"ఆ చూపులేమిటే తల్లీ....నన్ను కూడా రెప చేసేద్దామనుకుంటున్నావా? అంత పని చేయకు. ఆంధ్రదేశం అల్లకల్లోలం అయిపోయింది" నవ్వుతూ అంది ప్రియ.
"నేను ఇప్పుడు బాధపడటంలేదు. తరువాత కూడా బాధపడను." స్థిరంగా అంది మాయ.
"నిన్నటిని నువ్వేమీ చేయలేవు. రేపటిని ఏదో ఒకటి చేసే అదృశ్యహస్తాన్ని భగవంతుడు మనిషికి ఇవ్వలేదు, నీ చేతిలో వున్నది నేడు ఒక్కటే. ఆ ఒక్కదాన్ని నీ ధోరణిలో నువ్వు ఆలోచిస్తూ కూర్చుని, రేపటికి ఈ రోజుని నిన్నటిని చేసేస్తే ఫలితం దారుణంగా వుంటుంది. గడచిన నిన్నటి కాలాన్ని కొలిచే అత్యుత్తమ సాంకేతిక పరికరాన్ని ఏ శాస్త్రజ్ఞుడు ఇంతవరకు కనిపెట్టలేదు. నా మాటవిని అతనితో రాజీకొచ్చేయ్."
"కేసు పెట్టింది అతను. నేనెలా రాజీకి రాగలను.....?"
"డబ్బు, ఆస్తులు, కార్లు. బంగళాలు, ఫారమ్ హౌస్ లు, షేర్లు. ఏదో ఒకటి చేసి, రాజీకొచ్చేలా చూసుకోకూడదూ?" అమాయకంగా కనురెప్పల్ని ఆర్పుతూ అంది ప్రియ.
"నువ్వు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తావు. మరికొన్నిసార్లు తెలివితక్కువతో, తెలివితక్కువ సలహాలిస్తావు."
"అతనికి డబ్బుమీద ఆశేవుంటే, ఏదో ఒకటి నేనివ్వటమేమిటే? నన్ను పెళ్ళి చేసుకుంటే అవన్నీ అతనికే చెందుతాయి కదా...." అసహనంగా అంది మాయాదేవి.
'అవునా!' అని పైకే అనబోయి ఆగిపోయింది ప్రియ.
ఆ మాట వినపడితే మిస్ మాయాదేవి మీదపడి రక్కేయటం ఖాయం కనుక అవునా! అని లోలోపలే అనుకుని, తన తెలివి తక్కువతనానికి తనే సిగ్గుపడుతూ నాలుక కరుచుకుంది ప్రియ.
ఇద్దరి మధ్యా కొద్దిసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది.
"ప్రపంచంలో ఏ మగాడయినా ఆస్తిని, అంతస్తునీ, అందమైన స్త్రీని కావాలని కోరుకుంటాడు. వీటన్నింటికి మించి అద్భుతమైన వ్యక్తిగతమున్న నిన్ను, తనని ఎంతగానో ప్రేమిస్తున్న నిన్ను వద్దనుకుంటున్నాడంటే-దాన్నెలా అర్ధం చేసుకోవాలో నాకర్ధమై చావట్లేదు. ఎవ్వరూ నిన్ను అర్ధం చేసుకోరేమో బాబూ...." తల పట్టుకుని నిట్టూరుస్తూ అంది ప్రియ.
"ఎంతసేపూ నన్నర్ధం చేసుకోరేమో బాబూ.....అని దీర్ఘం తీసుకునే ప్రయత్నం చేశావా? ముందు నువ్వు ఇతరుల్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే-వాళ్ళు నిన్నర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో-ఈ ఇంటికి ఆ ఇల్లూ అంతే దూరం...."
"అది కాదే...." మళ్ళీ దీర్ఘం తీస్తూ అంది ప్రియ.
"ఇకాపు....అన్నీ సవ్యంగానే జరుగుతాయి...." అంది మిస్ మాయాదేవి నిద్రలేమితో కనురెప్పల్ని మృదువుగా రుద్దుకుంటూ.
"నేనతడ్ని రేపు ఒకసారి చూడాలి....చూపిస్తావా?"
"అదేం అభ్యంతరం.....కాకపోతే కాకెంగిలి చేస్తావేమో నని భయం!" నవ్వును బిగబట్టుకుంటూ అంది మాయాదేవి.
"అదేమిటే.....కాకెంగిలేమిటీ?"
"అంటే.....లేపుకెళ్ళిపోతావని....."
"అవునా....! లేపుకెళ్ళిపోతాననా? ఎందుకే....?" అని ప్రియ ఆలోచనలో పడిపోయింది. ప్రియ అమాయకమయిన మోమునిచూస్తూ నవ్వు ఆపుకోలేకపోయింది మిస్ మాయాదేవి.
ప్రియంటే మాయాదేవికి ఎంతో యిష్టం.....
ప్రియని ఆట పట్టించమంటే ఇంకెంతో ఇష్టం.....
తనన్న దాన్ని ప్రియ అర్ధం చేసుకుంటే, చేతికందిన వస్తువు పట్టుకుని తన వెనక పడటం ఖాయం అని, అర్ధం చేసుకున్న మిస్ మాయాదేవి తన బెడ్ రూమ్ లో కెళ్ళి తలుపులేసుకుంది.
ప్రియ బెడ్ రూం దగ్గరికెళ్ళి విండోలోంచి లోపలికి చూస్తూ-
"నువ్వన్నదేంటే....నాకేమీ అర్ధంకాలేదూ!" అంది ప్రియ చూపుడువేలుతో బుగ్గను నొక్కుకుంటూ.
"ఫర్వాలేదులే....రేపటికి అర్ధం అవుతుంది. కొంత మందికి కొన్ని వెంటనే అర్ధంకావు.....అలాని నువ్వేమీ వర్రీకాకు. టెన్షనేమీ పెట్టుకోకు. ఈ ప్రపంచంలో నీకర్ధం కానివి చాలా వున్నాయి. అంతమాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. అర్ధమైతే మాత్రం నీ మొగుడ్నేమీ చేయకు. పాపం అన్యాయంగా, అన్యాయమైపోతాడు. పైగా నీకున్న దొక్కడే మొగుడు, వున్న మొగుడు పారిపోతే, మరో మొగుడ్ని తెచ్చుకునే తెలివి తేటలు నీకు లేవు. బై.....మై డార్లింగ్....గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్...." అంటూ బెడ్ రూమ్ లో లైటు ఆపుచేసింది మిస్ మాయాదేవి.
"ఏమిటో....ఎవ్వరూ నన్నర్ధం చేసుకోరూ...." స్వగతంలో అనుకుంటూ బైటికి నడిచింది ప్రియ. సరిగ్గా అప్పుడే పని మనిషి పాలగ్లాసుతో ప్రియకు ఎదురైంది.
"కాకి ఎంగిలి....లేపుకెళ్ళడం.....అంటే ఏమిటో నీకు తెలుసా మంగమ్మా?" దీర్ఘం తీస్తూ అమాయకంగా అడిగింది ప్రియ. ఆ వెంటనే మంగమ్మకి అంతా అర్ధమైపోయింది.
"నాకు తెలియదు కానీ, తెలుసుకోవాలనే ఆత్రంతో మరెవర్నీ అడక్కండీ!"
"అడిగితే ఏమవుతుంది?"
"కొంప కొల్లేరయిపోతుంది...."
"కొంప కొల్లేరై పోవడమేంటీ.....?" తిరిగి అమాయకంగా అడిగింది ప్రియ. ఆ మాటలతో నిజంగానే బిక్కమొగ మేసిన మంగమ్మకి ఉన్న ఫళాన తలని గోడకేసి కొట్టుకోవాలనిపించింది. అది చెయ్యలేక వెర్రి చూపులు చూసింది.
"ఏమిటో.....నన్నెవరూ అర్ధంచేసుకోరూ.....నాకెవరూ అర్ధంకారూ! ఇదంతా ఏమిటో...." తనలో తాను గొణుక్కుంటూ వెళ్ళిపోయింది ప్రియ.
బైటికెళుతున్న ప్రియను చూసి- 'శుభలగ్నంలో ఆమని క్యారెక్టరు, ఆ సినిమాకి డైలాగులు రాసిన మహానుభావుడికి దండం పెట్టాలి. ఇట్టాంటోళ్ళని చూసే అట్టాంటోళ్ళు రాస్తారేమో....' స్వగతంలో అనుకుంటూ, నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయింది మంగమ్మ.
రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్నాడు మనోహర్. అప్పటివరకు ఆ ఇంట్లో ఉన్న ఆరుగురిలో ఏ ఒక్కరూ భోంచేయకపోగా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. మోటార్ సైకిల్ పార్క్ చేసి, లోపలికి వచ్చిన మనోహర్ కి విషయం అర్ధమయిపోయింది.