Previous Page Next Page 
జనవరి 5 పేజి 15

   

      మరోక్షణం ఆలస్యం చేయకుండా వడివడిగా టీ బంక్ దగ్గరకెళ్ళి "ఒక్క నిమిషం....తినేందుకేమున్నాయి ....?" అంది మేఖల.
   
    బంక్ యజమాని మేఖల కేసి ఆశ్చర్యంగా చూసి "బాబీ....ఒక్కసారిరా" అని లోపలకు చూస్తూ కేకవేసి "సమోసాలు, బిస్కట్స్ తప్ప ఏమీ లేవమ్మా అవి కావాలంటే...." అతని మాటలు పూర్తికాకుండానే "అవి ఇవ్వండి" అంది అక్కడే టేబుల్ మీదున్న రెండు మంచినీళ్ళ గ్లాసుల్ని అందుకొని, ఒకటి అభిరామ్ కిస్తూ.
   
    "అప్పుడే కట్టేస్తున్నారేమిటి....?" మంచినీళ్ళు తాగి గ్లాసు టేబుల్ మీద పెడుతూ అడిగింది మేఖల.
   
    "బక్క వ్యాపారస్తుల బ్రతుకు దినదిన గండమైపోయిందమ్మా! అచ్యుత్ ముఠా ఎవరో ఒక కుర్రాడికోసం వేట మొదలుపెట్టారు. నా కర్మ కాలి వాళ్ళిటే వస్తే ఇంకేమయినా వుందా....? అందుకే తొందరగా కట్టేస్తున్నారు...." అన్నాడా బంక్ యజమాని భయపడుతూ.
   
    అతని మాటలకు మేఖల ఉలిక్కిపడింది. ఆపైన భయపడింది.
   
    పరిస్థితి దాదాపు విషమించినట్లే... మరింత మాత్రం జాప్యం చేసినా అచ్యుత్ విషవలయంలో ఇరుక్కుపోక తప్పదు. తన ముఠా తిన్న చిన్నపాటి దెబ్బకు ఇంతగా రెచ్చిపోతున్నాడంటే.... తాము దొరికితే అంత తేలిగ్గా వదిలిపెట్టక పోవచ్చు....
   
    చటుక్కున తల తిప్పి అభిరామ్ వేపు చూసింది.
   
    ఎటో చూస్తూ యేదో ఆలోచిస్తున్నట్లుగా పరధ్యానంలో మునిగి వున్నాడు అభిరామ్.
   
    బంక్ యజమాని మాటలు విని వుండకపోవచ్చని భావించి వూపిరి తీసుకుందామె.
   
    టీ బంక్ కుర్రాడు రెండు ప్యాకెట్స్ తెచ్చిచ్చాడు. మేఖల వేనిటి బేగ్ లోంచి కొంత డబ్బు తీసి బంక్ యజమానికిచ్చింది.
   
    అతను త్వరత్వరగా బ్యాలెన్స్ చిల్లర మేఖల కిచ్చి బంక్ ని మూసేసు కునే ప్రయత్నంలో మునిగిపోయాడు.
   
    తమ్ముడి చేతిని తిరిగి పట్టుకొని ముందుకు సాగింది మేఖల.
   
    ఏ క్షణాన్నయినా అచ్యుత్ ముఠా ఆ వైపుకి రావచ్చు. మరికొంత ముందుకు వెళితే మెయిన్ రోడ్ వస్తుంది. అది మరింత ప్రమాదకరం.....
   
    ఆలోచిస్తున్న ఆమె దృష్టిలో రోడ్డు వారగా ఆగి వున్న లారీ ఒకటి కనపడింది.
   
    టైరు మారుస్తూన్న పనిలో మునిగి వున్నారిద్దరు వ్యక్తులు.
   
    నిశ్శబ్దంగా, వారి దృష్టిలోకి రాకుండా లారీకి రెండో వేపుకొచ్చింది మేఖల.
   
    టైర్ ఎక్కిస్తున్న శబ్దాలు వినిపించసాగాయి. ఆమెకి పరిస్థితి అర్ధమయిపోయింది.
   
    మరి కాసేపట్లోనే లారీ నగరాన్ని దాటిపోవచ్చు. ఎలాగోలా దాన్ని ఎక్కేస్తే ప్రమాదం నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు.
   
    నగర సరిహద్దుల్లో లారీని అచ్యుత్ అనుచరులు ఆపితే...? రిస్క్ చేయక తప్పదు.
   
    టైర్ మార్చటం పూర్తయ్యింది.
   
    లారీని మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ చేస్తారానగా అభిరామ్ ని తట్టి లారీ ఎక్కుదామన్నట్లుగా సైగ చేసింది మేఖల.
   
    అతని కిష్టం లేకున్నా, అక్క మాటలకు ఎదురు తిరిగే ధైర్యం లేని అభిరామ్ లారీ వెనుక వేపుకి నడిచాడు. లోపల ఏ సరుకుందో తెలీకుండా చుట్టూ టార్పాలిన్ గుడ్డతో కట్టేసి, వెనుక డోర్ కి బిగించారు. అంత ఎత్తు నున్న లారీని ఎక్కటం ఎలాగో మేఖలకు అర్ధం కాలేదు.
   
    అక్క భావాన్ని అర్ధం చేసుకున్న అభిరామ్ ముందు తాను ఎగిరి డోర్ అంచును పట్టుకొని పైకి పాకేసాడు.
   
    తాను లారీలోకి దిగాక లగేజీ అందించమన్నట్లుగా సైగ చేసాడు.
   
    మేఖల ఇంటి నుంచి వస్తూ తనతో తెచ్చుకున్న సూట్ కేస్ ని, బ్యాగ్ ని అభిరామ్ కి అందించింది.
   
    వాటిని లారీలోపల సర్దేసి వెనక్కి తిరిగి బాగా క్రిందకు వంగి చేతుల్ని అందించాడు.
   
    మేఖల అభిరామ్ చేతుల్ని అందుకొని అతికష్టంమీద లారీలోకి చేరుకోగలిగింది.
   
    మేఖల లారీ ఎక్కడం లారీ స్టార్ట్ అయి బయలుదేరడం ఒకేసారి జరిగింది.
   
    చీకట్లో లారీలో ఏ సరుకుందో తెలియలేదు ఆ ఇద్దరికీ.
   
    లారీ క్రమంగా వేగాన్ని పుంజుకుంది. అభిరామ్ చుట్టూ ఏం ఉన్నాయో చేతులతో తడిమి చూసి తామిద్దరూ స్థిమితంగా కూర్చునేందుకు వీలుగా ఆ ప్రాంతాన్ని సర్దాడు.
   
    లారీ వేగం పెరగటంతో ఈదురుగాలి విసురుగా వచ్చి తాకింది.
   
    మేఖల ఒక్కక్షణం చలికి ఒణికిపోయింది. అభిరామ్ పరిస్థితిని గమనించి టార్పాలిన్ ని బాగా ముందుకు లాగి డోర్ మీంచి బయటకు దింపేసాడు. కొద్దిక్షణాలు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.
   
    "నాకు చాలా బాధగా ఉందక్క."
   
    మేఖల మాట్లాడలేదు.
   
    "పిరికి వాళ్ళలా...."
   
    అభిరామ్ మాటలు పూర్తికాకుండానే మేఖల అంది.
   
    "ఇది పిరికితనం కాదు. దెబ్బతిన్న శత్రువు అనుపానులు, బలా బలాలు తెలుసుకోకుండా ఎదురు వెళితే అది దుస్సాహసమవుతుంది. పులి గాయపడున్న స్థితిలో డానికి ఎదురు వెళ్ళకూడదని తప్పించుకు వెళ్ళడం పిరికితనం కాదు. తాత్కాలికంగా తప్పుకొని, సర్వశక్తుల్ని క్రోడీకరించు కొని వెళ్ళాలి. నీ బాధ నా కర్ధమయింది తమ్ముడు. కాని నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు...." మేఖల ఖంఠంలో ధ్వనించిన ఆరాటాన్ని బాధని, భయాన్ని అభిరామ్ గుర్తించాడు.
   
    "కేవలం నీ ఒక్కడికోసం మొత్తం నగరాన్నే ముట్టడించే ప్రయత్నంలో ఉన్నాడు అచ్యుత్. అతనికి అంగబలం, అర్ధబలం ఉంది. మరి మనకో.....మనం పోరాడేది అన్యాయానికి, అధర్మానికి వ్యతిరేకంగా అని తెలిసినా ఒక్కరన్నా మనకు అండగా వస్తారా....? మనకు తోడుగా నిలుస్తారా...? మనమంటే నాన్నగారికి పంచప్రాణాలు మనకేదన్నా జరిగితే మన సంగతలా ఉంచి నాన్నగారు బ్రతగ్గలరా....? ఒక్కసారి వివేకంతో ఆలోచించు ఇప్పటికీ వెళ్ళి అచ్యుత్ ముఠాన్ని ఎదుర్కోవాలని నీకుంటే నేనాపను" అంది మేఖల.
   
    మాట్లాడలేకపోయాడు అభిరామ్.
   
    "నా తమ్ముడి ధైర్యం, బలం నాకు తెలుసు. నాకూ ఆ ధైర్యముంది. కాని..... కాని..... నేను నీ బాధ్యతను నెత్తికెత్తుకుని ఉన్నాను. నేనేం చేయగలను. అచ్యుత్ ని తాత్కాలికంగా అతను మర్చిపోయిన కాలాన్ని అతని బ్యాగ్రౌండ్ ని పెంచుకోడానికి ఉపయోగించుకో అప్పుడు నెఉ చెబుతాను- వెళ్ళి ఆ అందర్ని అంతం చేసి రమ్మని అంతవరకూ నా మాట విను..." అంది ఆమె అభిరామ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతూ.
   
                       *    *    *    *    *
   
    "There are a group of people who are working hard. There are many other people who depend on them. The whole world is working because of that working class. If they stop working...what will happen...? గ్రీకు పురాణాల ప్రకారం అట్లాస్ అనే మహావీరుడు ఈ ప్రపంచాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. ఆ వీరుడు సేద తీరుధామని ఒక్క క్షణం తన భుజాల్ని కదిపితే...? ఏమవుతుంది? ప్రళయం సంభవిస్తుంది. అదే విధంగా ఈ ప్రపంచంలో నిజంగా శ్రమపడిపనిచేసేవాళ్ళు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమందిపై ఆధారపడి బ్రతికేవారు ఎక్కువ మంది ఈ ప్రపంచం అంతా నడుస్తోంది కేవలం ఆ కొద్దిమంది శ్రామికుల వల్లే.... ఆ శ్రామికవర్గం పనిచేయటం మానివేస్తే...? ఎంత గొప్ప ఫిలాసఫీ... మహానుభావురాలు అయన్ రాండ్ అంతరాళంలోంచి ఎగిసిన ఈ ప్రశ్న ప్రపంచ సోమరిపోతుల పాలిట అస్థిత్వపు ప్రశ్నయి నిలిచింది."
   
    ఆ గదిలో ఇద్దరే వున్నారు.
   
    ఒక యువకుడు - ఒక యువతి.
   
    ఆ యువకుడికి ముఫ్ఫై దాకా వయస్సుంటే - ఆమెకి పాతిక దాకా వుంటుంది.
   
    అతని పేరు విమల్.
   
    ఆమె పేరు క్రాంతి.
   
    ఆమె అతనికి చెల్లెలు.
   
    అతను చెప్పేదంతా ఆమె శ్రద్దగా వింటోంది.
   
    మధ్యతరగతి ప్రజలుండే ప్రాంతంలో ఓ మూలగా ఉన్న ఆ చిన్న గదే వారికి ఆశ్రయం కలిపిస్తోంది.
   
    ఆ గదిలో రెండు సిరిచాపలు, రెండు పాత దుప్పట్లు, చెరి రెండు జతల బట్టలు, కొద్దిపాటి వంటసామాగ్రి పొందికాగా సర్ధబడి వున్నాయి.
   
    ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక చాపమీద కూర్చుని వున్నారు. వాళ్ళకు ఎదురుగా వివిధ అంతర్జాతీయ వ్యాపార పత్రికల్లో అచ్చయిన కొన్ని కటింగ్స్ పర్చి వున్నాయి.

 Previous Page Next Page