ఫక్కున నవ్వింది జ్యోతి "డాడీ మా గాంధర్వం మొన్న రాత్రే అయిపోయింది. రెండు నిద్దర్లుచేసి మూడో నిద్రకి వచ్చాం ఇక్కడికి.
"యూ..." తర్వాత మాట పెగలలేదతనికి.
"ఒరే ఎందుకురా అలా ఆరాటపడతావు? అది తప్పేచేసిందో, ఒప్పేచేసిందో నిజాయితీగా మనముందు నుంచుంది. ఏమిట్రా నీ అభ్యంతరం? అంతస్తా? ఆస్తా? మీ నాయనకీవాటి ఆస్తివుండేదిరా? మీ తాత వేరుశనక్కాయలు, గుగ్గిళ్ళు అమ్ముకున్నాడు తెలుసా? అది నీ ఒక్కగానొక్క బిడ్డ. ఆస్తంతా దానిది. అది ఇష్టపడ్డవాడిని చేసుకోనీ..." అంది పద్మావతి.
"అమ్మా!"
"అమ్మాలేదూ బొమ్మాలేదూ? సరేనను!"
"నువ్వు మాటాడొద్దు. ఆ అబ్బాయి జ్యోతికి గాలం వేశాడు. మన ఐశ్వర్యం మన సంపదాచూసి ఆశపడ్డాడు. అతను డబ్బును ప్రేమించాడేతప్ప జ్యోతిపై అభిమానం లేదు!"
ఆయన మాటలకి నవ్వింది జ్యోతి. "డాడీ నిజం చెప్పాల్సొస్తే నేనే అతన్ని ట్రాప్ చేశాను. అతని వ్యక్తిత్వాన్ని, అందాన్ని చూసి ఆశపడ్డాను. బంగారుపంజరంలో పెరిగిన నాకు అతను గురువూ దైవమూ అయి లోకం చూపాడు!" అంది.
"నువ్వొట్టి పిచ్చిదానివి తల్లీ!"
"నిజమే డాడీ! మూడునెలల క్రితందాకా నేనంతే! ఇప్పుడు నాకంతా తెలుసు."
"నీకు తెలీదమ్మా"
"డాడీ! ఎందుకీ వాదన? మా పెళ్ళి జరుపుతారా? మేం జరుపుకోమంటారా?" సూటిగా అడిగేసింది.
"ఏమండీ!" పిలిచింది విశాల.
ఏంటన్నట్టుగా చూశాడు గోవర్ధనం.
ఈ యింటి కోడళ్ళంతా బీదవాళ్ళే. ఇప్పుడు అల్లుడు పేదవాడే.....
ఆ మాటలతో ఆయనలో ఏదో మెరుపు మెరిసినట్లయి...
"జ్యోతి నేను శ్రీకర్ తో మాటాడాలి! మీ పెళ్ళి ఖాయం!" అన్నాడు.
ఆ మాటలతో జ్యోతి ముఖం వికసించింది. "థాంక్యూ వెరీమచ్! అతనితో మాటాడండి. ఏమైనా చేయండి మీ యిష్టం."
"బేబీ! నా ఆరాటం నువ్వు గ్రహించుకో లేదమ్మా. ఇంత ఐశ్వర్యాన్ని, సంపదని, హోదానీ వెలిగించిన జ్యోతీ నా ముందుండాలమ్మా ఎప్పుడూ. ఈ జ్యోతి మరో యింటి వెలుగై యిక్కడనుంచి వెళ్ళిపోవడం నాకిష్టంలేదు బేబీ! అదే నా కోరిక!"
"అలాగే డాడీ! నేను మాత్రం మీకు దూరంగా వెళ్ళి బ్రతకగలనా? మిమ్మల్ని విడిచి క్షణమైనా వుండలేను డాడీ!"అంది జ్యోతి. ఆ మాటలంటున్నప్పుడు తండ్రిపై ఆమెకు వున్న ప్రేమ, అభిమానం రెడూ ప్రవాహాల్లాగా పెల్లుబికాయి.
అది గమనించిన గోవర్ధనం తృప్తిగా నిట్టూర్చాడు.
విషయం సులభంగా సుకరంగా పరిష్కారమైనట్టుగా భావించాడాయన.
జ్యోతి ఆనందంతో గెంతుతూ తన గదికి వెళ్ళిపోయింది. "శ్రీకర్ ని పంపించమ్మా!" అన్న తండ్రి మాటలకి అలాగే డాడీ" అంటూ జవాబిచ్చింది.
పద్మావతిగారికి మనవరాలిని చూట్టానికి ఒళ్ళంతా కళ్ళే అయినాయి. తండ్రీ కూతుళ్ళ రాజీ చూసిన విశాల తృప్తిగా లేచి వెళ్ళింది.
ఒంటరిగా పులిలా వున్నాడు గోవర్ధనం.
15
"గుడాఫ్టర్ నూన్!" గదిలో ప్రవేశిస్తూ అన్నాడు శ్రీకర్. అతనికి విషయం తెలియదు. తండ్రి అంగీకరించాడనీ మాట్లాడటానికి రమ్మన్నారనీ మాత్రమే చెప్పింది జ్యోతి.
ముఖమంతా గంటుచేసుకుని గ్రీట్ కూడా చేయాలేదతను. అయితే శ్రీకర్ దానికి బాధపళ్ళేదు. ఆయన స్థాయికి ఎదగని తనని రిసీవ్ చేసుకోవటం ఆయనకి కష్టమే! అనుకున్నాడు.
"ఎంత కావాలి?" శ్రీకర్ ముఖమైనా చూడకుండా అడిగాడు.
"ఏమిటి?"
"డబ్బు-ఆ మాత్రం తెలియదూ?"
"దేనికి?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీకర్.
శ్రీకర్ ముఖం ఎర్రనైంది. "నో థాంక్స్! మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అందుకు పైసా అక్కర్లేదు. అయితే ఎట్టి పరిస్థితులలోనూ జ్యోతికి దూరంకాలేను. మీరు లక్షలిచ్చినాసరే!" దెబ్బకు దెబ్బ తీసినట్టుగా నిశ్చకంఠంతో అన్నాడు.
గిర్రున తిరిగాడు గోవర్ధనం. ఆయన ముఖంలో కోపం తాండవిస్తోంది. కానీ శ్రీకర్ లో కన్పిస్తున్న పట్టుదల చూశాక నోరు జారలేదు.
"శ్రీకర్! నువ్వు మా ఐశ్వర్యాన్ని ప్రేమించలేదంటావా?"
"నాకు మీ సొమ్ము పైసా అక్కర్లేదు."
"మీ వాళ్ళకి కావాలేమో?"
"మేం రెక్కలమ్ముకుంటాం కానీ గౌరవాభిమానాలను అమ్ముకోము."
"అయితే నీకు స్వంతానికి డబ్బే అవసరంలేదంటావా?"
"ఊహు"
"మీ నాన్నకోసం -"
"ఆయన చేయిచాచే మనిషి కాదు."
"మీ చెల్లి పెళ్ళికి -"
"మేం ముష్టివాళ్ళం కాదుసార్ _ ఎందుకిలా హింసింస్తారు నన్ను. మీరు నన్ను విశ్వశిస్తానంటే ఓ మాట చెబుతాను. ఇప్పుడే కాదు-ఎప్పటికీ నాకు మీ సంపదనుంచి చిల్లిగవ్వ అక్కర్లేదు."
"అయితే మరి ఏం చూసి ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నావ్?"
"అది చెప్పినా మీకు అర్ధంకాదు. ఆమె వ్యక్తిత్వం, ఆమె యిగో - ఆమె అమాయకత్వం, ఆమె నిర్మలమైన ప్రేమ, ఆమె మాటలు, చూపులు, అన్నీ ఆకర్షించాయి. అయితే అది నాకు అందని పూవు అనుకుని కేవలం ప్రేమతో ఆరాధించాను. అయితే ఆ పూలే భ్రమరాన్ని ఆహ్వానించింది. అది నా జన్మ చేసుకున్న పుణ్యంగా భావిస్తాను."
"ఊ. మరి నీ పాకెట్ మనీ...అదీ..."
"నేను గ్రాడ్యుయేట్ ని...క్షణాల్లో ఉద్యోగం సంపాదించుకోగలను."
"ఉద్యోగమా! అదేం బజార్లో పైసాకీ పదిపైసలకీ దొరుకుతోందను కుంటున్నావా? దమ్మిడి వుద్యోగానికి తండోపతండాలుగా ఎగబడుతున్నారు గ్రాడ్యుయేట్స్. పోస్టు గ్రాడ్యుయేట్స్ తెలుసా? జీతం ఇస్తామంటే ఏ పనికయినా సిద్ధంగా వున్నారు."
"వుండొచ్చు! అది నీకనవసరం. నేను ఉద్యోగం సంపాదిస్తాను. కావాలంటే చూడండి వారం రోజులు గడువు చాలు-"