Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 15


    ఆ బార్ లో రాత్రి పదిగంటల వరకూ అలా తాగుతూనే ఉన్నాడు అవినాష్.

 

    తాగి, తాగి అసలు తనెక్కడున్నాడో- తనెవరో మర్చిపోయాడు.

 

    ఆఖరికి-

 

    బార్ వాళ్ళే ఆటో పిల్చి ఎక్కించి, అతి కష్టంమీద అవినాష్ నోటంట ఎడ్రస్ కనుక్కొని 'రూం'కి పంపించారు.

 

    అంత మత్తులో కూడా అవినాష్ ని అతను కంటున్న రంగుల ప్రపంచం వెంటాడడం మానలేదు.


                                         6


    "సార్... మీకు ఫోన్..." స్టాఫ్ రూంలో కూర్చున్న అవినాష్ దగ్గరకు ప్యూన్ వచ్చి చెప్పాడు.

 

    ఎక్కణ్ణించి' అంటూ గబగబా పరుగులాంటి నడకతో లైబ్రరీ హాల్లో ఉన్న ఫోన్ దగ్గరికి నడిచాడు. పక్కకు తీసి పెట్టిన రిసీవర్ని తీసుకుని "హలో... అవినాష్... హియర్..." అన్నాడు.

 

    "హలో... అవీ... నేను... రోష్ణిని... నీకో గుడ్ న్యూస్..."

 

    రోష్ణి గొంతులో ఎంతో ఆనందం వినబడింది.

 

    "చెప్పు..."

 

    "మా డాడీకి నీ గురించి చెప్పాను..."

 

    "ఏమన్నారు..."

 

    "అంతా... ఓకే... కానీ నీతో ఓసారి మాట్లాడతామన్నారు."

 

    "ఈజిట్... ట్రూ... రోష్ణి... ఈజిట్... ట్రూ..." ఆత్రంగా అడిగాడు అవినాష్.

 

    "గాడ్ ప్రామిస్... అవీ... ఒక అరగంట క్రితం ఆయన బాంబే బైల్దేరి వెళ్ళారు... అంతకు ముందే... నేను మన విషయం అంతా చెప్పాను... నీకిష్టమేనా... అని ముందు నన్నడిగేరు. నేనిష్టమేనని చెప్పాను... అసలు నేనే వచ్చి నీకీ విషయం చెప్దామనుకున్నాను... ఇంట్లో ఎవరో రెలెటివ్స్ ఉన్నారు... మా ఆంటీ ఎక్కడికీ కదలనివ్వడం లేదు...అంచేత ఫోన్ చేస్తున్నాను... రేపు మార్నింగ్ హోటల్ ద్వారకాకు వస్తావా... డిటైల్స్... అక్కడ చెప్తాను... ఓ.కే..."

 

    "ఇంకేమైనా చెప్పు..." ఆనందంగా అన్నాడు అవినాష్.

 

    "కబుర్లు చెప్పుకుంటే టెలిఫోన్ డిపార్ట్ మెంట్ వారు ఊరుకోరు... మార్నింగ్ కలుద్దాం... ఓ.కె. ఈ రోజు రాత్రంతా కలలు కని... రేపు రావడం లేటు చేస్తే విడాకులిచ్చేస్తారు జాగ్రత్త..." హెచ్చరించింది రోష్ణి.

 

    "అసలు ఎన్నిగంటలకి రావాలి... టైం చెప్పకపోతే... ఎలా డియర్..."

 

    "టైం చెప్పింది" రోష్ణి.

 

    "ఇదిగో... నాకో మంచివార్త చెప్పినందుకు... నీకో ముద్దు..." అని రిసీవర్ మీద గట్టిగా చప్పుడు చేస్తూ ఓ ముద్దు పెట్టాడు అవినాష్.

 

    "షటప్... ఫోన్ పెట్టెయ్..." రోష్ణి గసిరింది.

 

    "ముద్దు పెట్టటానికి నోరు తెరవఖ్ఖర్లేదు. డార్లింగ్."

 

    నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసిందామె.

 

    లైబ్రెరీ హాల్లోంచి ఆనందంగా బయటికొస్తున్న సమయంలో-

 

    "సార్... మళ్ళీ మీకు ఫోన్..." ప్యూన్ పిలిచాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అవినాష్.

 

    "అవినాష్ గారేనా..."

 

    "ఎస్..."

 

    "నేను... డాక్టర్ మాలని..."

 

    "హలో... డాక్టర్... ఏమిటి విశేషం..." ఆ మాట అన్నాడే కానీ అప్పటికే అవినాష్ కి చెమట పట్టేసింది.

 

    "ఏం లేదు... రోజు రోజుకీ గౌతమి కండిషన్ చాలా వీగ్గా తయారైపోతోంది... అంచేత ఓ వారం రోజులు శెలవు పెట్టించాను... ప్రస్తుతం మా నర్సింగ్ హోంలో ఉంది... మీరోసారి చూడ్డానికి వస్తే ఆమెకు ధైర్యంగా ఉంటుంది..." చెప్పింది డాక్టర్.

 

    "కంప్లైంట్ ఏవిటి డాక్టర్..."

 

    "ఏం లేదు... బెంగ..."

 

    "మీరైనా చెప్పండి డాక్టర్... ఏజ్ ఎ ఫ్రెండ్ గా ఈ సమయంలో ధైర్యాన్నివ్వాల్సింది మీరే..." అన్నాడు అవినాష్.

 

    "వైనాట్ మిస్టర్... కానీ... ఓ మాట... ఏ రిజిష్టార్ ఆఫీసులోనో నలుగురు పెద్దల సాక్షిగా మీరిద్దరూ పెళ్ళి చేసేసుకుంటే... అప్పుడు గౌతమికి నీర్సం ఉండదు... ఏమంటారు...?"

 

    "నేనదే విషయం గౌతమితో చెప్పాను మేడం... ఓ పది రోజుల్లో... అంతే... ఆ తర్వాత ఈ ఇబ్బందులుండవు... ఓ.కె. మేడం... నేను ఇవాళ రాలేను... రేపు ఈవెనింగ్ వస్తాను... మా గౌతమిని కొంచెం జాగ్రత్తగా చూస్తుంటారు కదూ..."

 

    "నాతో చెప్పాలా... మీరు..." అవతల నుంచి డాక్టర్ మాల గొంతు.

 

    "సీ యూ మేడం..." ఫోన్ పెట్టేశాడు అవినాష్.

 

    ఆ సమయంలో అతనికి చాలా కోపం వచ్చింది. "ఇడియట్" అని అతని నోటంట ఓ తిట్టుకూడా వచ్చింది. ఇంతకీ ఎవర్ని ఇడియట్ అని తను తిట్టాడో అతనికీ తెలీదు.


                                                  *    *    *    *


    మర్నాడుదయం-

 

    సరిగ్గా పదిగంటలకు ద్వారకా హోటల్లో ఉన్నాడు అవినాష్.

 

    మరో అయిదు నిమిషాలకు అక్కడ కొచ్చింది రోష్ణి.

 

    అప్పుడా అమ్మాయి పంజాబీ డ్రెస్ లో ఉంది.

 

    "ఏం తీసుకుంటావ్... స్వీటా... టిఫినా..." అడిగాడు అవినాష్.

 

    "ఉదయాన్నే స్వీటెవడు తింటాడు..." విసుక్కుంది రోష్ణి.

 

    "మరి... పెసరట్ తింటావా..." అడిగాడు.

 

    తలూపింది.

 

    బేరర్ రెండు పెసరట్లు తెమ్మని చెప్పాడు.

 

    "ఇప్పుడు చెప్పు..." ఆమె కళ్ళవేపు చూస్తూ అన్నాడు.

 Previous Page Next Page