Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 17

    కేసులు కోర్టుల్లో పడి మూలగడం తప్ప- కింద కోర్టునుంచి పై కోర్టులకీ, అక్కడినుంచి స్పెషల్ కోర్టులకీ బదిలీ కావటం తప్ప! ఎవరికయినా శిక్షలు పడుతున్నాయా?
   
    అలాంటివాళ్ళు ఈ దేశంలో చాలామంది వున్నారు.  వాళ్ళిప్పుడు యధేచ్చగా కూడా తిరుగుతున్నారు. పదవులు అనుభవిస్తున్నారు.
   
    భారతీయ శిక్షాస్మృతి ఏమైనా చేయగలిగిందా?
   
    ఓరి పిచ్చివాడా.....సమాజగతి ఎప్పుడో దారితప్పిందిరా.
   
    విలువలు పారదర్శక పలువల్లా మారిపోయాయిరా. ఈ సమాజం మొద్దుబారిపోయింది. అంకుశాలిపుడు పనిచేయడంలేదు.
   
    ఇక్కడ మనిషి ఇతరులకోసం పనిచేయటం ఎప్పుడో మానేశాడు.
   
    ఇంకిప్పుడు 'తప్పు ఆడవాళ్ళు చేసినా, మగవాళ్ళు చేసినా ఒకటే!" అనే నినాదం నెత్తికెత్తుకున్న నిన్ను చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో అర్ధంకావటంలేదు.
   
    ఆ సున్నితత్వాన్ని వదులుకో! లేదంటే అంటరానివాడివై పోతావ్. నా మాట విని కేసు విత్ డ్రా చేసుకుని, కేసు విషయం పదిమందికి తెలిసేలోపే దాన్ని సమాధిచేసి, సరోజని పెళ్ళిచేసుకుని సుఖంగా సంసారం చేసుకో!" కఠినంగా అన్నాడు తండ్రి సూర్యప్రకాశరావు.
   
    "అసలైనా 'నన్ను ఓ ఆడపిల్ల రేప్ చేసిందోచ్' అనే మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. సిగ్గులేదయ్యా, అలాంటి కేసు పట్టుకొని కోర్టుకెళ్ళటానికి? ఈ రోజుల్లో రేప్ నకు గురైన ఆడవాళ్లే పరువుప్రతిష్టలకు భయపడి కోర్టుల కెక్కడంలేదు. అయినా మగవాడికి శీలం పోవటమేమిటి? మగవాడు ఎంతమందితో తిరిగినా మగాడు అని మెచ్చుకుంటారే తప్ప, తప్పు పట్టరు. స్త్రీలు చేసే తప్పునే తప్పుకింద జమకడతారు. మధ్యతరగతి, ఇంకా ఆ కింద తరగతి వాళ్ళు చేసిన తప్పుని తప్పుగా నిర్ధారిస్తారు. ఈ రెండు కోవల్లోకి రానివాళ్ళు, తప్పుచేసినా ఒప్పుగా చూడటమే ఇక్కడ నీతి!
   
    ఇప్పుడు చెలామణి అవుతున్న ఈ నీతిని మార్చే ప్రయత్నంచేస్తే చేసినవాళ్ళే మట్టికొట్టుకుపోతారు.

    పెళ్ళికిముందు కామకలాపాల్లో పాల్గొనని మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది వుంటారంటావ్? ఉంటే ఒక శాతం వుండవచ్చు. ఆ ఒక్క శాతం వాళ్ళయినా ధైర్యం లేక ఆడపిల్లలను ఆకర్షించే తెలివితేటలు లేక మిగిలిపోతున్నారు.
   
    మగవాడు ఏం చేసినా, ఎన్ని చేసినా, రేప్ లు చేసినా వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకుండా పోవటంలేదు. దయచేసి నా మాట విను. నీలో ఉన్న సున్నితత్వాన్ని మేము అర్ధం చేసుకోగలం ఈ సమాజానికి ఆ ఓపికలేదు. ఇప్పుడు నా కూతురికి పెళ్ళి చేయగలిగే శక్తి నాకు లేదు. నన్నూ, నా బిడ్డనూ గట్టెక్కించు. నువ్వు ఊ....అంటే.....నేనే నీ లాయర్ దగ్గరకెళ్ళి కేస్ విత్ డ్రా చేయమని చెబుతాను" అర్ధిస్తున్న ధోరణిలో అన్నాడు కుటుంబరావు.
   
    దానికేం సమాధానం చెప్పకుండా మౌనంగా తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు మనోహర్.
   
    అతని చర్యకు అక్కడున్న అందరూ విస్తుపోయి అలా చూస్తుండి పోయారు.
   
       
                                        *    *    *    *
   
    రాత్రి పదకొండు గంటలు అవుతోంది.
   
    గుడ్ మార్నింగ్ పత్రికాఫీసులో....ఆ పత్రిక ఎడిటర్ కు, క్రైం రిపోర్టర్ కు మధ్య సంభాషణ నడుస్తోంది.
   
    "ఇంతకీ ఏమై వుంటుందా కేసు?" ఆసక్తిగా అడిగాడు ఎడిటర్.
   
    "అదే అర్ధం కావటంలేదు సార్! మొత్తానికి అదేదో విచిత్రమైన కేసు. లేదంటే స్పెషల్ కోర్టు ఏర్పాటుచేయాలా? ఒకవేళ చేసినా అంత సెక్యూరిటీ మోహరించరు" అన్నాడు క్రైం రిపోర్టర్.
   
    "ఏది ఏమయినా ఆ కేసు గురించి మొదటి వార్త మనమే మన పేపర్లో వేయాలి.
   
    ఒకవేళ మనోహర్ మాయాదేవిని సెడ్యూస్ కేసు ఎందుకవుతుంది సార్? అలాంటి కేసులు ఇంతకుముందు ఎన్ని రాలేదు కోర్టుకి?"
   
    "మనోహర్ మిస్ మాయాదేవిని మానభంగం చేశాడేమో?"
   
    "అయినా కూడా అది స్పెషల్ కేసు ఎందుకవుతుంది? ఇన్ కెమేరా కేసు అవుతుంది. దాన్ని మామూలు కోర్టులోనే పరిష్కరిస్తారు, స్పెషల్ కోర్టునెందుకు అపాయింట్ చేస్తారు?
   
    పైగా ఒక స్త్రీ న్యాయమూర్తి కూడా బెంచ్ లో వున్నారు. దీనినిబట్టి స్త్రీపరమైన సమస్య లేమన్నా కేసులో ఇన్ వాల్వ్ అయి వుండవచ్చు.
   
    ఏది ఏమయినా రేపు మిస్ మాయాదేవి ఆఫీసుకెళ్ళి కూపీ లాగుతాను. మీ కోరిక నెరవేరుస్తాను. వస్తాను సర్" అంటూ అతను ఎడిటర్ కు నమస్కరించి వెళ్ళిపోయాడు.
   
    సర్క్యులేషన్ ఎలాగోలా పెంచుకోవాలనుకుంటున్న ఆ ఎడిటర్ ఆలోచనల్లోకి జారుకున్నాడు.
   
                                                                  *    *    *    *
   
    అప్పుడు సరిగ్గా తెల్లవారుజాము రెండు గంటలు అవుతోంది.
   
    బెడ్ మీద సంపెంగ పువ్వులా ముడుచుకుని పడుకున్న మాయాదేవికి ఎంతకీ నిద్రరావటంలేదు.
   
    ఆలోచనలు....
   
    ఆలోచనలు....
   
    ఆలోచనలు.....
   
    అవి ఎంతకీ తెగటంలేదు.
   
    తన తండ్రికి తెలిసేలోపు, ఆయన ఇక్కడికి వచ్చేలోపు ఎలాగోలా మనోహర్ ని తన దారికి తెచ్చుకోవాలి. అయినా మగవాళ్ళల్లో ఇంత సెన్సిటివ్ గా ఫీలయ్యేవాళ్ళుంటారా? చాలా ఆశ్చర్యం....ఉన్నారనే మనోహర్ నిరూపిస్తున్నాడు.
   
    ఆలోచనలతో నిద్రపట్టక బెడ్ మీంచి లేచి బాల్కనీలోకి వచ్చి, అటూ-ఇటూ పచార్లు చేయసాగింది.
   
    సరిగ్గా అప్పుడే ఔట్ హౌస్ లో వుంటున్న మంగమ్మ బాత్రూంకి వెళ్ళేందుకు లేచి, ఫస్ట్ఫ్లోర్ బెడ్ రూం బాల్కనీలో లీలగా కదులుతున్న ఆకారాన్ని చూసి వడివడిగా బంగళాలోకి ప్రవేశించింది.

 Previous Page Next Page