Previous Page Next Page 
దావాగ్ని పేజి 15


    ఎవరు?

 

    తనా?

 

    "సర్: మనం అనుకుంటున్నాం కదా, కొత్త బిజినెస్ పెట్టాలని ఆ కొత్త ఏరియాకి ఈ అమ్మాయిని ఏజెంట్ గా అపాయింట్ చేద్దామనుకుంటున్నాను మీరు పర్మిషనిస్తే"

 

    మధ్యలో ఎవరన్నా ఆ మాటలు విన్న అసలు విషయం గ్రహించే ప్రమాదం లేకుండా నిదానంగా కాస్త డొంక తిరుగుడుగా చెప్పాడు ప్రతాప్.

 

    "ఫీల్డులో ఉన్నావు. నీకే బాగా తెలియాలి రాణా: నువ్వు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవచ్చు"

 

    "ఐ థింక్ షీ ఈజ్ ఓకే సర్"

 

    "షీనా?"

 

    చిన్నగా నవ్వాడు ప్రతాప్.

 

    "అవును సర్: ఈ పని చెయ్యాలంటే హీ కంటే షీనే బాగుంటుంది"

 

    అవతలనుంచి మాట్లాడుతున్న వ్యక్తి గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించింది వినీలకు

 

    ఉహు: గొంతు కాదు. ఆ ఉచ్చారణ, అదీ తనకి బాగా పరిచయం అయినట్లు తోస్తోంది.

 

    ఎక్కడ విన్నది ఆ గొంతుకని?

 

    ఆలోచిస్తూ సంభాషణని వింటోంది వినీల.

 

    అవతలి వ్యక్తి అంటున్నాడు.

 

    "రాణా: మన కంపెనీ క్రిటికల్ కండిషన్ లో ఉందని నీకు తెల్సు. కంపెనీని స్వాధీనం చేసుకోవాలనీ, అది సాధ్యంకాకపోతే కంపెనీని సర్వనాశనం చేసెయ్యాలనీ చూస్తున్నారు ప్రత్యర్థులందరూ. అందులో ఒకడు నీకు తెలుసుగా... అతను మరీ డేంజరస్. అందుకని అతను బిజినెస్ చేస్తున్న ఏరియాలోనే మన బ్రాంచ్ ఓపెన్ చేయక తప్పదు. నీ కొత్త ఏజెంట్ కి ఇదంతా వివరంగా చెప్పు"

 

    అప్పుడు చటుక్కున గుర్తు వచ్చింది వినీలకి.

 

    ఆ గొంతుని చాలాసార్లు టీవీలో విన్నది తను, ఆ మనిషిని చిన్న తెరమీద చూసిందికూడా:

 

    అంటే ఆయన...

 

    ఓహ్ మైగాడ్:

 

    ఇది నిజంగానే నిజమా?

 

    "యస్సర్" అని వినీలవైపు తిరిగి "విష్ చెయ్యి" అన్నాడు ప్రతాప్ గుసగుసగా.

 

    "నమస్తే సర్" అంది వినీల మంత్ర ముగ్ధురాలిలా.

 

    "నమస్తే: ఐ విష్ యూ గుడ్ లక్" అన్నాడు అవతలి మనిషి.

 

    ఆ తర్వాత కొన్ని సంకేతాల తర్వాత వైర్ లెస్ కాంట్రాక్టు కట్ చేశాడు ప్రతాప్.

 

    ఇంకా కలగంటున్న దానిలా అలా కూర్చునే వుండిపోయింది వినీల.

 

    ప్రతాప్ తనవైపు తిరగ్గానే "ఆయన..." అంది సందిగ్ధంగా.

 

    "అవును. నువ్వు ఊహించింది నిజమే" అన్నాడు ప్రతాప్. "అంతటి vvvip స్వయంగా ఈ విషయంలో ఇంట్రెస్టు చూపిస్తున్నారంటే ఇది ఎంత ముఖ్యమైన పని అయుంటుందో గ్రహించు"

 

    "ఇంతకీ పనేమిటో చెప్పలేదు" అంది వినీల ఎగ్జయింట్ గా.

 

    ఒక్కసారి ఊపిరి తీసుకుని చెప్పడం మొదలుపెట్టాడు ప్రతాప్. "అరేబియా సముద్రంలో వుంది చిత్రద్వీప్" అని మొదలెట్టి ఆ ద్వీపం వివరాలన్నీ చెప్పి ఆ ద్వీపం ప్రెసిడెంట్ జనరల్ భోజాకి ఇండియా అంటే ఉన్న అకారణమైన ద్వేషాన్ని గురించి చెప్పాడు. తర్వాతన్నాడు. "గత పది పన్నెండు నెలలనుంచి జనరల్ భోజా ఇండియాకు ఎసరుపేట్టే ప్రయత్నాలు ఏవో రహస్యంగా మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది. ఈ విషయంలో అతనికి పరోక్షంగా సహాయ సహకారాలు అందించడానికి లెక్కలేనన్ని దేశాలు తయారుగా వున్నాయి. జనరల్ భోజా ఎప్పుడు యేం చేస్తాడో ఎవరికి తెలియదు. అందుకని కోటలోనే పాగా వేయాలి మనం. మనలో ఒకళ్ళు అతనికి సన్నిహిత వర్గంలో చేరాలి. మనం అంటే ఈ పరిస్థితులలో నువ్వన్నమాట"

 

    "నేనా?" అని మళ్ళీ అంది వినీల.

 

    "నాకో సందేహం:"

 

    "ఏమిటి?"

 

    "ఇన్నాళ్ళనుంచి మనవాళ్ళెవరూ ఈ పని చేయలేకపోయారా? అంటూ ఐ మీన్ అతని సన్నిహితవర్గంలో మన ఏజెంట్లు ఎవరూ ఇంత వరకూ చేరలేకపోయారా?"

 

    "చేరారు"

 

    "ఎవరు అది? తెలుసుకోవచ్చా?"

 

    "సాధారణంగా ఒక ఏజెంట్ కి మరో ఏజెంట్ వివరాలు చెప్పడు. కానీ అక్కడ వున్న మన ఏజెంటుకి రోజులు దగ్గర పడ్డాయి. ఆమె ఎక్కువ రోజులు బ్రతికి వుండకపోవచ్చు"     

 

    "ఆమెనా? ఎవరామె?" అని అడిగింది వినీల ఆశ్చర్యంగా.

 

    "జెన్నీ... జెనిఫర్: అంటే భోజా భార్య"

 Previous Page Next Page