Previous Page Next Page 
మైదానం పేజి 15


    నా ఆత్మనంతా ఆ విస్తీర్ణపు అంధకారంలో కలిపి నన్ను నేనే మరిచి కూచున్న నన్ను, వెనకనే రెండు చేతులు కావలించుకున్నాయి. నా జుట్టులోంచి వొచ్చి నా మెడని రెండు పెదవులు ముద్దు పెట్టుకున్నాయి.
    "ఎందుకు వొచ్చేశావు, నన్ను దాంతో వొదిలి?"
    "పాపం. నీమీద యెంత యిష్టం లేకపోతే, బంధువుల్నీ, మర్యాదనీ, యీ అర్థరాత్రి తన యింటినీ వొదిలి వొస్తుంది?"
    "నా కఖ్కర్లేదది."
    "దానికోసం నువ్వుపడ్డ బాధ జ్ఞాపకం లేదూ?"
    "అయితే-"
    "దానికిప్పుడల్లా వుండదూ? మూలనున్నదాన్ని లాక్కొచ్చి, మనసు లాగి నువ్విప్పుడు వొదిలేస్తే-"
    కొంచెం వూరుకున్నాడు.
    "నువ్వు రోషపడక, దానివేపు మాట్లాడటం నాకు బావుండలేదు. కోపంతో తగూలాడితే, నిన్ను ఓదార్చాలనిపిస్తోంది....ఈసారి వొస్తే దాన్ని తన్నేస్తాను. దానికి సిగ్గూ, గిగ్గూ యేమీలేదు."
    మొగవాళ్ళ హృదయం యెంతలో కఠినమౌతుందో, కాని స్త్రీలట్లా అమీర్ని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నామీద ప్రేమ పోయినా, నన్నూ అమీరిట్లానే అంటాడా అని భయమేసింది. జాలీ ప్రేమా యెంత దగ్గిరిగా వుంటాయి! ప్రేమ పోయిం తర్వాత, పోనీ జాలికూడా చూపరు.
    "అమీర్, నీకెందుకు ఆమెమీద అంత అసహ్యం కలిగింది?"
    "ఏం చేస్తుందంటే! నన్నంతా నలిపేస్తుంది. నాకు వూపిరాడనీదు. నా కాలు...."
    నాకు నవ్వొచ్చింది. సిగ్గుపడుతూ "నన్ను నువ్వు? అమీర్?" అన్నాను.
    "కాని ఆడది...."
    ఆ చీకట్లో యేడుస్తూ నన్ను తిడుతూ, బెదిరిస్తూ వొచ్చింది ఆ మనిషి. తనూ మంచిదే. అమీర్ మంచివాడే. నేను చెడ్డదానినైనాను.
    పాపం, ఒకత్తా, వొచ్చిన దోవనే తిడుతూ వెళ్ళేదాన్ని చూసి చాలా జాలేసింది నాకు ఏం చెయ్యను పాపం!

                               5

    ఆనాడు శరద్రాత్రి. అమీర్ వేళ్ళు నా మెడమీద శ్రుతులను నొక్కుతున్నాయి. నా జుట్టు గాలిలో అతని మొహంమీద ఆడుకుంటోంది. ఇద్దరూ ఆ వెన్నెల ప్రపంచంలో నీడలేని ఆ కొండమీద భూసౌందర్య మీక్షింప వచ్చిన దేవతలవలె నుంచున్నాము. కిందికి కళ్ళు తిప్పితే మా చిన్ని గుడిశా. నదీ, పటాలలోని బొమ్మలవలె కనిపించాయి. ఆనందంతో నా మనసు పరవశత్వం చెందింది. వరుసగా తరుముకుంటూ పావురాల్లాగు తెల్లనియీకెలమబ్బులు యెగుర్తున్నాయి. మా వెనక ఆ పాత కోట వుంది. తిరిగిచూసి, దాంట్లో మా సైన్యమూ, మంత్రులూ పరిజనమూ నిద్రపోతున్నట్లు మేము మాత్రం అర్థరాత్రి లేచి బైట నుంచుని మా వెన్నెల రాజ్యాన్ని పరీక్ష చేస్తున్నట్టూ; అప్పుడే లోపలికి పోయి హంసతూలికా పాన్పుపైన విశ్రమింప బోయేట్టూ అనుకుని ఆ సంగతులు అమీర్తో చెపుతున్నాను. ఇద్దరమూ తురకంలో మాట్లాడుతున్నాము.
    నా తురకం యేడిసినట్టే వుంది. కాని అమీర్ తురకం మాత్రం అద్భుతంగా వుంది. అట్లాంటి దర్జా రాజభాషకి తురకమే తగును.
    "సార్వభౌమా! భుజబలంతో జయించి, శత్రువుల దునుమాడి, బీడుపరిచిన యీ మహారాజ్యాన్ని అర్దరాత్రి నా కన్నుల పండువుగా ఒక్కసారి వీక్షింపనియ్యండి. కాని ఆ యేటి పక్కనున్న చిన్న కుటీర వాసుల్ని, ఆ నిర్భాగ్యుల్ని నా ప్రార్థనను మన్నించి ప్రాణాలతో వొదిలినందుకు సమస్త రాజమస్తక విరాజిత మకుటమణిమయ కాంతితేజములైన మీ పాదాలకు నమస్కరిస్తూ యున్నాను. ఆ క్షుద్ర కుటీరమున నున్న ఆ దంపతులెవరో మీరెరుగుదురా?"
    "ఆ, మన అమాత్యవరుడు చెప్పగా వింటిని. ఆ పురుషుడు మర్యాదయు, నీతియులేక కులాంగనల చెరువుటయే వ్రతముగా గల తుర్ ష్కాధముడట."
    "ఆ స్త్రీ...."
    "అది సిగ్గును, అభిమానమును త్యజించిన కులట....వారిని శిక్షింపక వదలగలనా?"

 Previous Page Next Page