Previous Page Next Page 
సీతాచరితం పేజి 15


                                బాలకాండ


    ఒకసారి నారదుడు వాల్మీకి దగ్గరకి వచ్చాడు. నారదుడు సకల సాస్త్ర పారంగతుడు. బ్రహ్మ నిష్ఠాగరిష్ఠుడు. తపస్వి. నారదుని చూచాడు వాల్మీకి. సంతోషించాడు. ఆదరించాడు. ఆసనం వేశాడు. నారదుడు కూర్చున్నాడు. అప్పుడు వాల్మీకి అడిగాడు.


    "ఈ లోకంలో ఉన్న నరుల్లో గొప్పవాణ్ని గురించి నాకు తెలియపర్చు. అతడు గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ధృడవ్రతుడు కావాలి. సదాచార సంపన్నుడు, భూతదయ గలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, దర్శనీయుడు కావాలి. ధైర్యశాలి, జితక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయలేనివాడు, ఉగ్రుడైన దేవతలను సహితము జయించగలవాడియి ఉండాలి. అలాంటి నరుణ్ని గూర్చి తెలుసుకోవాలని ఉంది. మీరు త్రిలోక సంచారులు. మీకు తెలియంది లేదు. కాబట్టి అలాంటి పురుషుణ్ని గూర్చి తెలియజేయండి.


    వాల్మీకి ప్రశ్న అడిగాడు. నారదుడు విన్నాడు. సంతసించాడు. ఇలా అన్నాడు :-


    "మహర్షీ! మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు చెప్పిన గుణాలన్నీ గొప్పవి. ఆ గుణాలన్నీ గల నరుడు దొరకటం కష్టం. ఐనా అలాంటివాడు ఒకడున్నాడు. అతడు ఇక్ష్వాకుల వంశంవాడు రాముడు. అతడు జితేంద్రియుడు, తేజోవంతుడు, మహావీరుడు, నిష్ఠాగరిష్టుడు, బుద్ధిమంతుడు, పండితుడు, శ్రీమంతుడు, శత్రుభయంకరుడు.


    విపులాంగుడు, మహా బాహువు, పెద్ద దడవడలు కలవాడు. విశాలమైన వక్షం కలవాడు. చక్కని లలాటం కలవాడు. అతని శిరస్సు సుందరమైంది. అవయవములు క్రమవిభక్తములు. స్నిగ్ధవర్ణుడు, పినోరస్కుడు, దీర్ఘనేత్రుడు,  లక్ష్మీవంతుడు, సత్యసంధుడు, ప్రజారంజకుడు, జ్ఞాని, శుచివంతుడు, బ్రహ్మసముడు, స్వధర్మ నిరతుడు, వేదవేదాంగపారంగతుడు. తత్త్వజుడు, శ్రుతిమంతుడు, ప్రతిభావంతుడు, సాధుపుఋషుడు. అదీనాత్ముడు, నదులకు సముద్రంలా సత్పుఋషులకు అతడే ఆశ్రమం. అతనికి స్వపర బేధాలు లేవు. ప్రియదర్శకుడు. సకల గుణాభిరాముడు. గాంభీర్యంలో సముద్రుడు. ధైర్యానికి హిమవంతుడు. పరాక్రమానికి విష్ణువు. చల్లదనానికి చంద్రుడు. ఓర్పుకు భూమి. కోపానికి ప్రళయాగ్ని. దాన ధర్మాలకు కుబేరుడు. ధర్మప్రవర్తనానికి యముడు. అలాంటి రాముడు దశరథుని కుమారుడు."


    అలా రాముని గుణగణాలన్నీ చెప్పాడు. తర్వాత రాముని కథ సాంతం సంగ్రహంగా చెప్పాడు.


    ఇక్కడ మనమొక విషయం తెల్సుకోవాలి. ఆనాటి నారదుడు ఈనాటి జర్నలిస్టులాంటివాడు. వార్తలంద జెయ్యడం అతని పని. అతడు అన్ని లోకాలకు స్వేచ్ఛగా తిరగగలడు. ఈ నారదపాత్ర పురాణాల సృష్టి. పురాణాలన్నింటిలోను మనకు నారదుడు కనిపిస్తాడు. ఏదో రకంగా కథాగమనానికుపరిస్తాడు. తగాదాలు పెట్టడంలో ఇతడు మొగనాడు. ఏదో రకంగా కథాగమనాని కుపకరిస్తాడు. తగాదాలు పెట్టడంలో ఇతడు మొనగాడు. అందుకే ఇతనికి 'కలహభోజనుడు' అని పేరు కూడ వచ్చింది.


    రామాయణానికి సంబంధించినంతవరకు ఈ ఒక్కసారి తప్ప నారదుడు మళ్లీ కన్పించడు. ఇప్పుడు కూడ అతడు నిర్వహించిన పెద్దపాత్రేమి లేదు. రామునికథ వాల్మీకికి చెప్పాడు. వాస్తవంగా రామాయణంలో అతడు నిర్వహించగల పాత్రలెన్నో వున్నాయి. ఐనా అతడు కనిపించడు. కాబట్టి ఈ పాత్ర వాల్మీకి సృష్టి కాదేమోననిపిస్తుంది.


    మానిషాద


    ఒకనాడు వాల్మీకి తమాషా నదికి వెళ్లాను. నది అందంగా వుంది. చక్కగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున అందమైన అడవి వుంది. ప్రకృతి సుందరంగా వుంది. నది సుందరంగా వుంది. అక్కడ ఒక చెట్టుమీద రెండు పక్షులు కనిపించాయి. అది క్రౌంచ మిధునం. అవి ఉల్లాసంగా వున్నాయి. ఆనందంగా ముక్కులు పొడుచుకుంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ దృశ్యం ముద్దనిపించింది వాల్మీకికి. అలా చూస్తుండిపోయాడు. అంతలో ఎక్కడినుంచో ఒకబాణం వచ్చింది. అది వేగంగా వచ్చింది. మగపక్షి గుండెలో గుచ్చుకుంది. అది గిరగిర తిరిగి నేలకొరిగింది. రక్తంలో కొట్టుకోసాగింది. చెట్టుమీదున్న ఆడపిట్ట ఈ దృశ్యాన్ని చూచింది. దాని మనస్సు క్షోభించింది. ఇది వలవల ఏడ్చింది.


    వాల్మీకి హృదయం వెన్నలాంటిది. ఈ దృశ్యం చూచింది. హృదయం ద్రవించింది. అతడు భరించలేకపోయాడు. కోపం పెల్లుబికింది. చుట్టూ చూశాడు. ఇందుకు కారణం ఎవరాఅని. అతనికి ఒకబోయవాడు కనిపించాడు. వాడిచేతిలో బాణముంది. వాణ్ణి చూసి మండిపడ్డాడు వాల్మీకి, శపించాడు.


    "ఒరేయ్ కిరాతుడా! ప్రేమలోవున్న పిట్టల్లో ఒకదాన్ని కొట్టావురా" నీకెన్నటికి కీర్తి కలుగదు. పో"


    అది వాల్మీకి నోటినుండి వచ్చిన శాపం. అది నిజమే. అది వాల్మీకిని ఆశ్చర్యపరచింది. ఆ వచ్చిన మాటలు సమానమైన అక్షరాలు కలిగి వున్నాయి. పాదబద్ధం, లయబద్ధమై వున్నాయి. ఏమిటిది, తననోట లయబద్ధమైన పద్యం వచ్చినట్టుందే! అనుకున్నాడు. అతనికేదో వింత అనుభూతి కల్గింది - గుండె గంతులు వేయసాగింది. అతని ధ్యాస  పద్యం నుండి కదలటం లేదు. దాన్నే మననం చేసుకుంటున్నాడు. అతన్ని అంత ఆశ్చర్యపరచిన శ్లోకం ఇలావుంది.


    "మానిషాది ప్రతిష్ఠాం త్వ మగమశ్సాశ్వతీ స్సమాఃI
    యత్ర్కౌంచ మిధునా దేక మవధీః కామమోహితం.II


    అది మనకు తొలిపద్యం. అలా పుట్టిందంటారు కవిత. వాల్మీకి హృదయంలోని వేదన పెల్లుబికి శ్లోకంగా మారింది. అతడు వ్రాయాలనుకున్నది కాదు - అలా వచ్చింది. హృదయం స్పందించినప్పుడు, భావం ఉప్పొంగినప్పుడు కవిత దానంతట అదే ఉద్భవిస్తుందనటానికి ఈ కథ ఎంతో ఉపకరిస్తుంది. హృదయపు అవధులు దాటి అక్షరంగా మారింతే కవిత. అది లయబద్ధం. స్వరబద్ధం తప్పకుండ అవుతుంది. వేదనలోనుంచి కవిత్వం ఆవిర్భవిస్తుంది. శ్లోకమే శ్లోకత్వం వహించింది. "శ్లోకం శోకత్వ మాగతః"

    
    రామాయణ రచన


    వాల్మీకి తన ఆశ్రమానికి చేరాడు. ఐనా అతని మనసులో ఆ పద్యం మసలుతోనే వుంది. అతని మనోఫలకం మీద క్రౌంచపక్షులే కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో బ్రహ్మ వచ్చాడు.


    బ్రహ్మ వాల్మీకిని చూశాడు. అతని పెదవులపైన నడయాడుతున్న చిరునవ్వు చూశాడు. గ్రహించాడు. అన్నాడు "మహర్షీ! నీ వెందుకంత ఆనందంగా వున్నావో నాకు తెల్సు. నీవు పలికింది శ్లోకం. నీవు కావ్యాన్ని రచించాలి. రాముని కథ వ్రాయాలి. నీకు నారదుడిదివరకే కథ చెప్పాడు. ఆ కథ అంతా నీకు కరతలామలకం అవుతుంది. నీవు వ్రాసినకథ పర్వతాలు, నదులు వున్నంతవరకు వుంటుంది. కాబట్టి రామచరిత్ర రచించు" అని చెప్పి బ్రహ్మ మాయమైపోయాడు.


    వాల్మీకి రామునికథ తెల్సుకోవటానికి ధ్యానించాడు. అప్పుడు అతనికి రామకథ అంతా కనిపించింది. అతడు రామాయణ కావ్యం రచించాడు. అది సముద్రంలా రత్నాలతో నిండి ఉన్నది. వినేవారికి ఇంపుగా వుంటుంది. అలాంటి కావ్యాన్ని వాల్మీకి, రాముడు పట్టాభిషేకం జరిగినప్పుడు రచించాడు. అందు 24 వేల శ్లోకాలున్నాయి. 500 ల సర్గలున్నాయి. ఉత్తరకాండ సహితంగా ఏడు కాండలు గలది రామాయణం.

 Previous Page Next Page