Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 15


    దక్షిణాన గుడులన్నీ తిరిగి రావాలని ఎంతో ఉంది. 'ఇప్పుడెలా అమ్మా' ఎండాకాలం సెలవుల్లో వెళ్ళండి అంటాడు. ఆ ఎండల్లో మేం ప్రయాణం చెయ్యలేక మానుకున్నాం. ఊళ్ళో మంచి నాటకాలు, ప్రోగ్రాంలు ఎన్నో అవుతున్నాయి. హాయిగా ఇద్దరం వెళ్ళి కూర్చోవచ్చు. కానీ ఇంటి కాపలా అయిపోయింది మా బతుకులు. చూడు సాంబశివరావు అందుకే కాస్త మాకై మేము ఈ ఆఖరు రోజుల్లో బాదర బందీలు లేకుండా ఉండాలని ఉందయ్యా. ఇంకా మా బతుకులు ఎన్నాళ్ళకి తెల్లారతాయో. పదేళ్ళో, పదిహేనేళ్ళో, ఇరవైయేళ్ళో ఎవరికి తెలుసు. మేం కాటికి కాచుకున్న మరీ ముసలాళ్ళం కాదు గదా? మాకు ఇవి తీరని సరదాలు, ముచ్చట్లు. వాటిని తీర్చుకోవాలనుకోవడం తప్పా. చూడు ఆఖరికి మేం ఇద్దరం మాటామంతీ కష్టం, సుఖం చెప్పుకోడానికి మాకంటూ ఓ గది లేదు. మొన్న ఓ రోజు మా కోడలు మా ఇద్దర్నీ కాస్త సన్నిహితంగా చూసి ముఖం చిట్లించుకుని విసవిసా వెళ్ళిపోయింది మేమేదో కాని పని చేస్తున్నట్లు. నాకింకా అరవై అన్నా లేదు. అన్ని సరదాలు, సరసాలు చంపేసుకు బతకాలంటావా? పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ పెంపకం, పెద్దయ్యాక బరువు బాధ్యతలు అన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవడం తప్పు కాదు గదా? మేం వెళ్ళడం తప్పు కాదు గదా?' అంగీకారంగా తల ఆడించాడు సాంబశివరావు.
    'అవునులే పోనీ మీ వాడికి వివరంగా చెప్పకపోయావా సంగతి ఇదీ అని' చెప్పాను. ఇన్ని మాటలలో కాకుండా 'మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటికి వెళ్ళాలని ఉంది. ఈ బాదర బందీలింక మాకొద్దు అని నా నిర్ణయం చెప్పాను. చెప్పాగా మేం ఇంట్లోంచి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకుని గాభరాపడుతున్నాడు. అదే అలవాటవుతుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్ళల్లో తల్లితండ్రులు ఉంటున్నారేమిటి, ఏదో మాలా ఓ కొంప లేనివాళ్ళు ఉంటారు. నాకేదో పెన్షను వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలు చేతిలో ఉన్నాయి గదా! ఓ లక్ష పెట్టి రూము కొన్నాను. మిగతాది కాస్త బ్యాంకులో ఉంది. అవసరాలకి. పెన్షన్ లో ఇద్దరికీ చెరో పదిహేను వందలు అక్కడ భోజనానికి కట్టాలి. ఇంకో వెయ్యి పై ఖర్చులకు సరిపోతుంది. ఈ మాత్రంగా నైనా లేనివాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు. వాళ్ళకంటే మేం నయం కదా - అందుకే ఎవరికీ ఇబ్బంది లేని నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా ఎవరి పాటికి వారుండడం మంచిది గదా!'
    'నీవన్నదీ నిజమేలే - ఈ రోజుల్లో ఎవరికీ భారంగా ఆధారపడాలనుకోడం లేదు'
    'ఇదేదో వాళ్ళ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు. వాడిని చిన్నబుచ్చాలని కాదు. లోకం ఏమనుకోదు - ఈ రోజుల్లో ఎవరి గోల వారిది. అడిగినా నాలుగు రోజులడుగుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, అలవాటైపోతుంది. ఇదివరకులాగ జాయింట్ ఫ్యామిలీలు ఇంకా ఈ అపార్ట్ మెంట్ సంస్కృతిలో, ఈ పట్టణాలలో కుదరదు. కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైలులా ఉంది మాకు. అందుకే స్వచ్చమైన గాలి, నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటికి వెళుతున్నారని నువ్వే వాడికి చెప్పాలి.'
    మాటల్లో బస్సు ఆశ్రమం చేరింది. చుట్టూ బోలెడు ఖాళీ స్థలం మధ్యలో ఆశ్రమం, ఆఫీసు, దగ్గరే చిన్న ప్రార్థనా మందిరం. గేటు లోంచి బస్సు లోపలికెళ్ళి ఆగింది.
    'పద ముందు ఆఫీసు దగ్గరకెళదాం' దారి తీశాడు రామ్మూర్తి.
    ఆఫీసులో కూర్చున్నాయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు.
    'ఎప్పుడు వస్తున్నారు' అనడిగాడు.
    'ఇదిగో పెన్షన్ పేపరులో అడ్రసు మార్పించి, పోస్టాఫీసు, బ్యాంకులకి కొత్త అడ్రస్సు చెప్పాలి. ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను. ఈయన సాంబశివరావని మా స్నేహితుడు. ఈ ఆశ్రమం, పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను.'
    'ఆ.. వెళ్ళండి, చూపించి రండి. ఈ లోగా టీ తెప్పిస్తాను' అన్నాడు మేనేజర్.
    ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి. ఒక్కో గదిలో రెండు మంచాలు, ఓ టుల్, కుర్చీ, ఒక ఇనుప బీరువా, గదికి ఆనుకొని చిన్న ఎన్ క్లోజ్ డ్ వరండా, ఎటాచ్డ్ బాత్ భార్యాభర్తలు కల్సి ఉండవచ్చు. వరండాలో స్టౌ పెట్టుకుని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు కొందరు. వంట గది, పెద్ద గ్యాస్ స్టౌలు, డైనింగ్ హాలులో ఒక్కసారి పాతిక ముప్పై మంది కూర్చునే పెద్ద టేబుల్, రిక్రియేషన్ రూములో పేపర్లు, మ్యాగజైన్లు, క్యారమ్, ఛెస్ ఆడుకోడానికి బోర్డులున్నాయి. ఉదయం కాఫీ, టిఫిను ఏడున్నరకి ఇస్తారు. మధ్యాహ్నం లంచ్ లో పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగుతో భోజనం. నాలుగు గంటలకు టీ, బిస్కట్లు, ఏదైనా ఒక పండు. రాత్రి ఏడున్నరకల్లా రొట్టె, కూర, అన్నం, పప్పు వగైరాలతో డిన్నర్. డైనింగ్ రూమ్ కి రాలేని వారికి క్యారియర్ గదికే పంపిస్తారు. కాస్త దూరంలో చిన్న గుడి, ఓ ఏభై మంది దాకా కూర్చుని ప్రార్థన, భజన, మెడిటేషన్ వగైరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి. అంతేకాక వాకింగ్ కు వెళ్ళడానికి చుట్టూ బోలెడు స్థలం. ఆఫీసు ముందు చిన్న గార్డెను, చుట్టూ పెద్ద మొక్కలు, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం.
    ఆ వాతావరణం చూసి 'చాలా బాగుందయ్యా! సిటీ ట్రాఫిక్, జనానికి దూరంగా హాయిగా ఉంది' మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు.
    'అందుకే బాబూ, చూడగానే నాకీ ఆశ్రమం నచ్చింది. ఊర్లోకెప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళడానికి బస్సులున్నాయి. పిల్లల్ని బంధువులని చూసి రావచ్చు. 'వాళ్ళు ఇక్కడికొచ్చి ఓ పూట గడిపి వెళ్ళొచ్చు. ఒంటరితనం అనిపించకుండా ఆవిడకి నేను, నాకావిడ ఉండనే ఉన్నాము. ఇంతకంటే ఏం కావాలి? మనం కోరుకునే ప్రైవసీ మనకు ఉంటుంది. పిల్లల మీద ఆధారపడ్డాం అని మనం, భారమయ్యామని పిల్లలు అనుకోనక్కరలేదు. ఏమంటావు?' అన్నాడు రామ్మూర్తి. సాంబశివరావు అంగీకారంగా తల ఆడించాడు. ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగి వచ్చారు.
    'నాన్న ఏమన్నారు అంకుల్, మాట్లాడారా' ప్రసాద్ మర్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు.
    సాంబశివరావు నవ్వి నేనూ అక్కడ ఓ రూము బుక్ చేసుకుందామని అనుకుంటున్నానోయ్. అంత హాయిగా, ప్రశాంతంగా ఉందక్కడ' అన్నారు.
    ప్రసాద్ ముఖంలో అసహనం, ఆరాటం చూసి భుజం తట్టి 'చూడు ప్రసాద్, రోజులు మారాయయ్యా. ఈనాటి తల్లిదండ్రుల దృక్పథాల్లోనూ మార్పు వచ్చింది. వాళ్ళ బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా మిగిలిన బతుకు బతకాలనుకుంటున్నారు. వయసులో ఉండగా తీరని కోరికలు వయసు పైబడక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు.'
    'ఇప్పుడు వాళ్ళకి మేము ఏమి లోటు చేశాము అయినా వాళ్ళకి తీరని కోరికలంటూ ఏమున్నాయి?'
    'మీరేదో లోటు చేశారని కాదు.'
    'మరి'
    'నేను చెప్పేది పూర్తిగా విను. ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్యా, భర్త, పిల్లలు సంసారాలలో తల్లిదండ్రులకి చోటెక్కడుంది. మరీ గతిలేని వారు, సర్దుకుబతక్క తప్పనివారు పిల్లల ఈసడింపులకి గురవుతూ బతుకుతున్నారు. అదృష్టవశాత్తు మీ నాన్నకి తన బతుకు తాను బతక గలిగే ఆదాయం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో నువ్వు బాధ పడాల్సింది ఏమీ లేదు. ఎవరేం అనుకుంటారోనన్న భయమూ లేదు. నీ సంసారం, నీ పిల్లలు, నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి. నాణానికి రెండు వైపులా చూడాలి. అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైనదేనని నాకు అనిపించింది. 'లివ్ అండ్ లెట్ లివ్' అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట. అంచేత అనవసరంగా మనసు పాడుచేసుకోకు. వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళను చూసిరావచ్చు. అలాగే వాళ్ళకి కొడుకు, కోడల్ని మనవలను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు. మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకో' అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు.  

                                                                                                  (గృహశోభ - మే 2005)

                                                *  *  *  *  *

 Previous Page Next Page