"ఏమిటో ఆ ధైర్యం?"
"ఆత్మ విశ్వాసం-"
"దట్సాల్ _ దట్సాల్ _ నా కూతురు వీక్లింగ్ ని ప్రేమించడంలేదు సంతోషం...శ్రీకర్ నువ్వు నా అల్లుడివై వుండి ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మా ఫ్యాక్టరీలోనే మేనేజర్ కి ఎసిస్ట్ చెయ్ చాలు."
"థాంక్స్ - పరువు తక్కువకాని ఏ పనైనా సిద్ధమే."
"ఊఁ మరో మారు చెపుతున్నా విను...నీవు కానీ నీ కుటుంబీకులుగానీ ఎప్పుడూ నా డబ్బు పైసా అడక్కూడదు."
"మాటిమాటికి అలా తర్జిస్తారెందుకు? కావాలంటే అలా రాసిస్తాను."
"వెరీగుడ్ - వ్రాసివ్వు. అయితే మన షరతులు మనిద్దరి మధ్యే వుండాలి. ఎవరికీ తెలీకూడదు. ఆఖరికి జ్యోతికి క్కూడా-"
"ముఖ్యంగా జ్యోతికి అనండి" అని అక్కడే వున్న లెటర్ పేడ్ తీసుకుని చకచకా రాసి సంతకం చేశాడు.
అది చదివి తృప్తిగా అన్నారు. "నువ్వెళ్ళి మీ తల్లిదండ్రుల అంగీకారం తీసుకునిరా. ముహూర్తాలు పెట్టిస్తాను."
చప్పున ఆయన పాదాలకి నమస్కరించి "థాంక్యూ అంకుల్. జ్యోతిలాంటి జెమ్ ని నాకు కానుకగా అర్పిస్తున్నందుకు మీకు నమస్కారం" అన్నాడు.
ఆయన తేరుకునేలోగానే గదిదాటి వెళ్ళిపోయాడు.
గోవర్ధనం మనస్సు శాంతించింది. 16
"అబ్బాయెప్పుడొచ్చాడూ?"
ఇంకా నిద్రలేవకుండా వరండాలో పడుకుని నిద్రపోతున్న కొడుకుని చూసి అడిగాడు విశ్వనాధం.
"రాత్రి బాగా ప్రొద్దుపోయింది. ట్రెయిన్ రెండు గంటలు లేటట-మీరు గాడనిద్రలో వున్నారు. అందుకని తెలీలేదు."
"పరీక్షలు ఎలా రాశాడట? అయినా బాగా చేసి వుంటాడులే. ఎలా అయినా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇక ఉద్యోగం చూస్తే సరి."
నవ్వింది అన్నపూర్ణ.
"ఏం నవ్వుతున్నావు? ఉద్యోగం రాగానే కోడలు వస్తుంది. నీ బాధ్యతనుంచి రిటైరైపోతావనా?"
"అదికాదు. ప్రశ్నలూ జవాబులూ మీరే చెబుతూ వుంటే అందుకొచ్చింది నవ్వు."
అంతలో నిద్దర్లేచి వచ్చాడు శ్రీకర్.
పలకరింపులూ, ప్రాతః కృత్యాలూ అయ్యాక వంటింట్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు తండ్రీ కొడుకులు ఇద్దరూ అన్నపూర్ణ కూడా అక్కడేవుంది. "విషయం ఇప్పుడే చెప్పేస్తేసరి!" అనుకున్నాడు శ్రీకర్.
కొడుకు ముఖంలో తారట్లాడుతున్న భావాల్ని చూసి ఏమిటి బాబూ?" అని అడిగాడు.
సూటిగా తండ్రి ముఖంలోకి చూడలేక ఎదురుగా వున్న మలయప్ప స్వామివారిని చూస్తూ అన్నాడు... "నాన్నా! నేను చేసింది తప్పయితే క్షమించండి. నేనూ మా క్లాస్ మేట్ జ్యోతీ ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ అమ్మా నాన్నా అంగీకరించారు. మీరు ఊ అంటే ఆయన ముహూర్తాలు నిశ్చయిస్తారు. వాళ్ళు మనవాళ్లే!"
అన్నపూర్ణ ముఖం నమ్లామైంది. కాఫీ తొలచి తెస్తోంది. గ్లాసులు అప్రయత్నంగా చేయిజారి పోయాయి.
"ఫర్లేదులే! చెయ్యి జారిందిగా! అంతే!" అన్నాడు ఆయన మాటల్లోని వ్యంగ్యం సూటిగా శ్రీకర్ గుండెల్లో నాటింది. అయినా ఏం సమాధానం యివ్వలేదు.
జ్యోతి నాన్నగారి పేరేమిటి?"
"గోవర్ధనంగారు!"
ఉలిక్కిపడ్డాడు విశ్వనాధం. లక్షాధికారి గోవర్ధనం కూతురా!" అన్నాడు అప్రయత్నంగా.
"అవును!" ముక్తసరిగా అన్నాడు శ్రీకర్.
కొంచెంసేపు మాట్లాడలేదు ఆయన. "బాబూ! అది మన పెదవికి మించిన వాళ్ళు! వాళ్ళు యిస్తాం అనొచ్చు. నీవు అంగీకరించి వుండవచ్చు. జ్యోతి అందచందాల్లో అపూర్వ సౌందర్యవతి కావచ్చు. కానీ వాళ్ళు ఐశ్వర్యవంతులు - ధనం వుంటే మదం వుంటుంది. మదం వుంటే మనిషి మనిషి కాడు!" అన్నాడు నిదానంగా.
"నాన్నగారూ! అవన్నీ నేను ఆలోచించాను. కానీ జ్యోతికి నేను మాట ఇచ్చేశాను!"
వెంటనే ఆయన యేమీ అనలేదు, ఆలోచనలు అలలు లాగా ఉవ్వెత్తున లేచి తాడిస్తున్నాయ్ "శ్రీకర్...నువ్వు మాట యిచ్చేశానన్నావు అంతేనా? మరింకేమైనా కమిట్ మెంట్ వుందా?" మౌనంగా ప్రశ్నించారాయన.
తల వంచుకున్నాడు శ్రీకర్.
"ఇక లాభంలేదు!" అనుకున్నాడు ఆయన. జాలిగా చూశాడు అన్నపూర్ణవైపు.
"ఒరే మేమింకా బ్రతికే వున్నామని మరిచిపోయావా? అలాగయితే మళ్ళీ యిక్కడికి యెందుకు వచ్చావు? నీవు చదివి ఉద్యోగస్థుడివై మమ్మల్ని ఉద్దరిస్తావనీ, చెల్లాయికి అండగా వుంటావని నేను ఆయన ఎంతో ఆశించాం. మా ఆశలన్నీ నిరాశలు అయ్యాయికదరా!"
"అమ్మా!"
"ఆ అమ్మే ఆ బొమ్మని చూసినపుడు గుర్తుకి వచ్చి వుంటే నీవు జ్యోతికి మనసిచ్చేవాడివా? నువ్వు పెళ్ళి చేసుకునేముందు చెల్లికి పెళ్ళి కావాలనే విషయం ఆలోచించావా? ఊహూ యవ్వనమదం నిన్ను ఆలోచించి వుండనివ్వదు."
"అన్నపూర్ణా!" మందలించాడు విశ్వనాధం.
మళ్ళీ మాట్లాడలేదు ఆమె.
ఒక్కక్షణం ఆగి అడిగాడు "అయితే ఇల్లరికం వెళుతున్నావన్నమాట?"
తండ్రి ప్రశ్నవిని ఉలిక్కిపడ్డాడు శ్రీకర్. "ఇల్లరికమా!" స్పష్టంగా అడిగాడు.
"అవును. ఆయనకుంది ఒక్కతే కూతురుకదూ? ఆమెని నీకిచ్చి పెళ్ళిచేసి యీ పేద గుమాస్తా యింటికి యీ పాత పెంకుటింటికి పంపిస్తాడని ఆశించావా? అది చాలా దురాశ శ్రీకర్!"
అతని నోటమాటరాలేదు.
మళ్ళీ ఆయనే అన్నారు "పోనీలే! నువ్వయినా సుఖపడితే చాలు! శైలజ పెళ్ళిదేవుంది? ఈ ఇల్లు అమ్మేస్తే అయిపోతుంది. మా విషయమా? నాకింకా పదేళ్లు సర్వీసు వుంది. జీతం డబ్బులతో ఇప్పుడూ, రిటైర్ అయ్యాక పెన్షన్ డబ్బులతో లాగేస్తాం!"
"నన్ను క్షమించండి నాన్నగారూ!"
"ఫరవాలేదు శ్రీకర్! ఎవరి బ్రతుకు వారిది. నీ మార్గం నువ్వు చూసుకోవటంలో తప్పేంలేదు. కానయితే కనీసం నీ స్థానాన్నన్నా భద్రం చేసుకో!"
తల వంచుకున్నాడు శ్రీకర్.
"ఇల్లరికపుటల్లుడు అందరికీ లోకువే! అయ్యగారీ అల్లుడూ, అమ్మాయిగారి మొగుడూ మిగిలిపోతావ్ నువ్వు. వారి అదుపాజ్ఞల్లో, ఆచార వ్యవహారాల్లో మెలగాలి నువ్వు. బిడ్డని అత్తింటికి పంపినా, కొడుకుని ఇల్లరికం పంపినా ఒకటే. అందుకే ముందు జాగ్రత్తలు చెపుతున్నాను."
కలిగినవాళ్ళ లోగిలి అంటే జైలుతో సమానం.
మామగారి క్రింద బ్రతుకుతుంటే బానిసత్వమే!