Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 16


    చిత్రంగా కృష్ణమోహన్ అభిరుచులు తన అభిరుచులు ఒకటే అవడం ఆనందం కలిగించింది సరోజకి. అతను పైకి ఎంతో నవీనంగా కన్పించినా అతనికి ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర సాహిత్యం, సంగీతం యివన్నీ ఎంతో యిష్టం! అతని లైబ్రరీ నిండా మంచి తెలుగు రచయితల గ్రంధాలన్నీ ఉన్నాయి. అతని టేప్ రికార్డు నిండా ప్రసిద్ద సంగీత విద్వాంసుల సంగీత రికార్డులున్నాయి. భారత భాగవతాల పట్ల గౌరవం ఉంది. మొదట్లో సరోజ ఆశ్చర్యంగా "మీరీ తెలుగు పుస్తకాలు చదువుతారా! యివన్నీ మీరే కొన్నారా" అంటూ ఆశ్చర్యపోతూంటే నవ్వాడు కృష్ణమోహన్.
    "ఎందుకంత ఆశ్చర్యం, తెలుగు వాడినయి తెలుగు పుస్తకాలు చదవడంలో ఏం వింత ఉందని అలా ఆశ్చర్యపడుతున్నారు." తెలుగు వాళ్ళయి తెలుగుపుస్తకాలు చదవడమే కాదు మాట్లాడడం కూడా నామోషి అనుకునే వారెందరినో చూసిన సరోజ అతనివంక ప్రశంసా పూర్వకంగా చూడడం మినహా ఏం అనలేక పోయింది.
    "మీరు సంగీతం వినడం, మీకు సంగీతంపట్ల యింత ఆసక్తి ఉండడం మరింత ఆశ్చర్యం, మీలాంటి వారు...."
    "ఏం ఇదంతా చూస్తుంటే నేనే నూరేళ్ళ క్రిందటో పుట్టవలసిన వాడినో అనిపిస్తూందా ఏమిటి. నిజమే నాకు సంగీతం ఎంతో యిష్టం. మా సీతకి మా నాన్నగారు చిన్నప్పటి నించి నేర్పించారు వీణ. మా నాన్నగార్కి వీణ అంటే ఎంతో యిష్టం. పెళ్ళయ్యాక మా అమ్మకి నేర్పించారు. అమ్మ, చెల్లి వాయిస్తూంటే నాన్నగారు పరవశంగా వినేవారు. అలా యింటిలో చిన్నప్పటినించి సంగీతం వినిపిస్తూంటే నాకూ దానిపట్ల ఆసక్తి పెరిగింది. నాతోపాటు ఆ అభిరుచీ పెరిగింది. సీతపోయాక యిదిగో ఈ టేప్ రికార్డరు పెట్టుకుంటాను. ఎప్పుడన్నా మనసు బాగులేకపోయినా, తోచకపోయినా అలా ఆ వీణా వాయిద్యం వింటూ నన్ను నేను మరిచి పోతాను. ఏమిటో మా చెల్లెలితో పాటు ఈ యింటిలో ఆటపాటలు, నవ్వులు అంతరించి పోయాయి- ఇల్లంతా ఎంత నిరాశ నిస్పృహలు ఆవరించాయో! ఎవరి మొహాలలో జీవకళే కన్పించేది కాదు. ఆ తరువాత నాన్నగారు పోయాక యీ యిల్లు స్మశానంగా తయారయింది పూర్తిగా. మళ్ళీ కాస్త ఇప్పుడు నీవు వచ్చిన యీ నెలరోజులనించి కాస్త జీవకళ తొంగి చూడడం ఆరంభించింది. ఎంత ఐశ్వర్యం వుంటే ఏం లాభం, కొందరి జీవితాలు యింతే" -అనేవాడు విషాదంగా. అలాంటప్పుడు అతనిని దగ్గరకి తీసుకుని ఓదార్చాలని "నేనున్నాను, నీకు" అని చెప్పాలని ఎంతో అన్పించేది సరోజకి. రోజులు గడుస్తున్నకొద్ది అతనిపట్ల అభిమానం, ఆత్మీయతే కాక మరేదో భావంకూడా సరోజని వశపరచుకోసాగింది. అయితే ఆ భావం క్రొత్తది కాక ఎప్పటినించో వున్నదే అన్నట్టు....బావే అంతటా నిండిన సరోజకి కృష్ణమోహన్ పట్ల అనురాగం వుండడంలో ఆశ్చర్యం లేనట్లు, అదేదో ఆమె హక్కన్నట్టు అన్పించసాగింది.
    ఈ రోజు మొదటిసారిగా - గీత కృష్ణమోహన్ లని చూస్తుంటే-కృష్ణమోహన్ తనకేం కాడని, అతనిమీద తనకేం హక్కులేదని, అతను మరొకరి సొత్తన్న నిజం తెలియగానే ఆమెమనసు దెబ్బతిన్నట్టు విలవిలలాడింది. ఊహాలోకాలనించి నేలమీదకి విసిరినట్లు ఆమె నిజ స్థితి గుర్తించుకోగానే సరోజ మనసు చెదిరిపోయింది. తనెంత పిచ్చిది! తనెక్కడ అతనెక్కడ!? జాలిపడి, ఆశ్రయమిచ్చి అభిమానించినందుకు తన అంతస్థు మరచి ఆశల నిచ్చెన ఎక్కాలని ప్రయత్నించడం తన తెలివి తక్కువ కాక మరేమిటి? వారు చూసే అభిమానం ఆప్యాయతల వెనక వారి స్వార్ధం వున్నా, తనను కన్నబిడ్డలా ఆదరించి తనసమస్యలకి పరిష్కారం చూపి ఆదుకున్నవారిపట్ల తన కుండాల్సింది కృతజ్ఞత కానీ, హక్కులు పొందే ప్రసక్తి ఎక్కడుంది! ఛ...తనింత తెలివి తక్కువగా ఎలా ఆలోచించింది యిన్నాళ్ళూ నయమే ఇప్పటికయినా తన స్థానం ఏమిటో గుర్తించింది. ఇంకా ఇంకా మమతలు పెంచుకుని, కలలుకంటూ బ్రతకకుండా తెలివి తెచ్చుకుంది. ఈ రోజునించి కృష్ణమోహన్ తనకేం కాడు. తన కాశ్రయం యిచ్చిన యజమాని! అతనికి తనకి మధ్య వుండాల్సింది యజమాని నౌకరుబంధం - అతను సహృదయుడు కనక స్నేహభావం వుంటే వుండొచ్చు. అంతకుమించి మరేం వుండడానికి వీలులేదు-మనసుకి పదే పదే నచ్చచెప్పుకుంటూ, తనని తను నమ్మించుకుంటూ, యిన్నాళ్ళు తన బుద్ధిహీనతని తిట్టుకుంటూ ఏవేవో నిర్ణయాలు చేసుకోసాగింది. ఆమె మనసు ఆమెకే తెలియని వేదనతో కుమిలి పోసాగింది. ఆ బాధలో తనేదో మోసపోయానన్న కసి, దానికి కారణం కృష్ణమోహన్ అన్నకోపం చోటు చేసుకుంది. తననేదో నమ్మించి మోసం చేసినట్లు బాధపడింది ఆ రాత్రంతా సరోజ.
    సినిమానించి వచ్చిన కృష్ణమోహన్ నవ్వుతూ సినిమా కబుర్లు చెపుతూంటే రోజులా సరదాగా ఆ సంభాషణలో పాల్గొనలేకపోయింది. సరోజ ముభావతని కొంచెం సేపటికి గుర్తించిన కృష్ణమోహన్ "అదేం అలా వున్నావు మొహం ఏమిటి అలా వుంది. వంట్లో బాగులేదా ఏమిటి?" అన్నాడు ఆదుర్దాగా. సరోజ "లేదు...బాగుంది, ఏంలేదు" అంటూ అవకతవకగా జవాబు చెప్పి, కంట్లో తిరగబోతున్న నీరు అతని కంటబడటం ఇష్టంలేక ఏదో పట్టుకొని వంటింట్లోకి వెళ్ళబోయింది. అతని పలకరింపుతో ఆమె మనస్సున అణగని ఆవేదన దుఃఖంగా మారింది. వంటింట్లో చప్పున కళ్ళు తుడుచుకుని మజ్జిగ తెచ్చింది. ఆమె మొహంమీద దుఃఖచిహ్నాలు అతని కంటబడ్డాయి. "ఏమిటి సరోజా యింకా ఎన్నాళ్ళని పోయినవాళ్ళకోసం ఏడుస్తావు....మరిచిపోవాలి, గుండె రాయి చేసుకోవాలి..." అంటూ సానుభూతిగా ఓదార్పుగా అన్నాడు. తన ఏడుపుకి సాకు దొరికిందని సరోజ ఈసారి కారే కన్నీటిని తుడుచుకోలేదు. ఆ కన్నీరు పోయినవారికోసం కాదని అతనికోసమని అతనికి తెలియదు. చేయి కడుక్కుని "అమ్మ పడుకుందా" అంటూ మేడమీదికి వెళ్ళిపోయాడు. ప్రక్కమీద వ్రాలి ఎందుకో తెలియని దుఃఖం పొంగిపొర్లగా కరువుదీరా ఏడ్చింది సరోజ.
    
                                                                     *    *    *

 Previous Page Next Page