Previous Page Next Page 
హైజాక్ పేజి 15

పాసెంజెర్స్ కేబిన్ లో కలకలం మొదలయింది.
"అప్పుడే ఢిల్లీ వచ్చేసిందా?" అన్నాడు, రెండు పాదాలకీ రెండు రంగుల సాక్సు వేసుకుని వున్న ప్రొఫెసరు సుందరం అయోమయంగా.
"మళ్ళీ కిందికి దిగిందా? ఎందుకు?" అంటున్నారు ఇంకెవరో.
"బ్లడీ ఇనెఫిషియెన్సీ! బ్లడీ ఇనెఫిషియెన్సీ!"
"ఉండండి! ఏదో అనౌన్స్ మెంటు!" స్పీకర్లో మోనికా గొంతు వినబడింది.
"ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఒక పక్షి విమానాన్ని తాకడం వల్ల విమానం స్వల్పంగా దెబ్బతిన్నది. రిపేర్లకి కొద్ది సమయం పట్టవచ్చు. రిపేర్ల కోసం విమానాన్ని హాంగార్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతవరకు ప్రయాణీకులు ఇన్నరు లాంజ్ లో కూర్చోవాలని కోరుతున్నాము. థాంక్యూ?!"
గుండె లయ తప్పినట్లయింది శతృఘ్నకి. రిపేర్లు పూర్తిఅయ్యే దాకా ఈ అమ్మాయి అరవకుండా కనిపెట్టి వుండాలి తను! ఈలోగా ఆ అమ్మాయి ఎవరికన్నా కళ్ళతోనే సైగచేస్తే? ఎవరైనా గమనించి అనుమానపడితే?
అతను భావగర్భితంగా ఇక్బాల్ వైపూ, విక్టర్ వైపూ చూశాడు. వాళ్ళ మొహాల్లో కూడా టెన్షన్ కనబడుతోంది.
అనౌన్స్ మెంటు వినగానే మిగతా ప్రయాణీకులు రకరకాలుగా రియాక్టు అయ్యారు. కొంతమంది చిరాకుపడ్డారు. కొంతమంది పెద్దగా తిట్టడం మొదలెట్టారు. ఇంకొంతమంది అదేదో తమాషా అయినట్లు నవ్వుతూ లేచి నిలబడ్డారు.
విమానం దగ్గర మెట్లు అమర్చారు. తలుపులు తెరుచుకున్నాయి. ప్రయాణీకులు దిగడం మొదలెట్టారు.
పైలెట్ సవ్యసాచి కిందకిదిగి, టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళ్తుంటే గబగబ అతని వెనకే వచ్చాడు రాజకీయ నాయకుడు వెంకట్రావు.
"ఆగవయ్యా! ఒక్క నిమిషం!"
ఏకవచన ప్రయోగం వినబడగానే కమ్చీదెబ్బ తగిలినట్టు తిరిగి చూశాడు సవ్యసాచి. వెనుకవస్తున్న శాల్తీకి పెద్ద బొజ్జ, ఖద్దరు బట్టలూ, కడుపు నిండిన రాజకీయవేత్త అని తెలిసిపోతోంది.
అనదలుచుకున్న మాటలను కష్టంమీద మింగేశాడు సవ్యసాచి.
"ఎస్?"
"పిట్ట తగిలితే విమానం దెబ్బతినడమేమిటయ్యా విడ్డూరం! అది హిట్టా, రాకెట్టా?" అని తన విట్టుకి తనే పొట్ట కదిలేలా నవ్వాడు.
"విమానం చాలా స్పీడుగా వెళుతుంది కదా! అందుకనే డామేజి!" అన్నాడు సవ్యసాచి.
"విమానం స్పీడుకి ఆ పిట్ట ఈకా, తోకా ఊడి గాల్లో కలిసి పోవాలి గానీ ఇంత విమానం ఎందుకు దెబ్బతింటుందీ?"
ఒకసారి టెర్మినల్ బిల్డింగ్ వైపు చూసి, తర్వాత సహనంగా చెప్పాడు సవ్యసాచి. "ఆగివున్న ఒక కారు విండ్ స్క్రీన్ మీదికి ఒక గులకరాయి విసిరారనుకోండి ఏ ఎజిటేషన్లోనో అది పగలవచ్చు. పగలకపోవచ్చు. కానీ అదే రాతిని గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు మీదికి విసిరితే, విండ్ స్క్రీన్ పగిలిపోయే అవకాశం చాలా హెచ్చుగా వుంటుంది. అలాంటప్పుడు ఐదారు కిలోల బరువు వుండే ఒక కొంగ, గంటకు ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడుతో వస్తున్న విమానాన్ని తాకితే, అది విండ్ స్క్రీన్ పగల గొట్టుకుని లోపలికి వచ్చిపడే ప్రమాదముంది. అదే జరిగింది ఇప్పుడు."
"అలాంటప్పుడు పక్షి కనబడగానే విమానాన్ని ఈ పక్కకో, ఆ పక్కకో తీసుకెళ్ళి తప్పించవచ్చుగా?"
నవ్వాడు సవ్యసాచి.
"చిన్న నోటిలెక్క చెబుతాను మీకు. విమానానికి వెయ్యి మీటర్ల దూరంలో ఒక పక్షి ఎదురయిందనుకోండి. పైలట్ దాన్ని చూడడానికి 0.1 సెకెండు పడుతుంది. ప్రమాదాన్ని గుర్తించడానికి 0.5 సెకెండ్లు పడుతుంది. విమానం దిశ మళ్ళించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఒక సెకండూ, కంట్రోల్స్ ని అందుకోవడానికి 0.4 సెకెండ్లూ, ప్లేన్ ని పక్కకి మళ్ళించడానికి రెండు సెకెండ్లూ పడతాయి. అంటే మొత్తం ఎన్ని సెకెండ్లు?"
"ఎన్ని సెకెండ్లా? ఇందులో చూడు!" అని తన రిస్టువాచీ చూపించి నవ్వాడు వెంకట్రావు. తను చేసే ప్రతిపనిలోనూ తనకు మిగిలేదెంత అని గుణించటానికి తప్ప, మిగతా లెక్కలు చెయ్యడం చేతకాదు అతనికి. తనకి తెలియని విషయాన్ని హాస్యంలోకి దింపేసి తప్పించుకోవడం ఆయన టెక్నిక్కులలో ఒకటి.
"గొరిల్లా వెధవా!" అని మనసులోనే తిట్టుకుని, పైకి మాత్రం ప్రసన్న వదనంతో అన్నాడు సవ్యసాచి. "ఇదంతా చెయ్యడానికి నాలుగు సెకెండ్లు పడుతుంది"
"మరింకేం దొబ్బుడాయీ? విమానం పక్కకి తిప్పడానికి నాలుగు సెకెండ్లు చాలదుటయ్యా?"
"కానీ ఈ వెయ్యి మీటర్ల దూరం ప్రయాణం చెయ్యడానికి విమానానికి మూడూ పాయింట్ ఆరు సెకండ్లు మాత్రమే పడుతుంది. అంటే అప్పటికే పక్షి విమానానికి తగులుతుందన్న మాట!"
"చంపావు పో! అయితే పెద్ద రిపేరే అంటావు ఇప్పుడు?"
వాళ్ళ వెనకనే వస్తున్న శతృఘ్న చెవులు రిక్కించి వింటున్నాడు సవ్యసాచి సమాధానం కోసం. అతని భుజంమీదకు వాలి వంటిమీద స్పృహలేనట్లు డీలాపడిపోయి నడుస్తోంది సుజాత. ఆమె భుజం చుట్టూ తన చెయ్యి వేసి నడిపిస్తున్నాడు శతృఘ్న.

 Previous Page Next Page