"నేలేననుకొని అవాకులు చవాలుకు పేలుతున్నార్రా కానీయండి. సాంతంవిని మీపని చెపుతాను" శ్రీపతి పిడికిళ్ళు బిగించి అనుకునాడు.
సుందరం మరోపెగ్గు అందరి గ్లాసుల్లోకి వంచి మొదలుపెట్టాడు.
"ఆరోజు నాకు బాగాగుర్తు. జూన్ పదోతారీకు. శ్రీపతి ఒక్కడూ పనిమీద వూరువెళ్లాడు. అది తెలీక నేను వాళ్ళింటికి వెళ్ళాను. శకుంతల ఆహ్వానించింది. కాఫీ తాగెళ్ళమణి కాదు దానికి.....దానికన్నమాట .....నేనేం మడికట్టుకుని మసిలేవాడిని కాదుకదా? తను సై అంటే నేను సై అన్నాను. కళ్లారా చూశాను, అనుభవించాను. దిష్టిబొమ్మలా కాదురా ఫూల్ ,రంభలా వుంది .బలిష్టమైన__"
సుందరం, శకుంతల అంగాలను వినసొంపుగా వర్ణిస్తున్నాడు.
శ్రీపతి వినలేక నిలువెల్లా కోపంతో వూగిపోతూ ఫెడేల్ మని తలుపులపై తన్నాడు.
లోపల గడియవేయని తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి.
"ఏమిట్రా పేలుతున్నావ్?" రయ్యిన లోపలికి దూసుకువచ్చి సుందరం చెంపమీద యీడ్చికొట్టాడు శ్రీపతి.
"ఏంపేలాను?" చెంప తడుముకుంటు సుందరం దబాయించాడు.
మిత్రబృందానికి వుషారుగా వుంది. శ్రీపతి ముఖం చూస్తూనే గ్రహించారు అన్నిమాటలు విన్నట్లు. సుందరం, శ్రీపతి పోట్లాడుకుంటుంటే సుందరం పక్షం వహించటానికి సిద్ధంగా వున్నారు. సుందరంవద్ద కావలసినంత "మందు" దొరుకుతుంది. "మనీ" పుడుతుంది, మధ్యమధ్య హైక్లాస్ లేడీతో ఉండటానికి ఓ గంటమాత్రం కావచ్చు ఛాన్స్ ఇస్తాడు. ఇన్ని వసతులు వదులుకుని శ్రీపతి పక్షం వహించేటంత పిచ్చిపక్షులు ఎవరూ వుండరు.
"ఏంపేలావో కూడా తెలీని స్థితిలో కళ్ళు మూసుకుపోయి నోరుపడిపోయిన స్టేజీలో వున్నావన్నమాట. లేక నా నోటితో చెప్పించాలనా?" శ్రీపతి రెట్టిస్తూ అడిగాడు.
సుందరం ఓసారి మిత్రులవైపు చూచాడు, ధైర్యం వచ్చింది.
"ఉన్నమాటే అన్నాను, అర్ధం చేసుకుంటే మామూలుగా వుండు. లేకపోతే నీ దోవనీది. పోతేపోరా బ్రదర్" వ్యంగ్యంగా అహంకారంగా అన్నాడు సుందరం.
"నేలేనుకదా అని, నాగురించి నా భార్యగురించి ఇష్టంవచ్చినట్లు వాగే మీరూ ఒక మనుషులేనా? మన స్నేహం ఇప్పటిదా? ఇంత స్నేహంలోను, పరిచయంలోను పరాయివాళ్ళ విషయం మాట్లాడుకున్నాముగాని స్నేహితుని భార్య గురించి మాట్లాడుకోలేదు? చెల్లెలులా తలిచాము .పరాయి ఆడదానిపట్ల పశువులా మాటజారి ప్రవర్తించలేదు."
శ్రీపతి మాటలు వింటూనే గదంతా దద్దరిల్లేటట్లు నవ్వారు మిత్రబృందం.
"మాముందు వల్లించవలసిన నీతివాక్యాలు ఇవా బ్రదర్! చ్చొ......చ్చొ.....చ్చొ.....ఆడదాని ముఖం చూడనట్లే మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నాగురించి ఆ రోజు.......పన్నెండు తరువాత, మాట్లాడిన తీరు, ప్రవర్తించిన తీరు, పశువులాగా__సారీ, మనిషిలాగానేకదూ శ్రీపతి బాబూ నీవు మెలిగింది?" లత మెలికలు తిరిగిపోతూ తియ్యని కంఠంతో అంది.
"ఛీ! నీవూ ఓ ఆడదానివేనా?" ఛీత్కారం చేశాడు శ్రీపతి.
"ఒకసారివస్తే తెలియలేదా? కమాన్ ,సుందరం ఆజ్ఞ తీసుకొని మరోసారి రా నేనెవరో బాగా చూద్దువుగాని"
"సంసార స్త్రీ పచ్చిగా మాట్లాడదు" శ్రీపతి ఆవేశం అంతకంతకూ ఎక్కువౌతున్నది. మనీ వెదజల్లితే వచ్చే సరుకు వీళ్ళముందు హేళనచేస్తూ మాట్లాడుతుందా అని.
"అరెభాయీ! మనవాడు చాలా సంసారస్త్రీలను చూచే వుంటాడురోయ్! లేకపోతే ఇంత అనుభవంగా మాట్లాడడు," శ్రీకంఠమూర్తి గొప్ప సత్యం కనిపెట్టినట్లు అన్నాడు.
"మన హీరో ఏకపత్నీవ్రతుడు. నోరు పడిపోతుంది అలా మాటాడకు." మురళి కసురుకున్నాడు.
లత కిసుక్కుమని నవ్వింది.
"రంభలాంటి పెళ్ళాం ఇంట్లోవుంటే నేనూ అవుతా, ఏకపత్నీ వ్రతుడ్ని" సుందరం హేళన.
"అరేయ్! నా ఎదుటే నన్ను హేళన చేస్తున్నార్రా ఎంత ధైర్యం? ఉహూ! మిమ్మల్ని అనటం నా పొరపాటు, నాదితప్పు, ఎస్. కరెక్టు, తప్పు నాది. ఇంట్లో రంభ వుండి రాళ్ళకోసం బైటకు వచ్చాను. నేనెంత మూర్ఖుడిని! మీలాంటి నీచుల స్నేహం నా పతనానికి దారితీసింది. స్నేహంలో మాధుర్యం వుంటుంది. అది పవిత్ర స్నేహమయితే, కాని....నీచులతో స్నేహం పతనానిని దారితీస్తుంది. అనుభవంతో కళ్ళు తెరుచుకున్నాయి. నేను మాటకు కట్టుబడివుండే రకాన్ని. మాటంటే మాటే. యీరోజు నుంచీ మీరెవరో నేనెవర్నో. యీ యింటి గుమ్మం తొక్కను. ఈ ఇల్లేకాదు. ఇలాంటి మనుషులుండే ఏయింటి గుమ్మమూ తొక్కను. స్నేహంచేయను." ఆవేశంతో అని వెనుతిరిగాడు శ్రీపతి.
"పాపం! సినిమాలు తెగచూచినట్లున్నాడు డైలాగులు కంఠతా వచ్చేశాయి."
"వాడు రంభవద్దకెళితే మనం ఊర్వశి వద్దకెళదాం."
వెనుకనుంచి హేళనగా అంటున్న స్నేహితుల మాటలు వినిపిస్తూనే వున్నాయి .పారిపోయి వచ్చినట్లు సుందరం ఇంట్లోంచి బైటపడ్డాడు శ్రీపతి.
దోవలో శ్రీపతి రిక్షా పిలిచాడు. రిక్షా అబ్బి అడిగినంతా ఇచ్చి ఇంటికి బయలుదేరాడు.
ముడుచుకుని రిక్షాలో ఓపక్కగా ఒదిగికూర్చుని, దోవపొడుగునా ఆలోచిస్తూనే వున్నాడు శ్రీపతి.
బావమరిది కృష్ణ జోక్ గా ఓకథ చెపుతూండేవాడు. కాబోయే మామగారు అల్లుడిగా చేసుకోబోతున్న అతన్ని అడిగాడట, "అబ్బాయ్! నీకే అలవాట్లు లేవా?" అని వెంటనే అతగాడు "అలవాట్లంటూ రోజూలేవు మామగారూ! పేకాడటానికి డబ్బులు కావలసివస్తే అప్పు చేస్తాను. పేకాటలో గెలిస్తే, హుషారుకి మద్యం ఓ చుక్క పుచ్చుకుంటాను. అదీ 'ఆ' చుక్కకూడా దొరుకుతుందని తెలిసినప్పుడే!" అన్నాడుట. అలాగే తనకి ఏ అలవాట్లూలేవు .సిగరెట్లు తాగడు. ఒకటికి రెండుసార్లు తాగటానికి ప్రయత్నిస్తే పొగ గొంతులోకి పోయి ఉక్కిరిబిక్కిరయి కంఠనాళాలు బద్దలయేటట్లు దగ్గు వచ్చింది. అంతటితో దానికి పులుస్టాప్. సుందరం బలవంతం మీద ఒక్కటంటే ఒక్క పెగ్గు పుచ్చుకున్నాడు. గొంతు మండటం తప్ప ఫలితం కనిపించలేదు. నిషాలో స్వర్గం కనిపిస్తుందని మరో నాలుగు పెగ్గులు బలవంతాన తాగించాడు సుందరం. స్వర్గం కనపడటం అటుంచి నిషా కూడా ఎక్కలేదు. ఫలితం కడుపులో వున్నదంతా బొళ్లున వాంతి రూపంలో బైటకు వచ్చింది. సిగరెట్లు, బ్రాందీ బలవంతాన తీసుకున్నా తన శరీరంపై వాటి ప్రభావం వికటంగా వుంటుంది. కాబట్టి వాటిని ముట్టలేదు .కార్డ్సు ఆడటం రాదు. దానిపై మోజులేదు. అలవాటంటూ అయింది మధ్య మధ్య సుందరం పార్టీ చేస్తూ పిలవటం, దానికి తాను హాజరయి, లతలతోను, రాణులతోను, రమణులతోను కలసి రాచక్రీడలు జరపటం.