ఇందుమతి అలాంటి వాతావరణంలో రావడం అదే మొదటిసారి. అందుకే ఏదోలా వుంది. జానపద గీతంలో ధ్వనిస్తున్న శృంగార భావనకు, టేబిళ్ళ ముందు కూర్చున్న మగాళ్ళు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు.
"తలుపులేని- వచ్చినావా- నాయురాలా
దీపమార్పి- వచ్చినావా- నాయులారా
సందమామ- తెచ్చినావా- నాయులారా
సేమంతులు తురిమినావా- నాయులారా"
హుషారుగా వుంది పాట. గొంతు కూడా బాగానే వుంది.
ఒక వారగా నిలబడి చూస్తున్న ఇందుమతి- పక్కనుంచి వెళ్ళిపోతున్న బేరర్ ని పిలిచి అడిగింది.
"యువరాజ్ అంటే అతనేనా?"
"ఆయనే"
"ఆయన్తో ఒక్కసారి మాట్లాడాలి అర్జంటని చెప్పు" అంది ఇందుమతి. బేరర్ నేరుగా వెళ్ళి యువరాజుతో చెప్పాడు.
అప్పుడు పక్కకు తల తిప్పి చూశాడు యువరాజు.
"ఆ ఫిగరు- మనకు తెలీదు. మనతో పనేంటట" కళ్ళెగరేస్తూ అన్నాడు యువరాజు.
"హేమమాలిని బాబులాంటి అమ్మాయి" అని మనసులోనే అనుకుంటూ "ఏమో నాకేం తెల్సు... వెళ్ళు" అని బేరర్ మిత్రుడు సలహా ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
మరి తప్పలేదు యువరాజుకి. చేతిలోని మైకును పక్కనున్న వాడికిచ్చేసి, చెంగున డయాస్ దూకి ఇందుమతి దగ్గరకొచ్చాడు యువరాజు. "నా పేరే యువరాజు చెప్పండి" అంత లేసి కళ్ళున్న ఇందుమతి కళ్ళవేపు సూటిగా చూస్తూ అడిగాడు యువరాజు.
అతన్ని దగ్గరగా చూస్తూనే ఆశ్చర్యపోయింది ఇందుమతి. ముత్యాలనాయుడు పరిస్థితి కూడా అలాగే అయింది.
"ఏంటలా చూస్తున్నారు...? నాతో మీకేమిటి పని?" తలెగరేస్తూ అడిగాడు యువరాజు.
"ఏం లేదు బాబూ... ఇప్పుడు నీ దగ్గరకు వస్తుండగా మార్గమధ్యంలో మీ తమ్ముడు బీచొడ్డున ఐదుగుర్ని చితకబాదేస్తుండగా చూశాం. మీ తమ్ముడు- నవ్వూ అచ్చం ఒకలాగే ఉన్నారని ఆశ్చర్యపోతున్నాం" అన్నాడు ముత్యాలనాయుడు ఆశ్చర్యంగా.
"అతను మీ తమ్ముడా? మీరు ట్విన్సా?" అడిగింది ఇందుమతి.
దానికి యువరాజు ఒక్కక్షణం ఆలోచించి... "ఓహో... రాజుని చూసారా! వాడలాంటి పనులే చేస్తుంటాడు. ఇద్దరం కవలలం కాకపోయినా అచ్చం అలాగే వుంటాం. వాడ్ని చూసి నన్ననుకోవడం నన్ను చూసి వాడనుకోవడం ఇక్కడ మామూలే" అని నవ్వి-
"చెప్పండి- ఏం పని మీదొచ్చారు" అని అడిగాడు యువరాజు.
"నా పేరు ఇందుమతి మీతో పనుండి వచ్చాను... విశ్వరూపశర్మగారు పంపించారు" అంది ఇందుమతి.
"విశ్వ...రూప...శర్మ... ఆయనెవరు?" కంగారుగా అడిగాడు.
"ఫేమస్ ఆర్కియాలజిస్టు. పర్లాకిమిడి ప్యాలెస్... "ఓ.... వొ... వొ... ఆయనా పిచ్చి శర్మగారా... సడన్ గా మిడ్ నైట్ వచ్చి తలుపు తట్టి... ఓల్డు తుపాకులున్నాయా... పిడిబాకులున్నాయా... అని అడుగుతాడు. ఆయనా? ఆయన పంపాడంటే... కొంచెం ఆలోచించాలి తప్పదు" ఇందుమతిని ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు యువరాజు- కొంటెగా నవ్వుతూ.
"నేనేం... పిచ్చాసుపత్రి నుంచి రాలేదుగానీ... ఈ మార్కెట్ లోంచి మనం బయటపడితే మీతో మాట్లాడాలి" అన్నది ఇందుమతి అతని చూపుల్ని అసహనంగా ఎదుర్కొంటూ.
"మంచి మూడొచ్చి పాటలు పాడుకుంటుంటే మీరేంటండీ మధ్యన నా దగ్గర పాత కత్తులూ, కటార్లూ ఏమీ లేవండి. పాపం... నన్ను వదిలెయ్యచ్చు గదండీ" అన్నాడు డయాస్ కేసే చూసుకుంటూ.
యువరాజు జోవియల్ అన్న విషయం అర్ధమయింది ఇందుమతికి.
"పాటలెప్పుడైనా పాడుకోవచ్చు. పాత కత్తులకోసం రాలేదు" తనే ఆ హాల్లోంచి బయటకు నడుస్తూ అంది ఇందుమతి.
"ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ లో నన్నొదిలేయాలి" తనూ, ఆమె వెనకే నడుస్తూ అన్నాడు యువరాజు.
బయట లాన్ లో ఓ నాలుగు కేన్ పర్చివున్నాయి.
"రండి. ఇక్కడ కూర్చుందాం. లేడీస్ ఫస్ట్" ఎయిరిండియా మహారాజులా ఫోజు పెడుతూ అన్నాడు యువరాజు.
నవ్వింది ఇందుమతి.
"థాంక్యూ" అంది కూర్చుంటూ.
"ఒక ఇంపార్టెంట్ వర్కు మీద, విశ్వరూపశర్మ గారి సజెస్ట్ చేస్తే మీ దగ్గర కొచ్చాను. మిమ్మల్ని చూడగానే మీరాపనికి ఖచ్చితంగా సరిపోతారని తెల్సింది" ఉపోద్ఘాతంగా అంది ఇందుమతి.
"మనకి పొగొడ్తలు పడవు... మేడమ్... న్యూస్ రీల్సు వద్దు... సినిమాలో కొచ్చేయండి."
"ట్రెజర్ హంటింగ్ కి మీ కోపరేషన్ కావాలి" చెప్పింది మెల్లగా.
"ట్రెజరా... హంటింగా... అంటే... నిధుల కోసం అన్వేషణ్... అహ... హ... హ... హ..." పెద్దగా నవ్వాడు యువరాజు.
"ఎందుకలా నవ్వుతున్నారు" చికాగ్గా అడిగింది ఇందుమతి.
"మీరిప్పుడు... విఠలాచార్య సినిమాగానీ, స్టీల్ బర్గ్ సినిమాగానీ- చూసొస్తున్నారా- చెప్పండి- ఫర్వాలేదు. ఈ కాలంలో నిధులేమిటండీ- బాబూ నిధుల్ని వెతకాలంటే, అడవులుండాలి గదా... అడవుల్నే అందరూ కొట్టుకుని అమ్మేసుకుంటున్నారు. మీకా విషయం తెలియనట్టుంది" అన్నాడు యువరాజు నవ్వుతూనే.
"నిధులు అడవుల్లోనే ఉంటాయని మీకెవరు చెప్పారు" తిరిగి ప్రశ్నించింది ఇందుమతి.
"మరెక్కడుంటాయి- జగదంబా జంక్షన్ లో- రోడ్డు మధ్యన వుండవు కదా" కళ్ళు చిత్రంగా తిప్పుతూ అన్నాడు యువరాజు.
ఆ కళ్ళల్లో, ఇందుమతికి అమాయకత్వం కన్పించింది. అతనితో మాట్లాడుతూనే హావభావాల్ని పసిగడుతోందామె.
"నిధులెక్కడుంటాయో- తర్వాత చెపుతాను గానీ... ట్రెజర్ హంటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా లేదా... ఊరికే కాదు లెండి"
"అంటే-"
"ఒక ఏడాదిపాటు మీరు నాతో ఉండాలి. ఈ పన్నెండు నెలలూ మీ పూర్తి బాధ్యత నాది. బయటుంటే మీరెంత సంపాదిస్తారో- దానికి రెట్టింపు ఇస్తాను షిప్ డ్యూటీలో ఉంటే- సంవత్సరానికి మీరెంత సంపాదిస్తారు" అడిగింది ఇందుమతి.
"మీరు నా గురించి అన్నీ తెల్సుకునే వచ్చారన్న మాట. అంటే కొత్తరకం జాబ్ అన్నమాట- ఓకే మన ఇన్ వాల్వ్ మెంట్ ఉంటే ఓకే. గ్రీక్ షిప్ లో నేను పనిచేస్తే అన్ని ఖర్చులూ పోను, నాకు మూడులక్షలు నికరంగా ఉంటాయి."
"ఆరు లక్షలు ఇస్తాను సరేనా" టక్కున అంది ఇందుమతి.
"ఆరు లక్షలా! డబ్బులే?!" ఆశ్చర్యాన్ని అభినయించాడు యువరాజు. ఇందుమతి సంగతి అతనికేం అర్ధం కావడంలేదు.
"లేకపోతే రెండు రాళ్ళిచ్చి ఇవ్వి, అమ్ముకోమంటే- నేను ఛస్తాను జోకేశాడు తిరిగి.
"కొత్త కరెన్సీనే ఇస్తాను సరేనా" అంది ఇందుమతి కూడా నవ్వుతూ.
"అయితే మన వర్కు ఎప్పట్నించి స్టార్టు అవుద్ది. మనం ఏం చెయ్యాలి స్పష్టంగా చెప్పండి. నేను ప్రిపేర్ కావాలిగదా" అన్నాడు యువరాజు వెంటనే. అంత త్వరగా తేలిగ్గా యువరాజు ఒప్పుకుంటాడని ఊహించని ఇందుమతి ముత్యాలనాయుడు ఆనందోద్వేగానికి లోనయ్యారు. విశ్వరూపశర్మ బ్యాగ్రౌండ్ గురించి బాగా తెలిసున్న యువరాజు అది నిజమే అయివుండొచ్చని భావించి వెంటనే ఒప్పుకున్నట్లు ఇందుమతి, నాయుడు ఊహించలేదు.
"అవన్నీ రెండు రోజుల తర్వాత చెప్తాను" అంటూ హేండ్ బేగ్ ఓపెన్ చేసి- అందులో అయిదు బండెల్స్ ని తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ డబ్బువేపు కళ్ళప్పగించి చూస్తున్నాడు యువరాజు.
"ఇది ఎడ్వాన్స్- ఈక్షణం నుంచి మీరు మా మనిషి. ఈ జాబ్ కు మీరు ఫిట్ అవుతారో లేదో కొన్ని టెస్టులుంటాయి. గుర్తుంచుకోండి. ఇంకొక విషయం. మనమధ్య జరిగిన వ్యవహారం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. అర్ధమైందా" సీరియస్ గా అంది ఇందుమతి.
"అర్ధమైంది. ఇన్ని గొడవలుంటాయని ఇప్పుడే అర్ధమయింది. డబ్బులిచ్చారు. సరే చిన్న పిల్లాడికి పెట్టినట్లు ఈ టెస్టులేంటండీ బాబూ! డైరెక్టుగా చెప్పండి హండ్రెడ్ మైల్స్ స్పీడ్ లో కారుని డ్రైవ్ చెయ్యమంటారా. అదీ బిజీ సెంటర్ లో- లేకపోతే ఏరాడో కొండకి తాడు కట్టేసి ఎక్కమంటారా- సముద్రంలో ఆరుగంటలు అలుపులేకుండా ఈత కొట్టమంటారా- మొసలి నోట్లో చెయ్యి పెట్టమంటారా!
మీకీ యువరాజు గురించి పూర్తిగా తెలీదు జగమొండిని నేను... నమ్మితే ప్రాణాలిస్తా- లేకపోతే కసుక్కున కాటు వేస్తా అర్ధమైందా- ఒకసారి గ్రీక్ షిప్ లో ఏమైందో తెల్సా" ఏమైందో చెప్పడం ప్రారంభించబోయాడు యువరాజు.
"ఇప్పుడొద్దు నేనెప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పాలంతే. ఎందుకో తెలుసా?" అంది రాబోతున్న నవ్వును పెదాల మాటున బిగ పట్టుకుని.
వెంటనే గ్రహించేశాడు యువరాజు.
"మళ్ళీ కలుద్దాం" లేచి నిలబడింది ఇందుమతి.
"రేపు సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు- జగదంబా జంక్షనులో ఎడంపక్కనున్న కోకిల ఆడియో కేసెట్ దగ్గర కలుద్దాం. సీయూ" అని లాన్ లోంచి గబగబా అడుగులేసుకుంటూ గేటువైపు వెళుతున్న ఇందుమతిని పిలిచాడు యువరాజు. "మేడమ్ చిన్న మాట" ఆగి చూసింది తల తిప్పి.
గబ గబా పరుగెత్తుకొచ్చాడు యువరాజు.
"నిధి అన్వేషణ నిజమే కదా"
"ఎందుకు అనుమానం?"
"ఇవి... దొంగనోట్లు కావుకదా"
నవ్వింది ఇందుమతి.
మరి మాట్లాడలేదు యువరాజు.
ముందు కడుగేసింది ఇందుమతి.
"ఓకే... మేడమ్ గుడ్ నైట్... రేపు ఐదుగంటలకు జగదంబా జంక్షన్" అంటూ బార్ లో కెళ్ళిపోయాడు!
మెట్లు దిగి రోడ్డుమీద కొచ్చింది ఇందుమతి. వెనుక నడుస్తున్నాడు ముత్యాలనాయుడు.
"అన్నదమ్ములిద్దరూ జెమాజెట్టీల్లాంటివాళ్ళు- ఇద్దర్నీ మనం తీసుకెళితే ఎలా వుంటుందమ్మా... వాళ్ళిద్దరూ వుంటే ఎలాంటి ప్రమాదమూ మన దరి చేరదు" అన్నాడు ముత్యాలనాయుడు ఇద్దరి రూపాల్ని తలుచుకుంటూ.
"నాకూ అలాగే అనిపిస్తోంది" అంది ఇందుమతి.
"అసలు యువరాజునే అడిగి వుంటే బావుండేది నీతోపాటు నీ తమ్ముడ్ని కూడా తీసుకురా అని చెప్పుంటే పోయేది. నిధి చాలా కేజీల బరువుంటుంది. దాన్ని పూర్తిగా తెచ్చుకోవాలన్నా మోయటానికి బలిష్టమయిన మనుష్యులు కావాలి" అన్నాడు ముత్యాలనాయుడు సాలోచనగా.
అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కొట్లాట జరిగిన ప్రాంతానికి వచ్చారు.
ఆ ప్రాంతం అప్పుడు ప్రశాంతంగా ఉంది. ఐదారుగురే సేద తీరుతూ కనిపించారు.
"బాబూ... రాజు ఎక్కడ దొరుకుతాడు" అని అడిగింది ఇందుమతి- అక్కడే ఇసుకలో కూర్చుని సారా ప్యాకెట్ నోట్లో వంపుకుంటున్న ఒక వ్యక్తి నుద్దేశించి.