Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 17


    "సరోజా...గుడ్ న్యూస్...నీకు ఉద్యోగం వచ్చేసింది. చూశావా నా మాట నిలబెట్టేసుకున్నాను. మరి నాకేం బహుమతి యిస్తావు..."సరోజని ఊరిస్తూ సరదాగా అంటూ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ చేతికిచ్చాడు. సరోజ ఆరాటంగా కాగితం అందుకొని చదువుకొని తృప్తిపడి "థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్....మీలాంటివారికి యిచ్చేందుకు నాలాంటి నిర్భాగ్యుల దగ్గర ఏముంటుంది? మేం యిచ్చేది మీ కవసరం ఉండదు. కంటికి అనదు." నిర్లిప్తంగా నవ్వి అంది సరోజ.
    "అదేమిటి అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు. ఇంత మంచి వార్త తెచ్చినందుకు ఎంతో సంతోషపడ్తావనుకున్నాను. మొహం అలా పెట్టావేమిటి, అసలు రెండు రోజులబట్టి నీ వెందుకో ఏదోలా ఉంటున్నావు..." కృష్ణ మోహన్ సరోజని గుచ్చి చూస్తూ అన్నాడు.
    "అవునమ్మా సరూ వంట్లో సరిలేదా ఏమిటి. రెండు రోజులుగా చలాకీగా కన్పించడంలేదు. ఇంట్లో డాక్టరుని ఉంచుకుని వంట్లో బాగులేకపోతే చెప్పవూ...చూడరా, సరోజని. కాస్త జ్వరం ఉందో ఏమిటో, తనకేం కావాలో నోరు తెరిచి చెప్పదు." సరస్వతమ్మ కూడా అంది.
    "అబ్బే, అబ్బే నాకేం లేదు. వంట్లో ఏంలేదు..." అంటూ బలవంతాన నవ్వు తెచ్చుకుని "మీకీయదగ్గది నాదగ్గిరేం ఉంది. మీరే చెప్పండి - అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను."
    "అదిగో మళ్ళీ రుణాలు, వడ్డీలు ఆరంభించకు...ఆ ఋణం అలా ఉండనీ, దానికి వద్దీగా నీవు నాకేం యీయాలో తెలుసా."
    సరోజ గుండె ఒక్క క్షణం కొట్టుకోడం మానింది. "ఏమిటి" అంది నీర్సంగా.
    "నీకమ్మని పాటలు రోజూ వినిపించలి. నీ కమ్మని గాత్రానికి తోడు సంగీతాన్ని నేర్చుకొని అదంతా నాకు వినిపిస్తూ ఉండాలి. సరోజా నీకింత చక్కని గొంతువుంది. మేష్టర్ని పెట్టి సంగీతం నేర్చుకోవాలి నీవు. మళ్ళీ మా సీతలా యింట్లోకివచ్చావు. మళ్ళీ సీతలా నీవూ సంగీత సరస్వతివి అవాలి....నా కోరిక యిదే. చెల్లించు....ఏం?" సరోజ చకితురాలయినట్లు చూసింది నమ్మలేనట్లు "నేనా సంగీతం నేర్చుకోనా, మీరు చెప్పిస్తారా....బాగుంది. ఇది చాల బాగుంది. యీ పెడుతున్న తిండి చాలనట్టు ఇంకా సంగీతం అంటూ నా మీద డబ్బు వృధా చేస్తారా... మతిగాని పోతుందా మీకు. మీకు పోయినా న మతి యింకా తిన్నగా వుంది. మీరు నా మీద ఖర్చు పెట్టేందుకు సిద్దంగా వున్నా పెట్టించేందుకు నేను సిద్దంగా లేను."
    "ఏమిటమ్మా సరోజా. ఎంతచేసినా నీవు పరాయి దాన నన్న భావం నీలో పోదా, మా సీతలా నిన్ను మేం చూసుకుంటున్నాంగాని మమ్మల్ని నీవు నీవాళ్ళన్నట్టు ఎందుకు అభిప్రాయపడవు....వాడంత ముచ్చటపడి అడుగుతుంటే కాదనకు. నీ పాటవింటూ మా వేదనలని మరిచి పోగలుగుతున్నాం రోజూ నీ సంగీతానికి అయ్యే ఖర్చు ఏపాటి, దానివల్ల మాకు లభించే మనశ్శాంతి ముందు. అన్నింటికి నీకు మొహమాటమే..." సరస్వతమ్మ మందలింపు ధోరణిలో అంది, సరోజ ఏమనాలో తెలియక నిస్సహాయంగా చూసింది. తరువాత చటుక్కున ఏదో గుర్తు వచ్చి "మీ కింత సంగీతం పట్ల అభిరుచి వుంటే మీ కాబోయే శ్రీమతికి చెప్పించుకో కూడదూ. మీ డబ్బు అనవసరంగా నా మీద వేస్టుచేసే బదులు..." హాస్యంగా అంటున్నట్లు అన్నా ఆమె మాటల్లో కాస్త కసి కూడా ఉంది.
    "ఆయనుంటే సామెతెలా ఉంది నీ మాట...గీత!- సంగీతం!! రెండూ ఉత్తర దక్షిణ ధృవాలు-ఆవిడగారు సంగీతం పేరు చెపితేనే పది మైళ్ళు పారిపోతుంది. అలాంటిది సంగీతం నేర్చుకుంటుందా....ఆవిడకి వీటిల్లో యింటరెస్టు లేదు. సరే ఆవిడ సంగతికేం నీవు నేర్చుకుంటావా లేదా ముందుచెప్పు."
    "నేర్చుకుంటుందిరా, మాస్టరిని కుదుర్చు అన్నింటికి అలా మొహమాట పడ్తూనే వుంటుంది" సరస్వతమ్మ అంది.
    "ఇటు ఉద్యోగం, అటు సంగీతం ఎలా కుదురుతుంది. నేనివన్నీ చేస్తే నాకింక టైమెక్కడ ఉంటుంది. యింటి సంగతి చూడడానికి...."
    "ఉదయం పది వరకు యింటి పనులు, తరువాత ఆఫీసు, సాయంత్రం సంగీతం, రాత్రి పురాణ కాలక్షేపం-" కృష్ణమోహన్ నవ్వుతూ టైం టేబుల్ చెప్పాడు.
    "అవును మరే, నాకింక రెస్టు అక్కరలేదు..."
    "అయితే యింటి పనులు మానేయ్..."
    "బాగుంది వరస- నా గొడవేదో నేను పడ్తాను. మీ యిష్టం వచ్చినట్లే కానీండి..."
    "ఊ....ఎవరికోసం ఒప్పుకుంటావు....ఇదిగోఅమ్మాయ్ ముందే చెప్పుతున్నాను. ఉద్యోగస్థురాలి నయానని యింక వెళ్ళిపోతాను అంటూ ఆరంభిస్తావేమో మళ్ళీ ఆ పిచ్చి ఆలోచనలు మానేసి, బుద్ధిగా ఆ డబ్బేదో మీ మామయ్యగారికి పంపేస్తూండు, నీవు చెయ్యాల్సింది అంతే. నీవు ఉండడానికి పర్మిషన్ నేను మీ మామయ్యగారి నించి పొందాను. అంచేత మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాననే ప్రసక్తి తేకూడదు..." అని సీరియస్ గా అన్నాడు.

 Previous Page Next Page