తనమనస్సులో వున్నది పరిష్కారం అయేటప్పటికి రఘుకి మనసు తేలికయింది.
మూలమలుపుదాకా వచ్చి "రేపు మధ్యాన్నంవచ్చి రాధకు ఎలా వుందో చెపుతానమ్మా!" అన్నాడు రఘు అక్కడే ఆగిపోయి.
రఘు ఇప్పటికిప్పుడు రావటానికి బిడియపడుతున్నాడని గ్రహించుకుంది పార్వతి.
"అలాగే, మరచిపోకు రాధకు ఎలావుందో వచ్చి చెప్పు." అంది పార్వతి.
"జాగ్రత్తగా వెళ్లు. రేపు మధ్యాహ్నం వస్తాను" మరోసారి అన్నాడు రఘు.
"అలాగే, బజారులో చక్కర్లుకొట్టక రాధని కనిపెట్టి వుండు." అంటూ పార్వతి బయలుదేరింది.
"పండక్కి పిలవటానికి కృష్ణ వస్తున్నట్లు రాశాను. రఘు ఎప్పటిలాగా వెళతానంటున్నాడు. మళ్ళీ ఆ విషయం శకూకి రాయాలా? రాయకపోతేమటుకేమి. కృష్ణ బదులు రఘు రావటంచూచి శకు జరిగింది గ్రహించకపోదు." అనుకుంది పార్వతి.
"రేపు నా లెటర్ శకుంతలకి అందుతుంది. చదివి ఏమాలోచిస్తుందో?"
గుమ్మలో కాలుపెడుతూ అనుకుంది పార్వతి.
13
శకుంతలను వదిలించుకొని ఇంట్లోంచి బయటపడ్డాడు శ్రీపతి.
ఆలస్యం అయినందుకు లోలోన విసుక్కున్నాడు. అడుగుల వేగం హెచ్చించి పెద్దపెద్ద అంగలేస్తూ వీధిమలుపు తిరిగాడు/
వీధి చివర రోజూ పది రిక్షాలవరకూ నిలిచివుంటాయి. శ్రీపతి అవసరం తెలిసేమో ఒక రిక్షా కూడా లేదు. అటూ ఇటూ చూశాడు. కనుచూపుమేర ఒక రిక్షా లేదు.
"అవసరానికి దొరకవ్, రిక్షాలు దేనికి ఏడ్వను. అందరూ ఒకేసారి ఎక్కడ తగలపడ్డారో! రిక్షా ఎక్కితే యీపాటికి అక్కడ వుండేవాడిని." అనుకున్నాడు శ్రీపతి. అనిషి ఇక్కడ మనసు అక్కడ వుండటంతో చిరాకు, విసుగు, అర్ధంలేని కోపం ఎక్కువయాయి.
ఖాళీ రిక్షా రావటం చూచి పిలిచాడు శ్రీపతి. కాదన్నట్లు చెయ్యివూపి రయ్యిన తొక్కుతూ రిక్షా అబ్బి వెళ్ళిపోయాడు. అదే సమయంలో మరో రిక్షా వచ్చింది ఖాళీగా.
"కొత్తపేట నాలుగోలైను మూడో అడ్డరోడ్డుకి వెళ్ళాలి. అర్జంట్, ఏమివ్వమంటావ్?" శ్రీపతి వేగిరిపడుతూ అడిగాడు.
"ఆ అర్జెంట్" అన్న మాటా శ్రీపతి కంగారు చూచి "రూపాయిన్నర అవుద్దిసామీ!" అన్నాడు రిక్షా అబ్బి తాపీగా.
"ఏమిటీ? "రూపాయిన్నరా? కొత్తపేట ఎంత దూరమని నీ ఉద్దేశ్యం? పట్టుమని పది అడుగుల దూరం లేదు. నడిస్తే అయిదు నిమిషాలు" అన్నాడు శ్రీపతి.
"అయితే నడిచిపోండి, పదడుగుల దూరానికి రిక్షా దేనికి. డబ్బు దండగ" ఇది కుదిరే బేరం కాదని తనూ ఓ మాట విసిరి రిక్షా అబ్బి వెళ్ళిపోయాడు.
"రిక్షావాళ్ళకున్న పొగరు మరొకళ్ళకు లేదు. ఎలాగూ ఇంతదూరం నడిచేవచ్చాను. యీకాస్త దూరం వేగంగా నడిస్తేసరి" రిక్షావాళ్ళ అందరిమీద కోపంవచ్చి ఖాళీరిక్షాలు ఎదురయినా పిలవక పదిహేను నిమిషాలు నడిచి సుందరం ఇల్లుచేరాడు శ్రీపతి.
సుందరం ఇంటితలుపులు వేసివున్నాయి. వరండాలో లైటు ఆర్పేశారు. చీకటిగావుంది. లోపలమటుకు మనుషులున్న అలికిడి, పెద్దలైటు వెలుగుతుంది.
శ్రీపతి వరండాలో ఆగిపోయాడు.
"గంట ఆలస్యంగా తాను వచ్చినందుకు తనగురించి వాళ్ళేమనుకుంటున్నారో వినవచ్చు, యీపూటకు శ్రీపతి రాడు అని ఖాయంచేసుకొని వుంటారు. అందుకే వరండాలో లైటులేదు. శ్రీపతి ఆలస్యం అయినా వస్తాడు, మాటతప్పడు అని ఇన్నేళ్ళ స్నేహంలోను గ్రహించలేదా తన తత్వం గురించి? ఆలస్యం ఎటూ అయింది. ఇక్కడేనుంచుని వింటే వాళ్ళేం మాట్లాడుకుంది వినవచ్చు." శ్రీపతికి చిలిపి ఆలోచన కలిగి చప్పుడుగాకుండా గుమ్మంపక్కన నుంచున్నాడు. చెవి తలుపుకి ఆనించి లోపలి మాటలు వింటూ.
"శ్రీపతి ఇంతాలశ్యం ఎప్పుడూ చేయడు కాబట్టి ఇహ రాడుగాక రాడు." అది సుందరం స్వరం.
"లేదు భాయ్! అటు సూర్యుడు ఇటు పొడిచినా ఆశ్చర్యపడనక్కరలేదు శ్రీపతి రాకపోవటం ఇంపాజిబుల్. శ్రీపతి కరెక్ట్ మనిషి. వస్తాడు. ఇంకో గంటకయినా వస్తాడు." అది మరో ఫ్రెండ్ మురళి స్వరం.
"ఏం? వాడేమన్నా సత్యహరిశ్చంద్రుడా? శ్రీరామచంద్రుడా? ధర్మరాజా? వాడు.....శ్రీపతిగాడు. మనిషి అంతే." మూడోకంఠం శ్రీకంఠమూర్తిది ఖంగున వినిపించింది.
"వైఫ్ యీ వైపుకి వెళ్లొద్దంటే మానేసి వుంటాడు. పిచ్చి సన్యాసి." సుందరం ప్రేమగా అన్నాడు.
"ఆడదాని మాట వింటారు కాని పెళ్ళాం మాట వింటారా? నేన్నమ్మను" కిలకిల నవ్వుతూ లత అంది.
వీళ్ళమాటలు వింటున్న శ్రీపతీ, లత స్వరం గుర్తించాడు. లత క్లబ్ డాన్సరు.
"ఇంకా ఏమనుకుంటున్నారో వినాలి. అప్పుడే తలుపు తట్టకూడదు." అనుకున్నాడు శ్రీపతి.
"శ్రీపతి పెళ్లాంపేరు ఏదో ఏదో వుందిరా, సావిత్రో, సీతో, సుమతో?"
"ద్రౌపతేమో?"
ఘొల్లున నవ్వులు వినపడ్డాయి.
"ద్రౌపతీ కాదు సుభద్రాకాదు. శకుంతల."
"అవును శకుంతల. గుర్తొచ్చింది." అందరూ ఏకగ్రీవంగా అన్నారు.
"అరేయ్ మురళీ! శకుంతలలాంటి అందమైన పెళ్లాం వుంటే రాత్రింబవళ్ళు విడవకుండా వుండొచ్చురా."
"శ్రీపతితో వాగనంటే ఓ నిజం వెళ్ళడిస్తారా?" సుందరం అన్నాడు.
"ఎక్కడిదక్కడ పొందటం, ఎప్పటిదప్పుడు మరచిపోవటం మనకలవాటేకదరా భాయి కానీయి."