Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 16

    వాళ్ళెవరినీ పలకరించకుండా బాత్రూంలోకి వెళ్ళి స్నానంచేసి, డ్రస్ చేంజ్ చేసుకుని హాల్లోకి వచ్చాడు.
   
    అప్పటి వరకు ఎంతో సహనంగా వున్న తల్లిదండ్రులు ఇకపై వుండలేకపోయారు.
   
    "ఎక్కడనుంచి వస్తున్నావ్?" తండ్రి సూర్యప్రకాశరావు అడిగాడు. సమాధానం చెప్పకుండా మౌనంగా వుండిపోయాడు మనోహర్.
   
    "సమాధానం చెప్పవేం...." వచ్చిందాఫీస్ నుంచేనా?" ఈసారి సూర్య ప్రకాశరావు కంఠంలో ఒకింత అసహనం చోటుచేసుకుంది.
   
    అయినా మనోహర్ మాట్లాడలేదు.
   
    "సమాధానం ఏమని చెబుతాడు....? తన దగ్గరుంటే కదా సమాధానం....? మా డబ్బులతో కావలసినంత చదువుకుని గట్టెక్కిపోయాడు. మంచి ఉద్యోగం దొరికింది. ఎప్పుడైతే డబ్బు రుచి మరిగాడో, ఆలోచనలకి పదునుపెట్టి, కొన్నివందల కోట్లకు వారసులైన మాయాదేవికి మస్కాకొట్టాడు. పాపం పిచ్చిది వీడి వల్లో పడిపోయింది.
   
    మేమెక్కడ మా అమ్మాయి విషయం గురించి అడుగుతామేమోనని, ఆ అమ్మాయీ, వీడూ కూడ బలుక్కుని ఈ రివర్స్ కేస్ పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లేదంటే, ఈ విడ్డూరాన్ని ఎక్కడయినా చూశామా?"
   
    ఆడపిల్లల్ని మగవాళ్ళు రేప్ చేయడం విన్నాఁ__చూసినోళ్ళు వున్నారు. పేపర్స్, టీవీల్లో, చూస్తూనే వున్నాం. ఈ రివర్స్ కేస్ ఏమిటి? మగ పిల్లాన్ని ఆడపిల్ల రేప్ చేయడం ఏంటీ....? పెడ బుద్దులు, పోయేకాలం కాకపోతే...." విరుచుకుపడింది విశాలాక్షి.
   
    అయినా మనోహర్ నోరు విప్పలేదు.
   
    "నువ్వు కొంచెం ఆగుతావా?" కుటుంబరావు చిరాకుగా భార్యవేపు చూస్తూ అన్నాడు.
   
    "ఏమిటాగేది....? ఇంతకాలం ఇలాగే ఆపుకుంటూ వచ్చారు. ఇంకెంత కాలం ఆపుతారు....? ఒక్కగానొక్క కూతుర్ని ఏం చేస్తారు....? నేనానాడే చెప్పాను - పిల్లను బాగా చదివించుకుని ఉన్నదేదో ఇచ్చి, పిల్లకి పెళ్ళి చేద్దామని.....విన్నారా? ఉన్నదంతా ఊడ్చేసి వీడికి పెట్టారు.....ఇప్పుడు వీడేమో సిగ్గూ ఎగ్గూలేని పని చేసి, విశ్వాస ఘాతకుడైంది గాక, అంతకంటే దరిద్రంగా 'నన్నొక ఆడపిల్ల రేప్ చేసిందంటూ' కోర్టుకెళ్ళాడు.....ఏమిటి సాధిస్తాడు కోర్టుద్వారా, మన పిల్లను మోసం చేయటానికి కాకపోతే..." ఏడుస్తూ కళ్ళు, ముక్కు, పైటతో తుడుచుకుంటూ దీర్ఘాలు తీసింది విశాలాక్షి.
   
    "చెప్పు....మీ మేనత్తకు సమాధానం చెప్పు?" కోపంగా కొడుకువైపు చూస్తూ అన్నాడు సూర్యప్రకాశరావు.
   
    "నాకు నిజంగా సరోజకి అన్యాయం చేయాలని లేదు...ఆ ఉద్దేశమే వుంటే, ఈ ఎండల్లో ముహూర్తం పెట్టమని మీరడగ్గానే ఎందుకు ఒప్పుకుంటాను?" నెమ్మదిగా అన్నాడు మనోహర్.
   
    "తప్పించుకోవటానికి అదో ఎత్తు....!" మెటికలు విరుస్తూ అంది విశాలాక్షి.
   
    "వాడు చెబుతున్నాడు కదా-నువ్వు కొంచెం ఆగితే ఏం పోయింది?" అసహనంగా అన్నాడు కుటుంబరావు.
   
    "సరోజను మనఃస్పూర్తిగా పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. ఇది ముమ్మాటికీ నిజం.....! కానీ ఈలోపు ఇలా జరిగింది!"
   
    "అలా జరిగిందే అనుకో....అది మీ ఇద్దరికేకదా తెలుసు. ఆ మాయాదేవి ఎలాగూ బైటికి చెప్పదు....ఆడపిల్ల కనుక....నువ్వుకూడా జరిగింది మర్చిపోయి, సరోజను పెళ్ళి చేసుకుంటే పోయేది కదా....? రోడ్డు మీద పడబోయిన మన కుటుంబాన్ని కాపాడటమే గాక, నీకు చదువు సంధ్యలు చెప్పించి ఇంతవాడ్ని చేసినందుకు ఇలా చేయొచ్చా....?" తండ్రి సూర్యప్రకాశరావు నిలదీస్తున్నట్లుగా అడిగాడు.
   
    "తప్పు ఆడవాళ్ళు చేసినా, మగవాళ్ళు చేసినా తప్పు తప్పే.....పెద్ద వాళ్ళు చేసినా, చిన్నవాళ్ళు చేసినా తప్పు తప్పే.....తప్పుకి లింగభేదం లేదు!" నసుగుతూ అన్నాడు మనోహర్.
   
    "ఈ దేశంలో, ప్రస్తుత వ్యవస్థలో చిన్నవాళ్ళు చేసిందే తప్పు.....పెద్దవాళ్ళు చేసింది తప్పు కిందకు రాదు.....
   
    నువ్వో, నేనో ఓ బ్యాంకులో పదివేలు అప్పుచేస్తే, అది టైంకి వడ్డీతో సహా కట్టకపోతే అది తప్పు. అదే ఏ మంత్రో, ఎం.పీ.నో, ఎం.ఎల్.ఏ నో పెద్ద పారిశ్రామికవేత్తో ఎగ్గొడితే అది తప్పుకిందకి రావడం లేదు. అలా తప్పు కిందకి వచ్చుంటే ఈ దేశంలో వున్న ఎనభైశాతం మంది రాజకీయ నాయకులు ఈపాటికే జైల్లో వుండేవాళ్ళు నామినేటెడ్ బ్యాంకు డైరెక్టర్లు, చైర్మన్లు, కోట్లకు కోట్లు తమకు కావలసిన వాళ్లకు లోన్లు ఇచ్చి సరైన టైంలో వసూలు చేయకపోయినా, అమలులో వున్న చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అవి నష్టాల్లో నడుస్తుంటే, సిబ్బంది బాగా పనిచేయడం లేదని కింద వాళ్లమీదకి, చిన్నవాళ్ళమీదకి నెట్టేస్తున్నారు. చిన్నవాళ్ళు గవర్నమెంట్ స్థలంలో, గుడిసెలు వేసుకుంటే బుల్డోజర్లతో వచ్చి కొట్టేస్తారు.
   
    అదే పెద్దవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో మేడలు, మిద్దెలు, ఫ్యాక్టరీలు, ఫాం హౌస్ లు కట్టుకుంటే ఆ స్థలం రేటు గవర్నమెంట్ కిచ్చేస్తే చాలు. తప్పు ఒప్పయిపోతుందని నిరూపణ కావటం లేదా?
   
    చట్టం ముందు అందరూ సమానమే అనే నినాదం ఎప్పుడో అటకెక్కింది. ఈరోజు నువ్వేదో 'తప్పు వాళ్ళు చేసినా ఒకటే, వీళ్ళు చేసినా ఒకటే, అని నీతి బోధించక్కర్లేదు ఈ సమాజానికి.
   
    చట్టాలు చేసేది వాళ్ళను వాళ్ళు రక్షించుకోవటానికి, వాళ్ళవాళ్ళను కాపాడుకోవటానికి. అంతే తప్ప, ఆ చట్టాలు మనల్ని కాపాడటానికి వస్తున్న చుట్టాలేమీ కాదు.
   
    వందల కోట్లు ఖరీదుచేసే గడ్డి తిన్నా, వందల కోట్లు పెట్టి పెళ్ళి చేసినా, కావలసిన వాళ్ళకి కాంట్రాక్టులిచ్చి వేల కోట్లు తిన్నా, ముఖ్యమంత్రులు మన ఎదుట తిరుగుతున్నా, ఇప్పుడున్న చట్టాలు ఏం చేయగలుగుతున్నాయి?

 Previous Page Next Page