Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 15

                                                                           11
    రాధాకృష్ణ శనివారంనాడు జానకిని తీసుకుని పిక్చర్ కెళితే పిక్చర్ చూచి వచ్చేటప్పుడు ఏ హోటల్లోనే ఆ పూటకి టిఫెన్ తిని రావటం అప్పుడప్పుడు జరిగే మామూలు విషయం.
    రాధాకృష్ణ జానకి హిందీ సినిమా చూచివస్తూ టిఫెన్ తీసుకోవటానికి హోటల్ కి వచ్చారు.
    రాధాకృష్ణ టిఫెన్ ఆర్డరివ్వడం బేరర్ కుర్రాడు టిఫెన్ ప్లేట్లు తెచ్చి రాధాకృష్ణ ముందు టేబుల్ మీద సర్ది వెళ్ళటం జరిగింది.
    రాధాకృష్ణ తలవంచుకుని ఆహారం నమిలి తినాలనే సిద్ధాంతం ప్రకారం చపాతీ నమిలి నెమ్మదిగా తింటున్నాడు.
    జానకి ఓప్రక్క నోటికి మరోపక్క చేతిలో స్ప్ప్నుకి పనికపిస్తు తలఎత్తి మిగిలిన టేబుల్స్ ముందు ఫలహారాలు చేస్తున్న వారిని కుతూహలంగా గమనిస్తున్నది.
    అలా గమనిస్తున్న జానకి ఓ టేబుల్ వద్ద హుషారుగా నవ్వుకుంటూ టిఫెన్ తింటున్న జంటను చూచి ముందు నిర్ఘాంతపోయి ఆపై తెప్పరిల్లి చేతిలో వున్న స్పూనుతో రాధాకృష్ణ టిఫెన్ ప్లేటుమీద కొట్టింది.
    "ఏమిటోయ్!" అంటూ రాధాకృష్ణ పెట్లోంచి తల ఎత్తాడు.
    "అటుచూడండి" తగ్గు స్వరంతో అంది జానకి.
    రాధాకృష్ణ ఎటుచూడకుండానే "ఎటు?" అన్నాడు సర్దాగా.
    "మీకెప్పుడు జోకులే చిన్నపిల్లాడిలా అటుచూడండి."
    "ఏముంది అక్కడ?"
    "నా ముఖం" విసుక్కుంది జానకి.
    "ఛా...పొరపడ్డావని చెప్పడానికి విచారిస్తున్నానోయ్ జానకీ! నీ ముఖం నా ఎదురుగుండా వుంది. అది నయనానందకరంగా కనిపించుచున్నది."
    అప్పుడప్పుడు జానకి అటు చూడండని చెప్పటం రాధాకృష్ణ చూడటం పరిపాటే. కొత్తరకం డిజైను చీర ఏ వనిత కట్టుకున్నా వికారంగా విడ్డూరంగా ఏ అతివయినా వున్నా వారి వస్త్రధారణ గురించి... ఆ పొట్టి ఆవిడ పెద్దపూల చీర కట్టుకుంది. అచ్చం పీపాలా వుంది. ఆ పొడుగ్గా వున్నామె చూడండి. అంచులేని నిలువు చారల చీరకట్టుకుందా అచ్చం వాసంలా వుంది  అందాన్ని పాడుచేసుకుంటున్నారు" అంటూ జానకి రాధాకృష్ణతో చెప్పి బాధపడుతుంది. ఇప్పుడు కూడా అలాంటి విషయమే అయివుంటుందనుకున్న రాధాకృష్ణ జానకి చెప్పిన వైపు చూడకుండా మాటలతో ఆటలు పటిస్తూ వుండిపోయాడు.
    "నేను టిఫెన్ తినను లేచి పోతున్నాను" బెదిరింపు అస్త్రం ప్రయోగించింది జానకి.
    ఎంత పెద్ద డాక్టరుగా పేరుపొందినా, తెలివిగా మాట్లాడగల వాడయినా, జానకి పతిదేముడేగా! దిగిరాక తప్పలేదు రాధాకృష్ణకి. "అమ్మమ్మమ్మ, కోపగించుకోకు. ఎటు చూడమన్నావ్, అటు కదూ! ఏముందక్కడ. అడ్డచారల చీరావిడ ఎవ..." ఆపై రాధాకృష్ణ మాటలు ఆగిపోయాయి. జానకి చెప్పినవైపు కళ్ళార్పకుండ (రెప్పలార్పకుండ) చూస్తూ వుండిపోయాడు.
    "చూశారా?" అంది జానకి.
    "చూశాను చాలా ఆశ్చర్యంగా వుంది." అన్నాడు రాధాకృష్ణ.
    ఓ ప్రక్కగా వున్న టేబుల్ దగ్గర శ్యాంసుందర్, వాసంతి బహుసరదాగా కూరలు చెప్పుకుంటూ మధ్యమధ్య నవ్వుకుంటు కబుర్లు మాటలు ఎక్కువ, టిఫెన్ తక్కువ భుజిస్తున్నారు.
    ఇంట్లో వాసంతి వివాహం విషయంలో మవునం వహించటం, త్వరలోనే తెలియపరుస్తాము ఏసంగతి అన్న పెళ్ళివారు కబురు చేయకపోవటంతో శ్యాంసుందర్ మీద ఆశ వొదులుకున్నారు అంతా. వాసంతి ప్రతాదివారం ఫ్రెండ్స్ తో సినిమాలకని వంకపెట్టి ఇంట్లోంచి బైటపడి శ్యాంసుందర్ ని కల్సుకోటం మరో మనిషికి తెలియని విషయం. ఈరోజు సెకండ్ సాటర్ డే కావటం శ్యాంసుందర్ వస్తానని చెప్పటంతో మళ్ళీ సినిమా వంకపెట్టి వాసంతి ఇంట్లోంచి బైటపడి శ్యాంసుందర్ ని కల్సుకుంది. ఇరువురు హోటల్ కి వచ్చారు. అదే హోటల్ కి వచ్చిన జానకి కంటపడ్డారు.
    "ఊహించని విషయం కంట పడింది." పూర్తి ఆశ్చర్యం నుండి తేరుకోకనే అన్నాడు రాధాకృష్ణ.
    "తమాషాగా వుంది" అంది జానకి.
    "నాకూను." "అవును" అన్నాడు రాధాకృష్ణ.
    "ఇప్పుడేం చేద్దాం!" అంది జానకి.
    "వాళ్ళని చూస్తూ కూర్చుందాము."
    "ఈ హోటలు మా తాత కట్టించలేదు.
    "ఆమాటి కొస్తే మా తాతా కట్టించలేదు."
    "కాబట్టి..." జానకిమాట పూర్తిచేయకముందే రాధాకృష్ణ అందుకున్నాడు. "కాబట్టి...ఇలా మనం ఈ కుర్చీల కంటుకుపోతే ఈ హోటల్ యజమాని మన్ని మెడపట్టుకు బైటికి గెంటుతాడు" అంటూ పూర్తిచేశాడు. 
    "చాల్లెండి. ఇప్పుడు మనం చెయ్యవలసింది ఏమిటీ అన్నది ముఖ్యం. వాళ్ళని పలకరిద్దామా. చూడనట్లు వెళ్ళిపోయి తర్వాత వాసంతి నడుగుదామా!"
    "ఎప్పుడో అడిగితే ఏదో చెపుతుంది జానికమ్మా? మనం హటాత్తుగా ఆదిదంపతుల్లా వాళ్ళకి దర్శనమిచ్చి వారి మనసులు తెల్సుకుందాము. అవసరమనిపిస్తే ఓవరం అంటే ఓ సలహా పారేద్దాం. ఎలా వుంది నా ఐడియా!"
    "దబ్బనంలాంటి సూదితో ఇంజక్షను పొడిచినట్లుంది.
    "ఇంకానయం. కత్తితో..." అంటూ చటుక్కుని ఆగి "వాసు మన్ని చూసింది" అనేసి "హాయ్ వాసూ!" అని పెద్దగా ఆపై చెయ్యి వూపాడు రాధాకృష్ణ.
    వాసంతి చెప్పటంతో శ్యాంసుందర్ తలతిప్పి రాధాకృష్ణ దంపతులను చూసి పలకరింపుగా మందహాసం చేశాడు.
    వేడివేడి బోర్నవిటా నాలుగు గుక్కల్లో తాగి వాసంతి శ్యాంసుందర్ రాధాకృష్ణ టేబుల్ దగ్గరకు వచ్చారు. రాధాకృష్ణ, జానకి కూడా రెండు నిమిషాలలో ముగించారు టిఫెన్ చేయటం.
    నలుగురూ హోటల్లోంచి బైటపడి నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు.
    శ్యాంసుందర్, రాధాకృష్ణ ముందు నడుస్తుంటే రెండడుగుల వెనగ్గా వాసంతి, జానకి నడవటం మొదలుపెట్టారు.
    "ఏమిటీ విశేషం?" జానకి మోచేత్తో మెల్లిగా వాసంతిని పొడిచి.
    "నాకేం తెలియదు" అంది వాసంతి.
    తప్పుచేసినట్లుగా తల వంచుకుని నాకేం తెలియదని వాసంతి అనగానే జానక్కి నవ్వొచ్చింది. గడుసుగా, పొగరుగా జవాబుచెప్పి గలగల వాగే ఈ అమ్మడేనా ఇలా పలకరిస్తే కంగారుపడిపోతున్నది? అనుకుని పైకి నవ్వేసింది.
    జానకి నవ్వు విని ముందు నడుస్తున్న రాధాకృష్ణ వెనుతిరిగి చూసి "నన్ను చూసేనా నవ్వటం?" అన్నాడు.
    "మీమీద జోక్ వదిలింది వాసంతి" అంది జానకి.

 Previous Page Next Page