ్యాంసుందర్ రాత్రి వాసంతితో చెప్పాడు. ఆ సంగతి గుర్తొచ్చి తానూ నాటకంలో పాహ్రలా "లేదు పతిదేవా! నేను మా కాలేజీలో చాలాసార్లు డిబేటింగ్ లో పాల్గొని అవతలివారు నోరెత్తకుండ నేను చెప్పింది చెప్పకుండ ఉపన్యసించితిని. అందరును సంతసించితిరి అంది వాసంతి.
    "భళీ. బాగు బాగు." అన్నాడు శ్యాంసుందర్.
    వస్తున్న నవ్వుని బలవంతాన బిగ బట్టుకుంది జానకి.
    కొత్తదంపతులు సిగ్గువిడిచి వకరి ముఖంలోకి వకరు చూసుకుని మాట్లాడుకుంటుంటే ఆదిలక్ష్మమ్మకి సిగ్గేసింది. వాళ్ళముందు వుంటానికి బిడియపడింది అవతలికెళ్ళిపోయింది. వెళ్ళేముందు "భగవంతుడా! పిల్లదాన్ని పిల్ల సంసారాన్ని చల్లగాచూసే భారం నీదే" అనుకుంది.
    శ్యాంసుందర్ వాసంతి మాటల మధ్యలో తానూ మాటలు కలుపుతూ ఆదిలక్ష్మమ్మ సగంలో వదిలి వెళ్ళిన సామాను సర్దుతూ అక్కడే కూర్చుంది జానకి.

 Previous Page Next Page