అందరు గుస గుసలాడి ఒక నిర్ణయానికొచ్చి మళ్ళీ పార్వతీదేవి ముందర నిలిచారు.
"ఏమాలోచించారు?" పార్వతీదేవి చిరునవ్వుతో అడిగింది.
"మాతా జగజ్జననీ! మీరు మాకు సలహా యిచ్చి మార్గం చూపారు. ఇంకా మేము ఇక్కడ్నించి పయనమై బ్రహ్మదేముడి దగ్గరికే వెళతాం మీ ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి" అందరూ వినమ్రంగా తలలు వంచి నమస్కరించారు.
"పది కాలాలపాటు పచ్చగ పసుపు కుంకుమాలతో పిల్లపాపలతో చల్లగ ఉండాలంటూ" దీవించండి పార్వతీదేవి.
అందరూ మరోసారి నమస్కారం పెట్టి అక్కడ్నించి బ్రహ్మ లోకానికి పయనమయ్యారు.
"పిచ్చిపిల్లల్లార! మీ మనసులింకా ఎదగలేదమ్మా! ఎప్పటికి ఎదుగుతారో ఏమో!" తన బిడ్డలమీద జాలితో పార్వతీదేవి...ఆ జగన్మాత వాత్సల్యంగా అనుకొని ఆ తర్వాత భారంగా ఓ నిట్టూర్పు విడిచి వెంటనే అదంతా మర్చిపోయి నలుగు పిండితో మళ్ళీ బొమ్మల్ని చేసుకుంటూ వాటిని చూసి ఆనందిస్తూ ఉండిపోయింది.
* * * *
"నారదుడు ముందే చెప్పాడు. అనవసరంగ మనం ఆయన్ని కోప్పడ్డాం. ఆడదేముళ్ళు ఏం చేశారు కనక." అరుణ వర్ణం దుస్తులు ధరించిన అరుణేందిర కాస్త ఆవేశంగ అంది.
"అదే కూడాదన్నాను. ప్రతిదానికి అంత ఆవేశమైతే ఎట్లా? లక్ష్మీ దేవి చూస్తే ఆమె పనులతో ఆమె తలమునకలై వుంది. సరస్వతీ దేవిని చూద్దామా అంటే చదవేస్తే ఉన్న మతి పోయినట్టు ఈ కొత్త సాహిత్యా లతో కొత్త సంగీతాలతో బుర్ర వేడెక్కి ఆమె బాధలో ఆమె వుంది. జగన్మాత పార్వతీదేవి దగ్గిరకెళితే తీరుబడిగ వున్నా తను చేయకూడని పని కాబట్టి మన కోరికల్ని తీర్చలేనందుకు మన్నించమని చెప్పి మంచి ఉపాయాన్ని సూచించి పంపించింది. మగ దేముళ్ళయితే తల తీసి మొలేస్తారా? బ్రహ్మదేముడి దగ్గరకే వెళ్ళి నిలదీసి అడుగుదాం. మన ఆడ దేముళ్ళని మనం దూషించటం తగదు" అంటూ నెమ్మదిగ మందలించింది లీడర్ లీలారాణి.
ఆమె మాటలకి అరుణేందిర తగ్గిపోయింది.
వాళ్ళంతా సృష్టి గురించి మాట్లాడుకొంటూ బ్రహ్మలోకానికి చేరారు.
వీళ్ళక్కడికి వెళ్ళేసరికి__
నల్లమన్ను, ఎర్రమట్టి, రేగడిమట్టి దాంట్లో కాస్త ఇసక కలిపి...అదిగాక తెల్లటిమట్టి....ఎక్కడ్నించి తెచ్చారోగాని తెల్లగ వుంది. అలాంటి రంగు రంగుల మట్టి గుట్టలు ఎటు చూసినా కొండల్లాగ వున్నాయి. లక్ష్మీ దేవి దగ్గర సరస్వతీదేవి దగ్గర లేని బిజీ ఈ లోకంలో మహా ఎక్కువవుంది. బండ్ల మీద బస్తాలు వేసుకొని ఆ బస్తాల మూతులిప్పి వాటిల్లోని మట్టిని గుట్టలుగ పోసి ఖాళీ సంచులని బండ్లమీద పడేసి లొడ లొడా వెళుతున్నారు కొందరు.
మరికొందరు ఎవరి డ్యూటీ వారిదన్నట్టు తెల్లటి మట్టిని మైదా పిండిని పిసికినట్టు నీళ్ళువేసి కలిపి పిసుకుతున్నారు. మరికొందరు గోధుమ రంగు మట్టిని ఇంకోచోట నల్లమట్టిని మరోచోట ఎర్రమట్టిని నీళ్ళు పోసే వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు ఆ మట్టిని చేతులతో పిసికేవాళ్ళు కాళ్ళతో మర్ధించేవాళ్ళు మరికొందరు వంచిన తలని ఎత్తకుండ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు.
వీళ్ళు కాక తూనికలు కొలతలు అంటు త్రాసు తీసుకొచ్చి రెండు రకాల మట్టిని కొలిచి కలుపుతున్నారు. బహుశ చామన ఛాయగ కాస్త కలర్ భేదంగా పుట్టడానికి ఆ ప్రయోగం కాబోలు.
"మట్టిని సరిగ్గా కలపండి. ఈమధ్య మీరు సరిగ్గా కలపకపోవడం వలన మనుషుల మొఖాన, వంటిమీద మచ్చలు చుక్కలు వస్తున్నాయ్. కొందరయితే పొడలు పొడలుగా పుట్టారు. మధ్యలో రాళ్ళు రప్పలూ వస్తే ఏరిపారేయండి లేకపోతే అవి ధమనులకి అడ్డుపడి కొత్త రోగాలు వస్తున్నాయ్. జాగ్రత్తగా మట్టి కలపండి. మట్టి పిసకండి....మట్టి జల్లించండి....మట్టి కొలతలు సమపాళ్ళల్లో వెయ్యండి...." అంటూ కొందరు అటూ ఇటూ తిరుగుతూ ఆజ్ఞలు జారీ చేస్తున్నారు.
మైదాపిండి ముద్దల్లాగ కలిపి పెట్టిన మట్టిని కొందరు తట్టలతో మోసుకెళ్ళి వెడల్పాటి బండమీద పరచి అప్పడాల కర్రలాంటి సాధనంతో వెడల్పుగా వత్తుతున్నారు. ఆ తరువాత దానిని సైజు వారీగా ముక్కలు చేయడానికి మరికొందరు. మళ్ళీ ఆ ముక్కల్ని గ్రేడింగ్ చేసి పెద్ద పెద్ద డబ్బాల్లో నెంబర్ వన్, నెంబర్ టూ అని రాసున్న వాటిల్లో వేస్తున్నారు.
అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా పాపం మట్టికొట్టుకొని పోయి మహా అందంగా వున్నారు.
"కాస్త పసుపురంగు ఎక్కువేస్తే నీ సొమ్మేం పోయింది. అందరూ తెల్లగాను, పచ్చగాను పుడతారు కదా?" వాళ్ళల్లో ఒకడు మరొకడితో అంటున్నాడు.
ఆ మరొకడు వెంటనే సమాధానమిచ్చాడు. "భూలోకంలో కావలసినన్ని సౌందర్య సాధనాలు తయారవుతున్నాయ్. మరేం ఫరవాలేదు. రంగులు, హంగులు వాళ్ళే చూసుకుంటారు."
"ఈ గ్రేడింగ్ పద్దతులు, ఇన్ని రకాల మట్టి, మశానం దేనికి? బ్రహ్మదేవుడు మరీ పెద్దవాడైపోయిం తర్వాత కాస్త చాదస్తం ఎక్కువై పోయింది. అన్ని రకాల మట్టిని కలిపేసి అందర్నీ ఒకే రంగులో సృష్టిస్తే పోలా! సౌందర్య సాధనానికి 'గిక్స్' అనే సబ్బు 'లుక్స్' అనే ఆయింట్ మెంట్ ఇలాంటివి బోలెడు సౌందర్య సాధనాలు భూలోకంలో బోలెడు వున్నాయి. ఆ మధ్య నేనొకసారి భూలోకం వెళ్ళినప్పుడు అదేదో పెట్టె ఆ...గుర్తొచ్చింది. దాని పేరు టి.వి దాంట్లో చూపిస్తూంటే చూశాను. కొరివి దెయ్యంలా ఉండే ఒకామె 'గిక్స్' సబ్బు వాడి సినిమా తార అయ్యిందిట" అంటూ వాడు చూసొచ్చిన విశేషాలు కాలక్షేపంగా చెప్పాడు.
నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్టు మరొకడు అందుకున్నాడు.
"నువ్వు గిక్స్ సబ్బు మాత్రమే చూశావ్. నేను అంతకన్నా గొప్పది చూశాను. అదేదో డబ్బాలో తెల్లటి పౌడర్ ఉంటుంది. ఒక చెంచాడు నీళ్ళల్లో వేసుకొని తాగుతాడు. అంతే వాడికి వేయి ఏనుగుల బలం వస్తుంది. ఏంటో మరీ విచిత్రాలు భూలోకంలో జరుగుతున్నాయ్."