Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 15


    "ఆహా....కాదు....ముందు కాసేపు గార్డెన్సు కి వెళ్ళి అట్నించి సినిమాకి వెడదామని" ఆదుర్దాగా అడిగింది కృష్ణ మోహన్ యిబ్బందిగా చూశాడు. "పేషంట్లు కూచున్నారు..."
    గీతమొఖం ముడుచుకుంది ... "ఎప్పుడు పేషంట్లు మందులు రోగాలు....యివన్నీ ఎప్పుడు లేవుకనక..."ఆమె ముఖంలో అప్రసన్నత చూసి సరస్వతమ్మ "పోనీ యీ పూతకి ఆస్పత్రి మానేయకూడదురా. ఆ అమ్మాయి సరదాపడుతూంది. నెలరోజుల తర్వాత వచ్చింది" అంటూ కొడుకువంక చూసింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి నిస్సహాయంగా నవ్వి "సరే....పద...తప్పుతుందాదేవిగారి ఆజ్ఞ" అన్నాడు. గీత మొఖం వికసించింది. ఉషారుగా ముందుకు నడిచింది.
    "అమ్మా మీరూ రాకూడదూ అంతా సరదాగా వెడదాం" అన్నాడు సరోజవంక చూసి తల్లి సినిమాలు చూడడంమాని చాలాకాలం అయిందని అతనికి తెలిసినా సరోజ అక్కడ ఎదురుగా వుండగా మాటవరసకన్నా పిలవ లేదని అనుకుంటుందేమో - సరోజని తమతో రమ్మంటే ఏమనుకుంటుందో - పిలవాలో, వద్దో ఏ సంగతి తెల్సుకోలేక తల్లితో అన్నట్లు అన్నాడు. "సినిమాలు నాకెందుకులే నాయనా మీరిద్దరూ వెళ్ళండి..." అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ ఆ మాట అనగానే ఎక్కడ వస్తారో అన్నట్టు భయపడింది గీత. సరస్వతమ్మగారి జవాబు విని తేలిగ్గా నిట్టూర్చి యింకా వుంటే ఏమంటాడో అన్నట్టు చేయి పట్టుకుని 'కమాన్ లెట్స్ గో' అంటూ లాక్కెళ్ళి నట్టే వెళ్ళింది. వెడుతూ వెడుతూ ఎందుకో సరోజ మొహం చూశాడు కృష్ణమోహన్. ఆమె వారిద్దరిని మెరుస్తున్న కళ్ళతో చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎక్కడో దెబ్బతిన్న పక్షి బాధలన్తి నీడ కన్పించినట్లనిపించింది అతనికి.
    వారిద్దరూ కారెక్కి వెళ్ళేవరకు అలాగే చూసింది సరోజ కారు కదిలాక ఎందుకో సరస్వతమ్మ నిట్టూర్చి సరోజ వంక చూసింది. సరోజ చూపు ఆవిడ చూపు కల్సుకుంది. సరస్వతమ్మగారి మొహంలో భారం ఏమిటో సరిగా అర్ధంకాలేదు సరోజకి. సరోజ మొహంలో కన్పించే ఆశ్చర్యాన్ని చూసి చప్పున ఆవిడ మొహంలో భావం మార్చేసి, "ఆయనే బ్రతికివుంటే యీపాటికి ఆర్నెల్లక్రితం పెళ్ళి కావల్సింది....ఆయనకా అదృష్టం లేకపోయింది" ఆవిడ గొంతు రుద్దమయింది. సరోజకి గీత ఆ ఇంటికి కాబోయే కోడలని చెపుతూండేది సరస్వతమ్మ, గీతని చూసి సరోజ ఎవరని అడిగిన ప్రశ్నకి, సగంలో ఆగిపోయిన ఆ సంభాషణని గుర్తు తెస్తూ, "మరి, పెళ్ళెందుకు వెంటనే చేయకుండా యిన్నాళ్ళాగిపోయారు." ఆశ్చర్యంగా అడిగింది సరోజ.
    "ఏది, పెళ్ళిసంబంధం నిశ్చయం అయింది. తాంబూలాలు పుచ్చుకుని మరో నెలాపది రోజులకి ముహూర్తం పెట్టుకున్నారు. ఆలోగానే ఆయన పోయారు...ఆయన సంవత్సరీకాలు వెళ్ళకుండా కొడుకు పెళ్ళి ఎలా చేస్తాం? సంవత్సరీకాలు కాగానే ముహూర్తం పెట్టించాలి..."
    "ఓహో! అదా సంగతి....మీరెప్పుడూ చెప్పనే లేదే కోడలు సిద్దంగానే ఉందని" నవ్వుతూ అన్న ఆమె మాటలు ఆమెకే ఎందుకో పేలవంగా అన్పించాయి.
    "ఏది, ఈ నెల్లాళ్ళాయి ఎండాకాలం గీత వాళ్ళ నాన్న అమ్మగార్లతో కాశ్మీర్ వెళ్ళింది. ఆ అమ్మాయి వచ్చి పోతుంటే చెప్పాలని తట్టేది ఏమిటో ఆ విషయమే గుర్తులేదు..."
    "ఆవిడ చక్కగా ఈ వూళ్ళోనే ఉన్నారు. పెళ్ళికాక పోతేనేం లెండి. హాయిగా తిరుగుతూనే వుంటారనుకుంటాను ....మీ కోడలు మంచి మోడర్న్ గా ఉన్నారు. గొప్పింటి పిల్లకదూ వారి నాన్నగారు ఏం చేస్తారు?"
    "ఊ గొప్పింటిపిల్లే, అందులో ఒక్కర్తె కూతురేమో-ముద్దుకేం లోటులేదు. యింటిలో ఆడిందాట పాడింది పాట-"
    "అదృష్టవంతురాలు. మీలాంటి అత్తగారు, మీ అబ్బాయిలాంటి మంచివారు భర్తకావడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం."
    సరస్వతమ్మ అదోలా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెల్తి కనిపించింది సరోజకి. గీత, కృష్ణమోహన్ వారిద్దరిని చూస్తూంటే సరోజకీ ఎందుకో గీతపట్ల అదోరకం యీర్ష్య లాంటిది కల్గింది. తనని అంతగా ప్రేమించిన తన బావని గీత తీసుకుపోతున్నట్లు ఆమె మనసు బాధపడింది. తన వస్తువేదో అన్యాక్రాంతమయినట్లు ఆమె మనసు నొచ్చుకుంది. కృష్ణమోహన్ -- యింటిలో తిరుగుతూంటే తన కళ్ళముందు బావ కదలాడుతున్నట్టే ఉంది. అతనికి కాఫీ అందిస్తూ, అతని వస్తువులు, సర్దుతూ, అతనికి స్వయంగా ఫలహారం పెడుతూ తనకి దూరమయిపోయిన బావని అతనిలో చూసుకుంటున్నంత అదోరకం తృప్తిగా వుంది ఆమెకి యిన్నాళ్ళూ, బావ ఎటూపోలేదు ఈ రూపంలో తనదగ్గరే ఉన్నాడన్న సంతృప్తి ఆమెకి ఉండేది. రోజు రోజుకి కృష్ణమోహన్ దగ్గిర చనువు పెరుగుతున్న కొద్ది కృష్ణమోహన్ తనకి చేరువవుతున్నట్టు అన్పించేది. సరోజని ముందు మీరు అని పిలిచెవాడు. ఒకరోజు తనే "నన్నంత మర్యాద చెయ్యనక్కర లేదు. సరోజా అనండిచాలు" అంది. సరస్వతమ్మ కూడా "నీకంటే చిన్నది. మన యింటిలో పిల్లలా తిరుగుతుంది నీ చెల్లెలు లాంటిది. మీరు అంటూ ఏమిటా పిలువు. సరోజా "అంటూ పిలు" అంది. అప్పటినుండి ఏం కావల్సినా "సరోజా" అంటూ చనువుగా పిలిచి పనులు పురమాయిస్తూంటే బావ తను యింటిలో ఫ్రీగా మసలినట్టే అనిపించేది సరోజకి. నెల రోజులకే కృష్ణమోహన్ తన బావకాదన్న సంగతి మరిచి పోయేంతగా అతని పట్ల అభిమానం, చనువు ఏర్పడ్డాయి సరోజకి.
    కృష్ణమోహన్ కి ఆమె పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో సరోజకి తెలియదు. చాలా అభిమానంగా మాట్లాడేవాడు. చనువుగా పనులు చెపుతూ, యింకా చనువుగా పాటలు కోరి పాడించుకుంటూ, ఎప్పటి నుంచో సన్నిహితురాలైనట్లు, లేదా నిజంగా ఏ మేనత్తకూతురో అన్నంత సరదాగా మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతూంటే చటుక్కున ఎప్పుడన్నా సరోజమాటల తొందరలో మా బావ యిలా అన్నాడు యిలా అనేవాడు యిలా చేసేవాడు అనేది ఆ క్షణంలో కృష్ణ మోహన్ బావ కాదన్న నిజం గుర్తు రాగానే ఆమె మొహంలో విషాదఛాయలు తొంగి చూసేవి. మొహం చిన్నబోయేది. ఆమెని ఆ మూడ్ నుంచి మరపించేందుకు ప్రసంగం మార్చి మరేదో చెపుతూ నవ్వించి మామూలు మనిషిని చేసేవాడు.

 Previous Page Next Page