రఘు తొందరపడి ఇల్లు వదిలాడు. తనూ తొందరపడి రఘూని దూరం చేసుకుంటే ఫలితమేముంది. అద్దాన్ని పగలకొట్టటం తేలిక. అతికించటమే కష్టం. మానవ జీవితాలు అందుకు భిన్నంకావు.
రఘు రమ్మని పిలిచాడు పైగా రాధకు జ్వరమని కూడ చెపుతున్నాడు. ఇలాటప్పుడు వెళ్ళి చూస్తే రఘుకి తృప్తిగా వుంటుంది. రఘు మళ్ళీ ఇంటికి వస్తాడు.
"ఏమిటమ్మా! ఆలోచిస్తున్నావు?" అత్తవారిల్లు సమీపిస్తుండగా రఘు అడిగాడు.
"నువ్వేం ఆలోచిస్తున్నావు?" ఎదురు ప్రశ్నవేసింది చిరునవ్వుతో పార్వతి.
"పోమ్మా! జవాబు చెప్పకుండా తప్పించుకుంటావు" పసిపిల్లాడిలా బుంగమూతిపెట్టి అన్నాడు రఘు.
రఘు అత్తవారింట్లో పార్వతికి ఎప్పుడూ జరిగే మర్యాదకు లోటుకాకుండా వియ్యపురాలు శ్యామలాంబ ఎదురొచ్చి చేతులు పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఒక్కొక్కరే వచ్చి కుశలప్రశ్నలు వేశారు.
పార్వతి గదిలోకి వెళ్ళి రాధమంచంమీద కూర్చుంది.
రాధకు గర్భస్రావం అయినప్పటినుంచి కోలుకోలేదు. శరీరంలో నలతగానే వుంటున్నది. మందులు, ఆహారం సక్రమంగా తీసుకుంటున్నా అవి శరీరానికి పట్టినట్లు లేవు .నీరసంగా పాలిపోయి మొదటిసారి గర్భిణి అలా అయిందనే చింతతో గడుపుతుంటే యీమధ్య తరచు సాయంత్రంకాగానే జ్వరమొచ్చినట్లు వుండటం. అది అశ్రద్ధచేయటంతో నాలుగు రోజులనుంచీ జ్వరం నూటమూడుకి దిగకుండా రాత్రింబవళ్ళు వుంది. రేపటికి తగ్గకపోతే టైఫాయిడ్ అని తేల్చవచ్చు అంటూ ఉదయం డాక్టరు చెప్పి వెళ్ళాడు.
సంగతులన్నీ విన్న పార్వతికి స్థలం మారిస్తే 'బాగుంటుంది అనిపించింది'.
"ఎలా వుంది రాధా! తలనొప్పి కూడా వుందా?" రాధ వంటిమీద చెయ్యివేసి చూచి అడిగింది పార్వతి.
"ఏంనొప్పులున్నా మీరు రావటం చూచి పారిపోయాయి. మిమ్మల్ని చూడగానే హాయిగా ప్రశాంతంగా వున్నట్లు అనిపిస్తున్నది అత్తయ్యా!" అంది రాధ.
"ఏగూటి చిలక ఆమాటే మాట్లాడుతుందన్నట్లు, ఇన్నాళ్ళూ నేచేసింది పోయింది. అత్తగారిని చూడగానే ఎలా చెపుతున్నావో? ఇక్కడంతా నే కష్టపెట్టినట్లు?" నవ్వుతూ అంది శ్యామలాంబ.
"రాధ ఏమందని నిందమోపుతున్నారు వదినా?" రాధ తలమీద చేయివేసి నిమురుతూ అంది పార్వతి.
"ముందు కాఫీ కలుపుకు వస్తాను. తీరుబడిగా వాదులాడుకుందాము వదినగారూ!" అంటూ శ్యామలాంబ లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
కాసేపు ఆ కబుర్లు యీ కబుర్లు చెప్పుకున్నారు.
"జ్వరం తగ్గింతరువాత అక్కడికి వస్తానత్తయ్యా!" అంది రాధ మాటల మధ్యలో.
అక్కడే కుర్చీమీద కూర్చున్న రఘుని క్రీగంటచూసి "రఘుని అడిగావా?" అంది పార్వతి.
"ఏమిటమ్మా నీవనేది" రఘు ఏంమాట్లాడాలో తెలియక అన్నాడు.
"రాధ అత్తగారింటికి వస్తే రఘు అత్తవారింట్లో వుండిపోవలసి వస్తుందేమో! అదెలా కుదురుతుంది?"
"అది కాదత్తయ్యా!" రాధ ఏదో చెప్పబోయింది.
కాఫీ కప్పులతో శ్యామలాంబ రావటంతో మాటలు ఆగిపోయాయి.
"అదేమిటర్రా, నేరావటం చూచి అంతా మౌనం వహించారు," శ్యామలాంబ కాఫీకప్పుని ముందుగా పార్వతికి అందిస్తూ అడిగింది.
"మీమీద చెప్పుకొనేటప్పుడు మీరాక అయితే ఏంచేయమంటారు చెప్పండి, నోళ్ళు మూతవేయటం తప్ప?"
"నేనంటే అంత భయపడుతున్నారన్నమాట శరీరం చూచేనా?"
పార్వతి నవ్వి వూరుకుంది.
శ్యామలాంబ తెల్లని ఛాయలో అందమైందయినా విపరీతంగా వళ్ళు వచ్చింది. మొదటినుంచీ బొద్దు శరీరం, వళ్ళు రావటంతో మరింతలావుగా కనిపిస్తున్నది, లావుతగ్గినా ఎత్తు లేకపోవటంతో చూడగానే ఆకర్షిస్తుంది లావుపాటి మనిషిలా.
ఓ పావుగంట కూర్చుని ఇంటికి బయలుదేరింది పార్వతి.
రఘు బైటకు వెళ్ళినప్పుడు పార్వతితో చెప్పింది రాధ - "ఆయన తొందరపడ్డారని పశ్చాత్తాపపడుతున్నారత్తయ్యా" అంది.
"ముందు నీ జ్వరంతగ్గనీ, పరిస్థితులు అవే చక్కబడతాయి" అంది పార్వతి.
పార్వతితోపాటు రఘు కూడా బయలుదేరాడు. "నీవెందుకురా రఘూ!" అంది.
"బజారుదాకా వస్తానమ్మా?" అన్నాడు రఘు.
బజారుదాకా అంటే సగం దూరం. ఇందాక మనం కలిసివచ్చినచోటువరకూ అని, రఘురావటం ఇంటివరకూ కాదని నిర్ధారణ అయింది పార్వతికి.
"నే వెళ్ళగలను. నీవెందుకు నాకు తోడు? రాధ దగ్గర వుండు" గంభీరంగా అంది పార్వతి.
"అది కాదమ్మా! మరి__మరి__" రఘు నసుగుతూ అన్నాడు.
రఘు ఏదో చెప్పటానికే తన వెనక బయలుదేరాడు. బహుశా అది మళ్ళీ ఇంటికొచ్చే విషయమై వుండవచ్చు.
దోవ పొడుగూత రఘు ఏదో ఏదో చెపుతూనే వున్నాడు. ఓమాటకీ ఓమాటకి అతకటం లేదు. చెప్పవలసింది చెప్పలేకపోతున్నాడు.
చివరికి ఓ నిర్ణయానికొచ్చి పార్వతి అంది.
"పండక్కి శకుంతలనీ, శ్రీపతినీ పిలుచురావటానికి కృష్ణ వెళుతున్నాడు. వాళ్లెలాగూ వస్తారనుకో, పిలవటం మన ధర్మం. కృష్ణని మీ అత్తవారింటికి పంపుతాను. నీవూ రాధా, పండక్కి రండి" అంది పార్వతి. ఇలా అన్నా రఘు మనసులో విషయం బయటకు వస్తుందని.
"అదేమిటమ్మా! కృష్ణ మనింటికి నన్ను రమ్మని పిలవటమా?"
"అవును రఘు! పరిస్థితులు మారాయికదా!" నిర్లిప్తంగా అంది పార్వతి.
"పిల్లలు తెలిసో తెలియకో ఏదయినా చేస్తే తల్లి మందలించాలమ్మా! పరిస్థితులు ఎప్పుడూ వుండేవే. పాడు మనసు జరుగుతున్న సంఘటనలకి మారుతుంది. అంతే అదీ తాత్కాలికంగానే, పండక్కి శకూని నే పిలుచుకు వస్తాను ఎప్పటిలాగానే కృష్ణని పంపకు."
"అలాగే రఘు! నీవే వెళుదువు గాని, రాధకు రెండు మూడు రోజుల్లో జ్వరంతగ్గితే రాధకు జ్వరం తగ్గినా కొన్నాళ్ళు రెస్ట్ కావాలి. ఇంటికి వచ్చేస్తానని నాలుగుసార్లు చెప్పింది. పండగదాకా అక్కడే వుంచి ఆనాటికి తీసుకు వస్తే సరి."