7
"హలో!"
"ఎస్, ప్లీజ్."
"స్వప్న హియర్."
"యువర్ వాణి హియర్."
"డార్లింగ్! నువ్వు వెళ్ళి వారం రోజులయింది. గుర్తుందా?"
"ఏం? బెంగెట్టుకున్నారా?"
"అవునోయ్. బాబు ఏడుస్తున్నాడు."
"బాబుకంటే అధికంగా మీరే బెంగెట్టుకున్నారు. అవునా?"
"వాణీ! నువ్వు కఠినాత్మురాలివి."
"థాంక్యూ! ఇంతకాలానికి గుర్తించారన్న మాట."
"నువ్వు నిర్దయురాలివి."
"మైగాడ్! ఈ విషయం ఇప్పుడు తెలిసిందా?"
"ఎందుకింత శిక్ష విధించావు?"
"ఎవరికి విధించాను? మీకా, బాబుకా?"
"ఇద్దరికీ! నువ్వు వెంటనే తిరిగి వచ్చేయ్యాలి" అన్నాడు స్వప్నకుమార్ ఆదుర్దాగా! ఆ మాటలు విన్న వాణికి కన్నులు చెమరించినాయి.
"డియర్ స్వప్నా! నేను తిరిగి రావాలని నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో అంతకన్నా అధికంగానే నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి నేను తీసుకున్న ఈ నిర్ణయం నీకో, బాబుకో విధించిన శిక్ష అనుకుంటున్నావు. కాని ఇది నాకు నేను విధించుకున్న శిక్ష అని నువ్వు గుర్తించలేకపోయినావు. డియర్ స్వప్నా! నీవు కంగారు పడకుండా వినగలిగితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.
శ్వేతనాగు పగ చల్లారలేదు. ఇంకా నన్ను వెన్నాడుతోంది. అందుకో ఈ విషయం తేలేవరకూ నీకూ, బాబుకూ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇల్లాలి మనసు దయావిహీనంగా ప్రవర్తించగలదేమో కాని, ఈ సృష్టిలో ఏ తల్లి మనసూ దయావిహీనంగా ప్రవర్తించలేదు.
ఒక తల్లి ఏ శాపం తనకు రాకూడదని సర్వదా కోరుకొంటుందో, ఏ శిక్ష భగవంతుడు తనకు విధించరాదని మనసారా ఆశిస్తుందో, అటువంటి శిక్షను కావాలని నాకు నేను విధించుకున్నాను. ఎందుకో తెలుసా!? బాబుని, నిన్ను కాపాడుకోవాలని మాత్రమే!" అన్నది వాణి రుద్ధమవుతున్న కంఠస్వరాన.
ఆ మాటలు విని స్వప్న విచలితుడైనాడు. వాణి వ్యక్తిత్వం హిమగిరి శిఖరాగ్రాల ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా అతనికి అనిపించసాగింది.
"వాణీ డియర్! నాగమణి నీ దగ్గర ఉండగా నీకేమిటి భయం?" అన్నాడు చివరి ప్రయత్నంగా.
"స్వప్నా! నాగమణి బాబు క్షేమం కోసం ప్రత్యేకించాను. అది వాడి మెడలోంచి తీయవద్దు. శ్వేతనాగు నించి నన్ను రక్షించాలన్న ప్రయత్నంలోనే కృష్ణస్వామి బలి అయినారు. దాని పగకు, ప్రతీకారానికి అడ్డువచ్చిన వారిని నిర్మూలించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో నేను విజయం సాధించగలిగితే సంతోషంగా తిరిగి వస్తాను. ఒకవేళ అందుకోసం నేను బలి అయిపోతే నన్ను మరిచిపోయేందుకు ప్రయత్నించు" అన్నది వాణి దిగులు నిండిన స్వరాన.
ఆ మాట వింటూనే "నో" అంటూ పెద్దగా అరిచాడు స్వప్నకుమార్. "అలా జరగనివ్వను" అన్నాడు.
"డియర్ స్వప్నా! మృత్యురేఖ సరిహద్దులమీద నడుస్తున్నాను నేను. ఇవతలి హద్దును తాకగలిగితే నీవూ. నేనూ, బాబూ, నాన్నగారూ అన్నీ బంధాలే!
అవతలి హద్దుకు పారిపోతే నీవెవరు నేనెవరు? నీ చేతిలో ఏముందని నువ్వు కంఠం చించుకుని అరుస్తావు? దయచేసి ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యాలని కానీ, బాబు గురించి జ్ఞాపకం చేయాలని కానీ ప్రయత్నించకు. అలా జరిగిన నాడు నేను కర్తవ్యాన్ని పాలించలేని ఆశక్తురాలను అవుతానని జ్ఞాపకం పెట్టుకో!" అంటూ చెప్పి ముగించింది వాణి.
స్వప్న ఖిన్నుడయినాడు. అతడి నోటివెంట మాటలు పెగిలి రాలేదు.
"డియర్ స్వప్నా! తాళపత్రాలను దాచిన వెండి పేటికను వీలయినంత త్వరగా నాకు పంపు. నాగమణి పొదిగిన హారాన్ని బాబు మెడలోంచి ఒక్క క్షణమైనా తొలగించవద్దు. బ్రతికి ఉంటే, శ్వేతనాగు పగనుంచి బయటపడగలిగితే మళ్ళి కలుస్తాను. ఒకసారి నన్ను రక్షించాలని ప్రయత్నించిన కృష్ణస్వామి బలి అయినారు. కాబట్టి ఈ మారు అటువంటి ప్రయత్నం ఎవరూ చేయకండి. ఈ పోరాటంలో నేను ఒంటరిగానే పాల్గొనదలిచాను. మరొక మారు చెప్తున్నాను, స్వప్నా, తిరిగి నాకు ఫోన్ చేసినా, బాబును గురించి జ్ఞాపకం చేయాలని ప్రయత్నించినా నా మనో నిశ్చయాలు బలహీనమవుతాయి. బై" అంటూ ఫోను పెట్టేసిందామె.
స్వప్న రాతిబోమ్మలా అయినాడు.
వాణి ఫోను పెట్టేసి తన గదికేసి నడవసాగింది. ఆమె ముఖం కర్తవ్యం పట్ల కృతనిశ్చయంతో కటినంగా అయింది. తన విషయమంతా శయ్యమీద పడి ఉన్న కృష్ణస్వామికి చెప్పి ఆశీస్సులండుకుని వచ్చిందామె.
ప్రొఫెసర్ కృష్ణస్వామి ఆమె చెప్పినదంతా ఆలకించారు. చూపులతోనే ఆశీర్వదించారు. "బేబీ! కాపు పెట్టందే బంగారానికి వన్నె పెరగదు. నీకు ఎదురు అయ్యే సమస్యలు కూడా అలాంటివే! ఈ సమస్యలు నీ వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దుతాయి. నాకు తెలుసు తల్లీ! నీవు విజేతవు కాగలవు" అన్నట్లు చూచినారాయన.
వారి పాదాలకు మొక్కి తిరిగి వచ్చింది వాణి.
రాగానే స్వప్న ఆమె రాకకోసం ఫోన్ చేశాడు. వాణి మనసు మరింతగా కలత బారుతోంది. శ్వేతనాగు పగనించి బయటపడే ఆరాటంలో, పోరాటంలో తాను విజయాన్ని సాధించేందుకు కొండంత గుండె దిటవు కావాలి.
అటువంటి మనో నిగ్రహాన్ని పొందెందుకు ఏ విషయాన్నయితే తాను మరచిపోవాలని ప్రయత్నిస్తూందో, అదే విషయాన్ని తిరిగి గుర్తు చేస్తున్నాడు స్వప్న.
చిన్నారి కృష్ణుడు మనసులోకి రాగానే ముందుకు సాగిన ఆలోచనలు వెనుకతట్టు పడుతున్నాయి. ఆ విషయాలన్నీ కొంతకాలమైనా మనసులోంచి చెరిపి వేసేందుకు నరకప్రాయమైన కాటిన్యాన్ని వహించిందామె.
పరుగులాంటి నడకతో మెడమీది తన గదిలోకి వెళ్ళింది. తలుపు తీయగానే ప్రత్యక్షమయ్యాడు పాముల మల్లిగాడు. ఆమె కన్నులు ముడిపడినాయి. వృద్ధ మల్లిఖార్జునుడి వరపుత్రుడు అని చెప్పబడుతున్న గిరిజనుడే అతడని గుర్తించేందుకు ఆమెకు ఎటువంటి గుర్తింపులూ తెలియరాలేదు. కాని అతడి ఆకృతిని అనుసరించి గిరిజనుడని గుర్తించిందామె.
ఆమెను చూచి అభిమానపూర్వకంగా నవ్వనూలేదు. లేచి గౌరవపూర్వకంగా నిలబడనయినాలేదు. పాతిక మేకులా అలానే కూర్చుండిపోయినాడు. అతడి నిస్తబ్దతను చూడగానే వాణికి జుగుప్సలాంటి భావాలే కలిగాయి. కాని అది అమాయకత్వమని కాని, గిరిజనులకు సహజమైన అనాగరిక లక్షణమనికాని అనిపించలేదు.