Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 14

    "నీ ఇష్టాన్నీ, అభిరుచినీ, ప్రేమనీ, ఆరాధననీ, వ్యక్తీకరించటం తప్పు అని నేను అనను. అవి తీర్చుకోవడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ అవతల వ్యక్తి కూడా నీ స్థాయిలోనే స్పందించాలికదా? అప్పుడే కదా నీ కోరిక నెరవేరేది....నువ్వు మనోహర్ ని ప్రేమించావు. మనోహర్ నిన్ను ప్రేమించాడా? అది తెలుసుకోకుండా, నియంతగా అతన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేశావు. అది ఇప్పుడు బెడిసికొట్టింది.  అందుకే కదా అతడు నిన్ను కోర్టుకు లాగింది. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే, ఎంత గొడవవుతుందో ఆలోచించావా?" తన కళ్ళలో మాయాదేవిపై ఎంతో ప్రేమని, అనురాగాన్నీ నింపుకొని అడిగింది ప్రియ.
   
    "నీక్కూడా ఎంతోకొంత, పిసరంతైనా బుర్ర వుందే! నువ్వన్న దాంట్లో నిజమున్నా, అతడ్ని వదిలి వుండలేక ఆ పని చేశాను."
   
    "టెన్షన్ మీద టెన్షన్. ఈ టెన్షన్ నేను తట్టుకోలేనే బాబూ...." అంటూ నిట్టూర్చింది ప్రియ.
   
    ఆమెనే చూస్తూ నిండుగా నవ్వింది మాయాదేవి.
   
    "చీటికీ మాటికీ టెన్షన్ నీ నెత్తిమీద వేసుకున్నావనుకో....నీ బుర్ర కాయ ఫటేల్ మని పగిలిపోతుంది. ఎడ్ వర్సిటీని కూడా నాకు అనుకూలంగా మలుచుకోగలను. నువ్వేం వర్రీ కాకు. మా నాన్నగారు నాకు వ్యతిరేకమయినా, మా అన్నయ్య నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తాడు...."
   
    "అవునా.....!"
   
    "అయినాదానికీ, కానీ దానికీ ఇలా 'అవునా!' అనడం ఎక్కడ నేర్చుకున్నావే? మీ ఆయన నిన్నెలా భరిస్తున్నాడే తల్లీ?"
   
    "బాగానే భరిస్తున్నాడు నేను 'అవునా!' అనగానే తాను 'అవునవును' అంటాడు. ఇక సమస్యేముంది....?"
   
    "అక్కడ బతికిపోయావ్.....నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ముందు ముందు ఏమి జరుగుతుందో. ఎలా జరుగుతుందో చూస్తూ వుండు."
   
    "అయినా, నాకొకటి అర్ధంకాలేదే....మనీషా కొయిరాలా ఒంపులు, ఐశ్వర్యరాయ్ నాజూకుదనం, సుస్మితా సేన్ ఎత్తు, కళ్ళల్లో టాబూ మత్తు, నీ ఒక్కదానిలోనే వున్నాయనిపిస్తుంది. అలాంటి స్టన్నింగ్ బ్యూటీవైన నిన్ను ఎలా వద్దనుకుంటున్నాడే? నాకేం అర్ధమై చావటంలేదు. ప్రపంచంలో ఇలాంటి మగాళ్ళు కూడా వుంటారా?"
   
    "ప్రతిదానికీ ఆశ్చర్యపోతూ, అవునా....అనుకుంటూ నువ్వులేవూ....అలాగే అతనూ....!"
   
    "ఏం కాదు. అతనికంటే నేను చాలా నయం. నీ దగ్గర ఏం తక్కువైందని అతను కాదనుకుంటున్నాడు?"
   
    "అది తెలియ చెబుదామనే ఆ ప్రయత్నం చేశాను. అది ఇలా బెడిసికొట్టింది. చూస్తాను.....నన్నొదిలి ఎంత దూరం వెళతాడో......!"
   
    "అతనికేమైనా వేరే ఇబ్బందులున్నాయేమో....ఆలోచించావా?"
   
    "ఒకే యిబ్బంది వుంది. అతన్ని చదివించింది, పెద్దచేసింది, అతని కుటుంబాన్ని నిలబెట్టింది అతని మేనమామ కుటుంబరావు. ఆ కృతజ్ఞతే అతనిలో బాగా జీర్ణించుకుపోయింది.
   
    వాస్తవానికి అతను వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఆ పెళ్ళి చేసుకోవడమనేది కేవలం కృతజ్ఞతతోనే. అతని మేనకోడలు మీద ప్రేమతో కాదు. ఏ వ్యక్తయినా, ఏ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నా, దాని పునాది జాలి కాకూడదు.....జాలి, దయ, రక్త సంబంధం, ప్రలోభం, స్వార్ధం, డబ్బు పిచ్చి ఏ పెళ్ళికయితే పునాదులవుతాయో ఆ పెళ్ళి ఎక్కువకాలం నిలబడదు. ఆ దంపతులు ఆత్మవంచన గొడుగుకింద బతుకుతారే తప్ప, ఆరాధన పంచన బతకరు...." ఆవేశంగా అంది మాయాదేవి.

    ఆమెకేసి కొద్దిక్షణాలు ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది ప్రియ.

    అంతలో కింద నుంచి వేడివేడిగా రెండు కప్పుల టీతో పనిమనిషి పైకి వచ్చింది. చెరో కప్పు యిచ్చి ఆమె కిందకు వెళ్ళిపోయింది.

    "అతని మనసు అతని మేనకోడలుమీద వున్నప్పుడు, నువ్వు అతడ్ని నీవైపు తిప్పుకునే ప్రయత్నం తప్పుకాదా?

    అతని ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళినట్లు గదా.....!"
   
    "అతని మనసు, అతని మేనకోడలు మీద లేదు. మనసుతో నిమిత్తంలేని కృతజ్ఞత మాత్రమే అతనిలో వుంది. దానిమూలంగా ఆ అమ్మాయి మనోహర్ ని చేసుకుని ఏం సుఖపడుతుంది?"
   
    "ఈ దేశంలో ఎంతమంది ఆడవాళ్ళు నిజంగా తమను ప్రేమించిన వాళ్ళను పెళ్ళి చేసుకుంటున్నారు? లేదా తమని ఇష్టపడిన వాళ్ళని చేసుకుంటున్నారు? అసలు ఆడపిల్లలకి నిర్ణయాధికారం వుందా? తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని గుండెలమీద కుంపటిలా భావించి ఏదో గంతకు తగ్గ బొంతలాంటి సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు.
   
    తలొగ్గి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఆడపిల్లలు గృహిణిలయ్యాక ఎంతమంది సుఖంగా కాపురం చేస్తున్నారు? అసలే పెళ్ళిళ్ళుకాక ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయలేక తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతున్నారో నీకు తెలుసా? నువ్వు డబ్బున్నదానివి.
   
    నీకు ఎంత డబ్బు వుందో నీకే తెలియదు. అలాంటి నీకు ఈ విషయాలన్నీ తెలిసే అవకాశంలేదు. కుటుంబరావుగారు తన కూతుర్ని తన మేనల్లుడు మనోహర్ పెళ్ళి చేసుకుంటాడని ఆశపడి, ఆదాయం ఖర్చుపెట్టో, ఆస్తులమ్మో చదివించి వుంటారు.
   
    అలాంటి సమయంలో నువ్వు వేటగాడిలా మనోహర్ ని, వేటాడి, వేటాడి నీ సొంతం చేసుకునే ప్రయత్నంచేస్తే, ఆ కుటుంబం ఏమైపోతుంది? ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుంది?"
   
    అమాయకంగా కనిపించినా, ఆలోచింపజేసే విధంగా మాట్లాడిన ప్రియకేసి ఆశ్చర్యంగా చూసింది మాయాదేవి.
   
    "చెప్పు....ఏదయితే మనిషికి సుఖశాంతులు లేకుండా చేస్తుందో..... ఆ పని ఎందుకు చేశామో అని, తర్వాత బాధ పడతామో, ఆ పనిచేయడం తప్పు కాదా?" అమాయకంగానే ప్రశ్నించింది ప్రియ.
   
    తన అందమైన కనుబొమ్మల్ని అలవోకగా, ఓరగా పైకెత్తి ప్రియ కేసి చూసింది మాయాదేవి. తను వింటున్న మాటలు మాట్లాడుతున్నది ప్రియేనా? అన్నట్లు.....

 Previous Page Next Page