Previous Page Next Page 
శ్వేతనాగు - 2 పేజి 15

    ఒక మాతృమూర్తిని అంత కఠినంగా మాట్లాడించిన ఆ కర్తవ్యమనేది ఎలాంటిదా అని ఆలోచించటం ప్రారంభించారు కేశవరావుగారు.
    వాణి తండ్రి ఇంటిలో యధావిధిగా తను ఉన్నప్పటి గదిలోకి వెళ్ళిపోయింది. ఇటీవల ఆమె ఆ గదిలోకి వెళ్ళి చాలా కాలమైంది.
    తండ్రి తన పట్ల ఎంత శ్రద్ధ చూపుతారో. అనుక్షణం తనను జ్ఞాపకం చేసుకుంటారో ఆ గదిని చూచి నిర్ణయించుకుంది  వాణి.
    తలుపు దగ్గరగా వేసి ఆ మెత్తని పక్కమీద అలవోకగా వాలిపోయింది. మనసులోని అశాంతినించి రవంత విముక్తి పొందాలని ప్రయత్నించింది.
    ఎర్రని లేత తమలపాకుల్లాంటి మెత్తని పాదాలతో ఇంతకాలం గుండెమీద, ముఖంమీద తన్నిన బాబు ఇప్పుడు జ్ఞాపకాల రూపంలో అంతర్లోకాన్ని తంతున్నాడు.
    ఆ బాధను మరచేందుకు దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది వాణి. కళ్ళు మండుతున్న గోళాల్లా ఎర్రపడి ఉబ్బినాయి. దుఃఖ భారం రవంత దిగిపోయింది. పని పిల్లాడిని పిలిచింది వాణి.
       "ఒరే కళ్ళు మండుతున్నాయి. పచ్చకర్పూరం ఉండాలి. ఎక్కడుందో తెలుసా?" అని అడిగిందామె.
    "అదా, అమ్మగారూ! తెలుసండి పూజా మందిరంలో ఉందండి" అన్నాడు వాడు భయంగానే! వాడి భయానికి అర్ధాన్ని గుర్తించలేదు వాణి. "వెళ్ళి పట్టుకురా" అంటూ అలవోకగా అందామె.
    "అమ్మ బాబోయ్" అంటూ అక్కడ నించి పారిపోయాడు వాడు. అప్పటికి జ్ఞాపకం వచ్చింది వాణికి యోగి సర్పయాగం చేసిన సందర్భాన కళింగనాగుని వశికరించి శ్వేతనాగు పగనించి వాణికి రక్షణ కల్పించవలసిందిగా నియంత్రించాడు. దాన్ని కేశవరావుగారి పూజా మందిరంలో నిబద్ధం చేశాడు.
    ఒకప్పుడు వాసుకి తనను మోసగించి తావీదులిప్పించాలని ప్రయత్నిస్తే కళింగనాగు పూజామందిరంలోంచి కదలి వచ్చి వాసుకి భయపడేలా చేసింది.
    అప్పుడు తన ప్రాణాలను కాపాడిన కళింగనాగు ఇంకా పూజామందిరంలోనే ఉందా? అని ప్రశ్నించుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యానికి అవధులు లేకుండాపోయినాయి. ఈ మధ్య శ్వేతనాగు పగ గురించి తాను మరచిపోయింది. అలాగే కళింగనాగు సంగతీ మరచిపోయింది. యోగి దానిమీద ప్రయోగించిన వశీకరణ నించి దానిని విముక్తం చేయలేదు. వాసుకి శక్తులు సాధించి వచ్చేవరకూ దానిని ఎవరూ విముక్తము చేయలేరు.
    అలా చేయగలిగిన వారు వచ్చేవరకూ అలా వశికరణలో శ్వేతనాగుని ఎదుర్కొంటూ, అలా ఉండిపోవలసిందే అన్న విషయం తెలిసింది వాణికి.
    వెంటనే ఆమె శయ్యమీది నించి దూకి పూజామందిరానికి వచ్చింది. తాళాలు బిగించి ఉన్నాయి. విచారిస్తే తాళంచెవులు కేశవరావుగారి వద్దే ఉన్నాయని తెలిసింది.
    వెంటనే తాళాలు తెప్పించి తలుపులు తీసిందామె. పూజామందిరంలోకి వెళ్ళింది.
    ఆ గదిలో కొన్ని దేవుని *విగ్రహాలున్నాయి. అతి పవిత్రమయిన వాతావరణం నెలకొని ఉంది. కళింగ నాగు అర్ధరాత్రి సమయానికి ఆహారానికి వెళ్ళివచ్చే తూపరాసిలోంచి రవంత వెలుగు కిరణంలోనికి వస్తోంది తప్ప మిగిలిన గది అంతా చేకటిగా ఉంది.
    ప్రశాంతం, చీకటి నిండిన ఆ గదిలో అనాయాసంగా ఏకాగ్రత కుదిరిపోతుంది.
    విగ్రహాల ఎదురుగా శేషశయనం వేసింది కళింగ నాగు చుట్టచుట్టుకొని చుట్టమీద తల పెట్టుకుని హాయిగా విశ్రాంతి తీసుకోటూంది.
    అడుగుల చప్పుడు వినగానే దాని శరీరంలో కదలికలు ప్రారంభమయినాయి. అడుగుల చప్పుడు దగ్గర అయాక అది పడగ ఎత్తి చివాలున లేచింది.
    వాణిని ఆశీఃపూర్వకంగా చూస్తూ తల ఆడించసాగింది. దాని శరీరం ముదిరిన తాటిపండువర్ణంలో ఉంది. ప్రతి ఆరంగుళాలకు బంగారువర్ణం రింగులున్నాయి. అది పడగ విప్పగానే శ్రద్ధాపూర్వకంగా దానిముందు మోకరిల్లింది వాణి. మోకాళ్ళు, మోచేతులు శిరస్సు నేలను తాకించి మ్రోక్కింది.
    పద్మపత్రంలా ఉన్న డోప్పలాంటి పడగను రెండుసార్లు ముందు వెనుకలకు ఊగించింది కళింగనాగు.
    "శ్వేతనాగు పగనుంచి కాపాడేందుకు నీకు నేనున్నాను." అని అభయహస్తమిస్తున్నదానిలా నాలుకల చిలికలను బయటకు లాగి ఊ ఊ ఊఫ్ ఫ్ ఫ్ మంటూ పూత్కారం చేసింది.
    "గురుదేవుని ఆనతితో ఆ వాటి యౌవనపు ఉత్సాహంతో శ్వేతనాగును కవ్వించి పరిశోధనలు చేశాను. అయితే ప్రాణాలు అర్పించేందుకు ఆనాడు నేను సంసిద్దురాలను. కాని ఈనాడు ఒక బిడ్డకు తల్లిని అయి కర్తవ్యబద్దురాలను అయినాను. ఆనాడు నాగుకీ, నరశక్తికీ పోరాటం జరిపాను. కాని ఆ శక్తి ఈనాడు లేదు. అందునించి నాగువయిన నీవే ఆ శ్వేతనాగుతో పోరాడాలి. ఇంక నాకు శక్తి చాలదని భావించి నిన్ను ఆశ్రయించుతున్నాను. నాగుకీ, నరుడికీ పోరాటం పరిసమాప్తమయింది. ఇంక నాగుకీ, నాగుకీ మధ్య పోరాటము జరగాల్సి ఉంది. నన్ను కాపాడు" అంటూ అలానే ముఖాన్ని నేలకు తాకించి మ్రొక్కింది వాణి.
    కళింగనాగు ఆశీర్వచనపూర్వకంగా మరొక మారు ఊ ఊఫ్ ఫ్ మంటూ పూత్కారం చేసింది. పద్మ ముకుళంలా ఉన్న పడగను ఆడించింది.
    వాణి లేచి వెళ్ళి మరొకమారు తలుపుల దగ్గర నిలబడి చూచింది. ఇతఃపూర్వం ఆ గదిలో ఏ సంఘటన జరగలేదన్నట్లుగానే తిరిగి శేషశయనం వేసింది కళింగనాగు. చుట్టచుట్టుకుని చుట్టమీద తలపెట్టుకుని హాయిగా నిద్రపోతున్నదానిలా పడుకుంది. దాని శయ్యకోసం ఏర్పరచిన ముఖమల్ దుప్పటి మడతలు తిరిగి నిశ్శబ్దంలో మునిగినాయి.
    తలుపులు తాళాలు బిగించింది వాణి.
    పాము నివాసముంటున్న పూజా మందిరంలోకి వాణి వెడుతున్నప్పుడే పనివారంతా హడలిపోయినారు. వారంతా అక్కడ గుంపుగా చేరి చూడటం ప్రారంభించారు. వాణి క్షేమంగా తిరిగి రావటాన్ని వారు మరింత ఆశ్చర్యంతో చూడసాగారు.
    రెప్పవేయటం మరచినారు వారంతా.

 Previous Page Next Page