Previous Page Next Page 
చెక్ పేజి 15


    "బాబూ ! నన్ను కొట్టండి, తిట్టండి పడతాను. జాతర మాత్రం మధ్యలో ఆపు చేయకండి" స్థిరంగా అన్నాడు యానాది పెద్ద.

 

    "నువ్వేందిరా చెప్పేది. నేను చెబుతున్నాను. అందరూ వినండి. ఇక జాతర జరగదు" అని భుజంగం వెళ్ళడానికి ఒకడుగు ముందుకేశాడు.

 

    ఆయనకు త్వరగా ఇంటికెళ్ళి, కూతుర్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తూ వుంది.

 

    "ఆగండి బాబూ" గర్జించాడు పెద్ద.

 

    ఆజ్ఞాపిస్తున్నట్టు అలా పెద్ద మాట్లాడతాడని భుజంగంతోపాటు అక్కడున్న వాళ్ళల్లో ఎవరూ వూహించలేదు.

 

    భుజంగం ఠక్కున ఆగాడు. మామూలు స్థితిలో అయితే ఆయన ఆగివుండేవాడు కాడు. ప్రస్తుతం ఆయన తను అపరాధిలా ఫీలవుతున్నాడు..

 

    "బాబూ ! మర్యాదగా చెబుతున్నాను ఇనుకోండి. గంగమ్మకు కోపం తెప్పించడం మీకే కాదు యానాదులకూ అరిష్టమే. మేం ఆ తల్లిని నమ్ముకునే ఎగిసిపడే సముద్రంలోకి పోతాం. భయంకరమైన అడవిలోకి పోతాం. ఆ తల్లి దీవెన లేకపోతే మేం ప్రాణాలతో తిరిగిరాం. అందుకే బాబూ ! జాతర ఆపకండి" పెద్ద ఒక్కో మాటను వత్తి పలికాడు.

 

    భుజంగం చాలా తగ్గాడు. "నిజమే పెద్దా. నేనూ ఒప్పుకుంటాను, జాతరను మధ్యలో ఆపు చేయకూడదని. అలా అని ఒక్కగానొక్క కూతుర్ని బసిలిగా చేయమంటావా? నువ్వే చెప్పు" ఆయన కళ్లల్లో నీళ్లు వూరాయి. అంతకు ముందున్న గాంభీర్యం మాయమై నిస్సహాయత ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంది.    

 

    "ఇందులో నా ఇష్టమూ లేదు, కష్టమూ లేదు బాబూ. అంతా గంగమ్మ తల్లి ఇష్టం. ఇంతకాలం చీటీల్లో వచ్చిన పేర్లన్నీ మా యానాదుల ఆడబడుచులవే. మేమెప్పుడైనా ఎదురు చెప్పామా? ఇక్కడున్న వాళ్ళల్లో చాలామంది తమ చెల్లెళ్ళని, కూతుర్లని ఆ దేవికి అప్పగించారు. అప్పుడు మేము తిరగబడ్డామా? జాతరను ఆపు చెయ్యమన్నామా? చెప్పండి బాబూ."

 

    "నేను చెప్పేది విను పెద్దా. ఇక నుంచి కన్యార్పణం వద్దు. బసిలిగా చేసేది వద్దు. అందుకు ఒప్పుకుంటే జాతర జరుగుతుంది. నాకు అభ్యంతరం లేదు."

 

    "అలా అనకు బాబూ. మనం ఇష్టం వచ్చినట్టు ఆచారాలూ మార్చకూడదు. యధా ప్రకారం జరగాల్సిందే" పెద్ద అలాగనడంతో యానాదులంతా "అవును జరగాల్సిందే" అని గట్టిగా అరిచారు.

 

    ఆ అరుపులకు రైతులు బెదిరారు.

 

    పరిస్థితి చేతి దాటిపోయిందని భుజంగం గ్రహించాడు.

 

    గంగమ్మ భక్తి యానాదుల తలకెక్కి వుంది. అంత మూఢ భక్తిని వాళ్ళకు ఎక్కించింది కూడా భుజంగమే.

 

    ఆయనకు నిజం చెప్పి ఈ గండం నుంచి బయట పడాలనుంది. కాణీ ఆయనకు గొంతు పెగలడం లేదు.

 

    కాగడాలు కొడిగట్టిపోతున్నాయి. సన్నటి ఎర్రటి వెలుగు పరుచుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా మండిపోతున్నట్టుంది.

 

    "బాబుగారు ఏమీ చెప్పలేకపోతున్నారు. నలుగురు ఆడాళ్లు వెళ్ళి అమ్మాయిగార్ని తీసుకురండి" యానాది పెద్ద ఆజ్ఞాపించాడు.

 

    నలుగురు స్త్రీలు కదిలారు.
    


    రైతు స్త్రీలంతా ఏడుస్తున్నారు. మా గీర్వాణి అక్కయ్య కూడా ఏడుస్తూ వుండడం నాకు కనిపించింది.

 

    పిచ్చిపట్టిన వాడిలా అయిపోయాడు భుజంగం. ఆయన ఒక్కవుదుటున పెద్ద దగ్గరకు పరుగెత్తి చేతులు పట్టుకున్నాడు. "పెద్దా కాళ్ళు మొక్కుతాను. నన్ను క్షమించు. నన్నూ, నా కూతుర్ని వదిలేయ్. మేం వెళ్ళిపోతాం. జీవితంలో ఇటువైపు రాము. న పొలాలన్నీ మీరే తీసుకోండి చిల్లి గవ్వ నాకొద్దు పెద్దా! నన్ను మన్నించి మా ఇద్దరినీ వదిలిపెట్టు" ఆయన కళ్ళు నీళ్ళను వర్షిస్తున్నాయి.

 

    రైతుల మనసు కరిగిపోతూ వుంది. యానాదులతో తిరగబడితే ప్రమాదమని తెలుసు కనుక వూరుకుండిపోయారు. యానాదులు వేయిమందున్నారు. రైతులంతా కలిపితే ముప్పై మంది కూడా లేరు. అందువల్ల వస్తున్న ఆవేశాన్ని దిగమింగుకున్నారు.

 

    యానాదుల్లో మాత్రం చలనం లేదు.

 

    పెద్ద ఏం మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడతాడోనని అందరూ చెవులు రిక్కించారు.

 

    "బాబూ ! మీ పొలాలు మాకొద్దు, మీ బిల్డింగులూ మాకొద్దు. ఇన్ని రోజులు ఎలా వున్నామో అలాగే మమ్మల్ని వుండనివ్వండి. మా రెక్కల కష్టం మాకుంది. తరతరాలుగా ఆ కష్టాన్ని నమ్ముకునే బతుకుతున్నాం. మనందరికీ గంగమ్మ తల్లి దిక్కు అనుకున్నాం. ఇప్పుడా తల్లిని వద్దని మీరెళ్లిపోతానంటున్నారు. అది మీ ఇష్టం. అయితే జాతరను ఆపుచేయడానికి ఒప్పుకోం. జాతర మామూలుగా జరిగిపోవాల్సిందే. రేపు మీరెక్కడకు పోయినా మాకు అనవసరం.

 

    యానాది పెద్ద ఆపాడు.

 

    "అవును. అలా జరగాల్సిందే" మళ్ళీ కొన్ని వందల కంఠాలు వంత పాడాయి.

 

    "అయ్యో" అని భుజంగం కింద కూలబడిపోయాడు.

 

    అంతలో నలుగురు స్త్రీలు అనూరాధను తీసుకొచ్చారు. ఆమెను చూడగానే భుజంగం పరుగున వెళ్ళి కౌగిలించుకుని ఏడుపు అందుకున్నాడు.

 

    విషప్పురుగు మందారం పువ్వుమీద వాలినట్టు ఆమె వణికిపోయింది. తండ్రిని అంత బేలస్థితిలో ఎప్పుడూ చూడకపోవడం వల్ల ఆమె ఖంగు తింది.

 

    అనూరాధలో ఇంకా యవ్వనం తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం లేదు. ఆ ప్రయత్నంలో వున్నట్టుంది.

 

    "ఆమెను అలంకరించండి."

 

    పెద్ద ఆజ్ఞాపించడంతో నలుగురు స్త్రీలు బలవంతంగా అనూరాధను లాగారు.

 

    భుజంగం బ్రతిమాలుతున్నా ఎవరూ వినడం లేదు.

 

    రైతులంతా నిస్సహాయంగా చూస్తుండిపోయారు.

 

    గుడిపక్కగా అనూరాధను తీసుకెళ్లారు. అక్కడామెకు ఒళ్ళంతా పసుపు రాశారు. తలంటి స్నానం చేయించారు. ఇంతక్రితం గంగమ్మకు కట్టిన పట్టుచీరను విప్పి ఆమెకు కట్టారు. నుదుటున రూపాయి బిళ్ళ సైజులో కుంకుమ పెట్టారు. జడలో మల్లెల దండను వుంచారు.

 

    ఏం జరుగుతూ వుందో ఆమెకు తెలియడంలేదు.

 

    పట్టుచీర కట్టేటప్పుడు గింజుకుంది. కుంకుమ పెట్టుకోనని మొండికేసింది. అలంకరిస్తుంటే వద్దంటూ ఏడ్చింది.

 

    కానీ ఫలితం లేకపోయింది. ఆ నలుగురు స్త్రీలకు మరో నలుగురు స్త్రీలు చేరారు. జరగాల్సిన అలంకరణను బలవంతంగా చేశారు.

 

    అనూరాధను ఆ వేషంలో చూడగానే భుజంగానికి మతిపోయింది. పెద్ద కాళ్ళమీద సాష్టాంగం పడ్డాడు. తనను తన కూతుర్ని వదిలేస్తానంటే కాళ్ళను వదలనని కన్నీళ్ళతో ప్రార్థించాడు.

 

    యానాది పెద్ద లొంగలేదు.

 

    ఈ దారుణానికి మనసు కరిగి ఏడుస్తున్నట్టు వర్షం మొదలైంది. కాగడాలు చివరి వెలుగులను పంచుతున్నాయి.

 

    "రేయ్. ఆ అమ్మాయిని గుడిలోకి నెట్టండ్రా" అన్నాడు పెద్ద.

 

    అనూరాధను గుడిలోకి తీసుకుపోయారు.

 Previous Page Next Page