"మంచిపని చేశావమ్మా! రాస్తే బాగుంటుందని నాకూ తోచింది. నీతో చేబుదామనుకుంటూ వుండగానే ఆ పని నీవే పూర్తి చేశావు"
"నాకు తెలుసు కృష్ణా! నీగురించి నా అంచనా ఏ విషయంలోనూ పొరపాటుండదు, అనుకుంది పార్వతి"
"ఇప్పుడే పోష్టు చేసిరానా?"
"వద్దు. సాయంత్రం నే బజారు వెళ్లాలి అప్పుడు పోస్టు చేస్తాను....." కాగితాలు మడతపెడుతూ అంది పార్వతి.
తలవూపి కృష్ణ గదిలోకి వెళ్లాడు.
"నా బిడ్డలు రత్నాలు" అనుకుంది పార్వతి.
12
పోష్టు డబ్బాలో కవరు వేసి ఇంటిముఖం పట్టింది పార్వతి.
బజారులో కొనాల్సిన రెండుమూడు సరుకులు కొనటం పూర్తి అయింది.
"అమ్మా!" అన్న పిలుపు విని చటుక్కున ఆగిపోయింది ,నడిరోడ్డుమధ్యలో. రెండంగల్లో రఘు పార్వతి దగ్గరకు వచ్చాడు.
"బజారులో పనివుండి వచ్చావా అమ్మా!" అన్నాడు రఘు.
"అవును," ముక్తసరిగా అంది పార్వతి.
"కోపమొచ్చిందా అమ్మా?"
"ఎవరిమీద?" తిరిగి ఎదురుప్రశ్న వేసింది పార్వతి.
రఘు తికమకపడి "మరి, మరి....." అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయి.
"అడిగిందానికి జవాబుచెప్పి, తిరిగి ప్రశ్నవేయటం కృష్ణకే సాధ్యం. ఉత్తపిచ్చి సన్యాసివి రఘూ నీవు." అనుకుంది పార్వతి.
రఘు, పార్వతి, వీధిమలుపు వద్దకు వచ్చేశారు. అటు వీధిన వెళితే రఘు అత్తవారిల్లు, ఇటు వీధిన బైలుదేరితే పార్వతి ఇంటికి వచ్చేస్తుంది. వీధిమలుపు తిరగబోతూ ఇరువురు చటుక్కున ఆగిపోయి ఒకరిమొహం ఒకరు చూచుకున్నారు.
"అమ్మా !" రఘు తగు స్వరంతో పిలిచాడు.
"ఊ!" అంది పార్వతి, రఘు చెప్పబోయేది ఆలోచిస్తూ.
"ఓసారి అక్కడికొచ్చి వెళ్ళమ్మా!" అన్నాడు రఘు.
ఎలా చెప్పాలో తెలియక లోలోన మధనపడుతూ. చివరికి చెప్పెదేమిటో గ్రహించకపోలేదు పార్వతి. తలఎత్తి పరీక్షగా రఘుని చూస్తూ__ఎక్కడికి?" అంది.
"అదే__అక్కడ__అదే అత్తవారింటికి వెళదాం రామ్మా!"
"ఇప్పుడు దేనికీ? తరవాత వస్తాను"
"ఉహూ! ఎలాగూ ఇంతదాకా వచ్చావుకదా! ఓసారి వచ్చి వెళుదువుగాని."
"రాధ ఆరోగ్యం ఎలా వుంది?" మాటమారుస్తూ అంది పార్వతి.
"నాలుగురోజులబట్టీ జ్వరం, అందుకే రమ్మంది."
రాధకు జ్వరం అనగానే పార్వతి కంగారుపడింది.
"ఇంతసేపటికా చెప్పటం, వెళదాం పద!" తనేముందుగా బయలుదేరుతూ అంది పార్వతి.
తను ఇంట్లోంచి వచ్చి అత్తవారింట్లో వున్నందుకు అమ్మకు చాలా కోపం వచ్చివుంటుంది. ఇంట్లో అడుగుపెట్టి అమ్మను చూదామంటే నాన్నగారు వున్నారు. నాన్నగారి మూలంగా అమ్మచాటుగా ఎన్నిసార్లు కుమిలికుమిలి ఏడ్చిందో తానెరగందికాదు. పిల్లలను కన్న నేరానికి వాళ్ళకు రెక్కలొచ్చిందాకా సాకటం తన ధర్మమని తాను తిన్నదో పస్తులే వున్నదో పెంచింది, పెద్ద చేసింది. చదువు, పెళ్ళి, అన్ని బాధ్యతలు పూర్తిచేసింది. తనేంచేశాడు రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోయాడు. నాన్నగారిని తను పోషించేపని లేదు. ఆయినా కోపంతో ఇల్లు వదిలాడు. మంచీ చెడ్డా తెలిసిన తల్లికన్నా తన ఆలోచన సవ్యమైందా? నాన్నగారిని ఇంట్లోకి రప్పించటం అవివేకమని తలచాడు ఆనాడు. అమ్మ వున్న పరిస్థితులలో యీయనే వుంటే మరణాన్ని కోరుకునే వాడేమో? ఆడది అబలకాదు సబల అంటూ నిరూపించి దెబ్బతిన్నవాళ్ళు ఆశ్రయించవలసింది మృత్యుదేవతని కాదు. ఆశతో ముందుమార్గాన్ని. అమ్మ ఆపనేచేసింది. ఇప్పుడు కూడా ఆలోచించే నాన్నగారికి ఇంట్లో ఆశ్రయమిచ్చింది. ఛా.....ఛా.....తను నిజంగా తొందరపడ్డాడు.
రఘు ఆలోచనలు ఇలా సాగుతున్నాయి.
చకచక అడుగులేస్తూ రఘు పక్కనే నడుస్తున్న పార్వతి మరో విధంగా ఆలోచిస్తున్నది.
ఎప్పుడూ రఘు ఒకటే తీరుగా వుంటాడు. తను కొత్తగా యీ వూళ్లో కాపురం పెట్టినప్పుడు డబ్బుకి ఎంత ఇబ్బందిపడేది! పిల్లలు ముగ్గురికి కంచాలుపెట్టి భోజనానికి పిలిస్తే గిన్నెలో అన్నం వుందాలేదా, అని చూస్తూ తినేవాడు. "అమ్మ మనకోసం కష్టపడుతున్నది మనం అదికావాలి, ఇది కావాలి అని అమ్మను వేధించకూడదు." అంటూ కృష్ణను, శకూని దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పేవాడు. చిన్నప్పటి అలవాటు ఎక్కడికి పోతుంది. "అమ్మ చెప్పినట్లు వినరా కృష్ణా!" అంటాడు. ఎప్పుడయినా కృష్ణ ఏదయినా విషయంలో వాదిస్తుంటే, టిఫెన్ గాని పండక్కి పిండివంటగాని చేస్తే "అమ్మా! నీకుందా? అంతా మాకే పెడుతున్నావా" అంటాడు అలాంటి రఘు వాళ్ళ నాన్నగారిని చూడగానే దూర్వాసుడే అయ్యాడు. తండ్రిమీద రఘుకి ఇంత కోపం వుందని. ఆ కోపం రఘు పసిహృదయంలో రగిలిరగిలి పెద్దయే నానాటికి పెరిగి నివురుగప్పిన నిప్పులా దాగొని సమయం రాగానే అగ్నిపర్వతం బద్దలయినట్లు ఆ రోజు__ఆయన వచ్చినరోజు...గ్రహించగలిగింది.
అగ్నిలో చల్లదనముందని, మంచులో వేడివుందని ఆయన వచ్చినరోజు రఘు, కృష్ణల ప్రవర్తన చూచి అనుకుంది. కొన్నికొన్ని సత్యాలు తెలియటానికి పరిస్థితులు మరి కొన్నింటికి ముసలితనం కూడా రావాలేమో?