"కొందరు తాగుతారు. అందుకే పాంపైన్ బాటిల్స్ కూడా తెప్పించాం. అందువల్లనే ఖర్చు పదివేల దాకా కావచ్చును"
"మీ నాన్న అనవసరంగా ఒక్క దమ్మిడీకూడా ఖర్చు పెట్టడని విన్నాను?"
"అవును! నా ఖర్చుల మీద రోజూ గొడవే!"
"మరి ఒక స్నేహితుడి కొడుకు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడా? ఆశ్చర్యంగానే ఉంది"
"అది బిజినెస్ రహస్యం. బిజినెస్ మ్యాన్ పది పైసలు ఖర్చుపెడ్తే ఇరవై పైసలు వస్తాయనే గ్యారంటీ ఉంటేనే మనీ ఇన్వెస్టు చేస్తాడు"
"బిజినెస్సా? ఇందులో బిజినెస్ ఏముంది?"
"ఆ వచ్చే అతను ఆర్కిటెక్ట్ అని చెప్పానుగా!"
"అయితే?"
"మా నాన్న కాంట్రాక్టరు"
"తెలుసుకాని ఈ పార్టీ వల్ల మీ నాన్నకు ఒరిగేదేముందో అర్థం కావడంలేదు"
"బిజినెస్ అంటే అదేరా? నీకూ నాకూ అర్థం కాదు. నాన్నను నువ్వు నన్ను వేసిన ప్రశ్నే వేశాను"
"ఊ"
"ఏమన్నాడు?" వేణు అడిగాడు.
"వీడొకడు మధ్యలో పానకంలో పుడకలా నేనూ ఉన్నానంటాడు" అనుకున్నాడు గౌతమ్.
"ఇవాళ పార్టీకి వచ్చే వాళ్ళంతా ధనవంతులు"
"అయితే?"
"పైగా స్వంత ఇళ్ళు లేనివాళ్ళు త్వరలో కట్టడానికి ఆలోచిస్తున్న వాళ్ళు, స్వంత ఇళ్ళు ఉన్నవాళ్ళను పిలవడం లేదు"
గౌతమ్ హనుమంతరావు ముఖంలో కొత్తగా చదువు నేర్చుకుంటున్న పిల్లవాడు.
సంయుక్తాక్షరాలు రాసిన బోర్డు కేసి చూసినట్టు చూశాడు.
"అందులో ఒక పెద్ద మనిషి కొన్ని లక్షలతో హోటల్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు"
గౌతమ్ కు ఇంకా ఈపార్టీ వల్ల హనుమంతరావు తండ్రికి వచ్చే లాభం ఏమిటో అర్థం కాలేదు.
"వాళ్ళందరికీ సురేష్ ను పరిచయం చేస్తాం!"
"అతని పేరు సురేశా?" వేణు ఏదో అనాలి కనుక అన్నట్టుగా అడిగాడు.
"అవును"
"ఊ ఆ తరువాత?"
"ఆ వచ్చే వాళ్ళలో కొందరైనా సురేష్ చేత డిజైన్ వేయించుకుంటారు"
"ఇప్పుడు అర్థం అయింది, అందులో మీ నాన్నకు కొంత కమీషన్ ఉంటుంది" క్లూ దొరికినట్టు అన్నాడు గౌతమ్.
"ఛ! కాదు మానాన్న అంత ఇంత మొత్తాలకు కక్కుర్తి పడడు"
"అసలు సంగతి ఏమిటో చెప్పరా బాబూ!"
"మీరు చెప్పనిస్తేగా?"
"చెప్పు!"
"సురేష్ డిజైను వేసిన బిల్డింగ్ కాంట్రాక్టు మా డాడీ తీసుకుంటాడు"
"ఒకవేళ వాళ్ళు ఆ కాంట్రాక్టు మీ డాడీకి ఇవ్వకపోతే?"
"ఇస్తారనే నమ్మకంతోనే ఇదంతా చెయ్యడం. బిజినెస్ లో డబ్బును ఇన్వెస్టు చెయ్యడం లాభాలు వస్తాయనే ఆశతోనే!"
"అంటే ఇదోరకం గేంబులింగ్ అన్నమాట!"
"జీవితమే ఒక గేంబులింగ్ భాయ్!" హనుమంతరావు గౌతమ్ భుజం తట్టాడు.
"అయితే గుర్రపందాలూ, జూదం ఆడొచ్చుగా?"
"వాటిలోలేని సేఫ్టీ బిజినెస్ లో ఎక్కువ ఉన్నది"
గౌతమ్ ఆలోచనలో పడ్డాడు.
"గౌతమ్ నా నీలం సూటు ఇస్తాను. వేసుకుంటావా?"
"ఎందుకూ?" కనుబొమ్మలు ముడిపడ్డాయి.
"చెప్పానుగా పార్టీకి వచ్చేవాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళేనని!"
"గొప్పవాళ్ళు అనకు. డబ్బున్న వాళ్ళు అను"
"అవ్వ పేరే ముసలమ్మ" అన్నాడు వేణు హనుమంతరావును సమర్థిస్తూ.
"ఏడ్చినట్టుంది నీ ఉపమానం!" నోటివరకు వచ్చిన మాటల్ని బయటికి కక్కలేకపోయాడు గౌతమ్.
"పోనీయ్ గొప్పవాళ్ళు కారు. ధనవంతులే! కాని వాళ్ళంతా చాలా టిప్ టాప్ గా వస్తారు. వాళ్ల మధ్యకు నువ్వు ఇలాంటి బట్టల్తో వస్తే నీకేసి ఎవరూ చూడరు"
"మరీ మంచిది. హాయిగా అందర్నీ నేను చూస్తాను."
"నీ ఇష్టం!"
"మరి అంత అభిమానం పెంచుకుంటే మనలాంటివాళ్ళకు బతకడం కష్టం!" అన్నాడు వేణు.
వేణుకేసి ఓ క్షణం జాలిగా చూశాడు గౌతమ్.
"నా దృష్టిలో అభిమానాన్ని చంపుకొని బ్రతకడం ఒక బ్రతుకు కాదని!"
వేణు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
వెంటనే గౌతమ్ కి బాధ అనిపించింది.
తను తొందరపడ్డాడు. వేణూ సంగతి తనకు తెలుసు. తనకు అతన్ని అవమానించే అధికారం ఏముందీ?
ఎదుటి మనిషికి బాధ కలిగించడం ఎంత సులభం?
"సారీ! వేణూ!" అన్నాడు వేణు భుజం తడుతూ.
"మనలో మనకు ఈ సారీలు చెప్పుకోవడం ఏమిటి?" అన్నాడు వేణు.
వేణులాంటి వ్యక్తుల్ని చూసి జాలి పడాలి. అంతేగాని అసహ్యించుకోకూడదు. గౌతమ్ అనుకున్నాడు.
"డిన్నర్ కు వస్తావు గదూ?" హనుమంతరావు లేస్తూ అడిగాడు.
"వస్తాను తప్పక వస్తాను. వేణుకూడా వస్తున్నాడుగా?"
"ఆ వస్తున్నాను" అన్నాడు వేణు.
వేణు హనుమంతరావును ఒక మంచి సూట్ అడగాలనుకున్నాడు. గౌతమ్ ముందు అడగలేకపోయాడు.