కండ్లలో ఆ పిల్ల కాపురమున్నాది.
కంటి రెప్పలు వాలబోవురో రన్నయ్య-వాలబోవురో చిన్నయ్య.
ఇంతి చూచిన్నాడే చింతలను వలచిన్ను
నవ్వు పాయెను చాలదవ్వురో రన్నయ్య - చాలదవ్వురో చిన్నయ్య.
పదం పూర్తికాకుండానే ఇల్లు వచ్చింది. లచ్చమ్మ ఇంటిముందు కాచుకొని నుంచుంది. లచ్చమ్మను దగ్గరనుంచి చూచాడు గురువయ్య-నల్లపిల్ల గుర్తువచ్చింది. లచ్చమ్మ విచారంగా కనిపించింది-ఆమెలో ఏవో అవలక్షణాలు కనిపించాయి- గురువయ్య కంటికి ఆనాటికి! గురువయ్య కెందుకో చుర్రుమంది-కోపం వచ్చింది.
"ఎందుకో అట్ల నిలపడ్డవు-దయ్యమోలె."
"ఇంకా రాకపోతే...." నసిగింది లచ్చమ్మ-ఊతంగా తాగాడని గమనించే.
"రాకపోతే నిలబడ్తవులే-నడువ్ లోపలికి" నెట్టాడు లచ్చమ్మను. తూలిపడబోయి నిలదొక్కుకుని సాగింది.
"చెప్పుతుంటే నీక్కాదు-నడవమంటే నిలబడతావు."
లచ్చమ్మ నడుస్తూనే ఉంది. నుంచున్నట్లు కనిపించింది గురువయ్యకు. లచ్చమ్మ మీదికి ఉరికాడు. లచ్చమ్మ ఒక అడుగు ముందుకు వేసింది-పట్టు దొరక్క తూలి పడిపోయాడు గురువయ్య.
"పడేస్తవులే చినాల్" అని లేవబోయాడు గురువయ్య. లేవలేకపోయాడు. లచ్చమ్మ లేపింది. "పడేస్తవులే నన్ను" అని లచ్చమ్మ వీపుమీద గుద్దాడు. లచ్చమ్మ మాట్లాడలేదు. నడిపించుకుపోయి మంచం కుక్కిలో కూలేసింది.
"మాట్లాడవేం లంజె నేనేమన్న తాగొచ్చిన్ననుకున్నావా?" అని మూకుడులో అన్నం వేస్తున్న లచ్చమ్మను జుట్టు పట్టుకొని లాగాడు. లచ్చమ్మ చేతిలోని కుండ నేలమీద పడి పగిలిపోయింది.
"అన్నం పారేస్తవులే-మస్తీ ఎక్కింది" అని బాదాడు. దిండును గుద్దినట్లు గుద్దాడు. లచ్చమ్మ పల్లెత్తుమాట అనలేదు. దెబ్బలు కడుపుకు తగలకుండా కాపాడుకుంటూంది అంతే.
"మస్తీ ఎక్కింది లంజె మాట్లాడదు" అని బాది, బాది, మూలకు విసిరాడు.
మూలకుపడి ముకాన చేతులు పెట్టుకొని ఏడుస్తూంది లచ్చమ్మ.
ఏడుపు విని వీరావేశం వచ్చింది గురువయ్యకు.
"ఆఁయ్! ఏమనుకుంటున్నవ్ ఏడుస్తావు. పానాల్తీస్త" అని లంఘించాడు గురువయ్య.
ఇంట్లో దీపం రెపరెపలాడి ఆరిపోయింది.
మీదికి వచ్చిన గురువయ్యను చూచి వణికిపోయింది లచ్చమ్మ. మీద పడ్తున్న రెండు చేతుల్నూ చీకట్లోనే పట్టుకుంది లచ్చమ్మ.
"ఇగ ఏడవను. ఏడవనన్న గద ఏడవను. ఇగ పొయ్యి పండుకో. పండు కొమ్మంటున్న" అని లాక్కొచ్చి మంచంమీద పడేసింది.
"ఆఁ అట్లన్నవు బాగుంది. పండమన్నవు గద పంటున్న. ఆఁ. ఇంకే మన్నన్నచో ఖబడ్దార్" అని మంచంలో పడిపోయి గుర్రుపెట్టాడు గురువయ్య.
ఆ రాత్రి నిద్రపోలేదు లచ్చమ్మ.
9
తెల్లవారింది. కాని గురువయ్యకు ఇంకా తెల్లవారలేదు. లచ్చమ్మ లేచి జొన్నలు దంచింది. జొన్నన్నం ఉడికేవరకు లేచాడు గురువయ్య. ముఖం కడుక్కున్నాననిపించుకొని, బుక్కెడు బువ్వ బుక్కి బయటపడ్డాడు. బయట పడ్డాడనే కాని ఎక్కడికి పోవాలో అర్ధం కాలేదు. నల్లపిల్ల ఇంకా అతన్ని వదల్లేదు. పనికి వెళ్ళబుద్ది కాలేదు. నల్లపిల్లను వెదకడానికి బయలుదేరాడు. నల్లపిల్ల కులాన్ని గురించిగాని, అంతస్థును గురించిగాని ఆలోచించలేదతను. నల్లపిల్ల ఏమనుకుంటూంది కూడా ఊహించలేదు. నల్లపిల్లను నిన్న చూచాడు. అంతే ఆమె అతని మనసులో నిండిపోయింది. ఆ పిల్లను చూడాలి- ఆ తరువాత మాట్లాడాలి. అంతే మరో ఆలోచన లేదు. యుక్తాయుక్త విచక్షణ లేదు.
ఆమె కోసం గౌండ్లబుచ్చమ్మ ఇంటి ముందుదాకా వెళ్ళాడు. అక్కడ ఆగిపోయాడు. లోనికి పోలేడు. బయట నుంచోలేడు. పచార్లు చేశాడు. కొంతసేపు రాతిమీద కూలబడ్డాడు. ఎదిరి చూచాడు. ఆమె కనిపించలేదు. అక్కన్నుంచి బయల్దేరాడు.
మంచినీళ్ళ బావి దగ్గర నుంచున్నాడు-కొంతసేపు తరువాత రావి చెట్టు నీడన కూర్చున్నాడు. అనేకమంది ఆడవాళ్ళు బావికి వస్తున్నారు. కడవలు నింపుకుంటున్నారు. పోతున్నారు. వారు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కిలకిల నవ్వుతున్నారు. వెళ్ళిపోతున్నారు. అందరినీ దీక్షగా చూస్తున్నాడు గురువయ్య. అతనికి పిల్లలు కనిపించారు. పడుచువాళ్ళు కనిపించారు__ముసలివాళ్ళు కనిపించారు. నల్లపిల్ల కనిపించలేదు. నల్లపిల్లను మించిన అందం కనిపించింది. అందవికారం కనిపించింది. నల్లపిల్ల కనిపించలేదు.
గురువయ్య చెరువుకు వెళ్ళాడు. నీళ్ళబండ దగ్గర నుంచున్నాడు. మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. నీళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళను చూడసాగాడు. పచ్చని పసిడి రంగు పడతులు కనిపించారు. చామనచాయ దానాలు కనిపించారు. నలుపురంగు నవలలు కనిపించారు, నల్లపిల్ల కనిపించలేదు. అలా చాలా సేపు కూర్చున్నాడు. పొద్దు ఎక్కిపోతూంది. నీలాటిరేవు కాళీ అయింది.
గురువయ్యకేమీ తోచలేదు. ఎక్కడికి పోవాలో అర్ధం కాలేదు. ఆలోచిస్తూ మర్రినీడ తలవాల్చాడు. ఒక మర్రి ఆకు రాలింది. దానికాడ నోట్లో పెట్టుకుని చెరువువైపు తిరిగాడు. చెరువు అందంగా వుంది. చెరువు నిండా తామరపూలు విచ్చికుని ఉన్నాయి. తామరాకుల మీద నీటిబొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. తామరపూల వనంలా ఉంది చెరువు. నీరు కనిపించడం లేదు. ఆకులు-పూలే. ఆకులు మీద ముత్యాలు అల్లల్లాడుతున్నాయి.
చెరువు అందంగా ఉంది. అది ఆకర్షించింది గురువయ్యను.
గురువయ్య లేచి కూర్చున్నాడు. చెరువునూ చెరువులోని తామరలనూ, ఆకులనూ, ఆకుల మీది నీటిబొట్లనూ చూశాడు. ఆ చెరువంతా అతని ఎదలో చేరి నట్లయింది. రోజూ చూస్తున్నాడు గురువయ్య చెరువును. ఇవ్వాళే ఇంత అందంగా ఉంది. ఎందుకో అర్ధం కాలేదు గురువయ్యకు.
తామరపూలు_--వందలు వేలు ఎర్రగా రెక్కలు విచ్చుకున్నాయి. ఎండకు మెరుస్తున్నాయి.
కొన్ని మొగ్గలు, కొన్ని అరవిచ్చినవి-కొన్ని పూర్తిగా విచ్చినవి, విచ్చుకున్నవి.
పూలు! తామరపూలు!
ఆకర్షించాయి గురువయ్యను.
పూలన్నీ తన ముందుకు వచ్చి కుప్పబడాలనుకున్నాడు. పూలన్నీ తనవి కావాలి- తనవే కావాలి. అవును అన్నింటినీ తెంపాలి. తెంపి తన ముందు పేర్చుకోవాలి. అవి చెరువులో వుండరాదు. తన ముందు ఉండాలి. అక్కడెందుకుండాలి అవి? తన దగ్గర ఉండాలి.
లేచాడు గురువయ్య చెరువువైపు నడచాడు. చెరువు అందంగా వుంది. అంతే అతనికి కనిపించింది. చెరువు లోతు-తామరతీగ అతనికి గుర్తు రాలేదు. అందం చుట్టూ అనేక ప్రమాదాలుంటాయని అతనికి తెలియదు. గులాబీకి ముళ్లుంటాయని అతడెరుగడు.
అందమే అలాంటిది.
అది ఏదీ తెలియనీయదు.
గురువయ్య చెరువులో కాలుపెట్టాడు. పూలు దూరంగా ఉన్నాయి. కనిపించలేదు. చేయి చాచాడు. ఒక మొగ్గ అందింది. అందుకున్నాడు. మరో చేతిలో పట్టుకున్నాడు. మరో దానికోసం సాగాడు. కాలికి అడుగు అందడం లేదు. పూవు దూరంగా వుంది. అది రమ్మని పిలుస్తూంది. చేయి చాచాడు, అందడంలేదు.