వాణి వారిస్థితిని చూచి ఒక్క క్షణం నవ్వుకుంది.
"నేనెప్పుడయినా ఈ గది తలుపులు తీస్తే మీరెవ్వరు ఈ గది ఛాయల కనిపించకూడదు తెలిసిందా?" అన్నదామె వారు తలలు ఊగించి భయంగా తప్పుకుపోయారు.
వాణికి తిరిగి జీవితం మీద ఆశలు చిగురించినాయి బిడ్డకు, భర్తకు దూరంగా కఠినమైన వ్రతంలాంటి జీవితంలోకి వచ్చింది తాను. అలా రావటం నించి తాను సాధించగలిగింది కొంతయినా ఉండగలదని అనిపించిందామెకు.
ప్రధమంగా కళింగనాగు ఇంకా తన పూజామందిరంలో ఉండటం అత్యంత ఆశాపూర్ణమయిన సంకేతంలా అనిపించిందామెకు. యోగికి మనసులో నమోవాకాలర్పించుకుంది.
రెండుమూడు రోజులు భయం భయంగానే గడిచిపోయినాయి. వాణి ఇల్లు వదలి ఎక్కడికీ వెళ్ళలేదు. కేశవరావుగారు ఆమె కదలికలన్నింటినీ పనివారి ద్వారా తెల్సుకుంటున్నారు. పూజామందిరంలో జరిగిన సంఘటన కూడా వారికి తెలిసింది. వాణి పూజామందిరం తాలుకు చెవిని తిరిగి వారికి పంపలేదు.
అది ఆధారంగానూ, స్వప్న ఇంటిలో జరిగిన సంఘటన ఆధారంగానూ ఆమె తిరిగి ఈవరకటిలాగే పాముల గొడవలో చిక్కిపోయిందని ఊహించారాయన. అటువంటి స్థితి కాబట్టే వాణి భర్తనూ, బిడ్డనూ వదలి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోందని వారికి అర్ధమైంది. శ్రీశైలం వెళ్ళిన తరుణంలో వాణి అంతర్ధానమైన సందర్భం వారికి గుర్తు వచ్చింది.
అప్పుడామెను అన్వేషించేందుకై మన్నూ మిన్నూ కలిపేసే లాంటి బృహత్తరమైన ప్రయత్నం చేశారాయన. ఆ ప్రయత్నాలలో ఉండగా వారికి వాణి వెళ్ళిన గ్రామం గురించిన సంగతులు కొన్ని తెలిశాయి.
ఆ గ్రామంలో ఉన్న పాముల మల్లిగాడి గురించి కూడా విన్నారాయన. శ్రీశైల శిఖరంమీద వృద్ద మల్లిఖార్జునస్వామి దయగల దైవం.
ఆయన అంశతో జన్మించాడని పాముల మల్లిగాడికి పేరు. వారి మనఃపటలం మీద పాముల మల్లిగాడు ప్రత్యక్షమయినాడు.
ఆయన వెంటనే తన అక్కౌంట్ వ్యవహారాలు చూచే ఒక యువకుణ్ణి కారు ఇచ్చి పంపేశారు.
"సరిగ్గా రెండురోజులు సమయం ఇస్తున్నాను. నీవు కారుతోపాటుగా కావలసినంత డబ్బు తీసుకుని వెళ్ళు. పాముల మల్లిగాడు లేకుండా మాత్రం తిరిగి రాకు. అవసరమైతే మరికొందరు మనుషుల్ని కూడా వెంట పెట్టుకు వెళ్ళు" అన్నారాయన.
ఆ యువకుడు కారు తీసుకుని వెళ్లాడు. పాముల మల్లిగాడి కోసం వల విసిరి పట్టుకున్నాడు. కేశవరావుగారిచ్చిన గడువులోగా తీసుకువచ్చి అప్పగించాడు మల్లిగాడి తీరే వేరు!
అతనికి నలభై సంవత్సరాలుంటాయి అనిపించింది వారికి. చూపులు పాము చూపులు. తల ఎత్తాడంటే పాముపడగ ఎత్తినట్టే అనిపిస్తుంది. చుట్ట చివర కొరికి తుప్పుమని ఉమిశాడంటే నిశ్వాసాలు నిశ్శబ్దంగా జరగవు. పాము బుసను అనుకరించి నడుస్తాయి.
కాళ్ళకు కడియాలు, మెడలోకంటే, ముక్కుకు పోగు చెవి తమ్మలకు బరువయిన ఎర్ర రాళ్ళ రింగులు! చాలా నిర్లక్ష్యంగా వదలివేసిన గిరజాలు. అన్నీ కలిపితే అతని రూపం చెంచు నాయకుల ఆకృతిని పోలి ఉంది.
"ఆ గోచిపాత ఎందుకు ఖర్మ! మంచి బట్టలిస్తారు. కట్టుకో. తలకు నూనె దట్టించుకో" అన్నారు కేశవరావుగారు అతని ఆకృతి విశేషాన్ని చూచి చిరాకు పడిపోతూ!
"ఈ నాగరీకం సవరింపులు నాకు చేతకావు, దొరా! ఆడకూన ఆదిశేషుడి దృష్టి తగిలింది. ఆపదలో ఉన్నదంటే ఆదుకుందామని వచ్చాను. ముసలి మల్లయ్య ఆజ్ఞముందు తప్ప ఎవరి ముందూ తలవంచడీ మల్లిగాడు" అంటూ బదులు చెప్పాడు అతడు వృద్ద మల్లిఖార్జునున్ని మనసులో స్మరించి.
"నిన్ను పిలిచిన కారణం తెలుసా?" అని అడిగారు కేశవరావుగారు. మల్లిగాడు అవునని తల ఊగించాడు.
"నీకు డబ్బేమైనా కావలిస్తే అడిగి తీసుకో! కాని అనుక్షణం వాణికి కనిపెట్టి ఉండాలి. ఏ క్షణంలో ఏ పొరబాటు జరిగినా నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ చావులన్నింటికీ నువ్వే బాధ్యుడవు అవుతావు" అని హెచ్చరించినారు కేశవరావుగారు. మల్లిగాడు నవ్వాడు.
"దొరా! శివుడాజ్ఞ లేనిదే చేమయినా కుట్టదు. సర్చాలంటే ఆభరణాలే కదా, దొరా! ఆ శివుడు జన్మ ఇచ్చిన బిడ్డను నేను. నన్ను కాదని ఏ పురుగూ వాణి దొరసానమ్మను అంటుకోలేదు. కావాలంటే చూడు" అంటూ జోలెలోంచి ఒక భయంకర సర్పాన్ని బయటకు తీశాడు పాములమల్లిగాడు.
దాని నోరు విచ్చుకునేలా మేడమీద నొక్కిపట్టాడు. అది భయంకరంగా నోరు తెరిచింది. ధవళ దంతాలు వంకీల్లా కనిపించాయి.
నాలుక చీలికలను వెలికి చూపుతూంది అది. దాన్ని చుట్టూ తిప్పి మెడలో వేసుకున్నాడతడు. ఆ నాగు మెడ చుట్టుకుని పడగ విప్పింది.
అతడు ఫణిభూషణాలను ధరించిన మహాదేవుని తలపిస్తూ అలా నిలబడ్డాడు. నాగుపడగను తన పెదవులకు ఆనించుకున్నాడు. దాని నోటిలో వేలు దూర్చాడు. ఎన్ని చేసినా నాగు అతడిని కాటు వెయ్యాలని ప్రయత్నించలేదు సరికదా, బుస్సుమని కూడా అనలేదు. అంతటితో కేశవరావుగారికి ఒళ్లంతా త్రుల్లింతలయిపోయింది. శరీరంలోని ప్రతి అణువు జలదరించింది. అతడు శాపగ్రస్తుడయి భూమిమీద పుట్టిన శివగణాధ్యక్షుడే అనిపించాడు.
అటువంటివాడు తన వాణిని రక్షించగలడన్న విశ్వాసం ఏర్పడింది వారికి! వెంటనే వ్రేలికి తొడిగి ఉన్న వజ్రపు రింగును తీసి అతడికి అందించారు.
"దీని విలువ ఇరవైవేలు పైమాటగా ఉంటుంది. ఉంచుకో" అన్నారాయన మనఃపూర్వకంగా. పాముల మల్లిగాడు ఆ మాటలు విని చిత్కారం చేశాడు.
"చీ! చీ! మీ నాగరీకుల బుద్ధులు డబ్బు చుట్టూ దాసోహమంటాయి. కాని డబ్బు పాపిష్టిది, దొరా! కడుపునిండా అన్నం పెట్టించు. చాలు" అన్నాడు పాముల మల్లిగాడు. అతని మనోనిశ్చయం ముందు తల దించుకున్నారు కేశవరావుగారు. ఎందరో వ్యాపారుల్ని, అధికారుల్ని శాసించగల వారి శక్తి అతని చీత్కారాన్ని భరించింది. పుత్రికా వాత్సల్యంతో ఎంత భయంకరంగా, జుగుప్సాకరంగా ఉన్నా పాముల మల్లిగాడి ప్రవర్తనను ఆయన మన్నించారు.
"సరే! నీ పని చూసుకో!" అంటూ అక్కడ నించి నిష్క్రమించారాయన. ఇంటిలోని పనివారంతా ప్రోగుపడిపోయి ఈ దృశ్యాలను చూచినారు. పాముల మల్లిగాడంటే వారికి బేజారు అవుతోంది. అతడు వాణిని కలుసుకునేందుకు మెట్లమీదుగా పైకి బయలుదేరాడు. పనివారంతా భయం భయంగా తొలగి ధారి ఇచ్చారు.
ఆ సమయానికి వాణి ఇంటిలో లేదు. ప్రొఫెసర్ కృష్ణస్వామిని చూచేందుకు వెళ్లిందామె. దర్జాగా లోనికి వెళ్ళి కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు పాముల మల్లిగాడు. వాణి కోసం ఎదురు చూడసాగాడు!