"రెండువందల కోట్లా?!!" తనలో తను గొణుక్కున్నాడు ముత్యాలనాయుడు. ఇందుమతి దిగ్భ్రాంతికి గురయింది రెండొందల కోట్లు అనగానే.
ఇప్పటి తరాలు తమ పిల్లల కోసం స్థలాలు, ఇళ్ళు, షేర్స్, డిపాజిట్స్ రూపంలో జాగ్రత్త పడుతుంటే అప్పటి తరాలు నగలు, నాణేలు, విలువైన రాళ్ళు, స్వర్ణ ప్రతిమల్ని నిక్షిప్తం చేయడం ద్వారా జాగ్రత్త పడేవారన్న మాట. 15వ శతాబ్దంలో బరీడ్ చేసిన అతి విలువైన నిధి...! ఎన్ని తరాల తరువాత వెలుగులోకి రాబోతోంది. ఫెంటాస్టిక్... ఫ్యేబ్యులస్. ఇంక్రిడబుల్ ట్రెజరీ...
"ఆ నిధి- తూర్పు కనుమల్లో... ఏ ప్రాంతంలో ఉండొచ్చనుకుంటున్నారు." అడిగింది ఇందుమతి దిగ్భ్రాంతి నుంచి తేరుకుంటూ.
"తూర్పు కనుమల్లో... అరకులోయ దగ్గర్నుంచి, ఒరిస్సా సరిహద్దు మధ్య ఉండొచ్చమ్మా... నిధుల్ని నిక్షిప్తం చెయ్యడమనేది ఒక్కరివల్ల సాధ్యం కాదు. ఆనాటి గిరిజన జాతుల సహాయం అందులో వుండి వుంటుంది. వారే ఆ నిధుల్ని ఇప్పటికీ సంరక్షిస్తూ ఉండొచ్చు. గిరిజన తెగల్లో, కొండదొరలు... రాజులు... వారి కుటుంబాలు... ఎక్కడెక్కడున్నాయో... తెలుసుకుంటే- ఆ సమీపంలోనే నిధులు దొరకవచ్చు. అందుకు సంకేతాలు కూడా అన్వేషణలో మనకు బయటపడతాయి. ఇంతకీ అన్వేషణకే నిర్ణయించుకున్నావా?" ఇందుమతి వేపు సూటిగా చూస్తూ అడిగాడు విశ్వరూపశర్మ.
"మళ్ళీ అనుమానం ఎందుకు బాబూ" ఆశ్చర్యంగా అడిగాడు ముత్యాలనాయుడు.
"నెలల తరబడి అడవుల్లో గడపాలి. ఈ ప్రయత్నంలో మృత్యువుకు అతి సమీపం నుంచే మీరు ప్రయాణం చేయవలసి వుంటుంది. ఎందరు మృతులవుతారో మార్గమధ్యలో- ఎందరో తిరిగి వస్తారో చెప్పలేం- క్షణం క్షణం భయం... భయం... అతి ప్రమాదకరమైన కోయ జాతులుంటాయి, క్రూరమృగాలుంటాయి. ఎందుకయినా మంచిది- మరోసారి ఆలోచించుకోండి"
"మాకేం భయంలేదు" నిశ్చయంగా అంది ఇందుమతి.
"పిచ్చిపిల్ల... నేననేది... అది కాదు. వేటకైనా, నిధి అన్వేషణకైనా పకడ్బందీ పథకంతోపాటు, ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, నమ్మకస్తులు అయిన వ్యక్తులు చాలా అవసరం. లీడర్ ప్రాణాలకు ఏ రకమైన హానీ జరక్కుండా చూసుకునే అప్రమత్తులైన వ్యక్తుల అవసరం చాలా వుంటుంది. వాళ్ళనెలా సంపాదిస్తావు" అడిగాడాయన.
ఆలోచనలో పడింది ఇందుమతి. "ముత్యాలనాయుడు... నువ్వూ. చిన్నమ్మగారితో వెళ్తావా" అడిగాడు విశ్వరూపశర్మ.
"ఏం బాబూ. నేను ముసిలోడ్ని అనుకుంటున్నారా" నవ్వుతూ అన్నాడు ముత్యాలనాయుడు. "నేనన్నానా... యూ ఆర్ యంగ్... ఐనో దట్ మన మనిషి, ఒకడుండడం పూర్తిగా అవసరం కూడా అదీ కాకుండా... వెళ్ళేది నిధి కోసం కాబట్టి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక వ్యక్తి మీలో వుండాలి" అన్నాడు విశ్వరూపశర్మ.
"మీరు... రారా... బాబూ" ముత్యాలనాయుడు అడిగాడు అనుమానంగా.
"అడవి ప్రాంతం ప్రారంభమయ్యే ప్రదేశం వరకూ నేనొస్తాను లోనికి రావాలంటే... కష్టం నా ఆరోగ్యం అందుకు అంగీకరించదు కూడా. అందువల్ల.. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక వ్యక్తి చాలా అవసరం. అతన్ని పట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా, మిమ్మల్ని రక్షించడానికి, అటు శత్రువుల బారి నుండి, ఇటు వన్యమృగాల బారినుండి- మరో ఆలోచన లేకుండా చొచ్చుకు పోగలిగే వ్యక్తి కావాలి. కొండలు, గుట్టలూ మీరు ఎక్కుతారు కాబట్టి. గిరిజన ప్రాంతాల్లోనే ఒక గిరిజన యువకుడ్ని మీరక్కడ సెలక్టు చేసుకోవచ్చు. ముందు... మిగతా ఇద్దరి విషయాలు ఆలోచిద్దాం.
ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వ్యక్తి అనుకున్నాం గదా... విశాఖపట్నం ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ మధ్య నా దగ్గర కొచ్చాడు. ఏదో ఇన్ ఫర్ మేషన్ కోసం. అతనైతే మీకు సరిపోతాడు. ఎడ్రసిస్తాను వెళ్ళి మాట్లాడండి. అలాగే- జాలరిపేటలో యువరాజని ఓ కుర్రాడున్నాడు. గ్రీక్ షిప్ లో పని చేస్తుంటాడు. షిప్ కు వెళ్ళకపోతే ఇక్కడ ఉంటాడు. మనకు కరెక్టు పర్సన్" చెప్పాడు విశ్వరూపశర్మ.
"యువరాజు ఎడ్రసుందా- మీ దగ్గర" అడిగింది ఇందుమతి.
"లేదు అతను తరచూ, షిప్పుల్లో తిరుగుతుంటాడు కదా... ఒకసారి ఎవరికో స్కాట్లాండ్ రివాల్వర్ కావాలంటే- వెళ్ళాం- అప్పుడు చూశాను అతడ్ని. జాలరిపేట గాంధీ బొమ్మ దగ్గర ఉంటాడు. అతడ్ని చూశాక మీకు నమ్మక మేర్పడితేనే మాట్లాడండి. ఆ తర్వాత రెండో కుర్రాడి గురించి ఆలోచిద్దాం."
"ఎప్పుడెళ్ళమంటారు" అడిగింది ఇందుమతి.
"ఆలస్యం అమృతం విషం- అన్నారు పెద్దలు- ఇవాలే వెళ్ళండి" ఇందుమతి, ముత్యాలనాయుడివేపు చూసింది. ముత్యాలనాయుడు లేచి నిలబడ్డాడు. వెంటనే ఇద్దరూ బయలుదేరారు.
యువరాజు... జాలరి కుటుంబానికి చెందిన వ్యక్తి. పదిహేనేళ్ళ వరకు సముద్రంలో చేపల వేటకి వెళ్లేవాడు. ఆ సమయంలో ఒకసారి విశాఖపట్నం రేవుకి ఒక గ్రీక్ షిప్పొచ్చింది. షిప్ డెక్ మీద మందు తాగుతున్న ఓ అమెరికన్... మందెక్కువైపోయి నీళ్ళలో పడిపోతే, అదే సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్న యువరాజు, ఆ అమెరికన్ ని రక్షించాడు. యువరాజు ధైర్యసాహసాలకు ఆశ్చర్యపడిన షిప్ కెప్టెన్ ఆ షిప్ లో బాయ్ ఉద్యోగమిచ్చి... తనతోపాటు తీసికెళ్ళిపోయాడు.
ప్రస్తుతం యువరాజుకు ముప్పయి ఏళ్ళు.
కాంట్రాక్టు ప్రకారం అయిదేళ్ళ కొకసారి షిప్ డ్యూటీకి వెళ్తాడు. ప్రపంచమంతా చుట్టేసి, మూడేళ్ళ తరువాత వస్తాదు. మళ్ళీ మరో అయిదేళ్ళ వరకూ ఖాళీ.
జాలీగా తిరుగుతాడు. విశ్వరూపశర్మ చెప్పిన విషయాన్ని మననం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చారు. గాంధీ బొమ్మ దగ్గర పోతపోసుకున్న బంగారు బొమ్మలా నిలబడ్డ ఇందుమతిని చూసి, జాలరిపేట జనం ఆశ్చర్యపోయారు.
"ఎవరా పిల్ల... గంగదేవత కాదుగదా" ఓ ముసలాడు వ్యాఖ్యానించాడు. ఆ ముసలాడ్నే అడిగింది ఇందుమతి.
"యువరాజు ఎక్కడుంటాడు"
"యువరాజు ఎక్కడుంటాడు"
"యువరాజు... ఆడు నిన్న సందేల కనబడ్డాడమ్మా... అంతే... ఉండండమ్మా" అని-
"ఒరేయ్! అర్థాలూ" అని దూరంగా కిళ్లీబడ్డీ దగ్గర సారా ప్యాకెట్లు తాగుతున్న ఒక వ్యక్తిని పిలిచి- "మన యువరాజుగాడెక్కడుంటాడ్రా" అని అడిగాడు.
అప్పుడు సాయంత్రం ఆరయింది.
సూర్యాస్తమయం జరగడానికి ఇంకా కొన్ని నిముషాలుంది.
"మెరీనా హోటల్ కెళ్ళాడు" చెప్పాడా వ్యక్తి.
"చూడమ్మా... బీచొడ్డున... ఆ చివర... ఏరాడు కొండదారిలో మెరీనా హోటల్ ఉంది. అక్కడ కనుక్కో అమ్మా" చెప్పాడు ఆ ముసలోడు.
"థాంక్స్" చెప్పేసి ముందు కడుగేసింది ఇందుమతి.
"ఆ కుర్రాడు షిప్ కెళ్ళకుండా... ఉన్నాడన్న మాట" సంతోషం నిండిన మోముతో అన్నాడు ముత్యాలనాయుడు.
బీచ్ నిండా, అప్పుడే లైట్లు వెలిగాయి. ఆ దీపాల వెలుగులో మసక, మసక చీకట్లో... ప్రతిఫలిస్తున్న సముద్రం... చమ్కీ చుక్కలతో నేసిన నీలపు చీరలా ఉంది.
దూరంగా సముద్రంలో లంగరు వేసుకున్న షిప్పుల్లోని లైట్స్ వినీలాకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. నిధి దొరుకుతుందన్న ఇందుమతి ఆశలా మిణుకు మిణుకుమని వెలుగుతున్నాయి.
కొంచెం దూరం వెళ్ళాక బీచొడ్డున జనం గుమిగూడి కనిపించారు.
అక్కడేదో గందరగోళంగా ఉంది. దగ్గరగా వెళ్ళాక అంతమంది జనం అక్కడెందుకు గుమిగూడారో అర్ధమయింది.
చుట్టూ జనం...
మధ్యలో ఎరీనాలాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి ఐదుగురు వ్యక్తులతో హోరాహోరీ పోరాడుతున్నాడు. ఓ పక్కన ఓ ముసలావిడ కూర్చుని ఏడుస్తోంది.
ఒక వ్యక్తి... ఐదుగురు బలిష్టమైన వ్యక్తుల్ని చితగ్గొట్టేస్తున్నాడు.
అట్లాస్ మహావీరుడిలా- ఎమ్ ఆర్ ఎఫ్ మోడల్ లో వున్న వ్యక్తి ఒక్కొక్కర్ని ఆకాశంలోకి ఎత్తి ఇసకమీదకు విసురుతున్నాడు.
ఒక్క వ్యక్తిలో అంత బలమా?
ఇందుమతి ఆశ్చర్యపోయింది.
ముత్యాలనాయుడయితే ఆనందంగా తిలకిస్తున్నాడు ఆ దృశ్యాన్ని-
"ఏమయింది? ఆ వ్యక్తి ఎందుకలా ఆ ఐదుగుర్ని కొడుతున్నాడు? అయినా మీరేం అడ్డుకోకుండా వింత చూస్తున్నట్లు చూస్తున్నారేం" అడిగింది ఇందుమతి ప్రేక్షకుడిలా చూస్తున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి.
"ఆ ఐదుగురికి తగిన శిక్షే అది. ఆ ముసలావిడ పాపం నానా కష్టాలు పడి సంపాదించుకున్న దానిలో ఐదొందలు, ఐదుగురిలో ఒకరికి వడ్డీకిచ్చింది. మాబోటివాళ్ళం నోట్లేం రాసుకుంటాం? దాన్నే ఆసరా తీసుకుని అసలు వడ్డీ రెండూ ఎగ్గొట్టాలని చూశాడు వాడు. మా రాజా వూరుకుంటాడా? చితగొట్టి ఇప్పించడూ! చిన్న అన్యాయాన్ని కాని, నమ్మకద్రోహాన్ని కాని రాజు క్షమించడు. అందుకే వాడ్ని నిలదీస్తే వాడి దోస్తులు నలుగురొచ్చారు. వాడితోపాటు వాడి దోస్తులు నలుగుర్నీ చితక కొట్టేస్తున్నాడు. ఏ ఆధారం లేని ఆ ముసలిదాన్ని అన్యాయం చేస్తేనే తన్నుతున్నాడు. ఊరకేకాదు అందుకే మేం అడ్డుగా పోవడం లేదు. ఇలాంటి దండన జరగాలి. దాన్ని పదిమంది చూడాలి. అప్పుడే మరొకడు ఇలాంటి పని చేయడు" అన్నాడా వ్యక్తి కసిగా.
"అబ్బ... ఏం శరీరం తల్లి, ఇనుప ముక్కల్తో చేశాడా భగవంతుడు వాడి శరీరాన్ని" తన్మయుడవుతూ అన్నాడు ముత్యాలనాయుడు.
అప్పటికే ఆ ఐదుగురు చేతులెత్తి దండం పెట్టారు. ముసలావిడ లేచి వాళ్ళవేపుకు వెళ్లింది.
ఇందుమతి, ముత్యాలనాయుడు ముందుకు సాగిపోయారు.
ఒక పావుగంట నడిచాక వచ్చిందా హోటల్.
HOTEL MARINA BAR AND RESTAURENT
గేటు దగ్గర కొచ్చిన ఇందుమతిని చూసి, ఆశ్చర్యపోయాడు గేట్ మాన్.
ఒక్క ఆడపురుగు కూడా ఆ హోటల్ కి రాదు. ఎప్పుడో షిప్పు వచ్చినప్పుడు అమెరికన్ లేడీస్ వచ్చి వెళుతుంటారు. అంతే! ఆ హోటల్ నాసిరకం, కేబెరా డ్యాన్సులకు ప్రసిద్ధి. అందుకే ఇందుమతిని చూసి ఆశ్చర్యపోయాడు గేట్ మేన్.
"యువరాజున్నాడా" అడిగింది.
"యువరాజంటే... రాజబాబు జాలరి కుర్రాడు... పాటలు పాడతాడు అతనేనా" ప్రశ్నించాడు గేట్ మేన్
"అవును" అంది ఇందుమతి తెలియకపోయినా.
"ఉన్నాడు వెళ్ళమ్మ... తిన్నగా వెళ్ళు" గేట్ మేన్ వెళ్ళమన్న వేపు వెళ్ళింది ఇందుమతి.
హాల్లో టేబిళ్ళ ముందు, అందరూ మగాళ్ళే ఉన్నారు. హాలు మధ్య ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డయాస్ పైన పాట పాడుతున్న యువకుడ్ని చూసింది ఇందుమతి. ఆరడుగుల ఎత్తులో మెలిదిరిగిన కండలు... నల్లటి బ్యాగీ పాంటు, దానిమీద లేత గోధుమరంగు షర్టు, తెల్లగా నిగనిగలాడుతున్నాడా యువకుడు.
చేతిలో మైకు పట్టుకుని ఏదో ఫోక్ సాంగ్ పాడుతున్నాడు. దానికనుగుణంగా ఇన్ స్ట్రుమెంట్ మోత.