ఆఖరికి మావాళ్ళకి చూచాయగా ఆయన అలిగారని, పెళ్ళిలో లోటుపాట్లు కారణంగా నన్ను పుట్టింటికి పంపలేదని, పండగకి పిలిచి ఘనంగా సత్కరిస్తే వస్తారేమో అంటూ రాశాను.
ఆ మాటలు ఎంత మధనపడి, మనసు చంపుకుని ఆత్మాభిమానం బలిపెట్టుకుని రాశానో ఆనాడు. కేవలం అమ్మనాన్నలని చూడాలన్న ఆశ నాచేత అలా రాయించింది. ఈ నరకంనించి ఓ వారం రోజులు విముక్తి దొరికినా చాలని రాశాను.
ఆ ఉత్తరం రాశాక పండగముందు అన్నయ్యని మమ్మల్ని తీసుకు రమ్మని పంపారు. అన్నయ్యవచ్చి పిలిచాడు.
'నాకు శలవు దొరకదు రావడం కుదరదు' అన్నారు ఆయన ముభావంగా.
అన్నయ్య పాపం నచ్చచెప్పబోయాడు. 'ఒక్క పండగకీ రాలేదు, శలవు ఎందుకుదొరకదు, ఎలాగైనా రావాలి" అంటూ బతిమిలాడాడు.
'సారీ వీలవదని చెప్పాగా' అన్నారు ఆయన చిరాగ్గా.
అన్నయ్య నిస్సహాయంగా చూశాడు.
ఆయన ధోరణికి నామనసు వుడికిపోతూంది. అన్నయ్య మొదటిసారిగా మా యింటికివస్తే భార్య తరపు బంధువనైనా కనీసం నటనైనా కనపరిచి ఆధారంగా ఆహ్వానించలేదు. ఆయన అన్నింటికి ముభావంగా సమాధానాలు చెప్పారు.
ఆఖరికి అన్నయ్య "పోనీ కనీసం శారదనైనా పంపండి. పెళ్ళయి వెళ్ళాక అది మళ్ళీ రానేలేదు. అమ్మగోలపెడ్తూంది చూడాలని."
ఆరాటంగా జవాబు కోసం చూశాను.
ఆయన నా వంక ఒకసారి చూసి నా మొహంలో ఆరాటం చూసి నన్నేడిపించాలన్నట్టుగా "ఇప్పుడు తను వెడితే నాకు భోజనం యిబ్బంది. మరోసారి వస్తుందిలెండి" అని బెడ్ రూములోకి వెళ్ళి పోయారు.
ఉక్రోషం ముంచుకు వచ్చింది నాకు. ఆయన వెంట విసురుగా లోపలికి వెళ్ళాను. "నేను అన్నయ్యతో మా ఇంటికి వెడుతున్నాను. అమ్మ వాళ్ళని చూసి నాలుగు రోజులలో వస్తాను. స్థిరంగా అన్నాను.
"వీల్లేదు" అన్నారాయన కటువుగా.
"ఏం ఎందుకు వీల్లేదు. ఎంత మీరు నా భర్తయినా పుట్టింటికి కూడా వెళ్ళ వద్దనే హక్కు మీకులేదు. నేనేం మీకు వంటలక్కని కాదు. పెళ్ళి కాకముందు ఏం చేశారు భోజనానికి? అదే చెయ్యండి ఈ నాలుగు రోజులూ" ఆవేశంగా అన్నాను.
"నోరు మూసుకో అట్టే పేలకు. వెడితే నీకు నాకు సరి ..." అన్నారు నన్ను గుప్పిటలో పెట్టే ఆఖరి అస్త్రం వదిలి.
ఆ క్షణంలో వళ్ళు మరిచాను. ఇన్నాళ్ళ కసి, దుఃఖం, రోషం ముంచెత్తాయి. "సరే, మీకంతపెళ్ళాం అక్కరలేదనుకున్నప్పుడు నాకూ మొగుడు అక్కరలేదు. అడుగడుగునా మీ జులుము, అధికారం యింత సహించే ఓర్మినాకు లేదు. అణిగి మణిగి వుంటున్నానని ఇంకా అణగదొక్కితే ఎంత సాధుజంతువైనా తిరగబడ్తుంది అన్నది గ్రహించండి. మీ బెదిరింపులు ఆపండి. పెళ్ళాన్ని ఎలా వదిలేసారో నేనూ చూస్తాను" అన్నయ్య వింటున్నాడని తెలిసి గట్టిగా అరిచాను.
ఆయన నా కేకలకి అన్నయ్య ముందు ఆయన గుట్టు బయటపడుతుందన్న కోపంతో, ఉక్రోషంతో చెంప చెళ్ళు మనిపించారు. "నీ కెంత పొగరు. అన్నని చూడగానే పొగరు మరింత ఎక్కువైనట్లుందే.....ఫో.... ముందు ఇంట్లోంచి" అన్నారు.
అన్నయ్య మా మాటలువిని పడకగది దగ్గర వచ్చాడు ఆరాటంగా. మా యిద్దరి స్థితి చూపాడు.
"శారదా" అన్నాడు గాభరాగా ఆ పిలుపుతో ఇన్నాళ్ళు భరించిన ఆవేదనమరిదాగలేదు. అన్నయ్యా అంటూ అన్నయ్య గుండెలమీద వాలిపోయాను.
"అన్నయ్యా నన్ను మన ఇంటికి తీసికెళ్ళిపో అన్నయ్యా.... ఇంక నేనిక్కడ వుండలేను అన్నయ్యా నన్ను నరకంనించి తీసి కెళ్ళు" అంటూ బేలగా వెక్కి వెక్కి ఏడ్చాను.
జరిగిన స్మఘతనకి మతిపోయినట్లు అన్నయ్య- "ఊరుకో శారదా ఊరుకో. బావగారూ ఏమిటిది? శారదని కొట్టారామీరు" నమ్మలేనట్టు అన్నాడు.
ఆయన పరువు బైటపడిందన్నట్టు పరాభవం జరిగినట్టు మొహం గంటుపెట్టుకున్నారు.
బావగారూ ఏమిటిది? చదువుసంస్కారమున్న మీరు ఇలాగేనా ప్రవర్తించాల్సింది. ఆడదాన్ని కొట్టేంత నీచానికి దిగజారతారా! అదేం తప్పుమాట అంది? పుట్టింటికి వెడతాననడం అంత నేరమా? వాడికి ఆవేశం వచ్చి ధాటీగానే అడిగాడు.
"నేను వద్దన్న పని చేయడం నా కిష్టం ఉండదని తెలిసీ దానికా పొగరేమిటి? మాటకి మాట ఎదురు చెప్పడం ఎదిరించడం తప్ప మీ చెల్లెలికి నమ్రతగా ఉండడం తెలియదా? తెలియకపోతే తెలియ చెప్పండి."