Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 15


                                    సినీ సుత్తి

    "హమ్మా..."వీధిలోంచి రంకె  వేశాడు గోపాళం.
    ఆ రంకె వినగానే పార్వతి మేనెల్లా పులకించింది. ఆమె హృదయపు వీణ "టింగ్ టింగ్..." అంటూ రాగాలు పలికింది.
    "అమ్మోయ్...పట్నం నుండి అన్నయ్యొచ్చాడే!!..." అంటూ హాల్లో చెంగుమంటూ ఓ గెంతు గెంతింది .
    ఈలోగా గోపాళం ఇంట్లోకి వచ్చేసి అమాంతం పార్వతిని వాటేస్కున్నాడు "హమ్మా చెల్లెమ్మా"
    "ఛీపో...అన్నయ్యా..."
    గోపాళం పార్వతిని గిరగిరా తిప్పి నేలమీదకు దించాడు. ఆ దెబ్బకి పార్వతి కళ్ళు తిరిగి దభేలుమని నేలమీద పడింది.
    "వచ్చావా బాబూ!..."ప్రేమంతా కళ్ళలోనూ మాటల్లోనూ నింపి అప్యాయంగా దగ్గరకు వచ్చింది గోపాళం తల్లి అన్నపూర్ణ.
    "హమ్మా!..."గోపాళం తల్లినికూడా వాటేస్కుని పైకిత్తి గిరగిరా తిప్పసాగాడు.
    "జాగ్రత్త నాయనా..మీ చెల్లాయ్ ని పడేసినట్టు నన్ను కూడా క్రింద పడేసేపు!..."భయంభయంగా అంది అన్నపూర్ణ.
    అంతే!...
    గోపాళం అన్నపూర్ణని చటుక్కున క్రిందికి దించేశాడు.
    అతని మొహం వివర్ణమైంది.బాధతో అతని కడుపులోని పేగు మెలిపడింది.
    "అమ్మా!...నిన్ను క్రింద పడేస్తానని ఎలా అనుకున్నావ్ అమ్మా...దైవ స్వరూపురాలైన కన్నతల్లిని క్రింద పడేసేంత కసాయివాడు కాదమ్మా ఈ గోపాళం..మాతృమూర్తి పవిత్ర పాదాలమీద ధూళినైన నన్నే అనుమానిస్తున్నావా అమ్మా!!?..."చొక్కా కాలరు నలిపేస్కుంటూ,అశృవులు ధారాపాతంగా కారుస్తూ అడిగాడు గోపాళం.
    "లేదు బాబూ...లేదు...పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని అనుమానిస్తారా బాబూ ఎవరైనా?నిత్యం వెన్నంటే నీడని సంశయిస్తారా బాబూ ఎవరైనా?..." అన్నపూర్ణ కూడా ధారాపాతంగా కన్నీరుకార్చింది.
    "అమ్మా..."
    "బాబూ..."
    "ఏంటి బాబూ...ఇంతగా చిక్కిపోయావ్?" ఒళ్ళంతా తడుముతూ అడిగింది అన్నపూర్ణ.
    "హిహి...నువ్వలా ఒళ్లంతా తడుముతుంటే...హిహిహి...కితకితలు పెడ్తుందే అమ్మా ...హి! ..."
    "ఏంట్రా బడుద్దాయ్?...ఎప్పుడొచ్చావ్?" తండ్రి పరంధామయ్య ఎంట్రెన్సు ఇది.
    "ఇప్పుడే నాన్నా..."
    "నీ చదువదీ ఎలా సాగుతుంది?"
    గోపాళం నాలుక కర్చుకున్నాడు.
    "హర్రే...అమ్మనీ,చెల్లనీ గిరగిరా తిప్పే హడావిడిలో అసలు విషయం చెప్పడం మర్చిపోయా...నేను టెన్త్ పాసయ్యా నాన్నా..."ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ అన్నాడు గోపాళం.
    పరంధామయ్య గుబురుమీసాలు గర్వంగా మెలేస్తూ "వీడు ఎవడి కొడుకనుకున్నావే!"అన్నాడు అన్నపూర్ణ వంక చూస్తూ.
    అన్నపూర్ణ ఆనంద భాష్పాలు రాలుస్తా రివ్వున పరంధామయ్య ఫోటో దగ్గరికి పరుగుతీసింది.
    "చూశారా...చూశారా?...మన అబ్బాయ్ ఎంత ప్రయోజకుడయ్యాడో!!..." ఆనంద భాష్పాలు ఒత్తుకుంది.
    "నీ బొంద...నేనిక్కడుంటే నా ఫోటోతో మాట్లాడ్తావేం?...నేనింకా బ్రతికే ఉన్నా..."పళ్ళు నూరాడు పరంధామయ్య.
    ఇంతలో లోపలి గది నుండి పాకురుకుంటూ డేకురుకుంటూ గోపాళం నాయనమ్మ జానకమ్మ వచ్చింది.
    "ఏవిటర్రా సందడి!!?" అని వణికే కంఠంతో ప్రశ్నించింది.
    "మన గోపాళం టెన్త్ పాసయ్యాడత్తయ్యా..."సంబరంగా చెప్పింది అన్నపూర్ణ.
    "ఆహా...ఎంత చల్లని వార్త చెప్పావ్ తల్లీ..అయితే మన గోపాళంగాడు కలెక్టరు అయిపోయినట్టే!..."
    "అంతే కదు అత్తయ్యా!..."
    "హోయ్...హోయ్!... అన్నయ్య కలెక్టరు అయిపోయాడోచ్!!..." ఎగిరిగంతులేసింది పార్వతి.
    "ఏవండీ...మనవాడి చడువుకూడా అయిపోయింది... వాడికిక పెళ్ళి చేసేయాలండీ..."అన్నపూర్ణ పరంధామయ్య నడ్డిమీద గోకింది.
    "నువ్వు ఆ విషయం చెప్పాలా?...వీడికోసం ఏనాడో ఓ సంబంధం చూసి ఉంచాను"అన్నాడు పరంధామయ్య.
    "ఎవరండీ?...నా కోడలు అయ్యే భాగ్యం ఎవరికండీ?"
    "రామాపురం జమిందారుగారి అమ్మాయి పాపాయమ్మ!..."
    "నాన్నా!..." గుండెలదిరేలా రంకేవేశాడు గోపాళం.
    "పోనీ నీకు ఆ అమ్మాయి పేరు నచ్చకపోతే పెళ్ళయిన తర్వాత ఏ లతో, గీతో అని మార్చుకో..."
    "అది కాదు న్నానా..."
    "మరేంటి?..."
    "నేను సెవెన్త్ చదువుతుండగానే నా క్లాస్ మేట్ రాధని ప్రేమించాను నాన్నా..."
    "గోపాళం..."ఈసారి పరంధామయ్య రంకేవేశాడు.
    "పెళ్ళి చేస్కుంటానని ఆ అమ్మాయికి మాట కూడా ఇచ్చాను నాన్నా..."
    "నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చన్రా...ఇచ్చిన మాట ఎలా తప్పమంటావురా?..."
    "నాన్నా..."
    "వాళ్ళకి రేప్పొద్దున్న మొహం ఎలా చూపించన్రా...ఇంత విషం తెచ్చివ్వరా...మింగుతా..."
    "ఏవండీ..."అన్నపూర్ణ మంగళసూత్రాలను గట్టిగా పట్టుకుంది.
    "అబ్బాయ్...ఖళ్...
    "నాన్నా..."పార్వతి అరిచింది.
    గోపాళం మౌనంగా రోదించాడు.
    పరంధామయ్య గోపాళాన్ని చెయ్యిపట్టి బరబరా ఒక ముసలాయన తైలవర్ణ పటం దగ్గరికి లాక్కెళ్ళాడు.
    "ఈయనెవరో తెల్సా?...మీ తాతయ్య చెంగయ్య...కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా..."
    "నాన్నా..." గోపాళం మూలుగు.
    ఇంకో చిత్రపటం దగ్గరికి లాక్కెళ్ళాడు పరంధామయ్య.
    "ఈయన మీ ముత్తాత వెంగళయ్య...తాసీల్దారు ఆఫీసులో ప్యూను!..."
    "నాహాన్నా..." జుట్టు పీక్కున్నాడు గోపాళం.
    "ఇలాంటి వంశంలో పుట్టిన నువ్వు ఆ అమ్మాయిని ఎలా ప్రేమించావురా?..."
    ప్రేమకి కులమతాల,ఆస్తిఅంతస్థుల అడ్డుగోడల ఉండవునాన్నా..."

 Previous Page Next Page